మా వీధిబడి… గుడి (వనపర్తి ఒడిలో- 4)

 

(రాఘవశర్మ)

ఉదయం తొమ్మిదైతే చాలు ఒకటే సందడి.
గుడి మండపం అంతా పిల్లలతో కిటకిట లాడిపోయేది.
ఒక పక్క ఒకటి రెండ్లు.. మరొక పక్క అఆలు, వేరొక పక్క ఎక్కాలు.
దిద్దే వాళ్ళు దిద్దుతూ, బట్టీ పట్టే వాళ్ళు బట్టీ పడుతూ..
ప్రభవ, విభవ అంటూ తెలుగు సంవత్సరాలు..
చైత్రము, వైశాఖము అంటూ తెలుగు మాసాలు..
అశ్వని, భరణి నక్షత్రాలు.. పాడ్యమి, విదియ తిథులు..
నాలుగు తరగతులూ ఆ మండపం లోనే.
ఎవరు ఏ తరగతో హద్దులు లేవు.
ఉద్యోగులు, వ్యాపారులు, ఆసాముల పిల్లలు కూడా ఈ వీధిబడిలోనే!
ఆరోజుల్లో ఇంకా కాన్వెంట్లు పుట్టలేదు.
ఊరంతటికీ ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూలు ఎక్కడో ఒకటుండేది.
అక్కడ చదువు సరిగా చెప్పరని, చాలా మంది తమ పిల్లల్ని ఈ వీధిబడిలోనే చేర్చేవారు.
బడి కెళ్ళడానికి మారాం వేసే పిల్లలను బలవంతంగా తీసుకొచ్చి ఒదిలి పెట్టే తల్లి దండ్రులు.
తమ పిల్లల్ని అక్కడ వదిలేస్తే చదువు వచ్చేస్తుందని విశ్వసించేవారు.
దాంతో తమ బాధ్యత తీరిపోయిందని ఆనందంగా వెనుతిరిగేవారు.
నాలుగు పీకి, రెక్క పుచ్చుకుని లాక్కొచ్చి కూర్చోబెట్టే చిన్న సారు గుండాచార్యులు.
తొడ పాశం పిండే పెద్ద సార్ రంగాచార్యులు.
కాసేపు ఏడుపులు, పెడ బొబ్బలు.
వేణుగోపాల స్వామి గుడంతా గోల గోలగా ఉండేది.
ఒక మూల రాతి కప్పుకు ఇనుప కొక్కెం వేలాడదీసి ఉండేది.
దానికొక చిన్న తాడు కట్టి ఉండేది.
ఎవరైనా బడికి రాకుండా మరీ మారాం వేస్తుంటే, ఆకోదండం ఎక్కించే వారు.
కోదండం ఎక్కిన పిల్లల లేత చేతులు ఎర్రగా కమిలిపోయేవి.
ఆ నొప్పిభరించలేక కిందకు దూకితే మళ్ళీ ఎక్కించేవారు.
ఎక్కించినా మాట వినకపోతే చింత బరికెలతో కాళ్లమీద, పిర్రల మీద కొట్టే వారు.
ఒకడి పేరు శ్యాంసుందర్.
కోదండం ఎక్కిస్తే ఉయ్యాల లాగా ఊగాడు.
ఊగి ఊగి దూరంగా దూకి పారిపోయాడు.
మర్నాడు మళ్ళీ కోదండం ఎక్కించి, చింత బరికెలతో కొట్టారు.
ఈ తడవ దూకి పారిపోకుండా కింద ముళ్ళ కంచె పెట్టారు.
ఈ శిక్షలన్నిటినీ ఎక్కువగా పెద్ద సారు రంగాచారే అమలు చేసేవారు.
ఒక్కొక్క సారి తొడ పాశం పిండేవాడు.
పిల్లలు విలవిల్లాడిపోయేవారు.
వాటిని చూస్తే నాకు చాలా భయమేసేది.
నన్ను కూడా కొడతారేమో అనుకునే వాడిని.
కానీ, నన్నెప్పుడూ కొట్టలేదు.
తల్లి దండ్రులే వచ్చి ‘మావాణ్ణి నాలుగు పీకండి’ అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు.
దాంతో కొట్టడానికి పెద్ద సారుకు లైసెన్స్ వచ్చేది.
కొడితే కానీ చదువురాదన్నది తల్లి దండ్రుల విశ్వాసం.
కొట్టైనా చదివించాలన్నది పెద్ద సారు పట్టుదల.
రంగాచారి కాస్త సన్నగా, తెల్లగా పొడుగ్గా ఉండే వాడు.
పంచె కట్టుకుని, నామాలు పెట్టుకునే వాడు.
ఎంత చలికాలమైనా చొక్కా వేసుకునే వాడుకాదు.
ఒక పలుచని ఉత్తరీయం కప్పుకునే వాడు.
అప్పుడప్పుడూ పౌరోహిత్యానికి వెళ్ళే వాడు.
గుడిపక్కనే వేసుకున్న ఒక పూరి పాకలో భార్యా బిడ్డలతో రంగాచారి జీవించేవాడు.
రంగాచారి భార్య గుడిని, దాని పరిసరాలను శుభ్రం చేసేది.

