“ఎగువభద్రకు జాతీయ హోదా – కృష్ణపై తీగల వంతెనకు కేంద్రం మొగ్గు చూపుతున్నందున ఏపీ అఖిలపక్షం ఏర్పాటు చేయాలి.'”
-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
ఎగువభద్రకు జాతీయ హోదా – కృష్ణపై తీగల వంతెనకు కేంద్రం మొగ్గు చూపుతున్నందున ఏపీ అఖిలపక్షం ఏర్పాటు చేయాలి.
రాయలసీమ భవిష్యత్ ప్రమాదంలో పడే విధంగా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో తుంగభద్ర పై నిర్మిస్తున్న ఎగువ భద్రకు జాతీయ హోదా ప్రకటించడం తాజాగా ఏపీ తెలంగాణ మధ్య 170 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణ పర్యవేక్షణ కోసం అధికారుల కమిటీ ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమ భవితవ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున ఏపీ ప్రభుత్వం వెంటనే రాజకీయ పార్టీలు, రాయలసీమ ఉద్యమ సంస్థలతో అఖిలపక్షం నిర్వహించాలని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
కృష్ణపై తీగల వంతెన స్థానంలో అలుగు ఎందుకంటే …
ఏపీ – తెలంగాణ మధ్య కృష్ణా నది మీదుగా 170 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారిని నిర్మిస్తున్నది. అందులో భాగంగా సిద్దేశ్వరం దగ్గర కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రాయలసీమ ప్రజల చిరకాల కోరిక సీమ నీటి సమస్య పరిష్కారానికి కీలక పరిష్కారం సిద్దేశ్వరం అలుగు నిర్మాణం పూర్తి చేయాలి. శ్రీశైలం రిజర్వాయర్ రాయలసీమకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. పై పెచ్చు 315 TMCల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మాణం చేసిన రిజర్వాయర్ నేడు పూడిక వల్ల 200 TMC ల కన్నా తక్కువ సామర్థ్యానికి పడిపోయింది. పూడిక వల్ల నిల్వ సామర్థ్యం పడిపోవడంతో బాటు రిజర్వాయర్ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ కి 70 కిలోమీటర్ల ఎగువన సిద్దేశ్వరం దగ్గర తీగల వంతెన స్థానంలో అలుగు నిర్మాణం చేపడితే శ్రీశైలంకు పూడిక సమస్య రాయలసీమ ప్రాజెక్టులకు నీటి సరఫరాకు అవకాశం ఉంటుంది.
ఎగువ భద్రకు జాతీయ హోదా…
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో తుంగభద్రపై ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చింది. బచావత్ అవార్డు మేరకు తుంగభద్ర నుంచి కృష్ణకు నీటి కేటాయింపు 21.5 TMC లు మాత్రమే ఈ ఏడాది సుంకేసుల నుంచి 630 TMC లు నీరు కలసింది. పుష్కలంగా నీటి లభ్యత ఉన్న తుంగభద్ర నీటిని రాయలసీమకు వినియోగించే అవకాశం గుండ్రేవుల , సిద్దేశ్వరం ముందే అంటే తుంగభద్ర నీరు కృష్ణలో కలిసే చోటు అలుగు నిర్మాణం చేపడితే రాయలసీమ ప్రాజెక్టులకు నీరు విడుదల చేయచ్చు. కర్ణాటక తుంగభద్ర పై ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేస్తున్న నేపథ్యంలో సిద్దేశ్వరం అలుగు ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేని పక్షంలో భవిష్యత్తులో నీటి హక్కును కూడా కోల్పోపోయే ప్రమాదం ఉంది.
అఖిలపక్షం ఏర్పాటు చేయాలి.
జాతీయ రహదారిపై తీగల వంతెన ప్రతిపాదనతోనే ముందుకు వెళ్ళడానికి అధికారిక ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రం అనేక దపాలుగా తమ వ్యతికతను తెలిపినా పట్టించుకోకుండా ఎగువ భద్రకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం జాతీయ రహదారిపై తీగల వంతెన స్థానంలో సిద్దేశ్వరం అలుగు అడగకుండా నిర్మాణం చేయదు. అందుకనే రాయలసీమ భవిష్యత్ ప్రమాదంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి కనుక ఏపీ ప్రభుత్వం రాజకీయ పార్టీలు ముక్యంగా రాయలసీమ ఉద్యమ సంస్థలతో వెంటనే అఖిలపక్షం నిర్వహించి సీమ ప్రజలను ఛైతన్య పరిచి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాయలసీమ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తోంది.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త,
రాయలసీమ మేధావుల ఫోరం. తిరుపతి)