కృష్ణా నది యాజమాన్య బోర్డును ఆ మూల ఉన్న విశాఖపట్నం లో ఏర్పాటు చేయాలనుకోవడంతో ప్రభుత్వ చిత్తశుద్ధిపై రాయలసీమ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి బొజ్జా దశరథ రామి రెడ్డి రాష్ట్ర మంత్రి బుగ్గనకు లేఖ రాశారు.
శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు
గౌరవ ఆర్థిక శాఖ మంత్రి , అంధ్రప్రదేశ్ రాష్ట్రం
అయ్యా
విషయం : కృష్ణా నది యాజమాన్య బోర్డ్ ను కర్నూలు లో ఏర్పాటు చేయడం గురించి
కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు విషయాన్ని ముఖ్య మంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడానికి మీరు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు. కృష్ణా నది యాజమాన్య బోర్డు మరియు ఈ బోర్డు కర్నూలులో ఏర్పాటు ఆవశ్యకతపై ప్రధాన అంశాలను వ్రాతపూర్వకంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము.
రెండు తెలుగు రాష్ట్రాలలో కృష్ణా నది నీటి నిర్వహణ చేయడానికి, కృష్ణా జలాల వినియోగంపై వివాధాలను పరిష్కరించడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు మీకు తెలిసిందే. విభజన చట్టం ప్రకారం ఈ బోర్డు ప్రధాన కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఏర్పాటు చేయాలన్న నిబంధన కూడా మీకు తెలిసిందే. అక్టోబర్ 6, 2020 న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న కృష్ణా నది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ కు తరలించడానికి గౌరవ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించినందుకు అభినందనలు.
రెండు తెలుగు రాష్ట్రాల నీటి వినియోగానికి, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైనది శ్రీశైలం రిజర్వాయర్ కావడంతో కృష్ణా జలాల నిర్వహణ, వినియోగంపై పర్యవేక్షణకు శ్రీశైలం రిజర్వాయర్ అత్యంత కీలకంగ మారిందన్న విషయం మీకు విదితమే. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటుకు శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలు అత్యంత అనుకూలమైన, ఆవశ్యకత కలిగిన ప్రాంతం అన్న విషయం కూడా మీకు విదితమే.
పాలకుల నిర్లక్ష్యంతో రాయలసీమ తరతరాలుగా నీటి హక్కులను వినియోగంచుకొనలేని సందర్భంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటుతో రాయలసీమకు న్యాయం జరుగుతుందని రాయలసీమ వాసులు ఆశించారు. కాని కృష్ణా నదికి ఏమాత్రం సంబంధం లేనీ విశాఖపట్నం లో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం రాయలసీమ వాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఒకవైపు పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటును ప్రకటించిన ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల వినియోగంలో రోజువారి వివాదాల పరిష్కారానికి కీలకమైన న్యాయవ్యవస్థలో భాగమైన కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు ను విశాఖపట్నం లో ఏర్పాటు కు ప్రతిపాధనలు పంపడంపై రాయలసీమ సమాజం ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తపరుస్తున్నది.
పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేపడతాం, అన్ని ప్రాంతాల అభివృద్ధి చేపడతాం అని ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం, పాలనా మరియు అభివృద్ధి వికేంద్రీకరణలను రెండింటిని రాయలసీమ ప్రాంతంలో చేపట్టడానికి కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయడంతో తొలి అడుగు వేయలాని విజ్ఞప్తి చేస్తున్నాం.
జనవరి 11, 2023 న జరిగే కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో బోర్డు ను విశాఖపట్నం కు తరలించడంపై నిర్ణయం తీసుకుంటారని దినపత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు మరింత క్రియాశీలకంగా పైన వివరించిన అంశాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి కర్నూలులో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు కు కృషి చేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాము.
ధన్యవాదములు
రాయలసీమ సాగునీటి సాధన సమితి
బొజ్జా దశరథ రామి రెడ్డి
అధ్యక్ష్యులు