సిపిసి 20 వ జాతీయ సమావేశాలు ముందుకు తెచ్చిన అంశాలు: ఆధునికీకరణ, మానవాళి పంచుకునే విలువలు
డాక్టర్. యస్. జతిన్ కుమార్
ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక శక్తిగా ఎదిగిన చైనా అభిప్రాయాలు, ఆలోచనలు, సమస్యలను పరిష్కరించే తీరు, విదేశాలపట్ల దాని వైఖరి, ఈ రోజు మొత్తం ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేస్తాయి. చైనా విధానాలను, ప్రణాళికలను సూత్ర బద్ధంగా రూపొందించేది చైనా కమ్యూనిస్ట్ పార్టీ ,కనుక ప్రపంచ దేశాలన్నీ 16-10-22 నుండి 23-10-22 వరకు జరిగిన సిపిసి 20 వ జాతీయ సమావేశాల రిపోర్టులను ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి.
“ఈ రోజు నుండి, సిపిసి యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటంటే, చైనాను అన్ని విధాలుగా ఒక గొప్ప ఆధునిక సోషలిస్టు దేశంగా నిర్మించాలనే రెండవ శతాబ్ది లక్ష్యాన్ని సాధించడానికి, ఆధునికీకరణకు అన్ని రంగాలలో చైనా జాతి పునరుజ్జీవనాన్ని ముందు కు తీసుకువెళ్ళే సమిష్టి ప్రయత్నంలో అన్ని ప్రాంతీయ, స్థానిక జనజాతుల కు చెందిన చైనీయులను చైనా మార్గం లో ఐక్యంగా నడిపించడం.” అని కాంగ్రెస్ ప్రారంభ సమావేశంలో చైనా అగ్రనేత జిన్ పింగ్ అన్నారు. చైనా లక్షణాలతో కూడిన సోషలిజం అనే గొప్ప పతాకాన్ని ఉన్నతంగా ఉంచడం, కొత్త శకానికి చైనా లక్షణాలతో సోషలిజంపై ఆలోచనను పూర్తిగా అమలు చేయ డం, పార్టీ యొక్క గొప్ప వ్యవస్థాపక స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళడం, ఆత్మవిశ్వాసం, బలాన్ని పెంపొందించుకోవడం, మౌలిక సూత్రాలను నిలబెట్టడం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం, ధైర్యసాహసాలతో ముందుకు సాగడం ఈ మహాసభ యొక్క ఇతివృత్తం. 21 వ శతాబ్దంలో చైనాలో శాస్త్రీయ సోషలిజం కొత్త చైతన్యాన్ని ప్రదర్శించిందని, చైనా తరహా ఆధునికీక రణ, మానవాళికి ఆధునికీకరణలో ఒక కొత్త మార్గాన్ని అందించిందని జిన్పింగ్ పేర్కొన్నారు.
చైనా ఆధునికీకరణ అంటే భారీ జనాభాను ఆధునీకరించడం. చైనా ఆధునికీకరణ అంటే సోషలిస్టు ఆధునికీకరణ. అందరికీ ఉమ్మడి సంపత్తి ,శ్రేయస్సు, భౌతిక , సాంస్కృతిక-నైతిక పురోగతి, మనిషికి ప్రకృతికి మధ్య సామరస్యం వెరసి శాంతియుత అభివృద్ధి ని సాధించడం. ఇది ఆధునికీకరణను సాధించడానికి మానవాళికి “కొత్త మార్గాన్ని” అందిస్తుందని జెన్ పింగ్ నొక్కి చెప్పారు. పాశ్చాత్య ఆధునికీకరణ మార్గాల వలన ఉద్భవించిన ఆధిపత్యం, వలసవాదం అనే రెండు దుర్మార్గపు చెడు విధా నాలను నిర్మూలించి, నేటి ప్రపంచీకరణ యుగంలో చైనా-శైలి ఆధునికీకరణ ఒక కొత్త నమూనాను అందించేదిగా వున్నదని ఆయన అన్నారు . చైనా- అన్ని రకాల ఆధిపత్యం, ఆధిపత్య రాజకీయాలకు , ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం, ద్వంద్వ ప్రమాణాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడుతుంది. ఆర్థిక ప్రపంచీకరణలో చైనా సరైన మార్గానికి కట్టుబడి ఉంది. అభివృద్ధికి అనుకూలమైన అంతర్జాతీయ వాతావరణాన్ని పెంపొందించడానికి , ప్రపంచ వృద్ధి కి కొత్త చోదకాలను సృష్టించడానికి, ఇతర దేశాలతో కలిసి పనిచేయడానికి ఇది కట్టుబడి ఉందని జిన్ పింగ్ చెప్పారు. చైనా తరహా ఆధునికీకరణ నిర్వచనంలో ఐదు అంశాలు పొందుపరచబడినాయి.
