– రాఘవశర్మ
దట్టమైన పచ్చని అడవిలో ఎత్తైన కొండలు.
కొండల మధ్య లోతైన లోయలు , వాగులు, వంకలు.
గలగలా పారే సెలఏర్ల పక్కనుంచి జాగ్రత్తగా అడుగులు వేయాలి.
నీటి గుండాల్లో ఈదుకుంటూ ముందుకు సాగాలి.
జలపాత సంగీతాన్ని ఆస్వాదించాలి.
పాచిపట్టిన కొండ అంచుల్లో ఒట్టి కాళ్ళతో నడవాలి.
తాళ్ళు పట్టుకుని లోయల్లోకి దిగాలి.
శనేశ్వర తీర్థానికి ఇలా దారంతా సహసాలే!
కైలాస తీర్థమా? శనేశ్వర తీర్థమా?
ఎటువెళ్ళాలో మధుక్కూడా సందిగ్ధమే!
ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు అలిపిరిలో ద్విచక్ర వాహనాల్లో బయలు దేరాం.
అంతా పదకొండు మందిమి.
ముప్పావు గంటలో తిరుమల చేరాం.
“ఎటువెళదాం?’ మధు మళ్ళీ ప్రశ్న.
‘కైలాస తీర్థం చూశాం కనుక శనేశ్వర తీర్థం వెళదాం’ అన్నాను.
ఎక్కువమంది శనేశ్వర తీర్థానికే మొగ్గు చూపారు.
‘మెజారిటీ ఈజ్ డెమాక్రసీ’
మా వాహనాలు శిలాతోరణం మీదుగా వేదపాఠశాల వైపు కదిలాయి.
వేదపాఠశాల ఈవలనే కుడివైపున అడవిలోకి దారితీశాం.
దారంతా రాళ్ళురప్పలతో ఎగుడుదిగుడుగా ఉంది.
దారి మధ్యలో పచ్చిగా ఏనుగు విసర్జితాలు.
గుండె గుభేలుమన్నది.
అంతా ఆగిపోయాం.
దారపొడవునా ఏనుగుల పాదముద్రలు.
పిల్ల ఏనుగులు ఆన వాళ్ళు కూడా కనిపించాయి.
అనుమానం లేదు, ఈ తెల్లవారుజామునే, ఈ దారిలోనే ఏనుగుల గుంపు వెళ్ళింది.
ఏనుగుల గుంపు వెళ్ళిపోయిందో, ఈ పక్కనే సంచరిస్తోందో తెలియదు.
ఒంటరిగా సంచరించే మదపుటేనుగు మాత్రం కాదు.
మదపు టేనుగైతే తప్పించుకోవడం కష్టం.
ఏనుగుల గుంపు మన వైపు వస్తే, తప్పించుకోవడానికి పక్కన లోయలు కూడా లేవు.
మనం పరిగెత్తినంత వేగంగా లోయల్లోకి ఏనుగులు పరిగెత్తలేవు.
మా వాహనాలు ముందుకు కదిలాయి.
దారిపొడవునా ఏనుగులు సంచరించిన ఆనవాళ్ళే!
కుమార ధార సమీపిస్తుండగా ఏనుగుల ఆనవాళ్ళు కనుమరుగవడంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్నాం.
కుమార ధార సమీపిస్తుండగా ఎడమ వైపునకు మా వాహనాలు కదిలాయి.
దారంతా రాళ్ళతో ఎగుడుదిగుడుగా ఉంది.
మా వాహనాలు ఎగిరెగిరిపడుతున్నాయి.
దూరంగా అన్నదమ్ముల బండ కనిపించింది.
ఆ పక్కనే చామల కోన.
దారికి పక్కనే ఉన్న ఆ కోన ఎంత అందంగా ఉందో!
లోతైన చామల కోనలోకి జలపాతం దుముకుతోంది.
రెండు కొండల నడుమ, కనుచూపు మేర చామల కోన అందాలు చూడ తరమా అన్నట్టుగా ఉంది!
లోయలో దట్టంగా పెరిగిన ఎత్తైన వృక్షాలు కనిపిస్తున్నాయి.
పై నుంచి చూస్తుంటే లోయలో ఆ వృక్షాలు ఎంతో లోతున ఉన్నాయి!
చామల కోన అంచుకు వెళ్ళి దాని అందాలను వీక్షించాం.
చామల కోనకు ఎదురుగా మా వాహనానాలు నిలిపేసి లోయలోకి నడక మొదలు పెట్టాం.
ఎత్తైన చెట్ల మధ్యలో సన్నని నడకదారి.
లోయలోకి దిగుతున్నాం.
మనిషెత్తు పెరిగిన బోదలోంచి, వాటి మధ్యనున్న ఈత చెట్ల మధ్య నుంచి దిగువకు మా నడక సాగుతోంది.
నడక దారి ఎన్ని మెలికలు తిరిగిందో తెలియదు.
ఎట్టకేలకు లోయలోకి దిగేశాం.
చిన్న నీటిచెలమ కనిపించింది.
సమయం ఎనిమిదైంది.
ఆ నీటి చెలమ దగ్గరే టిఫిన్లు ముగించాం.
రెండు కొండల నడుమ రొద చేస్తూ వంక సాగుతోంది.
ఎటు వీలైతే అటు వంకను దాటుకుంటూ నడుస్తున్నాం.
రెండు కొండల నడమ, సాగే నీటి వంక వెంట నడుస్తున్నాం.
మధ్యలో చిన్న చిన్న జలపాతాలను దాటుతున్నాం.
వాటి అందాలను ఆస్వాదిస్తున్నాం.
ఆ వంక ఎన్ని మెలికలు తిరిగిందో!
ఇరువైపులా కొండపైన దట్టంగా పెరిగిన వృక్షాలు.
వంకను ఎంత తప్పించుకుని నడుస్తున్నా, ఇక నన్ను తప్పించుకోలేరంటోంది.
ఆ వంక పెద్ద నీటి గుండంలోకి దుముకుతోంది.
దాని వెంట మేముకూడా దూకక తప్పలేదు.
బ్యాగులను, ప్యాంటు షర్టులను, బూట్లను గట్టునే ఒదిలేశాం.
షా ర్టులు, బనీన్లతో గుండంలోకి దిగక తప్పలేదు.
ఈదుకుంటూ ఆవలకు వెళ్ళాం.
ఇక్కడ నుంచి మా నడక సాహసోపేతంగా సాగుతోంది.
వంకలో రాళ్ళపైనుంచి, మధ్యలో గులక రాళ్ళ పైనుంచి మానడక.
ఇంట్లో చెప్పులేసుకుని నడిచిన పాదాలు సుకుమారంగా తయారయ్యాయి.
గులక రాళ్ళపైన, మట్టిలో నడవలే నంటున్నాయి.
అయినా వాటిపైన నడక తప్పదు.
పడకుండా బ్యాలెన్స్ చేస్తూ మా నడక సాగుతోంది.
మాలో కొందరు పడిపోతున్నారు.
మళ్ళీ లేచి నడుస్తున్నారు.
మళ్ళీ మరొక నీటి గుండం అడ్డం వచ్చింది.
దాని పక్కనుంచి దాటడానికి కొందరు ప్రయత్నించారు.
ఆ సర్కస్ ఫీట్లకంటే గుండంలో ఈదుకుంటూ వెళ్ళడమే మేలనిపించింది.
మాలో ఈత రాని ఒకే ఒక వ్యక్తి కోసం ట్యూబ్ వేసి ఆవలికి చేర్చారు.
కొండ అంచునే చెట్ల మధ్య నడుస్తున్నాం.
కొన్ని ముళ్ళ చెట్లు కూడా అడ్డంవస్తున్నాయి.
వాటిని తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నాం.
అయినా అక్కడక్కదా శరీరాన్ని గాయపరుస్తూనే ఉన్నాయి.
రెండు కొండల నడుమ పారుతున్న వంక దిగువనున్న లోయలోకి జాలువారుతోంది.
లోయలోకి దిగాలి.
అంతా చెమ్మ చెమ్మగా ఉంది.
అడుగు వేస్తే జారేట్టుంది.
ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కొండ అంచునే రెండు వరుసల తాడు కట్టారు.
ఆ తాడు పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తూ చిన్న కొండ దిగాం.
తాడు ఎంత పట్టుకున్నా కింద చెమ్మ ఉండడంతో జారుతోంది.
తాడుపట్టుకున్న పట్టుతోనే కిందకు దిగాం.
రెండు కొండల నడుమ దూరం తగ్గిపోతోంది.
రెండు కొండలు దగ్గరగా ఉన్న చోట మధ్యలో ఎత్తైన వృక్షం నిటారుగా ఎదిగింది.
కొండ మధ్యలో అంచున మొలిచిన వృక్షానికి ఊడలు కిందకు వేలాడుతున్నాయి.
రెండు కొండల నడుమ పారుతున్న చిన్న చిన్న జలపాతాలనుంచి కిందకు దిగుతున్నాం.
అంతా పాకుడు.
ఎక్కడ జారుతుందో తెలియదు.
జాగ్రత్తగా అడుగులు వేయాలి.
వాగు ప్రవాహానికి అక్కడక్కడా అడ్డంగా పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చి ఇరుక్కుపోయాయి.
వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతున్నాం.
రెండు కొండలనడుమ వంకకు అడ్డంగా ఇరుక్కుపోయిన రాళ్ళ కింద నుంచి జలపాతం దాదాపు ఇరవై అడుగుల లోయలోకి జాలువారుతోంది.
అక్కడి నుంచి ముందుకు సాగడం ఎలా!?
పక్కనున్న కొండ అంచులు పట్టుకుని కాస్త పైకి ఎక్కాం.
కొండ అంచునే కొంత దూరం వెళ్ళాక ముందుకు వెళ్ళడం సాధ్యం కాదనిపించింది.
మళ్ళీ వెనక్కి వచ్చి, జలపాతం నుంచి కిందకు తాడు వదిలాం.
ఆ తాడు పట్టుకుని ఒకరొకరు కిందకు దిగారు.
