(వనపర్తి ఒడిలో -12)
-రాఘవశర్మ
వనపర్తి సిగపై రెండు సిరులున్నాయి!
అవి సహజ మకుటాల్లా వెలుగొందుతున్నాయి.
రెండూ, రెండు మతారాధకులకు పుణ్యస్థలాలు.
రెండు మతాల మధ్య స్నేహ వారధులు.
తరతరాల సామరస్యానికి చెరగని చిహ్నాలు.
ఒకటి పీర్ల గుట్ట, రెండవది తిరుమలయ్య గుట్ట.
ప్యాలెస్ కు కూత వేటు దూరంలో పీర్ల గుట్ట.
ప్యాలెస్ కుడి వైపున కాస్త దూరం నడిస్తే చాలు, పీర్ల గుట్ట కనిపించేది.
పీర్ల పండుగ వచ్చిందంటే అక్కడ ఒకటే సందడి.
పీర్లను పట్టుకుని గుట్టపైకి జనం పరుగులు తీసేవారు.
ముస్లింలే కాదు, హిందువులూ గుట్ట ఎక్కేవారు.
ఆ సందడంతా ఏడాదికొకసారే.
నలుగురితో నేనూ పీర్లగుట్ట ఎక్కేవాణ్ణి.
అదొక సరదా.. అదొక సంబరం..
ఒకప్పుడు పీర్లగుట్ట ఊరిబయట ఉండేది పాపం.
వెలివేసినట్టు ఒంటరిగా కనిపించేది. ఇప్పుడది ఊరి మధ్యలోకొచ్చేసింది.
కాదు కాదు, ఊరే దాన్ని తన బాహువు ల్లోకి తీసుకుని చుట్టుముట్టేసింది.
పీర్ల గుట్టపైకి ఇళ్ళు ఎగబాకుతున్నాయి!
గుట్టపైకి రహదారులు ఏర్పడుతున్నాయి.
పేరుకు గట్టయినా, మరి కొన్నాళ్ళకు అది గుట్టగా కనిపించదు.
ఒకప్పుడు ఆ గుట్ట కిందే తైసిలాఫీసు ఉండేది.
అది కర్నూలు వెళ్ళే రహదారి.
ఎప్పటి నుంచో వనపర్తి తాలూకా కేంద్రం.
ఇప్పుడు జిల్లా కేంద్రం అయిపోయింది.
వనపర్తికి మరో మకుటం తిరుమలయ్య గుట్ట.
వనపర్తికి కాస్త దూరంగా ఉండేది.
సైకిళ్ళ పైన వెళ్ళే వాళ్ళం.
ఇది కూడా కర్నూలు వెళ్ళే రహదారిలో ఉండేది.
ఆరోజుల్లో సైకిల్ పై ఎంత తొక్కినా వచ్చేది కాదు.
చాలా దూరమనిపించేది.
కానీ అది ఐదు కిలోమీటర్లే.
దట్టమైన అడవిలో ఉండేది తిరుమలయ్య గుట్ట.
ఏడాదికొకసారి ఉత్సవం జరిగేది.
జనం తండోపతండాలుగా వచ్చేవారు.
గుట్ట వరకు వెళ్ళడానికి జట్కాలుండేవి.
ఆ జట్కాల్లో ప్రయాణిస్తుంటే భలేగా ఉండేది.
సన్నని తారు రోడ్డు.
ఇరువైపులా దట్టమైన అడవి.
ఎత్తుకెళ్ళి మళ్ళీ పల్లానికి పరుగులు తీసేది జట్కా.
ఘాట్ రోడ్డు
లా ఉండేది.
‘రోడ్డంతా నీ కర్లింగ్ హెయిర్లా ఉం ది’ అన్నాను.
ఆ జట్కావాలా ఎంత సంబరపడిపోయాడో!
ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు.
జట్కాలో ఉన్న మా అమ్మా వాళ్ళు కూడా నవ్వుకున్నారు.
దేవానంద్ లాగా దువ్వుకోవడం ఆరోజుల్లో పెద్ద ఫ్యాషన్.
జుట్టు ముందు గుబ్బలా వచ్చి వెనక్కి దిగిపోయేది.
జట్కా రోడ్డులోంచి కొంత దూరం వరకు వెళ్ళేది.
అక్కడి నుంచి కొండ పైకి నడక. చుట్టూ దట్టమైన అడవి.
అడివంతా చింతబల చెట్లతో నిండిపోయేది.
చెట్ల నిండా ఎన్ని చింతబలకాయలు!
చెట్లకే పండి కిందపడిపోయేవి.
అడివంతా చింతబలకాయలు పండిన వాసన.
వీటి కోసం ఎలుగు బంట్లు వచ్చేవి.
వాటికి ప్రియమైన ఆహారం.
అందుకునే తిరుమలయ్య గుట్టకు ఒంటరిగా ఎవ్వరూ వెళ్ళే వారు కాదు.
ఎలుగు బంట్లు దాడి చేస్తాయని భయం.
ఆరోజుల్లో గుట్ట ఎంత ఎక్కినా ‘ఇంకా ఎంత ఎక్కాలబ్బా’ అనిపించేది.
చివరికి కొండ శిఖరం ఎక్కాలి.
ఆ కొండ శిఖరానికి తాటి నిచ్చెన వేసేవారు.
వనపర్తి ప్రాంతంలో ఆరోజుల్లో తాటి చెట్లు చూద్దామన్నా కనిపించేవి కావు.
ఈ నిచ్చెనకు తాటి మానులు వేరే ప్రాంతం నుంచి తెచ్చేవారు.
ఆ తాటి నిచ్చెనను పట్టుకుని ఒక వరుస ఎక్కుతుంటే, మరొక వరుస దిగేవారు.
ఎక్కడ జారిపడిపోతామోనన్న భయం!
ఒక్కొక్క సారి పదిమంది ఎక్కాక, పదిమందిని దిగమనేవాళ్ళు.
ఎక్కితే పైన నిలు చో డానికి పెద్దగా స్థలం ఉండేది కాదు.
రెండు పెద్ద పెద్ద కొండ రాళ్ళ మధ్య చిన్నగా వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం.
దాన్ని చూడ్డానికే జనమంతా ఈ ప్రయాస.
కొండ ఎక్కడ మే కిలోమీటర్ !
ఎక్కడం ఎంత ప్రయాసో, దిగడమూ అంత ప్రయాసే.
హైస్కూల్లో చదివేటప్పుడు స్నేహితులతో కలిసి అప్పుడప్పుడూ సైకిళ్ళలో వెళ్ళే వాళ్ళం.
కేవలం చింతబలకాయల కోసం.
అడివంతా చింతబలకాయల చెట్లే! వర్షాకాలంలో బాగా కాసేవి.
చెట్లకే పండిన పళ్ళు తిన్నంత తినేవాళ్ళం.
సంచుల నిండా కోసుకొచ్చే వాళ్ళం.
చాలా మంది కూలీలు గంపలు తీసుకుని నడుచుకుంటూ వచ్చేవాళ్ళు.
గంపల్లో కోసుకుని, నెత్తిన పెట్టుకుని మూడు కిలోమీటర్లు నడిచేవాళ్ళు.
ఆ రోజుల్లో చింతబల పండ్లు చిన్న గంపైతే పావలా!
కాస్త పెద్దదైతే అర్ధరూపాయికి ఇచ్చే వాళ్ళు.
ఆ పావలా అర్ధరూపాయి కోసం ఎంత కష్టపడే వాళ్ళో!
అదే మహాభాగ్యం అనుకునే వారు.
వారిని అటవీశాఖ సిబ్బంది పట్టుకునేవారు.
వాళ్ళ కళ్ళలో పడకుండా తప్పించుకుని వస్తేనే రూపోయో, రెండు రూపాయాలో లభించేది.
తిరుమలయ్య గుట్టకు వ్యాపారులు లారీల్లో కూలీలను తీసుకొచ్చే వాళ్ళు.
పక్వానికి వచ్చిన చింతబలకాయలు లారీ నిండా కోయించుకుని తీసుకెళ్ళిపోయేవారు.
కోసినందుకు వీళ్లకు కూ లీడబ్బులు ముట్టేవి.
ఇటు వంటి వ్యాపారులను పెద్దగా పట్టుకునే వారు కాదు.
‘తెలుగోళ్ళు’ అనే కులస్తులు ఉండేవారు.
ఒక భాషతో కులం ఏర్పడడం ముచ్చటగా ఉండేది.
ఇలా ‘తెలుగోళ్ళ’ను మరెక్కడా చూడలేదు.
ఈ తెలుగోళ్ళే చింతబలకాయలు కోసే కూలీలు.
వీళ్ళు మామిడి తోటలకు కాపలా దారులు.
వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు.
వీరి జీవితం వ్యవసాయంతో ముడిపడి ఉండేది.
వ్యవసాయ పనులు లేని సమయంలో చింతబలకాయలే వీరికి జీవనాధారం.
తిండి దొరకని రోజుల్లో ఈ పండ్లు తినే కాలం వెళ్ళదీసేవారు.
తిరుమలయ్య గుట్టకు నాలుగు నెలల క్రింత వెళ్ళాను.
ఎంత మార్పు! ?
ఆ అడవిలో చింతబల చెట్లు ఒక్కటంటే ఒక్కటీ కనిపించ లేదు! తిరుమలయ్య గుట్ట రూపురేఖలు మారిపోయాయి.
ఇదివరకటిలా అడవిలో నడవాల్సిన పని లేదు.
గుట్ట ఎక్కాల్సిన అవసరమూ లేదు.
ఆలయం ఉండే గుట్ట వరకు రోడ్డు వేశారు.
వాహనాలు అక్కడి దాకా వెళతాయి.
తాటి నిచ్చెన అవసరం లేకుండా మెట్లు కట్టారు.
గుడిని నిర్మించారు.
మిగతా దేవాలయాల లాగానే అది కూడా ఇప్పుడొక చిన్న పాటి యాత్రా స్థలమైపోయింది.
యాభై ఏళ్ళలో ఎన్ని మార్పులు!
అమాయకత్వం కాకపోతే అర్ధ శతాబ్దం క్రితం ఉన్నట్టు ఇప్పుడు ఎలా ఉంటుంది!?