“చైనా 1.4 బిలియన్ల జనాభాకు నిలయంగా ఉంది. ఇది అన్ని ఆధునిక,అభివృద్ది చెందిన దేశాల సంయుక్త జనాభా కంటే ఎక్కువ. అంటే చైనా తన రెండవ శతాబ్ది లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు, అది ప్రపంచంలో అత్యధిక జనాభాతో ఆధునిక ఆర్థిక వ్యవస్థ అవుతుంది”. పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలతో చైనా ఆధునికీకరణ యొక్క మరొక ప్రధాన వ్యత్యా సం ఏమిటంటే, ఉమ్మడి శ్రేయస్సుపై దాని ప్రాధాన్యత. సామాజిక అభివృద్ధిలో అసమానత, ధనిక-పేద మధ్య అంత రాలు పెరగడానికి దారితీసిన పాశ్చాత్య దేశాల ఆధునికీకరణ మార్గానికి ఇది పూర్తి విరుద్ధం. చైనా తరహా ఆధునికీ కరణ శాంతియుత, ఆకుపచ్చని అభివృద్ధితో కూడివుంటుంది. కొన్ని దేశాల అభివృద్ధి ఇతర దేశాల నెత్తురు, కన్నీళ్లతో ముడిపడి సాగింది. దోపిడీ, ఆక్రమణ, వలసవాదం ద్వారా లేదా ఆ దేశాల సహజ వనరులను నాశనం చేయడం, పర్యావరణ వినాశనం, గ్లోబల్ వార్మింగ్ కు ఆజ్యం పోసే కార్బన్ డయాక్సైడ్ విడుదలతో పెనవేసుకుని వుంది.” అని బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయం యొక్క బెల్ట్ అండ్ రోడ్ స్కూల్ ప్రొఫెసర్ వాన్ విశ్లేషించారు.
“అన్ని విధాలుగా ఉన్నతమైన ఆధునిక సోషలిస్టు దేశాన్నినిర్మించాలంటే, మనం మొట్టమొదటగా, అత్యంత నాణ్య మైన అభివృద్ధిని సాధించాలి. పారిశ్రామిక వ్యవస్థను ఆధునీకరించడం, నూతనంగా పారిశ్రామికీకరణను ముందుకు తీసుకెళ్లడం, తయారీ, ఉత్పత్తిలో నాణ్యత, ఏరోస్పేస్, రవాణా, సైబర్ స్పేస్, డిజిటల్ అభివృద్ధిలో మరింత శక్తివంతం కావాలి. దేశ వ్యాప్తంగా గ్రామీణ పునరుజ్జీవనాన్ని పెంపొందించడానికి చైనా- వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి మొదటి స్థానం ఇవ్వడం కొనసాగిస్తుంది, పేదరిక నిర్మూలనలో విజయాలను ఏకీకృతం చేస్తుంది. విస్తరిస్తుంది. ఆహార భద్రత కు పునాదులను బలోపేతం చేస్తుంది. ప్రజలకు అత్యంత ఆందోళన కలిగించే సమస్యలను పరిష్కరించడానికి, ప్రజా సేవా ప్రమాణాలను పెంచడానికి ప్రాథమిక ప్రజా సేవా వ్యవస్థను మెరుగుపరచడానికి, ప్రజా సేవలను మరింత సమ తుల్యంగా,అందుబాటులో ఉంచడానికి సిపిసి కష్టపడి పనిచేస్తుంది, తద్వారా ఉమ్మడి శ్రేయస్సును ప్రోత్సహించడం లో బలమైన పురోగతిని సాధిస్తుంది” అని జిన్పింగ్ చెప్పారు.
“ఆదాయ పంపిణీ వ్యవస్థను చైనా మెరుగు పరుస్తుందని చెప్పారు. మేము మరింత ఎక్కువ పనికి ఎక్కువ వేతనా న్ని నిర్ధారిస్తాము. కష్టపడి పనిచేయడం ద్వారా శ్రేయస్సును సాధించడానికి ప్రజలను ప్రోత్సహిస్తాము. అవకాశాల సమానత్వాన్ని ప్రోత్సహిస్తాం, తక్కువ ఆదాయం సంపాదించేవారి ఆదాయాలను పెంచుతాం, మధ్య ఆదాయ వర్గాల పరిమాణాన్ని విస్తరిస్తాం’ అని జిన్ పింగ్ పేర్కొన్నారు.
చైనా తరహా ఆధునీకరణ ఈ కాలపు ధోరణికి అనుగుణంగా ఉంటుంది .ప్రపంచంలో అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశంగా చైనా యొక్క స్వంత అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. విద్య, సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభను ఆధునికీకరణలో ముందు వరుసలో ఉంచడానికి ఆయన పిలుపు నిచ్చారు. చైనా ఆధునికీకరణ దేశ అవసరాలకు, సమయ, సందర్భాలకు అనుగుణంగా చైనా లక్షణాలతో కూడిన సోషలిజాన్ని నిర్మించడం అని నొక్కి చెబుతుంది
జిన్ పింగ్ కొత్త శకం యొక్క కొత్త ప్రయాణంలో లక్ష్యాలను,మార్గాలను విపులీకరించారు
సిపిసి ప్రాథమికంగా 2020 నుండి 2035 వరకు సోషలిస్ట్ ఆధునికీకరణను సాధించటం, చైనాను సుసంపన్న మైన, బలమైన, ప్రజాస్వామిక, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన, సామరస్యపూర్వకమైన, అందమైన, గొప్ప ఆధునిక సోషలిస్టు దేశంగా నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. “ చైనా నేరుగా అనుసరించడానికి లేదా అనుకరిం చడానికి సిద్ధంగా ఉన్న అభివృద్ధి మార్గం లేదా విధానం లేనందున, చైనా విప్లవం వంద సంవత్సరాలకు పైగా అన్వేషణ, నిర్మాణం తరువాత ఆధునికీకరణకు తనదైన ఒక మార్గాన్ని సిద్ధం చేసుకుంది. ఇది పూర్తిగా కొత్త ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నది. స్వీయ-అభివృద్ధి, సార్వభౌమత్వం, స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రతను కాపా డుకోవడం అనే లక్ష్యాలతో సత్వర అభివృద్ధిని సాకారం చేసుకోవాలని అనేక దేశాలు వారి అభివృద్ధి విధానాలను అన్వేషిస్తున్నాయి లేదా పోరాడుతున్నాయి. చైనా ఆధునికీకరణలో ప్రపంచంలోని దేశాలన్నింటికీ మరో అభివృద్ధి మార్గం తెరుచుకుంది” అని ఫుడాన్ విశ్వవిద్యాలయానికి చె౦దిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పబ్లిక్ ఎఫైర్స్ ప్రొఫెసర్ షెన్ యి వ్యాఖ్యానించారు
ఆధునికీకరణ యొక్క చైనా మార్గం అందరికీ ఉమ్మడి శ్రేయస్సు, శాంతియుత అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది. చైనా ఆధునికీకరణ ఇతర దేశాల ఆధునికీకరణతో కలిసి విజయవంత మవుతుంది. ఇది ఇతర దేశాలు వారి ఆధునికీ కరణను, అభివృద్ధిని సాధించే అవకాశాలను సృష్టిస్తుంది. అయితే ఇది తన భావజాలాన్ని అంగీకరించమని ఇతరు లకు ప్రబోధించదు. బలవంతం చేయదు. మీ జాతీయ పరిస్థితుల కనుగుణమైన మార్గం అనుసరించమని మాత్రమే చెబుతుంది.
పాశ్చాత్య ఆధునికీకరణకు చాలా భిన్నంగా ఉన్న చైనా ఆధునికీకరణ, ప్రస్తుత ప్రపంచ వ్యవస్థపై ఆధిపత్యం చెలాయిస్తున్న శక్తులకు సవాళ్లను విసురుతోంది. అందువల్ల అవి చైనా పై నిరంతరం యుద్ధాన్ని ప్రకటిస్తున్నాయి. చైనా అత్యంత దారుణమైన పరిస్థితులకు,”ప్రమాదకరమైన తుఫానులకు” కూడా సంసిద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ ఆధిపత్యం, దాని అనుచరులు చైనా విజయం సాధిస్తుందని అంగీకరించరు, ఎందుకంటే అది వారి ప్రయోజనాలకు సేవ చేయటం కోసం వారు నిర్మించిన వ్యవస్థ యొక్క ముగింపును తీసుకురాగలదు అని నిపుణులు పేర్కొన్నారు. “మన భవిష్యత్తు ఉజ్వలమైనది, కానీ మనం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. అందు వల్ల మనం సంభావ్య ప్రమాదాల గురించి మరింత అప్రమత్తంగా ఉండాలి, గడ్డు పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి, ప్రచండమైన సుడిగాలులు, ముంచెత్తే జల విలయాలు, ప్రమాదకరమైన తుఫానులను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి” అని జిన్ పింగ్ అన్నారు.
కాబట్టి చైనా తనను తాను అభివృద్ధి చేసుకుంటూ, చైనా ప్రజల జీవనోపాధి కోసం మెరుగుదలను కోరుతూ, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వంటి మరిన్ని ప్రపంచ ప్రజానుకూల విధానాలను, నిర్మాణాలను ఇతర దేశాలకు అందించ డానికి ప్రయత్నిస్తున్నంత కాలం, పరస్పర గెలుపు కోసం సహకారం, ఆధునీకరణ, శాంతియుత అభివృద్ధిని కోరుకు నే ఇతర దేశాలకు అందిస్తున్నంతకాలం ప్రస్తుత ఆధిపత్య శక్తులు చైనాపై, ఆయా దేశాలపై ఒత్తిళ్లు, అణచివేతలు వాటికి వ్యతిరేకంగా దాడులను కూడా నిర్వహిస్తాయి. గత దశాబ్దంలో ఇలాజరిగిందని, చైనా యొక్క సైన్స్-టెక్ పరిశ్రమలకు వ్యతిరేకంగా అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం, అణచివేత, అలాగే తైవాన్ సమస్యపై రెచ్చగొట్ట డం, జోక్యం చేసుకోవడం ప్రస్తావిస్తూ, విశ్లేషకులు తెలిపారు. సిపిసి సెంట్రల్ కమిటీ పార్టీ స్కూల్లో ప్రొఫెసర్ అయిన జాంగ్ జిక్సియాన్, “గత శతాబ్దంలో ప్రపంచం చూడని తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక, సామాజిక సంక్షోభాల మధ్య సంభవించగల యుద్దాలు ‘ప్రమాదకరమైన తుఫానులు’ తీసుకురాగలవు. చైనా జాతీయ పునరేకీ కరణకు అడ్డంకులు, తైవాన్ వేర్పాటువాదానికి మద్దతు ఇవ్వడానికి విదేశీ జోక్యంవంటివి తీవ్రమైన ప్రమాదాన్ని తీసుకురాగలదు.” అని వివరించారు. అందువల్లనే చైనా జాతీయ భద్రతా వ్యవస్థ సామర్థ్యాన్నిఆధునీకరించడం, జాతీయ భద్రతా, సామాజిక స్థిరత్వాలను రక్షించడం గురించి జిన్పింగ్ నొక్కి చెప్పారు. జాతీయ భద్రత అనేది జాతీయ పునరుజ్జీవనానికి పునాది అని, బలమైన, సంపన్న మైన చైనాను నిర్మించడానికి సామాజిక స్థిరత్వం తప్పనిసరి అని జిన్పింగ్ అన్నారు. బాహ్య, అంతర్గత భద్రతల కోసం, మాతృభూమిరక్షణ కోసం, ప్రజల భద్రత కోసం సంప్రదాయ, సంప్రదాయేతర భద్రతల తోపాటు పార్టీ సమన్వయంతో కూడిన చర్యలు తీసుకుంటుందన్నారు.
స్ఫూర్తిదాయకమైన దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు, వాటిని చేరుకోవడానికి స్పష్టమైన మార్గాలు, విస్తృత చర్యలు, నిస్సందేహంగా ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యొక్క అధిక-నాణ్యత, స్థిరమైన అభివృద్ధిని నిర్ధారి స్తాయి. యుఎస్ వంటి అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థల వద్ద వారి స్వంత, దీర్ఘకాలిక అభివృద్ధి కోసం అటువంటి వ్యూహా త్మక, దార్శనిక ప్రణాళికలు లేవని గమనించడం ముఖ్యం, ఎందుకంటే అవి దేశీయంగా తమ రాజకీయ ప్రయోజనం , భౌగోళిక రాజకీయాలలోతమకు లాభించే చర్యలపై ఎక్కువ దృష్టి పెడతాయి.
ఈ నేపథ్యంలో, చైనా ప్రవేశ పెడుతున్న స్థిరత్వం, ఖచ్చితత్వం అనే భావన కీలకమైనది. రాబోయే సంవత్సరాల్లో చైనా యొక్క స్థిరమైన వృద్ధి, బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరీకరణ శక్తిగా మారుతుందని నమ్మడానికి తగిన కారణం ఉంది. గత దశాబ్దంలో చైనా అభివృద్ధి కథ ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంది. 2013 నుండి 2021 వరకు చైనా జిడిపి సగటు వార్షిక రేటు 6.6 శాతం వద్ద విస్తరించిందని గణాంకాలు చూపిస్తున్నాయి, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సగటు 2.6%, లేక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల 3.7%వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువ. అంతే కాక, 2013-2021 కాలంలో ప్రపంచ ఆర్థికవృద్ధికి చైనా చేర్పు 30% మించిపోయిందని 20 వ సిపిసి నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి సన్ యెలీ విలేకరుల సమావేశంలో చెప్పారు.
చైనా ఆర్థికవృద్ధి కేవలం సంఖ్యను మాత్రమే అనుసరించలేదు. దీర్ఘకాలిక, సుస్థిర అభివృద్ధి కోసం మౌలికసమస్య లను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అందువల్ల, గత దశాబ్దంలో చైనా ఆర్థికాభివృద్ధి మరింత సమతుల్యంగా, సమన్వయంతో, సుస్థిరంగా మారింది. ఆర్థిక, శాస్త్రీయ, సమగ్ర జాతీయశక్తి పరంగా కొత్త ఎత్తులను అధిరోహించింది. కొంతవరకు, ఈ పరిణామాలన్నీ ప్రపంచానికి చైనాచేసిన కూర్పులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ఏడాది, కోవిడ్-19 పదే పదే వ్యాప్తి చెందడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రాంతీయ భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, యుఎస్ ద్రవ్య విధానం కఠినతరం కావడం, సరఫరా గొలుసుల లోని సమస్యల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గొప్ప అనిశ్చితి ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. చైనాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి, వాణిజ్యం నుండి విడదీయడం, వారిని అణచి వేయడం అనే అసమంజసమైన విధానాన్ని అమెరికా కొనసాగించింది. ఈ బాహ్య తలనొప్పులన్నీ చైనా అభివృద్ధిపై కొంత ఋణాత్మక ఒత్తిడిని కలిగించాయి.
“ సిపిసి, చైనా ప్రజలు ఆధునికీకరణకు చైనా మార్గాన్ని తెరవడానికి సుదీర్ఘ కాలం కష్టపడి ప్రయత్నించారు. ఇది ఒక గొప్ప కార్యం. అది మహిమాన్వితమైనది. చైనాను అన్ని విధాలా ఆధునిక సోషలిస్టు దేశంగా మార్చడానికి, రెండవ శతాబ్ది లక్ష్యం దిశగా మనం ఇప్పుడు ఒక కొత్త ప్రయాణంలో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్నాము . సిపిసి- పెనుగాలులకు, ప్రళయ జల విలయాలకు లేదా ప్రమాదకరమైన తుఫానులకు భయపడదు, ఎందుకంటే ప్రజలు ఎల్లప్పుడూ దాని వెన్నంటే ఉంటారు, దానికి విశ్వాసాన్ని ఇస్తారు.” అని జిన్పింగ్ భావిస్తున్నారు. తిరిగి పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయిన తరువాత తొలి ప్రసంగంలో ఉమ్మడి భవిష్యత్తు కోసం శ్రమించే మానవ సమాజ నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి చైనా యొక్క నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.”శాంతి, అభివృద్ధి, న్యాయం, ప్రజాస్వామ్యం, ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి, ప్రపంచ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, భాగస్వామ్య భవిష్యత్తుతో మానవ సమాజపు నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి మేము ఇతర దేశాల ప్రజలతో కలిసి పనిచేస్తాము” అని జిన్పింగ్ ప్రకటించారు. మానవాళి యొక్క భాగస్వామ్య విలువలను ఆయన వక్కాణించి చెప్పారు.
సిపిసి సమర్పించిన “మానవాళి పంచుకునే విలువలు” అనే భావన పాశ్చాత్య దేశాలు ప్రోత్సహించిన “సార్వ జనీన విలువల” కంటే చాలా భిన్నమైనదని నిపుణులు తెలిపారు. “సార్వత్రిక విలువలు” అని పిలువబడే ఈ “సార్వత్రిక విలువలు” వాస్తవానికి ఇతర దేశాలను బెదిరించడానికి, జోక్యం చేసుకోవడానికి, ఆక్రమించడానికి ఆధిపత్యానికి సాకుగా పనిచేసాయి, చేస్తాయి.”విలువలు” వాస్తవానికి ప్రపంచాన్ని ఏకం చేయడానికి బదులుగా విభజించాయి. పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా యు.ఎస్. అనేక సందర్భాల్లో కపటత్వం, ద్వంద్వ-ప్రమాణాలకు పాల్ప డి, తన స్వంత మిత్రదేశాలను, అనుచరులను ఏకం చేయడానికి, “శత్రువులు- పోటీదారులు” అనే విభేదాలు సృష్టించడానికి ఈ భావనలను ఉపయోగిస్తుంది. కానీ సిపిసి భావన “మానవాళి యొక్క భాగస్వామ్య విలువలు” అనేది సమ్మిళితమైనది, అంతర్జాతీయ సమాజంలోని సభ్యులందరినీ, పాశ్చాత్య ప్రపంచంలోని నాగరికతల తో సహా అన్ని నాగరికతలను ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చైనా ఎల్లప్పుడూ ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తుంది, సిపిసి నాయకత్వంలో పోరాడు తుంది. తన కొత్త ప్రయాణంలో చైనా-గతంలో ఆధిపత్యం లేదా సామ్రాజ్యవాదం నడిచిన క్రూరమైన, నెత్తుటి మార్గాన్ని ఎన్నడూ అనుసరించదు అని నిపుణులు చెప్పారు. ఇది చైనా నిష్పాక్షికత, న్యాయాన్ని ఎత్తిపట్టడం ద్వారా మానవాళి ఉమ్మడి విలువలను కాపాడుతుందని సూచిస్తుంది.
“ 18 వ సిపిసి నేషనల్ కాంగ్రెస్ నుండి చైనా అనుసరిస్తున్న ప్రధాన ఆలోచనలను జిన్పింగ్ చేసిన వ్యాఖ్యలు మరింత స్పష్టం చేస్తాయి. ప్రధాన లక్ష్యాలను మార్గాలను వివరిస్తాయి. దౌత్య విధానాల స్థిరత్వం, కొనసాగింపులను నొక్కిచెబుతాయి.” అంటూ చైనా ఇన్స్టిట్యూట్ఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ – డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిప్యూటీ డైరెక్టర్ సు జియావోహుయ్ చేసిన వ్యాఖ్యలతో ఈ అంశాలను అర్ధం చేసుకుందాం చైనా విధానం స్వార్థపూరితమైన,మొత్తం లాభంమాకే చెందాలనే మనస్తత్వాలపై ఆధారపడి లేదు. భాగస్వామ్య భవిష్యత్తు తో మానవ సమాజాన్ని ప్రోత్సహించే ఆలోచన గెలుస్తుంది. అంతర్జాతీయ సమాజం నుండి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ఎక్కువ మద్దతును పొందుతుంది”
[చైనా, 20 వ జాతీయ కాంగ్రెస్ లో చైనా అధ్యక్షుడు జీ జీన్ పింగ్ చేసిన ప్రసంగాలు, గ్లోబల్ టైమ్స్ పత్రికలో ప్రచురింప బడ్డ నివేదికలు, ప్రత్యేక కథనాలు యాంగ్ షెంగ్, ఝాంగ్ చాంగ్యూ రచనల ఆధారంగా ]