ఈ దఫా ట్రెక్ : 3 జలపాతాలు, 6 ఈతలు

ఎన్ని మార్లు తిరిగొచ్చినా వన్నె తగ్గని మా ట్రెక్కింగులు

(భూమన్)

తెలతెలవారుతుండగా… తిరుపతిని చుట్టుముట్టిన మంచు తెరలను మనసారా అనుభవిస్తూ.. 50 కిలోమీటర్లు ప్రయాణానికి సన్నద్దమైనాము. నాతో పాటు ట్రెక్కు శీను, సమోసా మల్లీ, బ్యూటిఫుల్ తిరుపతి శశి ఉన్నారు. దారంట మంచు తెరలు అడవి సొగసులు చూస్తూనే… మరొక పక్కన ట్రెక్కింగ్ అనుభవాలు, నేను లేని రోజుల ట్రెక్కింగ్ ల గురించి మాట్లాడుకుంటున్నాము. ఆరు నెలల క్రితం ఒకటి, రెండు గ్రూపులుగా ఉన్నవారు ఇప్పుడు 10 గ్రూపుల కింద చీలిపోయినారని, ఒకరికొకరికి పడటం లేదని, ట్రెక్కింగ్ క్రమశిక్షణ పూర్తిగా పక్కదారి పట్టిందని శశి చెబితే ఆశ్చర్యపోయాను.

అంతకు ముందటి రోజే ట్రెక్కింగ్ దీపధారి బి.వి.రమణరా సిన ట్రెక్కింగ్ పుస్తకం చదివి ఉన్నాను. అద్భుతమైన పుస్తకం. ట్రెక్కింగ్ కు సంబంధించిన సమస్త సమాచారం విపులంగా వివరించినాడు.ట్రెక్కింగ్ అంటే ఏమిటి?. గ్రూపు నాయకుని సమర్థ లక్షణాలు ఎలా ఉండాలి.. సభ్యులు ఎలా మెలగాలి.. అడవి దాని లోతుపాతులు, కొండలు దాని అంతు, జలపాతాలు వాటి రహస్యాలు, అడవిలోని పురుగు పుట్ర.. జంతుజాలం, వాతావరణం తదితర సంగతులన్నీ వివరించి కనువిప్పు కలిగించిన పుస్తకం అది. ప్రతి ట్రక్కరు విధిగా చదవవలసిన పుస్తకం.

Mosaic Adventure commune బండారు బాలు ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రెక్కింగ్లు ఎంతో క్రమశిక్షణాయుతంగా ఉంటున్నాయో నాకు తెలుసు.

ఇన్నాళ్లు ఒక ఎత్తయితే.. కొంతమంది డెవిల్స్ ప్రవేశించి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఒకరి ప్రాణం పోయేంతవరకు పరిస్థితి దిగజారిందని తెలిసి.. చాలా చాలా దుఃఖంగా అనిపించింది.

అడవిలోకి అడుగుపెట్టడం అంటేనే తెలియని రహస్యాలను శోధించడమే. అడవి, కొండలు, జలపాతాల గురించి ఏ మాత్రం అవగాహన లేనివాడు ఇటీవల ట్రెక్కింగ్ కని బయలుదేరి ఒక విధమైన విచ్చలవిడితనాన్ని తీసుకొస్తున్నారని విని ఆశ్చర్యమేసింది. అడవిలోకి బయలుదేరటం అంటే సరైన గ్రూప్ లీడర్, అటవీ శాఖ అధికారుల అనుమతి, యానాదులు, గిరిజనుల తోడు తప్పనిసరి. ఆ దీపదారుల తోడు లేకపోతే పెద్ద ప్రమాదమే. వారికి అడవి అనుపానాలన్నీ తెలుసు. వారు పక్కన ఉంటే అదొక ధైర్యం

 

నేను ఎప్పుడు ట్రెక్కింగ్ లకు బయలుదేరిన నా వెంట అటవీ అధికారులు వారి సిబ్బంది తప్పనిసరిగా ఉండేట్టుగా చూసుకుంటా. తగిన సరంజామా కూడా విధిగా ఉంటుంది.

మామూలుగానే అయితే మన ఆధార్ కార్డులు అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పి రాతపూర్వక అనుమతితో అడవిలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. అటవీ శాఖ అధికారులే మా వెంట ఉండటం వల్ల ఆ అవసరం మాకు రాలేదు. ఇకముందు తప్పనిసరిగా ఆ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ పాటించాలని మా వారందరితో అన్నాను.

ప్రస్తుతం అడవిలో విచ్చలవిడిగా తిరుగుతున్న ట్రిక్కింగ్ లనబడే గ్రూపులు ఎవరి పర్యవేక్షణలో.. ఎవరి అనుమతులతో దారి తీస్తున్నారో అర్థం కావడం లేదు. ఏ మామూలు పురుగు కుట్టినా ఎంత ప్రమాదమో రమణ ట్రెక్కింగ్ పుస్తకంలో చెప్పి ఉన్నాడు. కొండచిలువ చుట్టముడితే.. పాము కాటేస్తే ..ఎలుగుబంటు.. పందుల మందు దాడి చేస్తే.. ఏనుగులు ఎదురొస్తే.. చిరుతలు దాడి చేస్తే.. వీటికి సంబంధించి ఓనమాలు తెలియని వారు బయలుదేరుతున్నారు. పైగా అడవిలో ఏ ప్రాణికి హాని చేయకూడదని తెలిసి.. కోళ్లు, మందు మాకులతో విందులు చేసుకుంటున్నట్టుగా విని బిత్తర పోయినాను. అటవీ శాఖ నిర్లక్ష్యం ఎవరినైనా బలి తీసుకుంటే, ఆ నెపం ఎవరిది ?