చుట్టుపక్కల ఇళ్ళు ఉండేవి కాదు.
అదంతా రెండు వీధుల వెనుక భాగం.
గుడి చుట్టూ చాల పెద్ద ఖాళీ జాగా.
గుడికి ఎదురుగా ఒక ఏరు పారేది.
వర్షాకాలంలోనే అది ఉదృతంగా ప్రవహించేది.
ఆ ఏరు దాటితే సందులోంచి మరొక ప్రధాన వీధిలోకి దారి ఉండేది.
దిద్ది, దిద్ది విసిగెత్తితే రంగాచారికి చిటికన వేలు చూపించేవాళ్ళం.
ఇంకా విసిగెత్తితే ఉంగరపు వేలు, చూపుడు వేలు కలిపి చూపించే వాళ్ళం.
సరే అని తలూపే వాడు.
ఆ ఒంకతో ఆ ఏరు చివరికి వెళ్ళి వచ్చేవాళ్ళం.
భయపడుతూ, భయపడుతూ మళ్ళీ బందీఖానాలోకొచ్చి పడే వాళ్ళం.
రంగాచారి అంటే వనపర్తిలోని పెద్దపెద్ద షావుకార్లకు చాలా గౌరవం.
అందుకే తమ పిల్లల్ని ఆ వీధి బడిలో చేర్పించే వారు.
గుండాచారి తెల్లగా, పొట్టిగా, గుండుగా, బలంగా ఉండే వాడు.
రంగాచారి లాగానే పంచకట్టుకుని, నామాలు పెట్టుకుని ఉండేవాడు.
చొక్కా వేసుకోకుండా, ఉత్తరీయాన్ని కప్పుకుని ఉండేవాడు.

ప్యాలెస్ లోని ఆంజనేయ స్వామి గుడి

రంగాచారి వేణుగోపాల స్వామి భక్తుడైతే, గుండాచారి హనుమంతుడి భక్తుడు.
ప్రతి రోజూ ఉదయమే ఆయన హనుమంతుడిపైన స్తోత్రాలు చదువుతూ ప్యాలెస్ ఆవరణకు నడుచుకుంటూ వచ్చేవాడు.
కాళ్ళకు చెప్పులుండేవి కాదు.
హనుమంతుడి ఆలయంలో పూజలు చేసి, తాను తెచ్చిన నీళ్ళతో అభిషేకం చేసి వెళ్లే వాడు.
ఆయన ముఖంలో కాస్త హనుమంతుడి పోలికలూ ఉండేవి.
కానీ, పిల్లల్ని రంగాచారిలా కొట్టేవాడు కాదు.
పొద్దున్నే బడి గంట కొట్టగానే ఉరుకులు పరుగులతో వచ్చే వాళ్ళం.
ఆ గుడిలో మోగేది మాకు బడిగంట.
ఆ గంటే ఇంటర్వెల్, మద్యాహ్నం భోజనానికి కూడా ఆ గంటే.
మెయిన్ రోడ్లోంచి వేణుగోపాల స్వామి గుడిలోకి వెళ్ళాలంటే చిన్న రాతి మండపం ఉండేది.
ఆ రాతి మండపం అయిదడుగులు కూడా ఉండదు.
పెద్ద వాళ్ళయితే తలొంచుకు వెళ్ళాలి.
మళ్ళీసాయంత్రం నాలుగైతే గుడిలో బడిగంట మోగేది.
ఆ గంట కోసమే ఎదురు చూసే వాళ్ళం.
గంట మోత వినపడగానే లేచి లేడిలా పరుగెత్తే వాళ్ళం.
ఒకరినొకరు తోసుకుని గుడి మండపం నుంచి కిందకు ధబాలున దూకేవాళ్ళం.
ఇంటి ముఖం పట్టిన ఎద్దుల్లా పరుగో పరుగు.
ఆ మండపం దగ్గర సందులో పట్టేవాళ్ళం కాదు.
ఒకరినొకరు తోసుకుంటూ, తోసుకుంటూ బైటకొచ్చే వాళ్ళం.

వేణుగోపాల స్వామి గుడికి (వీధి బడి) వెళ్ళే సన్నని దారి. ఒకప్పుడు పుట్నాల బట్టి ఉన్న ప్రాంతం లో వెలిసిన జువెలె రీ షాప్.

మండపం నుంచి రోడ్లోకి రాగానే ఎడమ వైపు పుట్నాల బట్టీ ఉండేది.
పుట్నాలు(వేయించిన  శెనగ పప్పు), బొరుగులు, బఠాణీలు అమ్మే వాళ్ళు.
ఒక పొయ్యి పెట్టి వాటిని అక్కడే తయారు చేసేవారు.
ఆ పొయ్యిలో ఒక పక్క నుంచి ఓ వ్యక్తి వేరు శెనగ పొట్టు వేసే వాడు.
పొగ పోవడానికి దాని పైన చిమ్నీ ఉండేది.
ఆ చిమ్నీ అంతా మట్టితో అలికి కే వారు.
నల్లగా, ఎత్తుగా, బలంగా ఉన్న మరో వ్యక్తి పొయ్యి ముందు కూర్చునే వాడు.
కాస్త బట్ట తల, పెద్ద పెద్ద బుంగ మీసాలతో గంభీరంగా ఉండేవాడు.
అతన్ని చూస్తే, సినిమాల్లో విలన్లా అనిపించి భయమేసేది.
పొయ్యిపైన పెట్టిన బాండీలో సన్నని ఇసుక పోసేవాడు.
ఆ ఇసుకలో నానబెట్టిన పచ్చిశెనగలు, బఠాణీలు, బొరుగులు విడివిడిగా పోసి వేయించేవాడు.
వేయించడానికి పెద్ద కొడవలితో తిప్పేవాడు.
అతని శరీరమంత చెమటతో నిండిపోయేది.
అవి వేగాక జల్లెడలాంటి వెడల్పాటి గరిటలోకి తీసుకుని తిప్పితే ఇసుకంతా మళ్ళీబాండీలో పడిపోయేది.
వేగిన వాటిని బుట్టలో పోసేవాడు.
ఇసుకలో పోసి వేయించడం వల్ల అన్ని వైపులా సమపాళ్ళలో వేగేవి.
స్కూలుకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు వాటిని చూడడం ఒక వింతైన సరదా.
మా అమ్మ పోపుల డబ్బాలో దాచిన అయిదు నయాపైసలు తీసిస్తే, బఠాణీలు కొనుక్కుని తింటూవచ్చే వాడిని.
మా కాంపౌండ్లో ఉండే ‘అమ్మణి’ అనే అమ్మాయి నాతోపాటే స్కూలుకు వచ్చేది.
నల్లగా, బొద్దుగా ఉండేది.
మాటల పుట్ట.
తెగ కబుర్లు చెప్పేది.
ఎవరీ అమ్మణి అంటే నాజర్ సాబ్కా బేటీ.
ఎవరీ నాజర్ సాబ్ అంటే స్కూళ్ళఇన్ స్పెక్టర్.
స్కూళ్ళ ఇన్స్పెక్టరై ఉండి కూడా తన కూతురిని ఈ వీధి బడిలోనే చేర్పించాడు!
ఆయనకొక జీవుండేది.
ఆ జీపు వచ్చినప్పుడే పాటక్ తెరిచేవారు.
అమ్మణి, మరొక అబ్బాయితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఇంటికొచ్చే వాణ్ణి.

పుట్నాల బట్టీ పక్కనే తుకారాం జట్కాబండీ ఉండేది.
తుకారం జట్కా అంటే వనపర్తిలో చాలా ప్రసిద్ధి.
జట్కా భలే ఉండేది.
అదే అతనికి జీవనాధారం.
గుర్రాన్ని చాలా బాగా చూసుకునే వాడు.
దానికి దాణా పెట్టి ఎప్పుడూ నిమురుతూ ఉండేవాడు.
దాని పైన ఈగ వాలనిచ్చే వాడు కాదు.
తుండు గుడ్డతో ఎప్పుడూ విసురుతుండే వాడు.
ముదురు గోధుమ రంగులో అది నిగనిగలాడుతుండేది.
అదే రంగులో దాని తోక కూడా ఎంత అందంగా ఉండేదో!
తుకారాం గుర్రం గొప్పదనం గురించి కథలు కథలుగా చెప్పుకునే వాళ్ళం.


ఆ గుర్రాన్ని తాకాలనే కోరిక.
తాకనిచ్చేవాడు కాదు తుకారాం.
దాన్ని తాకిన వారు హీరోలని మేం పోటీ పెట్టుకున్నాం.
బడి ఒదిలాక, ఇంటికి వెళుతూ, తుకారాం లేని సమయం చూసి, ఆ గుర్రం వెనుక చేయివేసి నిమిరాను.
అంతే.. వెనుక కాలిని ఒక్క సారి విదిలించింది.
దాని కాలి గిట్ట నా కను బొమ్మ పైన తగిలి బొటబొటా రక్తం కారింది.
తెల్లటి చొక్కా ఎర్రగా తయారైంది.
ఎవరో వచ్చి ఒక గుడ్డ ఇచ్చి నెత్తురు కారకుండా అడ్డం పెట్టుకోమన్నారు.
రక్తం కారుతూనే అలా ఇంటికొచ్చేశాను.
నన్ను చూసి మా అమ్మ ఖంగారు పడిపోయింది.
అమ్మణి వచ్చి మా అమ్మకు అసలు విషయం చెప్పేసింది.
మా అమ్మ పౌడరు తీసుకుని అద్దింది.
కాసేపటికి రక్తం కారడం తగ్గిపోయింది.
గుర్రం దెబ్బ తగలక పోతే మిగతా పిల్లల మధ్య హీరోనయ్యేవాడిని కానీ!?
మళ్ళీ ఎప్పుడూ ఆ సాహసం చేయలేదు.
మిగతా పిల్లలు భయపడిపోయారు.
మళ్ళీ మా మధ్య ఆప్రస్థావనా రాలేదు.
కానీ, నా కనుబొమ్మ పైన తుకారాం గుర్రం చేసిన గాయపు గుర్తు ఇప్పటికీ అలాగే ఉంది.
అదొక తీపి గుర్తు.
కనుబొమ్మను చేతితో తడిమినప్పుడు, కనుబొమ్మను అద్దంలో చూసుకున్నప్పుడు తుకారం గుర్రమే గుర్తుకు వస్తుంది.
తుకారాం గుర్రం తంతే తన్నింది కానీ, ఒక మధురమైన బాల్యపు జ్ఞాపకాన్ని శాశ్వతంగా మిగిల్చింది.
ఈ గాయంతో మర్నాడు స్కూలు మానచ్చనుకున్నా.
స్కూలు మానితే గుర్రాన్ని తాకిన సాహసం మా నాన్నకు తెలిసిపోతుంది.
తిట్లు, చివాట్లు , అక్షింతలు.
మర్నాటి నుంచి స్కూలుకు యధావిధి.
ఆ విషయం మా నాన్నకు చెప్పకుండా మా అమ్మ దాచేసింది.
‘కన్న కడుపన్న కాంతల కెంత తీపి’
రంగాచారి పిల్లల్ని కోదండం ఎక్కించడం, చింత బరికెలతో కొట్టడం, తొడ పాశం పిండడం గుర్తు కొస్తే చాలు, నాకు స్కూలు ఎగ్గొట్టాలని పించేది.
కడుపులో తెమిలినట్టనిపించేది.
నన్ను ఎప్పుడూ కొట్టకపోయినా, ఇతర పిల్లల్ని కొడుతుంటే నన్ను కొడుతున్నట్టే బాధపడేవాడిని.
స్కూలు ఎగ్గొట్టాలంటే నాకు కడుపునొప్పి వచ్చేది.
పడుకుని విలవిలా కొట్టుకునేవాడిని.
‘వాడికి కడుపు నొప్పిగా ఉంది, ఈ పూట స్కూలుకు వెళ్ళడులేండి’ అనేది మా అమ్మ.
ఒక్కొక్కసారి తల నొప్పి కూడా వచ్చేది!
తెల్లవారు జామునుంచి గుడి తలుపులు తెరిచి ఉంటాయి.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు బడి, రాత్రికి మళ్ళీ గుడి.
ఆ వీధి బడిలో మూడేళ్ళు చదువుకున్నాను.
అక్కడ తెలుగు , ఎక్కాలు తప్ప ఇంగ్లీషు, హిందీ అక్షరాలు చెప్పలేదు.
తరువాత అప్పర్ ప్రైమరీ స్కూలుకెళ్ళాక చాలా ఇబ్బంది పడాల్సివచ్చింది.
పెద్దబాల శిక్ష వల్లెవేయించేవారు.
రెండవతరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ‘కలవారి కోడలు కలికి కామాక్షి’ అన్న గేయం చదువుతుంటే గొంతు పెగిలేది కాదు, కళ్ళలో నీళ్ళొచ్చేవి.
ఆ రోజుల్లోనే అది నాకు కంఠోపాఠం.
ఈ గేయాన్ని ఎవరు రాశారో తెలియదు.
విశ్వనాథ సత్యనారాయణ రాసినట్టు ఈ మధ్యనే ఎక్కడో చదివాను.
నా ఎలిమెంటరీ చదువు అలా తీపి, చేదు జ్ఞాపకాల మేలుకలయికగా మిగిలిపోయింది.
ఆ గుడిలోనే రాత్రి 9 తరువాత అప్పుడప్పుడూ హరికథా కాలక్షేపాలు.
హైస్కూలు చదివే రోజుల్లో మా నాన్నకు తెలియకుండా హరికథలు వినడానికి ప్యాలెస్ నుంచి ఇక్కడివరకు దాదాపు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాడిని.
రాత్రి భోజనం చేసి, చలికాలమైతే దుప్పట్లు కప్పుకుని మరీ చాలా మంది వచ్చేవారు.
హరికథల ద్వారానే నేను పౌరాణిక కథలను, గాథలను ఎక్కువగా తెలుసుకున్నాను.
హరి కథ చెప్పడం అంత తేలిక కాదు.
ప్రేక్షకులను రంజింప చేయాలి.
మధ్యమధ్యలో పిట్టకథలతో చలోక్తులు.
అందులో సంగీతం, సాహిత్యం, నటన, నాట్యం హరిదాసులు గాత్ర శుద్ధితో కలిసి ఉంటాయి.
హరికథలు అనేక కళల సమ్మేళనం.
హరిదాసులు తన హావభావాలతో, నటనా చాతుర్యంతో పౌరాణిక దృశ్య రూపాలను మన కళ్ళకట్టెదుట నిలబెడతాడు.
ఇది ఒక బలమైన ఫ్యూడల్ కళారూపం.
శతాబ్దాలుగా రాచరిక వ్యవస్థను ప్రజల్లో నిలబెట్టడానికి హరికథలు కృషి చేశాయి.
సంభావనలపైన ఆధారపడే హరిదాసుల జీవితాలు మాత్రం గాలిలో దీపంలా ఉండేవి.
ఇప్పుడవి పూర్తిగా ఆరిపోయాయి.
పౌరాణిక సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో హరికథలే బాగా పనిచేశాయి.
ఫ్యూడల్ వ్యవస్థలో హరికథలకు పాలకులే రాజపోషకులు.

తొలి నుంచి వ్యాపారులంతా మహా భక్తులు.
ఆ తరువాత హరికథలను వారే పెంచి పోషించారు.
పౌరాణిక నాటకాలు హరికథలకు పోటీగా నిలబడ్డాయి.
పౌరాణిక సినిమాలు వచ్చి హరికథ ను చావుదెబ్బతీశాయి.

హరికథ అయిపోగానే హరిదాసులు మంగళం పాడేవాడు.
కొందరు సంభావనలు సమర్పించుకునే వారు. హరిదాసులును పిలిచిన వారు నూటపదహార్లు ఇచ్చే వారు. ఒకరొకరు లేచి బయలు దేరే వారు.
నెలకు రెండు హరికథలు చెప్పే అవకాశం వస్తే చాలా గొప్ప.

అనేక కళల సమాహారమైన హరిదాసుల జీవితాలు తొలి నుంచి, ఆరిపోయే వరకు అవి గాలిలో దీపాలే.

గమనిక : ‘వనపర్తి జ్ఞాపకాలు” ను ‘వనపర్తి ఒడిలో..” గా మార్చాం. సీనియర్ జర్నలిస్టు, డాక్టర్ గోవిందరాజు చక్రధర్ గారి సూచన మేరకు చేసిన ఈ మార్పును పాఠకులు గమనించగలరు.
(ఇంకా ఉంది)

(ఆలూరు రాఘవశర్మ, జర్నలిస్ట్, రచయిత, ట్రెక్కర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *