(తిరుపతి జ్ఞాపకాలు-62)
-రాఘవశర్మ
ఒక రాతి కొండలో నిట్టనిలువునా చీలిక..
ఇరువైపులా ఆకాశాన్ని తాకేలా కొండ అంచులు..
మధ్యలో నీటి ప్రవాహం..
నీటిగుండాలను నింపుకుంటూ ముందుకు సాగుతోంది.
ఆ కొండ చీలిక తనలో ఎన్ని రూపాలను పొదుగుకుందో..!
ఆ తుంబురు సొగసు మాటలకందని మహాద్భుతం!
తిరుమలలో పాపనాశనం డ్యాం దాటి తుంబురు వెళతాం.
మామండూరు నుంచి వెళ్ళడం మరో అనుభూతి.
ఆదివారం (జనవరి 22) తెల్లవారు జామున 5 గంటలకు తిరుపతి నుంచి కదిలాం.
పన్నెండు ద్విచక్రవాహనాల్లో 23 మందిమి.
మామండూరుకు 23 కిలోమీటర్లు, ముప్పావు గంట పట్టింది.
మామండూరు దాటి కొంత దూరం వెళ్ళాక ఎడమ వైపు రైల్వే వంతెన.
వంతెన కింద నుంచి అడవిలోకి మా వాహనాలు సాగాయి.
దారంతా రాళ్ళు రప్పలు.
వాహనాల వేగం తగ్గింది.
చుట్టూ అడవిలో రకరకాల చెట్లు.
దారికి ఇరువైపులా పెరిగిన బోద.
దారి ఎన్ని మెలికలు తిరిగిందో!
ఆ మెలికల్లో మా వాహనాలు తూనీగల్లా సాగుతున్నాయి!
దట్టమైన చీకటిని చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాయి!, రాళ్ళ పై నుంచి ఎగిరెగిరి దూకుతున్నాయి.
అడవిలో అలా ఏడుకిలో మీటర్లు.
చీకటి తెరలు తొలగిపోతున్నాయి.
వెలుగు రేఖలు తొంగి చూస్తున్నాయి.
కిలకిలా.. కిచ కిచా.. శబ్దాలు.
ఈ పరదేశీయులను పక్షులు అలా పలకరిస్తున్నాయి.
ఓహ్.. ఎంత ఆహ్లాదం.. ఈ ఉదయం ప్రకృతి హృదయం.
వెనుకబడ్డ వారి కోసం అరగంట ఆగాం.
సమయం ఆరైపోయింది.
ముందుకు సాగుదామంటే బండిరుసు వాగు అడ్డమొచ్చింది.
ఆ వాగులో ఏటి ప్రవాహానికి కొట్టుకిచ్చిన రాళ్ళు, రప్పలు. వాహనాలను అక్కడే ఆపేశాం.
బండిరుసు పేరు ఎందుకొచ్చింది!?
ఎద్దుల బండ్లలో ఈ దారినే తుంబురుకు వెళ్ళే వారు.
ఈ వాగులో వెళుతుంటే బండిరుసులు విరిగిపోయేవి.
అందుకుని దీన్ని బండిరుసు అన్నారు.
ఆ ఏరు దాటాం.
అడవిలో నడక మొదలైంది.
ఇరువైపులా కొండ.
మధ్యలో రాళ్ళతో నిండిన ఏరు.
వర్షాకాలంలో ఇది ఉదృతంగా ప్రవహిస్తుంది.
అడవిలో చెట్ల మద్య నడక మొదలైంది.
వెదురు పొదలతో అడవి దట్టంగా ఉంది.
ఆ పొదల నుంచి వీస్తున్న చల్లని గాలి వింత వింత శబ్దాలను చేస్తోంది.
అక్కడక్కడా ఏనుగుల విసర్జితాలు.
నాలుగైదు రోజుల క్రితం అక్కడ సంచరించిన ఆనవాళ్ళు.
అలా గంట నడిచే సరికి ఎడమ వైపు నుంచి మరో నీటి ప్రవాహం ప్రధాన ఏటిలోకి వచ్చిపడుతోంది.
అదే దేవతార్థం వెళ్ళే దారి, అక్కడి నుంచి దగ్గరే.
అలా నడుచుకుంటూనే వెళుతున్నాం.
అడవిలోంచి ఏటిలో రాళ్ళపైన నడక.
రాళ్ళ పైన నడవడం ఎంత కష్టం! రాళ్ళపైన అడుగులు జారుతున్నాయి.
మళ్ళీ ఏటిలో రాళ్ళ పైనుంచి అడవిలో నడక.
ఇలా ఎన్ని సార్లు మారోమో తెలియదు.
రెండు కొండల నడుమ ఏటిలో ఒక పక్క ప్రవహిస్తున్న నీళ్ళు.
ఆ రహదారి మా ఓపికను పరీక్షిస్తోంది.
ఏటిలో ఎంత సేపు నడకో, అడవిలో అంత సేపు నడక.
అడవిలో దారి తప్పుతున్నాం.
మళ్ళీ దారిలోకొస్తున్నాం.
మాకు ఏరే కొండగుర్తు, దాని పక్కనే నడక.
ఎప్పుడో గడ్డి తొక్కిన ఆనవాళ్ళే తప్ప వేరే దారి లేదు.
గడ్డి, పిచ్చి మొక్కలు పెరగడంతో దారికనపడడం లేదు.
ముళ్ళు గీసుకుంటున్నాయి.
చెట్లు రాసుకుంటున్నాయి.
కాళ్ళకు తీగలు అడ్డం పడుతున్నాయి.
అందరినీ పుణ్యాత్ములను చేస్తున్నాయి.
పడని వాళ్ళు పాపాత్ములన్నట్టు!
ఏడుగంటలకు మొదలైన మా నడకకు, తొమ్మిదింటికి విరామమిచ్చాం.
పులిహోరలు, పూరీలు, చపాతీలు, ఇడ్లీలు.
ఏటి పక్కన అల్పాహారం.
ఆ ఏటి పక్కనే ఒక వింతైన చెట్టు.
కాస్త పొడవాటి పెద్ద పెద్ద ఆకులు.
ఆ ఆకుల కింద నక్కిన పచ్చటి కాయలు.
ఎప్పుడూ వాటిని చూడలేదు.
ఒక్కొక్కటి కొబ్బరి బొండాం అంతుంది.
దాని గురించి ఒక్కొక్కరూ ఒక్కో వ్యాఖ్యానం!
ఎప్పుడూ చూడలేదు.
ఎక్కడా చూడలేదు, దీని పేరేంటి!
అందరిలో అదే చర్చ.
‘ఎలిఫెంట్ యాపిల్ అంటారు’
నెల్లూరు నుంచి వచ్చిన విజయభాస్కర్ రెడ్డి చెప్పారు.
తాను భూటాన్ సరిహద్దున ఉన్న బోడో ల్యాండ్లో చూశానన్నారు.
అక్కడి వారు దాన్ని తింటారట.
దాన్ని తినడానికి మాలో ఎవ్వరూ సాహసించలేదు.
పువ్వు విచ్చుకోక ముందు రేఖలతో మొగ్గలా ముడుచుకున్నట్టుంది పచ్చగా.
మళ్ళీ మానడక మొదలైంది.
ఎక్కువగా ఏటి మధ్యనే నడుస్తున్నాం.
నీటిని జాగ్రత్తగా దాటుకుంటూ, ఒక్కొక్కసారి పడుతూ లేస్తూ సాగుతున్నాం.
ఏటిలోకి ఈ నీరంతా తుంబురు నుంచి వచ్చేదే.
తుంబురుక సమీపిస్తున్నాం..
ఏటిలో నీటి ఉదృతి పెరిగింది.
రెండు కొండలు ఒకదానికొకటి సమీపిస్తున్నాయి.
అదిగో వెంగమాంబ గుహ.
అంతా గుహలోకి ప్రవేశించాం.
సుబ్బారావు అనే దిగంబరస్వామి ఈ గుహలోనే చాలా ఏళ్ళు గడిపాడు.
ఆకులు, అలములు తింటూ బతికేవాడు.
ఆ గుహలో హెూమాలు చేసేవాడు.
ఆ దారిన వచ్చిపోయే ట్రెక్కర్లు, అటవీ ఉద్యోగులు ఏమైనా పెడితే తినేవాడు.
ఎవరో అతన్ని హత్య చేశారు.
ఎందుకు హత్య చేశారు?
అతని వద్ద ఉన్న డబ్బులు తీసుకోడానికి హత్య చేశారని ఒక వాదన.
వచ్చిన వారు అక్కడి జంతువులను చంపుతుంటే వారించడం వల్ల అతన్ని హత్యచేశారని మరొక వాదన.
వాస్తవం వెల్లడి కాలేదు కానీ, తుంబురుకు వెళ్ళినప్పుడల్లా ఆ గుహను చూస్తే ఆ దిగంబర స్వామే గుర్తుకొస్తాడు.
గుహ నుంచి కుడివైపునకు కదిలాం.
సమయం పది గంటలవుతోంది.
బండిరుసు నుంచి మానడక ఈ గుహవద్దకు మూడు గంటలు పట్టింది.
ఎడమ వైపున కొండ అంచునే నడుస్తున్నాం.
పెద్ద పెద్ద కొండ రాళ్ళను ఎక్కుతూ దిగుతూ సాగుతున్నాం.
తొలిసారిగా చూస్తున్న వారికి ఎంత అనుభూతి!
ఎన్ని సార్లు చూసినా మాకు కొత్తగా చూస్తున్నట్టు అదే అనుభూతి.
అలా రాళ్ళను ఎక్కుతూ, దిగుతూ సాగుతున్నాం.
ఎడమ వైపున ఓ గడి.
అక్కడే ఓ రాత్రి నిద్రించిన జ్ఞాపకం.
చుట్టుపక్కల ఎక్కడా కోతులు కనిపించలేదు.
మా తిండి తీర్థాలు తెచ్చుకున్న బ్యాగులను గుడిలో పెట్టాం.
గుడికి తలుపులేసేసి, దాన్నితీయకుండా, దాని కొక్కీకి ఒక తాడు కట్టాం.
