‘తిరుమలేశుని ధనికుల దేవుడిగా మార్చకండి’
(కందారపు మురళి)
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, యాజమాన్యం తిరుమల వెంకన్నను ధనికులదేవుడుగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్టుందని ఈ వైఖరిని తక్షణం మార్చుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇటీవల తిరుమల కొండపై అతిథి గృహాలకు పెంచిన ధరలు సామాన్య యాత్రికులను విస్మయానికి గురి చేశాయని ఆరోపించారు. కొన్ని అతిథి గృహాలలో 2000% కు పైగా పెంచేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. సౌకర్యాలు పెంచామనే పేరుతో సామాన్యులకు కేటాయించబడ్డ అతిథి గృహాలను డబ్బున్న వారికి అమ్మకానికి పెట్టినట్టుగా తయారైందని, ఈ ధోరణి ఏమాత్రం సమంజసం కాదని ఆయన హితవు చెప్పారు. సామాన్యుడే మాకు వీఐపీ అనే పదే, పదే మాట్లాడే టిటిడి సామాన్యుల పట్ల అనుసరిస్తున్న ధోరణి తీవ్రమైన విమర్శలకు గురవుతున్న విషయాన్ని పరిగణలో ఉంచుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో టిటిడి పై వస్తున్న విమర్శలను టిటిడి బోర్డు, యాజమాన్యం పరిగణలో లేకుండా వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు. ఈ ధోరణి మార్చుకోకపోతే భక్తుల ఆగ్రహానికి టీటీడీ యాజమాన్యం గురవుతుందని అన్నారు. పెంచిన ధరలను తక్షణం తగ్గించాలని సామాన్యుడు కేంద్రంగా నిర్ణయాలు జరగాలని టిటిడి యాజమాన్యానికి కందారపు మురళి సూచించారు.
(కందారపు మురళి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి.)