ఉదయం పదకొండవుతోంది.
రెండు కొండల నడుమ వంకనుంచి ఈదుకుంటూ ముందుకు సాగాలి.
కొంత దూరం నడుచుకుంటూ, మరికొంత దూరం ఈదుకుంటూ వెళ్ళడం.
ఇరువైపులా ఎత్తైన కొండలు, నడుమ సన్నని దారిలో ప్రవహిస్తున్న వంక.
అలా గంటపైగా సాగాకగానీ శనేశ్వర తీర్థం రాలేదు.
శనేశ్వర తీర్థంలోకి దిగడం ఇద్దరికే సాధ్యమైంది.
మిగతా అంతా పైనుంచే దాన్ని దర్శించి తృప్తి చెందారు.
మళ్ళీ తిరుగు ప్రయాణం.
పైనున్న జలపాతం వద్దకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటిగంటైంది.
ఇరవై అడుగుల జలపాతంలోకి దిగడమైతే దిగారు.
పైకి ఎక్కడం ఎలా?
అతి కష్టంపైన ఒకే ఒక్కరు ఎక్కడానికి ప్రయత్నించారు.
తాడుపట్టుకుని ఎక్కడానికి సాధ్యం కావడం లేదు.
కాళ్ళకు పట్టు దొరకడం లేదు.
‘ఉపాయం లేని వాళ్ళను ఊళ్ళోంచి తరిమేయాలి’ అనే ఒక పాతకాలపు సామెత గుర్తుకొచ్చింది.
మళ్ళీ కాస్త వెనక్కి వెళ్ళారు.
పైనెక్కిన వ్యక్తి తాడు తీసుకుని కొండ అంచునే పైకి ఎక్కడానికి అనుకూలంగా తాడుకట్టుకుంటూ కిందకు వదిలాడు.
ఆ తాడు పట్టుకుని కొండ అంచునుంచి అంతా పైకి ఎక్కి వచ్చారు.
అంతా క్షేమంగా వచ్చేసరికి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాం.
ఎక్కలేకపోతే ఎలా?
శనేశ్వర తీర్థానికి మరో రెండు దారులున్నాయి.
ఏదో ఒక దారి నుంచి వచ్చేయవచ్చు.
కైలాస తీర్థం నుంచి వచ్చినా మళ్ళీ ఎంత దూరం నడక!?
ఒక వేళ అలా వచ్చినా బట్టలు, బ్యాగులు, మధ్యాహ్న భోజనాలు ఇటువేపు ఉండిపోయాయి.
మళ్ళీ ఇక్కడికి రావాలి.
మళ్ళీ వచ్చిన దారినే తాడుపట్టుకుని ఎక్కుతూ, నీటి గుండాలను ఈదుకుంటూ బట్టలు, బ్యాగులు పెట్టిన ప్రాంతానికి వచ్చేశాం.
మధ్యాహ్నం రెండున్నరవుతోంది.
మంచి ఆకలిగా ఉంది.
ఆవురావురు మంటూ భోజనాలు ముగించాం.
ఒట్టి కాళ్ళతో నడక తప్పింది.
బట్టలేసుకుని, బూట్లు తొడుక్కుని, ఖాళీ బ్యాగులతో కదిలాం.
గంటల తరబడి ఒట్టికాళ్ళతో నడిచినమేం, బూట్లు వేసుకునే సరికి ఎంత హాయిగా ఉందో!
మా నడక కూడా వేగం పుంజుకుంది.
వచ్చేటప్పుడు చూసిన జలపాతాలను, పారే వంకను, అడవిని, కొండలను పరికిస్తూ వస్తున్నాం.
ఉదయం టిఫిన్లు చేసిన చోటికి వచ్చేశాం.
అక్కడి నుంచి వంక వెంటే కొంత దూరం నడిచాక కొండ ఎక్కాం.
చెట్ల మధ్య బోదలోంచి మా నడక సాగుతోంది.
మా వాహనాలు నిలిపిన చామల కోన వద్దకు వచ్చేసరికి సాయంత్రం అయిదుగంటలవుతోంది.
వచ్చిన మార్గానే బయలు దేరాం.
చీకటి పడబోతోంది.
ఏనుగుల భయం వెంటాడుతోంది.
వేదపాఠశాల వద్దకు వచ్చేసరికి ఆరుగంటలైంది.
తిరుమలనుంచి తిరుపతి వచ్చేసరికి రాత్రి ఏడుగంటలైంది.
తిరుపతి నుంచి శనేశ్వరతీర్థం వెళ్ళి రావడానికి పద్నాలుగు గంటలు పట్టింది.
తిరుమల నుంచి చామల కోన పదిహేను కిలోమీటర్లుంటుంది.
అక్కడి నుంచి శనేశ్వరతీర్థానికి నాలుగున్నర గంటల నడక.
మొత్తం రాను పోను తొమ్మిది గంటల నడక.
శనేశ్వర తీర్థానికి ఈ దారిలో ఎవ్వరూ వెళ్ళి ఉండరు.
ఇలా శనేశ్వర తీర్థానికి వెళ్ళిరావడం నిజంగా సాహసమే.