ఆ తాడును ఒక రాయికి కట్టాం.
కోతుల నుంచి మా తిండిని కాపాడుకోవడానికి ఈ ఏర్పాట్లు.
కోతులు ప్రతి విడత నా పులిహోరనే ఎత్తుకుపోతున్నాయి.
ఇక్కడ నుంచే తుంబురు అందాలు.
రెండు కొండల నడుమ నీళ్ళు.
ఆ నడుములోతు నీళ్ళలో జాగ్రత్తగా మా నాడక.
కొండ అంచును పట్టుకుని నడుస్తున్నాం.
సామానంతా గుడిలో పెట్టాం కనుక మేం నీళ్ళలో పడినా పరవాలేదు.
ఓహ్.. ఈ తుంబురు కోనది ఏమి సొగసు!
అడుగడుగునా సౌందర్యమే.
తలెత్తితే చాలు కనువిందు చేసే అందాలు.
ఆకాశపుటంచులను తాకేలా ఉన్న కొండ కొసలు.
రెండు కొండల నడుమ పారుతున్న నీటికి అడ్డంగా పడిన రాయి.
దాన్నెక్కి ఆవలికి దిగాం.
లోతైన నీటి గుండం.
ఈ గండంలో ఎన్ని సార్లు దూకి ఎలా ఈదామో!
నీటి గుండానికి ఇరువైపులా లోనికి చొచ్చుకుపోయిన కొండ అంచులు.
ఆ కోనలో ఒకటే చలి.
మధ్యాహ్నం పన్నెండైనా ఎండ పడడం లేదు.
ఒక వేళ ఎండ పడినా కాసేపే.
సూర్యుడు ఇలా తొంగి చూసి అలా వెళ్ళిపోతుంటాడు.
రాత్రి చందమామా అంతే.
ఈ కోనలో కాసేపు గడపడానికి పెట్టిపుట్టుండాలిగా మరి.
సూర్యుడికి, చంద్రుడికి ఆ అదృష్టం లేదు పాపం!
పక్షులు మాత్రం రెండు కొండల నడుమ ఎగరగులుగుతాయి.
ఈ అందాలను ఆస్వాదిస్తున్నాయి.
అవి ఎంత పుణ్యం చేసుకున్నాయో!
ఓహ్..
ఈ కోనలో మనమూ వాటిలా ఎగరగలిగితే!
ఇవ్వన్నీ ఊళ్ళేలుతున్న ఊహలే !
కొండ అంచునే ముందుకు సాగుతున్నాం.
మధ్యలో నీటి ప్రవాహాలు.
రెండు కొండలు చేతులు కలిపిన చోటికి చేరాం.
ఆ రెండు కొండల నడుమ ఇరుక్కున్న బండరాయి. బండరాయిని తమ బిడ్డలా చూసుకుంటున్నాయి కొండలు. బండరాయి పై నుంచి దుముకుతున్న జలధార.
అదే తుంబురు తీర్థం.
తీర్థంలో తడిసి తలమునకలయ్యాం.
ఆ ఆనందానికి ఉబ్బితబ్బిబయ్యాం.
ఎంత సేపుంటాం!?
ఎంత సేపున్నా తనివి తీరదు.
పన్నెండవు తోంది.
తలెత్తితే ఆకాశంలో తప్ప ఎండ ఎక్కడా కనిపించడం లేదు.
నీటి గుండాల్లో ఈదులాడి వెనుదిరిగాం.
గుడి దగ్గరకొచ్చేసరికి మా కోసం కోతులు ఎదురు చూస్తున్నాయి.
మా తిండిని ఎత్తుకుపోవడానికి వాటికి అవకాశం లేకుండా చేసినందుకు గుర్రుగా ఉన్నట్టున్నాయి.
బట్టలేసుకుని వెనుదిరిగాం.
కొంత దూరం వచ్చాక భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్నాం.
వచ్చిన దారినే మా నడక.
కొందరు మధ్యలో దేవతీర్థం వెళ్ళి వచ్చారు.
మా శరీరం అలిసిపోయింది.
బండిరుసు వద్దకు వచ్చి ఆ రాళ్ళలోనే కాసేపు సేదదీరాం,
సాయంత్రం అయిదవుతోంది.
దేవ తీర్థం వెళ్ళిన వాళ్ళు తిరిగొచ్చేశారు.
మా వాహనాలను ఎక్కి ఊపిరి పీల్చుకున్నాం.
ఇంటి ముఖం పట్టిన ఎద్దుల్లాగా మా వాహనాలు తిరుపతి వైపు కదిలాయి.
వెళ్ళేటప్పుడు చూసిన అడవి అందాలన్నిటినీ మరొక్కసారి చూస్తూ వచ్చాం.
చీకటి పడక ముందే అడవిని దాటేశాం.
తిరుపతి చేరే సరికి రాత్రి ఏడైంది.
తుంబురు అనుభూతులను, అనుభవాలను మూటగట్టుకుని మరీ అలా ఇళ్ళకు చేరాం.
(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)
ఎంత బాగా రాసారు. నోరు ఊరుతుంది.