ఎగువ భద్ర ప్రాజెక్టు…ఆంధ్ర నీటి హక్కులపై గొడ్డలి పెట్టు!

* ఎగువ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులపై మోడీ గొడ్డలి పెట్టు!

* స్పందించని జగన్మోహన్ రెడ్డి – బడ్జెట్ కు కితాబిచ్చిన బుగ్గన

(టి.లక్ష్మీనారాయణ)

మోడీ ప్రభుత్వం కేంద్ర వార్షిక బడ్జెట్లో మధ్య కర్ణాటక ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన ఎగువ భద్ర ప్రాజెక్టుకు రు.5,300 కోట్లు కేటాయించడం అత్యంత గర్హనీయం. దీన్ని కోర్టు ధిక్కార చర్యగా కూడా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేడు విజయవాడలో నిర్వహించిన చర్చా వేదికలో ప్రసంగిస్తూ నా అభిప్రాయాన్ని వెల్లడించాను. కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదో! ప్రజలకు వివరణ ఇవ్వాలని, బాగుందని కితాబిచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అనర్హుడన్న అభిప్రాయం వ్యక్తం చేశాను.

నేడు అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కృష్ణా నదీ జలాల్లో కర్ణాటకకు కేటాయించిన నికర జలాల వినియోగానికి కర్ణాటక రాష్ట్రం నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించుకొన్నది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగు ప్రజలకు శరాఘాతంగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. ఆ కేసు విచారణలో ఉన్నది. పర్యవసానంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదు. అది అమలులోకి రాలేదు.

బచావత్ ట్రిబ్యునల్ 75% నీటి లభ్యత ప్రామాణికంగా కేటాయించిన నికర జలాలను యధాతధంగా కొనసాగిస్తూ, ఆంధ్రప్రదేశ్ కు దఖలు పరచబడిన మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను హరిస్తూ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65% మరియు 55% నీటి లభ్యత ప్రామాణికంగా లభించే నీటిని కూడా లెక్కగట్టి అందులో మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకొని, 65% నీటి లభ్యత ప్రామాణికంగా లభించే నీటిని వినియోగించుకొంటామంటూ కర్ణాటక బిజెపి ప్రభుత్వం 30 టియంసిల సామర్థ్యంతో ఎగువ భద్ర ప్రాజెక్టును రూపొందించి, కేంద్ర ప్రభుత్వానికి పంపి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఆమోదింపచేసుకొన్నది. దాని నిర్మాణ అంచనా వ్యయం రు.16,125 కోట్లు. మోడీ ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్లో రు.5,300 కోట్లు కేటాయించింది.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉండగా, నికర జలాల కేటాయింపులేని ప్రాజెక్టుకు సి.డబ్లు.సి. ఎలా అనుమతిస్తుంది? కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జాతీయ ప్రాజెక్టుగా ఎలా ప్రకటిస్తుంది? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్లో రు.5,300 కోట్లు ఎలా కేటాయిస్తారు?

పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు గోదావరి నదీ జలాల వివాద పరిష్కారం కోసం నియమించబడిన బచావత్ ట్రిబ్యునల్ నికర జలాలను కేటాయించింది. సి.డబ్లు.సి. ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 మేరకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది. కానీ, 2014-15 వార్షిక బడ్జెట్లో రు.100 కోట్లు నామమాత్రంగా కేటాయిస్తే ఆందోళన చేయగా మరో 250 కోట్లుకు పెంచారు. తర్వాత కాలంలో వార్షిక బడ్జెట్లలో పోలవరానికి నిధులను కేటాయించకుండా, కేంద్ర ప్రభుత్వమే చెల్లించే బాధ్యతతో నాబార్డ్ నుండి రుణం తీసుకొని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తాన్ని చెల్లిస్తూ వస్తున్నారు. పోలవరానికి సంబంధించి డిపీఆర్-2 కు ఆమోదం తెలియజేయకుండా మోకాలడ్డుతూ, సవతితల్లి ప్రేమ కనబరుస్తూ, నికర జలాల కేటాయింపేలేని భద్ర ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో రు.5,300 కోట్లు కేటాయించడాన్ని ఏమనాలి?

భద్ర ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి వెనుకబడ్డ – కరవు పీడిత రాయలసీమ ప్రాంత నీటి హక్కులపై గొడ్డలి పెట్టుగా పరిణమిస్తుంది. 133 టియంసిల నిల్వ సామర్థ్యంతో నిర్మించబడిన తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల 101 టియంసిల నిల్వ సామర్థ్యానికి పడిపోయింది. దీన్ని చూపెడుతూ తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ చివర భాగంలో ఉన్న నవలి వద్ద కర్ణాటక ప్రభుత్వం 30 టియంసిల తరలింపుకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నది. కర్ణాటక ప్రభుత్వం ఎగువ భద్ర, నవలి ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తే బచావత్ ట్రిబ్యునల్ నికర జలాలు కేటాయించిన తుంగభద్ర ఎగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ, కె.సి.కెనాల్, రాజోలి బండ మళ్లింపు పథకం ప్రాజెక్టులకు నీటి సమస్య జఠిలంగా మారుతుంది. తుంగభద్ర డ్యాం నుండి నీరు క్రిందికి ప్రవహించి సుంకేసుల ఆనకట్ట మీదుగా శ్రీశైలం జలాశయానికి చేరడం ప్రశ్నార్థకమౌతుంది. అంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి హక్కులకు శాశ్వతంగా నష్టం వాటిల్లుతుంది.

ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర బడ్జెట్లో ఎగువ భద్ర ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై నోరు మెదప లేదు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర బడ్జెట్ బాగుందని కితాబు ఇచ్చారు. ఈ పెద్ద మనిషి ఇటీవల కర్నూలు గర్జన సభలో ప్రసంగిస్తూ రాయలసీమ ప్రయోజనాలపై గొంతు చించుకొని మాట్లాడారన్న విషయం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకానికి నిధులు కేటాయించక పోయినా, కడప ఉక్కు ప్యాక్టరీ ఊసే ఎత్తక పోయినా, రాయలసీమ ప్రాంత నీటి హక్కులపై గొడ్డలి పెట్టువేస్తూ ఎగువ భద్ర ప్రాజెక్టుకు రు.5,300 కోట్లు మోడీ ప్రభుత్వం నిధులు కేటాయించినా నిరసన కూడా వ్యక్తం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.

మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు, మరీ ప్రత్యేకంగా కరవు పీడిత రాయలసీమకు చేస్తున్న దగా, అన్యాయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన తమ వైఖరేంటో స్పష్టం చేయాలి. వైఎస్సార్సీపీ సభ్యులు పార్లమెంటులో గళమెత్తి నిజాయితీగా పోరాడుతారో! లేదా! రాజీనామాలు చేస్తారో! తేల్చుకోవాలి. రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఉద్యమించాలని విజ్ఞప్తి చేశా.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ప్రధాన కార్యదర్శి కా.కె.వి.వి.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ చర్చా వేదికలో మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ వ్యవసాయ శాఖామాత్యులు, రైతు సంఘాల సమన్వయ కమిటీ, అధ్యక్షులు శ్రీ వడ్డే శోభనాధ్రీశ్వరరావుతో పాటు వివిధ రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

(టి.లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *