క్రీ.శ.7వ శతాబ్ది నాటి బాదామీ చాళుక్య మహిషాసురమర్దిని శిల్పాన్ని గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
హైదరాబాద్, జూన్ 23: సిద్ధిపేట జిల్లా దుద్దెడ మండలం ఆరెపల్లి వేంకటేశ్వరాలయం వద్ద అరుదైన మహిషాసురమర్దిని శిలాఫలకం బయల్పడిందని కొత్త తెలంగాణా చరిత్రబృందం, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. సిద్ధిపేటకు చెందిన కొత్త తెలంగాణ చరిత్రబృందం కో-కన్వీనర్ వేముగంటి మురళీకృష్ణ, సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీర్ ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారంనాడు అహోబిలం కరుణాకర్, వేముగంటి మురళీకృష్ణ, శ్రీరామోజు హరగోపాల్, ఈమని శివనాగిరెడ్డి, ఎస్.జైకిషన్, ఎం.డి. నసీరులు ఆ శిలాఫలకాన్ని పరిశీలించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
18 సెం.మీ. పొడవు, 10 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ.ల మందం కలిగిన ఈ శిలాఫలకంలో కిందిభాగం భిన్నమైందని, పై భాగంలో మహిషాసురమర్దిని ఎడమచేత్తో దున్నపోతు ఆకారంలో వున్న మహిషాసురుని తోక పట్టుకుని, కుడిచేతిలోని శూలంతో రాక్షసుని శరీరంలో గుచ్చుతూ, అతని తలపై తన కుడికాలుతో తొక్కుతూ సంహరిస్తున్నట్లుగా ఉంది.
అదే విధంగా కుడి, ఎడమ వైపున గల పరహస్తాలలో శంఖు, చక్రాలను ధరించిన దేవత వంటిపై కొద్దిపాటి ఆభరణాలను, తలపై వెంట్రుకలను ముడిగా అలంకరించుకొని, కిరీటం లేకుండా ఉందని, ప్రతిమాలక్షణాలనుబట్టి ఈ శిలాఫలకం బాదామీ చాళుక్యుల తొలికాలం క్రీ.శ.7వ శతాబ్దికి చెందినదని శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
గతంలో విష్ణుకుండినకాలపు(5వ శతాబ్ది) మహిషాసురమర్దిని శిల్పం కీసరగుట్టలో లభించిందని, ఇటీవల నల్లగొండ జిల్లా పానగల్లులో అదే కాలానికి చెందిన మహిషాసురమర్దిని చిన్న శిలాఫలకాన్ని ఈమని శివనాగిరెడ్డి, డి.సూర్యకుమార్ గుర్తించారన్నారు.
ఆరెపల్లిలో వెలుగుచూసిన ఈ చిన్న మహిషాసురమర్దిని శిలాఫలకం బాదామీలోని శిల్పం కంటే ముందుదని, తెలంగాణాకు సంబంధించి బాదామీ చాళుక్యుల కాలానికి చెందిన తొలి మహిషాసురమర్దిని శిలాఫలకమనీ, ఆ తరువాత పెద్ద పరిమాణంలో అమ్మవారి శిల్పాలు ఆలంపురం వంటి క్షేత్రాల్లో అనేకం బయటపడినాయని ఆయన అన్నారు.
అదే వేంకటేశ్వరాలయం ముందర 9వ శతాబ్దపు రాష్ట్రకూటుల శైలి జైన చౌముఖిని కూడా చరిత్ర బృందం పరిశీలించింది.
పురావస్తు, చారిత్రక ప్రాధాన్యత కలిగిన తొలి చాళుక్య ప్రతిమాలక్షణం, శిల్పకళాశైలికి అద్దం పడుతున్న ఈ శిలాఫలకాన్ని భద్రపరిచి, భవిష్యత్తరాలకు అందించాలని కొత్త తెలంగాణ చరిత్రబృందం ఆరెపల్లి గ్రామస్తులకు, ఆలయకమిటీకి విజ్ఞప్తి చేసింది.