అసలు నీళ్లలో జారుడుబండల మాటున ఒక వ్యక్తి బలైపోయినాడని శశి చెబితే .. ఈ డెవిల్ ట్రెక్కర్ల మీద విపరీతమైన కోపం కలుగుతున్నది. ఒకపక్క ఎర్రచందనపు దొంగలతో అడవి అల్లాడుతుంటే.. ఈ డెవిల్ ట్రెక్కర్ల వల్ల, నిర్లక్ష్యం వల్ల ముందు ముందు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళనతోనే ఈ ట్రెక్కింగ్ రోజు నన్ను బాగా కలవరపరిచింది.

ఇవన్నీ మాట్లాడుకుంటూ గమ్యస్థానం చేరుకోగానే మా అటవీ దీపదారులు మణి, రాజేంద్ర, వెంకటేశం, బేస్ క్యాంప్ చిరుద్యోగులు తదితరులతో కలిసి సిద్దలేరు, దేవ బండలు, కంగుమడుగు చూసి ఆనందంలో మునిగి తేలినాము.

దేవ తీర్థంలో విపరీతమైన పాములు, అద్భుతమైన జారుడు జలపాతాల మధ్యన కొంచెం సేపు గడిపినాము. ఆ బండ్లలోనే రాత్రుళ్ళు జంతువులు నీటి కోసం వచ్చేది. దారి పొడుగునా బిడ్డ ల్లాంటి ఎర్రచందనపు చెట్లను తుండ్లు తుండ్లుగా నరికి పారేసిన చిత్రాలను చూసి కుపితులమైనాము. ఆ ఎర్రచందనపు దొంగల పిక్కల బలం, చేతివాటం విని నోళ్లు వెల్లబెట్టినాము అదొక బలాఢ్యమైన ప్రత్యేక జాతి.

సిద్దలేరు ఒక అద్భుతమైన జలపాతపు హోరు. చూసినంతా పచ్చదనమే ఆ హోయలు.. సింగారం.. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ రెండిట్లో కొంచెం కొంచెంగా స్నానమాడి కంగు మడుగులో తనివి తీరా ఈతాడి మమ్మల్ని మేం జలకాలాటలో కోల్పోయినాము.

ఈ కంగుమడిగే ఏనుగుల స్థావరం. ఇక్కడికి నీళ్ల కోసం వస్తాయి. ఈతలాడుతాయి.

మంచి అనుభూతులు, గ్రూపుల కలవరపాట్ల మధ్య తిరుగు ప్రయాణమైనాము. దార్లో… శశి చాలా చాలా కొత్త సంగతులు చెబితే… తిరుపతి వాళ్ళు కనీసం పదిమంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారని వాళ్లలో సుస్మిత అద్భుతమైన ఫోటోగ్రాఫరని, చాలా అంతర్జాతీయ సంస్థలు ఆమెను గుర్తించినాయని చెప్పి ఆశ్చర్యపరిచినాడు. ఆమె తరువాత లెక్కల గోపి ఇంకో విశిష్టమైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. వీరికి గాని అవకాశం ఇస్తే… ఎక్కడో ఎందుకు మన అడవిలోనే అద్భుతాలను వెలికి తీస్తారని నొక్కి చెప్పినాడు.

తిరుపతికి సంబంధించి అనేక మాధ్యమాలలో యువత చురుగ్గా ఉందని, లక్షల వీక్షకులు ఉన్నారని తెలుసుకొని మరింత ఆశ్చర్యపోయాను.

మనకు తెలియని సంగతులు ఇట్టాంటి కలయికల వల్ల తెలుస్తున్నాయి. ట్రెక్కింగ్ లలో ఉండవలసింది కలివిడి తనం, స్నేహభావం, మానవత్వం.. అవి కరువైపోతున్నాయని బాధపడుతున్న యువతను చూసి అబ్బురపడుతున్నాను. అతను ఒక మారు ఈ కంగుమడుగుకు వస్తే అడవిలో వదిలేసి… డెవిల్ అయితే చూస్తూ చూస్తూ పోయాడ్సార్… ఆ రాత్రి మాకు నరకమే అయ్యిందని అంటుంటే ఎంత విచారంగా అనిపించిందో. గ్రూపుల మధ్య అహంకారాలు, చీలికలు పేలికలు, ట్రెక్కింగ్ ల స్వరూప స్వభావాలు నాశనం చేస్తున్నాయని వాపోయే యువత కోసమయినా సమాధానం వెతకాలి..

ఒక పద్ధతి ప్రకారం, నియమ నిబంధనలతో కూడిన క్రమశిక్షణాయుత ట్రిక్కింగ్ గ్రూపులను తయారు చేయాలి. వీలైతే… ట్రెక్కింగ్ వచ్చేవారికి శిక్షణ కూడా ఇచ్చే దిశగా ఆలోచన చేయాలనే తలంపుతో …. మా ఈ అద్వితీయమైన ట్రెక్కింగ్ ముగిసింది.

3 thoughts on “ఈ దఫా ట్రెక్ : 3 జలపాతాలు, 6 ఈతలు

  1. మీతో ప్రయాణిస్తూ, మిమ్ములను దగ్గరగా చూసిన నాకు, మీ విషయం లో నాకు ఒక quotation గుర్తు వస్తుంది. అది మీకు సరిగ్గా సరిపోతుందని అనిపిస్తోంది.

    ” LIVE SIMPLY
    ROAM WILDLY ”

    🙏🙏🙏🙏🙏

  2. ఆత్మీయ మిత్రులు భూమన్ తుహిన భూధర శృంగ కోమల శ్యామల కానన హేమాఢ్య ఝరీ నిరీక్షాపేక్ష అనుపమానము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *