విస్తృతంగా,తీవ్ర స్థాయిలో ఉన్న తాగునీటి కాలుష్యం: స్వచ్చ భారత్ అంటూ వట్టికబుర్లు చెప్తే పోయే సమస్య కాదిది.
ఆదిత్య కృష్ణ
పై ఫోటోలోనివారు వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు కాదు.నీటి కాలుష్యం మొ.సమస్యలతో వికలాంగులైన మహిళలు.యూపీ వారణాసి దగ్గరి సోన్భద్ర జిల్లా స్త్రీలు.కాలుష్యంతో ‘శాపగ్రస్తమైన‘ ఈ ప్ర్రాంతం గురించిన కథనాల్లో భాగంగా ఔట్ లుక్ వారపత్రిక (2014 నవంబర్ 10)ప్రచురించిన ఫోటో.అక్కడి ఖనిజ,ఇతర సంపదలూ,పరిశ్రమలూ కొందరికి వరప్రసాదమయితే,స్థానిక ప్రజలకు శాపంగా మారాయి.
“హమారా పానీ కా బహుత్ తక్లీఫ్ హై, ఔర్ యే జిందగీ భర్ కా తక్లీఫ్ హై”(మేము చాలా నీటి సమస్యలను ఎదుర్కొంటాము మరియు ఈ సమస్య జీవితాంతం ఉంటుంది).అని ఇక్కడి మహిళలు చెప్తున్నారు.యూపీలో డబుల్ ఇంజను సర్కార్ ఉన్నా,మంచినీటి సమస్యతో విసిగిపోయిన జనం నిరాశతో చెప్తున్నమాట అది.
నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న సోన్‌భద్ర యూపీలోని అతిపెద్ద జిల్లాల్లోఒకటి; గంగకి ఉపనది అయిన సోన్ నది ప్రవహించే ఈ జిల్లాలోనే దారుణమైన తాగునీటి సమస్యలు! ఈ జిల్లా పారిశ్రామిక ప్రాంతం:నీటికాలుష్యం మొ.సమస్యలపట్ల నిర్లక్ష్యం,అధికారుల సహకారంతోనే నియమాల ఉల్లంఘన వల్ల అదే శాపమైంది:
సోన్‌భద్ర-సింగ్రౌలీ కోల్ బెల్టులో10 బొగ్గు ఆధారితపవర్ ప్లాంట్లున్నాయి. అవి సమీప రాష్ట్రాలకు 21,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి సప్లయి చేస్తాయి. ’ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద’(AIIA) 2018 పరిశీలనా నివేదిక ప్రకారం, వీటన్నిటివల్లా సోన్‌భద్ర-సింగ్రౌలీ ప్రాంతంలో నివసిస్తున్న20లక్షల మంది ప్రజలు బహుళ కాలుష్య కారకాలతో కొట్టుమిట్టాడుతున్నారు.వారి ఆరోగ్యానికి అవి ముప్పు కలిగిస్తున్నాయి. బాక్సైట్, సున్నపురాయి, బొగ్గు, బంగారం వంటి అనేక ఖనిజాలు అక్కడి మట్టిలో ఉన్నాయి.వీటన్నిటివల్లా అధిక ఫ్లోరైడ్‌తో సహా -లెడ్,క్రోమియం,మరింత ఘోరమైన పాదరసం మొ.అనేక కాలుష్యకారకాలున్నాయి.
పర్యావరణవేత్త,సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వనీ కుమార్ దూబే ఇలా అన్నారు:’సోన్‌భద్ర-సింగ్రౌలీ ప్రజలు తీవ్రమైన పర్యావరణ సమస్యలతో బాధపడుతున్నారు. కోర్టు, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల్నిఇక్కడ పాటించడం లేదు.బంగారు గనుల ఆవిష్కరణతో,దానికోసం భూమిని తవ్వడం,చెట్లను నరికివేయడం మరింత పర్యావరణ క్షీణతకు కారణమవుతుందని స్పష్టమైంది.బంగారాన్ని వెలికితీయాలి,కానీ ప్రకృతికి హాని చేయకూడదు.’ సోన్‌భద్రలో ఇతర కాలుష్యంతోపాటు పాదరసం(మెర్క్యురీ)వల్ల ఊపిరితిత్తుల రుగ్మతలు,టీబీ,క్యాన్సర్ల మృత్యుతాండవం సాగుతున్నది.
ఈ బెల్టులో బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్లు ఉన్న ప్రాంతాలలో అధిక ఫ్లోరైడుతో సహా అనేక కాలుష్యకారకాలున్నాయి: వాటివల్ల ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడి వికలాంగులవుతున్నారని తెలిసింది.ప్రజలకు త్రాగునీటిని అందించడానికి బాధ్యత వహించే ఉత్తరప్రదేశ్ జల్ నిగమ్ చీఫ్ ఇంజనీర్ (గ్రామీణ)జీపీశుక్లా ఇలా చెప్పారు: “అధిక ట్యాపింగ్ కారణంగా, భూగర్భజలాలు వేగంగా క్షీణిస్తున్నాయి.అలాగే ఫ్యాక్టరీల నుంచి వెలువడే కలుషిత నీటిని నదుల్లోకి వదులుతూ భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నారు.”
సోన్‌భద్రలోని శక్తి నగర్‌లో నివసించే 35 ఏళ్ల హీరాలాల్ తన మూడేళ్ల చిన్నారి ఆరోగ్యం గురించి ఆందోళనతో ఇలాఅన్నాడు: “నా కొడుకు వయసు మూడు సంవత్సరాలు.ఆస్తమా ఉంది. ఇక్కడ నివసించే చాలా మంది పిల్లలస్థితీ అదే.సాయంత్రం కాగానే మేము మా ఇళ్ల తలుపులు మూసివేస్తాము. మేము పైకప్పులపై బట్టలు ఆరబెట్టము. ఎందుకంటే అవి మసిగా మారుతాయి.”
హీరా లాల్ చిల్కతాడ్ గ్రామంలో నివసిస్తున్నారు;ఈ గ్రామం బొగ్గు వెలికితీత సంస్థ అయిన నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) స్థానిక సైట్ నుండి కేవలం కొన్ని మైళ్ల దూరంలో ఉంది.ఈగ్రామంలో “తరతరాలుగా వికలాంగులైన కుటుంబాలు చాలా ఉన్నాయి”.
దేశం యూపీ పారిశ్రామిక, ఆర్థికప్రగతినీ,జీడీపీవృధ్ధినీ సాధిస్తున్నాయని,ఇంకా సాధించి చైనానీ మించిపోతామనీ విశ్లేషణల్నీ, ఫుల్ పేజీ ప్రకటనల్నీచూస్తున్నాం.ఉత్తరాదిలో బొగ్గుకంపెనీలు అనేకం ప్రైవేటురంగంలోనూ, చట్టవిరుధ్ధంగానూ కూడా పనిచేస్తున్నాయి.వారికి ఏ నిబంధనలూ వర్తించవు.కాంగ్రెసు దారిలోనే మోదీ-బిజేపీ ప్రభుత్వం-ఇంకా పెద్దఎత్తున- అన్నిరంగాల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోంది. పాలకుల, దళారీ పెట్టుబడిదారుల నిర్లక్ష్యం వల్ల పైన చూసినట్టు ఇక్కడి ప్రజలు“అభివృద్ధి మూల్యం” చెల్లిస్తున్నారు.ఒకప్పటి చైనా ఇండియావలె వెనుకబడీ, 1980 వరకూ అభివృధ్ధిలో మనతో సమానంగానూ ఉండేది.ఆ తర్వాత వారు అనితర వేగంతో ప్రగతిని సాధించారు.ఐతే ఇలాటి దారుణాల్ని అక్కడి ప్రజలు చవిచూడటంలేదు.’ఏది ఏమైనా జీడీపీని పెంచాల’న్నవిధానాల్నివారు విడనాడారు. దానికి ప్రజానుకూలమైన వారి సోషలిస్టు వ్యవస్థే కారణం.
*** ***
డబుల్ ఇంజను సర్కార్ ఉన్న అనేక రాష్ట్రాల్లో మంచినీటి సమస్య
కర్నాటక రాష్ట్రంలోని 20 జిల్లాల్లో, ప్రత్యేకించి 12 జిల్లాల్లోని 6వేల గ్రామాల్లో ఫ్లోరోసిస్ విస్తృత స్థాయిలో ఉందని ఆ రాష్ట్రానికి చెందిన FMRRC సంస్థ ప్రకటించింది. మునుగోడు ఎన్నికల సందర్భంగా పొరుగున డబుల్ ఇంజను సర్కార్ ఉన్న కర్నాటకనుంచిముఖ్యమంత్రి బొమ్మయి, ఇతర బీజేపీ నేతలు వచ్చి గొప్పలు చెప్తున్నారు. రాయచూరు, యాద్గిర్, గుల్బర్గా, బళ్ళారి వంటి హైదరాబాదు-కర్నాటక జిల్లాలన్నిటా ఈ సమస్య ఉంది. అంతేకాక దావణగిరి, చిత్రదుర్గ, తుమకూరు, కొప్పళ్, గదగ్, చిక్కబళ్లాపుర, బిజాపుర మొ. జిల్లాల్లోనూ ప్రబలంగా ఉందని పై సంస్థ విస్తృత క్షేత్ర పరిశీలనల తర్వాత ప్రకటించింది. బెంగళూరు గ్రామీణ జిల్లాలోనే కాక, నగరంలోనూ ఫ్లోరైడు సమస్య ఉన్నది.
ఇతర (అనేక బిజెపి పాలిత) రాష్ట్రాలు ఫ్లోరోసిస్ లో అగ్రస్థానంలో ఉన్నాయి. రాజస్థాన్ మొత్తం 32 జిల్లాలు ఫ్లోరోసిస్‌తో తీవ్రంగా ప్రభావితమయ్యాయి; మధ్యప్రదేశ్ 39, హర్యానా 12 జిల్లాలూ అంతే.
గుజరాతులో ఫ్లోరోసిస్ ప్రభావితమైన నివాసప్రాంతాల సంఖ్య నిల్( NIL) గా చూపబడింది (లోక్ సభ ప్రత్యుత్తరానికి అనుబంధం, డిసెంబర్ 21, 2017); కొన్ని చోట్ల NA (సమాచారం అందుబాటులో లేదు) అని- ఇది ఒకటి కంటే ఎక్కువసార్లు – చూపబడింది. వాస్తవం ఏమిటంటే గుజరాతులోని దాదాపు అన్ని జిల్లాలు (25లో 24) ఫ్లోరోసిస్ ముప్పులో ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా విస్మరించబడిందో లేదో మనకు తెలియదు; సత్యానంతర (post-truth అసత్య) విధానానికిది మరొక ఉదాహరణ?
పైవే కాక, బీజేపీ- వారి ఎన్ ఐ ఏ మిత్రులూ- సుదీర్ఘకాలం పాలించిన బీహారు, పంజాబు, మహారాష్త్రల్లోనూ మంచినీటి -ఫ్లోరోసిస్- సమస్యలూ తీవ్రంగా ఉన్నాయి. సమస్యను పరిష్కరించుకొన్న తెలంగాణలో ఉపన్యాసాలిచ్చే బదులు ఆయాచోట్ల తమ చిత్తశుధ్ధినీ, శక్తినీ ప్రదర్శించాలి.
గంగా–బ్రహ్మపుత్ర బెల్టులో ఆర్సెనిక్: ప్రాణాంతక విషం
(మ్యాప్ మూలం: ఉమాశంకర్ మిశ్రా, సైన్స్ రచయిత)
పై యూపీ పటంలో నీటివనరుల్లో ఆర్సెనిక్ ఉన్న ప్రాంతాలు ఎంత విస్తృతంగా ఉన్నాయో గుర్తించారు. ఎర్ర చుక్కలు ప్రమాద స్థాయిలో, ఆకుపచ్చ చుక్కలు అధ్వాన్న స్తితిలో ఆరెస్నిక్ ఉన్నట్టు సూచిస్తాయని వివరించారు. లీటరుకి 0.01మిగ్రా. లోపుంటే ‘అనుమతించవచ్చు’ననీ, మరోవనరులేకపోతే 0.05 మిగ్రా వరకూ ‘ఆమోదించవచ్చున’నీ ప్రమాణాలు చెప్తున్నాయి. 0.01మిగ్రా. లోపున్నా ఆందోళనకరమేనని, తొలగించటం కష్టమనీ WHO చెప్తున్నది.
ఈ కాలుష్యం వల్ల వచ్చే వ్యాధిని ఆర్సెనికోసిస్ అంటారు. దాని ఆరోగ్య ప్రభావాలను డాక్టర్ అశోక్ ఘోష్ వివరించారు. మానవ శరీరానికి అర్సెనిక్ స్లో పాయిజనుగా పనిచేస్తుందనీ, క్యాన్సరుకు కారణమవుతుందనీ నొక్కి చెప్పారు.
“ఆర్సెనిక్ కలుషితమైన నీటిని తాగడం వల్ల మెంటల్ రిటార్టెడ్ నెస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, అజీర్ణం, హైపర్ కెరొటోసిస్, చికాకులు, పేటరీజియం, పెరిఫెరల్ న్యూరోపతి, లివర్ క్యాన్సర్, కిడ్నీ & యూరినరీ బ్లాడర్ క్యాన్సర్…
ఇంకావంధ్యత్వానికి దారితీసే రీతిలో స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది.” ( భారత ప్రభుత్వ జల్ శక్తి మంత్రిత్వ శాఖ నేషనల్ కాన్ఫరెన్స్, 7 ఫిబ్రవరి, 2020, న్యూఢిల్లీ.)
ఉత్తరప్రదేశ్ (యూపి) లోని మొత్తం జిల్లాలు 75 కాగా, 40 జిల్లాల్లోని 13,092 నివాసప్రాంతాల్లో (habitations) ఆర్సెనిక్ కాలుష్య సమస్య ఉంది: గంగా-బ్రహ్మపుత్ర బెల్టులో చాలావరకు వ్యాపించిఉన్నది; యూపీతో కూడిన ఈ డేంజర్ జోన్ మొత్తం దేశంలో లక్షకు పైగా గ్రామాలు న్నాయి.ఈ సమస్యల్ని ఎదుర్కొనేది ఎక్కువగా పేద, గ్రామీణ శ్రామిక జనాలే. ఆర్సెనిక్ ప్రాంతాల్లో 2.34 కోట్లమంది ప్రజలు జీవిస్తూ ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని ప్రసిధ్ధ పర్యావరణ పత్రిక ‘డౌన్ టు ఎర్త్’ 2019లో ఒక రిపోర్టుని ప్రచురించింది; కాదు 25జిల్లాలే అంటుంది ప్రభుత్వం; అదేమీ తక్కువ కాదు. ఆర్సెనిక్- కేన్సరు, గుండె,లంగ్స్, కిడ్నీజబ్బులు కలుగజేసే ప్రాణాంతక విషం. గర్భస్థ శిశువుకీ, మెదడుకీ హానికరంకూడా అని WHO చెప్తోంది. 17 జిల్లాల్లో లెడ్, క్రోమియం, క్యాడ్మియం, మెర్క్యురీ వంటి ప్రమాదకర కాలుష్యాలూ యూపీ మంచినీటిలో ఉన్నాయి. ఇక వారణాసి దగ్గరి సోన్ భద్ర జిల్లా సకల కాలుష్యాలూ ఉన్న నరకమే.
ఒక అధికారిక రిపోర్టు ప్రకారం దేశంలో “సుమారు 28, 000 ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్ ప్రభావిత నివాస ప్రాంతాలున్నాయి.” ఆర్సెనిక్ (లీటరుకి 0.01మిగ్రా. పైన) 21 రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల్లోని 153 జిల్లాలలో కనుగొనబడింది. వీటిల్లోఅధికభాగం బీజేపి, వారి మిత్రులూ సుదీర్ఘకాలంగా పాలిస్తున్న ప్రాంతాలే. అక్కడ -ముఖ్యంగా బీహారు, అస్సాంలలో- ఈ సమస్య తీవ్రంగా ఉంది. బెంగాల్లోనూ తీవ్రంగా ఉంది.
ఆర్సెనికోసిస్ వ్యాధి
ఆర్సెనికోసిస్ వ్యాధి వచ్చిన వారి చర్మం దెబ్బతిని ఇలా మారుతుంది. చర్మ కేన్సరుకి దారితీస్తుంది. ఇలాటి వ్యాధులన్నీ కష్టజీవులనీ, పేదలనే ఎక్కువ దెబ్బ తీస్తాయి. ప్రజలు ఈ విధంగా దెబ్బతింటే, నష్టపోతే, మేక్ ఇన్ ఇండియా ఎలాంటి సాధ్యం?
ఇలాటి శ్రామికులున్న దేశంలో సబ్ కా వికాస్, దేశ ఉత్పత్తులను పెంచి, ప్రపంచంలోనే ముందుబరిలో ఉండటం ఎలా సాధ్యం?
డాక్టర్ అశోక్ ఘోష్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, బీహార్ చైర్మన్ మరియు ప్రొఫెసర్ & HoD రీసెర్చ్, మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ & రీసెర్చ్ సెంటర్ (MCSRC), పాట్నా. బీహార్‌లోని అతని (అశోక్ ఘోష్) ఇన్‌స్టిట్యూట్ చేసిన ఆర్సెనిక్ పరిశోధన ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి:
లీటరుకి 0.01మిగ్రా. ఆర్సెనిక్ WHO ప్రకారం ‘అనుమతించదగిన’ పరి
ఇది WHO ప్రకారం ‘అనుమతించదగిన’ పరిమితి. బీహార్‌లో అత్యధిక ఆర్సెనిక్ విలువ 1.906 గా నమోదైంది. మొత్తం 18 జిల్లాలు (61 బ్లాక్‌లు) అధిక స్థాయి ఆర్సెనిక్‌తో ప్రభావితమయ్యాయి;
ట్రైవాలెంట్ ఆర్సెనిక్ రీక్షించిన భూగర్భ జల వనరులలో 87% చోట్ల కనుగొనబడింది. భోజ్‌పూర్, భాగల్‌పూర్, బక్సర్, పాట్నా, వైశాలి, ఖగారియా మరియు సమస్తిపూర్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.
కేంద్ర మంత్రిత్వ శాఖ డేటా ఫార్మాట్ E28 ప్రకారం, దేశంలోని మొత్తం ఆవాసాల సంఖ్య: 17,26,031 . కనీసం ఒక నీటివనరుని పరీక్షించిన నివాస ప్రాంతాల సంఖ్య : 7,25,096 ( మొత్తంలో 42 శాతం) . పరీక్షించబడని చోట్లు : 10,00,935 ( మొత్తంలో 58 శాతం). పరీక్షించబడని సోర్సెస్ పరీక్షించిన వాటి కంటే చాలా ఎక్కువ. కాబట్టి ఇవి సంపూర్ణమైన లెక్కలు కాదు.
నిజానికిది యావత్ దేశం, ఆంధ్ర కూడా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య.స్వచ్చ భారత్ అంటూ వట్టికబుర్లు చెప్తే పోయే సమస్య కాదిది.
దేశంలో దాదాపు 80-90 శాతం గ్రామీణ జనాభా త్రాగడానికి, వంటకీ కూడా భూగర్భ జలాలను ఉపయోగిస్తున్నట్లు అంచనా. దేశంలోని మొత్తం 17.87 కోట్ల గ్రామీణ కుటుంబాలలో ప్రస్తుతం 3.28 కోట్ల (18.33%) కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్ ఉందని జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ లోగడ వివరించారు. మిగిలిన 14.60 కోట్ల (81.67%) కుటుంబాలకు 2024 నాటికి అందించాల్సి ఉంది.
ఇప్పటిదాకా పరిష్కరించని అతి మౌలిక సమస్య ఇది.భారతదేశం లోని 20రాష్ట్రాల్లోని 335జిల్లాలు అధిక ఫ్లోరైడుతో ఉన్నాయి; దాదాపు 10కోట్ల మంది దేశ ప్రజలు ఫ్లోరోసిస్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని కర్నాటకకి చెందిన FMRRC ’ఫ్లోరోసిస్ మిటిగేషన్ రీసెర్చ్ అండ్ రిసోర్స్ సెంటర్’ ప్రభుత్వ గణాంకాల ఆధారంగా ప్రకటించింది. ఇలాటిదేశం అగ్రరాజ్యంఅని, ప్రపంచానికే గురువులమని చెప్పుకోటం సిగ్గుచేటు. 75ఏళ్ల స్వతంత్ర అమృతోత్సవ సందర్భంగానైనా సత్వరపరిష్కారానికి పూనుకోవాలి. డా. కేయస్ శర్మ, CSIR సీనియర్ విశ్రాంత సైంటిస్ట్ డా. ఎం. బాపూజీల నేతృత్వంలోని పై సంస్థ ప్రతినిధులు అంతర్జాతీయ ఫ్లోరోసిస్ సదస్సులో పాల్గొనటమే కాక, తెలంగాణలోనూ,ఆంధ్రలోనూ పర్యటించారు.
ఆంధ్ర ప్రదేశ్లోనూ, ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరుజిల్లాల్లోనూ- రాజధానికి ఆనుకొన్నకృష్ణా గుంటూరు జిల్లాల వివిధ ప్రాంతాల్లోనూ ఈ సమస్య తీవ్రంగా ఉంది. అమరావతి రాజధాని అని ప్రకటించిన రోజుల్లోనే పై సంస్థ ఈ విషయాల్ని ప్రకటించింది. ఆనాటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా వివరాలు ప్రచురించారు. అధిక ఫ్లోరైడుకల నీటిశాంపుల్స్ సంఖ్య ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆనాడు ఇలా ఉన్నది: కృష్ణా 1426 , గుంటూరు 4400, ప్రకాశం 2591, అనంతపురం 2347, నెల్లూరు 1566, కడప 1140, కర్నూలు1135. కృష్ణా జిల్లాలోనే 20 మండలాల్లో సమస్య ఉన్నదనీ, కిడ్నీ వ్యాధులకు దారితీస్తున్నదనీ ప్రకటించారు.
అగ్రశ్రేణి భూవిజ్ఞాన శాస్త్రవేత్తలచే గుర్తించబడినట్లుగా, ఈ రోజుల్లో భూగర్భ జలాలు ఎక్కువగా కలుషితమైనవి; ఈ రోజుల్లో పట్టణాలు నగరాల్లో కూడా -ముఖ్యంగా శివార్లలో కొత్తగా విస్తరించిన ప్రదేశాల్లో- చాలా ఇళ్లకు 20-లీటర్ బాటిళ్లలో అందించబడుతున్నది బోర్ వెల్ వాటర్ మాత్రమే. వాటిలో ఎక్కువ భాగం సరైన శుధ్ధీకరణ, నియంత్రణ లేని సరఫరాదారులచే విక్రయించబడుతున్నాయి. ఈ విషయాన్నిఉదా.కి కర్నాటక ప్రభుత్వం అక్కడి హైకోర్టుకి తన అఫిడవిట్లో చెప్పింది. ఉత్తరాది ‘బీమారు (BIMARU) రాష్ట్రాల్లో ఇంకా అధ్వాన్నం’ అని పలువురు నిపుణులు చెప్పారు.
భారత ఉపఖండం 1970ల వరకు సాంప్రదాయకంగా ఉపరితల నీటిని ఉపయోగించిందని, ఆ తర్వాత పెరుగుతున్న కాలుష్య స్థాయిల కారణంగా గొట్టపు బావులు ఒక ట్రెండుగా మారాయని గమనించాలి. భూగర్భ జలాల వినియోగం కాలుష్యంవల్ల శిశు మరణాల రేటును కొంత తగ్గించినప్పటికీ, ఇది ఫ్లోరైడ్ వంటి కాలుష్య సమస్యలను తెచ్చిపెట్టింది. దానికి కారణం: హరితవిప్లవం తర్వాత వ్యవసాయంకోసం భారీఎత్తున బోర్ వెల్స్, కరెంటు మోటార్లు -విచ్చలవిడిగా, వాల్టా (WALTA) చట్టం నిబంధనల్ని ఉల్లంఘించి- పెరిగాయి.
ప్రస్తుతం కోట్లకొద్దీ గొట్టపు బావులు ఉన్నాయి. వీటివల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని
డాక్టర్ అశోక్ ఘోష్ చెప్పారు. ఆయన బీహార్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్; పాట్నాకి చెందిన మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ & రీసెర్చ్ సెంటర్ (MCSRC) ప్రొఫెసర్ & రీసెర్చ్ హెడ్.
“ఫ్లోరైడ్‌తో నిండిన భూగర్భ, కలుషిత జలాల యొక్క ఈ ముప్పు, గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా, మలప్రభ, తుంగభద్ర, భీమా వంటి నదుల పక్కనే ఉన్న భారతదేశంలోని అనేక ప్రాంతాలను పీడిస్తున్నదని గమనించవచ్చును. నదీ జలాలు, చెరువునీళ్లు (సర్ఫేస్ వాటర్ ) సురక్షితమైనవి, వాటిల్లో ఫ్లోరైడ్, ఇలాంటి కాలుష్య కారకాలు ఉండవు. కానీ భారీ నీటిపారుదల ప్రాజెక్టులన్నీ భారీ ప్రభుత్వ పెట్టుబడులతో, భూస్వామ్య వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రాథమికంగా ఉపయోగపడుతున్నాయి. గ్రామీణ పేదల తాగునీటి అవసరాలను పరిష్కరించడానికి అవి ఉపయోగించబడటం లేదు. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సాగునీటి ప్రాజెక్టులోనూ మొదట 10 శాతం నీళ్ళను రిజర్వు చేయాలన్న నిబంధనను రూపొందించి, మిషన్ భగీరథ ద్వారా అమలు చేస్తున్నది. దాని నుంచి నేర్చుకొనే బదులు బిజేపీ నేతలు -ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారు- అధిక ప్రసంగాలు చేస్తున్నారు. ఎక్కువ మంది (అంతగా) భూమిలేని పేదలు, అలాంటి ప్రాజెక్టుల వల్ల ఎటువంటి ప్రయోజనం పొందలేరు. ప్రాజెక్టు వచ్చేముందే అక్కడ భూములు కోల్పోతారు. అత్యున్నత న్యాయవ్యవస్థ , అధికారిక సంస్థలు తమకు అనుకూలంగా అనేక అవార్డులు మరియు తీర్పులు ఇచ్చినప్పటికీ సరైన, తగినంత ఉపశమనం, పునరావాసం లేకుండా తరచుగా ఈ ప్రాజెక్టుల కోసం స్థానభ్రంశం సమస్యలను ఎదుర్కోవడమే వారి దుస్థితి, దుర్గతి అయింది.
‘ప్రాథమిక హక్కుగా తాగునీరు ‘
ఈ మౌలిక సమస్యలు జటిలమైనవి. తక్షణ (ఆర్వో ప్లాంట్స్, వైద్యం) మధ్యకాలిక, దీర్ఘ కాలిక పరిష్కారాలను మేళవించి కృషి చేయాలి. స్వచ్చ భారత్ అంటూ వట్టికబుర్లు చెప్తే పోయే సమస్య కాదిది. అందరికీ చాలినంత పోషకాహారంతో పాటు చెరువులు, వర్షపునీరు, నదీజలాల వంటి సర్ఫేస్ వాటర్స్ ని అందరికీ చేర్చటమొక్కటే నిజమైన పరిష్కారం- అంటారు డాక్టర్ డి. రాజారెడ్డి, FMRRC వంటి నిపుణులు. ఇప్పటిదాకా ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యత నివ్వలేదు. అందరికీ పోషకాహారంతో పాటు సురక్షిత మంచినీటిని అందిస్తే దేశంలోని జబ్బుల్లో 70 శాతం పరిష్కారమవుతాయి. వైద్య రంగం ఖర్చులు తగ్గుతాయి. ప్రజారోగ్యానికి సంబంధించిన ఈ మౌలిక విషయాన్ని విస్మరించి, కార్పొరేట్ వైద్యం ద్వారా పరిష్కారం అని దాని వెనక పడితే, అది బడాపెట్టుబడిదారుల లాభాలకే ఉపయోగపడుతుంది. ‘తాగునీరు ప్రాథమిక హక్కుగా’ ఉండాలన్నది FMRRC వారి నినాదం. ఈ సమస్యపై నిరంతరం SEAM (సెన్సిటైజ్, ఎడ్యుకేట్, ఎజిటేట్, మొబిలైజ్) చేయటం అవసరం, తెలంగాణ అనుభవం, విజయరహస్యం అదే అంటారు వారు.
***
(ఈ సమస్యలపై అనేక FMRRC రచనలు ‘కౌంటర్ కరెంట్స్’ ఆన్ లైన్ దినపత్రికలో వ్యాసాలుగా ప్రచురించారు. ప్రసుత క్లుప్త పరిచయానికి ఆధారం అవే. మరింత సమగ్ర సమాచారం కోసం వాటిని చదవటం ఉపయోగకరం.
Socio-Political and Economic Aspects Of Fluorosis (2016) FMRRC వారి ప్రసిధ్ధ పత్రం . https://countercurrents.org/2017/04/socio-political-and-economic-aspects-of-fluorosis/.
వివిధ రాష్ట్రాల సమస్యలనూ, ప్రభుత్వాల అశ్రధ్ధనూ అనేక వ్యాసాల్లో చర్చిమ్చారు. మచ్చుకి కొన్ని ఇవీ:
https://countercurrents.org/2022/02/it-is-poison-not-water-that-comes-out-of-the-handpumps-in-up/
మరిన్నివివరాలకు bapujim@gmail.comకు ఇమెయిల్ చేయండి: ఆదిత్య కృష్ణ)