ప్రొఫెసర్ జి.హరగోపాల్ తో ఇంటర్వ్యూ -4
‘‘సరళీకరణ విధానం వచ్చాక సంక్షేమ రాజ్యాంగం పాత్ర కనుమరుగైపోతున్నది.
న్యాయస్థానాల మాటను పోలీసులు పట్టించుకోవడం లేదు.
శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాలో ఉన్నా, అణచివేత మొత్తం కేంద్రీ కృతమే.
ఉమ్మడి రాష్ట్రంలో నన్ను ఎప్పుడూ అరెస్టు చేయలేదు.
తెలంగాణా రాష్ట్రం వచ్చేసరికి పౌరహక్కుల సంఘాన్ని నిషేధించే స్థాయికి వెళ్లింది.
మానవాళి ఒక ప్రేమ మయమైన ఒక నాగరికత దశకు చేరుకోవాలి’’ అంటారు ప్రొఫెసర్ జి. హరగోపాల్.
హరగోపాల్ ఇంటర్వ్యూలోని చివరి భాగం ఇది.
ఇంటర్వ్యూ : రాఘవ శర్మ
ప్రశ్న : రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగకరం కలిగించే ఏ చట్టం కూడా చెల్లుబాటు కాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతంలో చేసిన తొలి తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు గారు ఒక రూలింగ్ ఇచ్చారు. పాలకులు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. సుప్రీం కోర్టు ఇచ్చే ఇలాంటి రూలింగ్ లకు ఏమైనా చట్ట బద్దత ఉందా?
హరగోపాల్ : ఏ పాలకవర్గమైతే చట్టం చేసిందో, ఆ పాలక వర్గమే సంక్షేమంకోసం రాజ్యాంగాన్ని కూడా తయారు చేసుకుంది.
రాజ్యాంగానికి విశ్వసనీయత వస్తుందని సంక్షేమాన్ని జోడించారు.
నూతన సరళీకరణ విధానం ఎప్పుడైతే వచ్చిందో, సంక్షేమ రాజ్యాంగం పాత్ర కనుమరుగైపోతున్నది.
కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంటున్నారు.
మనుస్మృతిని తెస్తున్నామని స్పష్టంగా చెపుతున్నారు.
సమాజాన్ని వెనక్కి తీసుకుపోయే ప్రక్రియని అంబేద్కర్ ప్రతీఘాతక విప్లవం అన్నాడు.
ప్రశ్న : దేశద్రోహ నేరం మోపే వలస వాద చట్టాన్ని అమలు చేయకుండా సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. వలసవాద చట్టానికి ఏమాత్రం తీసిపోని ‘ఉపా’ చట్టాన్ని ఎందుకు అమలు చేస్తోంది.?
హరగోపాల్ : న్యాయస్థానం నిలిపివేసినా దేశద్రోహం కేసులు పెట్టడం, న్యాయస్థానం నిలిపివేసినా దేశద్రోహం కేసు పెట్టకూడదని పోలీసులకు తెలిసినట్టు లేదు.
తెలిసినా దానిపట్ల నిర్లక్ష్యం కూడా కావచ్చు.
మా అందరిపైన దేశద్రోహం నేరం కింద, ‘ఉపా’ చట్టం కింద కేసు పెట్టారు.
మా లాంటి కొందరిపైన ప్రభుత్వం కేసు ఉపసంహరించుకుంటున్నాం అన్నారు.
ఇంకా ఈ కేసులోని ఇతరులపై ఉపసంహరించుకోలేదు.
న్యాయస్థానాల మాటను పోలీసులు పట్టించుకోవడం లేదు.
చట్టబద్ద పాలన కాదు ఇది, చచ్చుబడ్డ పాలన.
చట్టబద్ద పాలన అంటే నాగరికత పరిణామ క్రమంలో వచ్చిన ఒక పాలన.
చట్టబద్ద పాలనపై ఏ నాగరికత ఆధారపడి వస్తుందో, ఆ నాగరికతా ప్రమాణాల మీద కాకుండా చేసే చట్టాలు కావు ఇప్పుడు చేసేవి.
రాజ్యాంగానికి, రాజ్యాంగ నియమానికి కట్టుబడి చేసేదే చట్టబద్ద పాలన.
ప్రశ్నః తాజాగా మీపై ‘ఉపా’ చట్టం ఎందుకు పెట్టారు? కొద్ది మందిపై ఎందుకు ఎత్తేశారు? ఇంకా ఎంతమందిపైన ఈ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి?
హరగోపాల్ : తాడ్వాయ్ కేసులు కొందరిపైన ఉపసంహ రించుకుంటున్నామని ఎస్పీ చెప్పారు.
ఈ కేసులు పెట్టడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.
ఆధారాలు లేవు.
ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి.
అందుకే కొందరిపైన ఉపసంహరించుకుంటున్నామంటున్నారు.
ఈ కేసులు పెట్టడమే కానీ, ఉపసంహరించుకునే అధికారం పోలీసులకు ఉన్నదా అని ‘ద హింతూ’ ఆంగ్ల పత్రిక ప్రశ్నించింది.
దీనిపై పోలీసు అధికారులు మాట్లాడుతూ లీగల్ సలహా తీసుకుంటున్నామని, ఎలా ఉపసంహరించుకుంటామో ఆలోచిస్తామని అన్నారు.
ప్రశ్న : పౌరహక్కుల అణచివేతలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎక్కువా? రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎక్కువ?
హరగోపాల్ : అణచివేత మొత్తం కేంద్రీకరణే.
శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాలో ఉన్నవి.
ఎన్ఐఏ ఎవరికీ చెప్పకుండా కేసులు పెడుతోంది.
తీసుకు వెళుతున్నారు.
వ్యక్తులను ముంబయి రమ్మని ఆజ్ఞాపిస్తున్నారు.
సమాఖ్య స్ఫూర్తి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి తీసుకెళ్ళాలి.
కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా, కేసులు పెట్టి వ్యక్తులను తీసుకెళ్ళిపోతున్నారు.
స్టాన్ స్వామి అరెస్టును ఛత్తీస్ ఘఢ్ ముఖ్యమంత్రి తోపాటు హెూం మినిస్టరు ఖండించారు.
స్టాన్ స్వామి కేసు సందర్భంగా స్టాన్ స్వామి చాలా మంచి వ్యక్తి, నిరాడంబరుడు అని హైకోర్టు న్యాయమూర్తి అంటే, ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం చెప్పారు.
‘మీరంతా ఇలా మాట్లాడితే ఇక మేం కేసు ఏం కొనసాగిస్తాం?’ అన్నారు.
దాంతో హైకోర్టు న్యాయమూర్తి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
ఇలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం.
ప్రశ్న : ప్రస్తుతం నిర్బంధ చట్టాలు ఎవరిపైన ఎలా అమలు చేస్తున్నారు?
హరగోపాల్ : ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపైన, ప్రజల పక్షాన మాట్లాడే వారిపైన, దళిత సంఘాలపైన, మహిళా సంఘాల పైన, ఇతర ప్రజాసంఘాలపైన నిర్బంధచట్టాలను ప్రయోగిస్తున్నారు.
నిరసన తెలిపే వారిపైనే కాకుండా, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల పైన, ప్రతిపక్ష నాయకులపైన కూడా నిర్బంధ చట్టాలు పెట్టి బెయిల్ రాకుండా జైల్లో పెడుతున్నారు.
చివరికి జర్నలిస్టులపైన, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లపైన కూడా నిర్బంధ చట్టాలను ప్రయోగిస్తున్నారు.
వారి పాలన ఉన్న ప్రతి రాష్ట్రంలో నిర్బంధ చట్టాలను విస్త్రుతంగా ఉపయోగిస్తున్నారు.
ప్రశ్న : మణిపూర్ లో రెండు జాతుల మధ్య జరిగే ఘర్షణలతో అనేక నెలలుగా ఆ రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది. దీని మూలం ఎక్కడ?
హరగోపాల్ : ఆదివాసీల సమస్య రెండు వందల ఏళ్ళనుంచి కొనసాగుతోంది.
రైల్వేకోచీల తయారీకి కావలసిన కలప కోసం బ్రిటిష్ పాలకులు అడవిలోకి వెళ్ళారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదివాసీల పైన నిర్బంధం కొనసాగుతూనే ఉంది.
అడవిలో సంపదను తీసుకోవడం, ఆదివాసులను నిర్బంధించడం చేస్తూనే ఉన్నారు.
రాజ్యానికి, ఆదివాసీలకు మధ్య ఏదైన తేడా వస్తే వనరులు సామాజిక అవసరాలకోసం కనుక రాజ్యానిదే అంతిమ నిర్ణయమంటుంది.
బ్రిటిష్ వారు ప్రశేశపెట్టిన ఎమినెంట్ డొమైన్ ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.
భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వల్ల ఆదివాసులకు కొన్ని హక్కులు కల్పించినప్పటికీ, బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన ఎమినెంట్ డొమైన్ను మాత్రం తొలగించలేదు.
అటవీ చట్టాల ప్రకారం ఆదివాసులు అనుమతి తీసుకోవాలనే నిబంధనను పట్టించుకోకుండా ఎమినెంట్ డొమెన్ అడ్డుపడుతోంది.
అటవీ సంపదలో ఆదివాసీలకు భాగముందని అనకుండా వారికి ఏమీ ఇవ్వకుండా వారిని అడవి నుంచి వెళ్ళగొడదామనడంతో ఆదివాసుల ప్రాంతాల్లో పోరాటాలు జరుగుతున్నాయి.
చత్తీస్ ఘడ్, ఒరిస్సా, తెలంగాణా వంటి చాలా రాష్ట్రాల్లో ఆదివాసులు పోరాడుతున్నారు.
1917 ఆదివాసుల భద్రతా చట్టం ఉంది కానీ, అది వర్తించడం లేదు.
ఇప్పుడు రాజ్యం జోక్యం పెరిగి మణిపూర్లో హింస పెరుగుతున్నది.
మణిపూర్ లో కుకీలు నివసిస్తున్న గుట్టలపై విలువైన ఖనిజాలున్నాయి.
వాటి వేట కొరకు కుకీలకు, మైతీలకు మధ్య ఘర్షణ జరుగుతున్నది.
ప్రశ్న : పౌరహక్కుల అణచివేతలో దక్షిణాది రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాలకు మధ్య కొంతైనా తేడా ఉందా?
హరగోపాల్ : అణచివేతలో ఉత్తరాదికి, దక్షిణాదికి పెద్ద తేడా లేదు.
కేంద్రం అరెస్టు చేస్తే, కేంద్రంతో విభేదాలున్న రాష్ట్ర ప్రభుత్వం కాస్త అభ్యంతరం చెపుతోంది.
కేంద్రంపైన పోరాడి రాష్ట్రాలు ఏమీ చేయడం లేదు.
ఢిల్లీ రాష్ట్ర మంత్రిని కేంద్రం అరెస్టు చేస్తే, ముఖ్యమంత్రి ఏమీ చేయలేకపోతున్నారు.
తెలంగాణాలో ప్రజాస్వామిక ఉపాధ్యాయుల సంఘం వారు మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకున్నారు.
శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాది కదా, సెంటర్ ఎలా కలగ చేసుకుంటుంది అంటే, కేంద్రం నుంచి వచ్చింది కదా అమలు చేయక తప్పదని రాష్ట్ర అధికారులంటున్నారు.
ప్రశ్న : పౌరహక్కుల అణచివేతలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు, బీజేపీ ఏతర పార్టీల పాలిత రాష్ట్రాలకు తేడా ఏమైనా ఉందా?
హరగోపాల్ : అధికారంలో కొచ్చాక, అణచివేతలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు.
బెంగాల్ పౌరహక్కుల ఉద్యమంలో సుజాతో బద్ర ఒక క్రియాశీలక కార్యకర్త, గౌరవప్రదమైన వ్యక్తి.
ఎన్నికల్లో మమతా బెనర్జీ తరపున ప్రచారం కూడా చేశారు.
విప్లవ కారుల నాయకుడు కిషన్ ని చంపేయడంతో సుజాతో భద్ర కూడా ఏం అనలేకపోతున్నారు.
పౌరహక్కుల సంఘం పైన అణచివేత జరుగుతోంది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక, రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నవారిని పిలిచి గౌరవించిన వారు కూడా, ఇప్పుడు పౌరహక్కుల సంఘాన్ని నిషేధించేవరకు వెళ్ళారు.
గతంలో ఎప్పుడూ పౌరహక్కుల సంఘంపైన నిషేధం పెట్టలేదు.
ప్రజల ఒత్తిడితో నిషేధాన్ని వెనక్కి తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వమైతే వెనక్కి తీసుకునేది కాదు.
ప్రశ్న : ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో మీరు పాల్గొన్నారు కదా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మీ ఆశలు, ఆకాంక్షలు ఏమేరకు నెరవేరాయి?
హరగోపాల్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయనే భ్రమలేం మాకు లేవు.
తెలంగాణా వస్తూనే మారిపోతుందని అనుకోలేదు.
తెలంగాణాకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి, అస్తిత్వం ఉంది.
ఒక ఆధిపత్య పొర పోతే అది ప్రజాస్వామిక విజయమని భావించాం.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు.
ఆచరణలో లేదు.
ఇదంతా ఒక వ్యక్తి పాలన.
వీరికి ప్రజాస్వామ్యం పట్ల, హక్కుల ఉద్యమం పట్ల ఏమాత్రం గౌరవం లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో నన్ను ఎప్పుడూ అరెస్టు చేయలేదు.
తెలంగాణా రాష్ట్రం వచ్చేసరికి పౌరహక్కుల సంఘాన్ని నిషేధించే స్థాయికి వెళ్లింది.
నీటి పంపిణీ పైన అధికారం కేంద్రం తీసుకుంటే ఒక్క మాట మాట్లాడలేదు.
జీఎస్టీకి మద్దతు తెలిపారు.
ప్రజాస్వామ్య సంస్కృతి కొంత వికాసం చెందుతుందని భావించాం. కానీ, దానికి విరుద్ధంగా పాలన జరుగుతున్నది.
ప్రశ్న : ప్రభుత్వానికి, ఒకనాటి పీపుల్స్ వార్, నేటి మావోయిస్టులకు మధ్య జరిగిన చర్చల్లో మీరు పాల్గొన్నారు కదా! శాంతిని నెలకొల్పడంలో ఆ చర్చలు ఎంత మటుకు ఫలించాయి?
హరగోపాల్ : పీపుల్స్ వార్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగడమనేది ఒక ప్రయోగం.
బహుశా ప్రపంచ చరిత్రలోనే చాలా అరుదైన ప్రయోగం.
అటు సాయుధ పోరాటాన్ని ఎంచుకున్న విప్లవ పార్టీ, ఇటు అణచి వేసే ప్రభుత్వం రెండూ భిన్న ధృవాలు.
ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం అనేది ఊహించలేనిది.
శాంతి నెలకొనాలని పౌర స్పందన వేదిక అటు విప్లవకారులకు నచ్చచెప్పింది.
ఇక్కడ ముఖ్యమంత్రిని, మంత్రులని ఒప్పించగలిగింది.
వీరిద్దరి మధ్య చర్చలు జరపడం అసాధ్యం అని చాలా మంది అన్నారు.
చర్చలు జరగనే జరగవని అన్నారు.
ఈ ప్రయత్నం చర్చల దాకా పోతుందా అని కూడా అన్నారు.
శంకరన్ గారు, కన్నాభిరాన్ గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, జయశంకర్ గారు వంటి గౌరవం ఉన్న వ్యక్తులు పౌరస్పందన వేదికలో ఉన్నారు.
చర్చలు జరగాలని కాదు, హింస తగ్గాలి అని భావించాం.
విప్లవ పార్టీలకు ఒక స్వప్నం ఉంది.
రాజ్యానికి రాజ్యాంగం నిర్దేశించిన సంక్షేమ ధ్యేయం ఉంది.
పౌరహక్కులను గౌరవించడం మీ బాధ్యత, ఆయుధాలకు ప్రాధాన్యత కాకుండా, మీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ చర్చలో ఉభయులకు చెప్పాం.
పీపుల్స్వార్ పార్టీ వారు మేం చర్చలకు సిద్ధమే అన్నారు.
చంద్రబాబు కాలంలో చర్చలకు ప్రయత్నాలు జరిగాయి.
చర్చలకు వస్తామన్న వారిలో మొదటి ముగ్గురు అగ్రనాయకులను ఎన్ కౌంటర్లో చంపేశారు.
దానికి ప్రతిగా చంద్రబాబుపైన తిరుమలకు వెళ్ళేదారిలో ఆయనపైన దాడి జరిగింది.
తరవాత జరిగిన ఎన్నికల్లో గెలిచిన రాజశేఖర్ రెడ్డికి చర్చలు ఇష్టం లేదు.
ఎన్నికల ప్రణాళికలో పెట్టారు కనుక విధిలేక చర్చలకు సిద్ధమయ్యారు.
హెూంమంత్రి జానారెడ్డి పీపుల్స్ వారుకు లేఖ రాశారు.
నిషిద్ధ సంస్థతో చర్చలు జరపడం నిజానికి చట్టవ్యతిరేకం అంటే చర్చల కోసం నిషేధం ఎత్తేయమన్నాం. ఎత్తేశారు.
చర్చల సందర్భంగా సామరస్య వాతావరణం ఏర్పడడం పోలీసులకు ఇష్టం లేదు.
చంద్రబాబు కాలంలో ఉద్యమాన్ని అణచివేసిన వ్యక్తే రాజశేఖరరెడ్డికి సలహాదారయ్యాడు.
చర్చలకు వచ్చిన వారిని ఏం చేస్తారోనని మూడవ రోజే మాకు భయమేసింది.
పొత్తూరు వెంకటేశ్వరరావు గారు హెూం మంత్రి జానారెడ్డికి చేతులు జోడించి వారిని క్షేమంగా పంపించమని అడిగారు.
జానారెడ్డి తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని అన్నారు.
మిగతా విషయాలు రెండవ దశలో చర్చిద్దామన్నారు.
కొంత భూమిని పంచుతామన్నారు.
పది నెలలు శాంతియుత వాతావరణం ఏర్పడింది.
గ్రామాల్లో మంచి వాతావరణం వచ్చింది.
తక్కువకు తక్కువ ప్రాణ నష్టం జరగడానికి భవిష్యత్తులో సమాజం నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు చర్చలు జరగవచ్చు.
తక్కువ హింసతో సమాజం ముందుకు పోవచ్చు.
చర్చల విఫలం పట్ల పోత్తూరు వెంకటేశ్వరరావు గారు, శంకరన్ గారు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ప్రశ్న : ప్రపంచం ఎలా ఉంది? అసలు ఎలా ఉండాలనుకుంటున్నారు?
హరగోపాల్ : ప్రపంచం ఎలా ఉండాలి అంటే నా మటుకు నాకు, మనిషి మనిషిగా ఉండాలి.
కానీ, మనిషి మనిషిగా లేరు.
మానవ సంబంధాలు మానవ సంబంధాలుగా లేవు.
విలువలు ఉన్నతీకరణ జరిగినప్పుడు సమాజం ఉన్నతీకరణ జరుగుతుంది.
ఆధిపత్యాలు లేని ఒక స్వేచ్ఛాయుత మానవీయ సమాజం రావాలని కోరుకుంటున్నాను.
ప్రజలు తాము కోరుకుంటున్నట్టు జీవించి, తమలోని సృజనాత్మతను వెలికి తీసే విధంగా సమాజం ఉండాలనుకుంటున్నాను.
ఆర్థికంగా సమానత్వం, రాజకీయంగా ప్రజల భాగస్వామ్యం ఉన్న అధికారం, సామాజికంగా సామరస్యపూర్వకంగా సహజీవనంతో కలిసి జీవించే సమాజం, నైతికంగా ఉన్నతీకరించిన సమాజం, కళాత్మకంగా, సృజనాత్మకంగా ఉండే సమాజం, హింస లేని సమాజం ఏర్పడాలి.
సమాజంలో ఇలాంటి వాతావరణం ఉంటేనే మనిషి జీవితానికి,అలాగే సమాజ జీవనానికి ఒక లక్ష్యం, అర్థవంతంగా జీవించగలుగుతారు.
మానవాళి ఒక ప్రేమ మయమైన ఒక నాగరికత దశకు చేరుకోవాలి.
ప్రతి తరం అలాంటి లక్ష్య సాధనకు దోహదపడాలి.
(అయిపోయింది)