శేషాచ‌లం కొండ‌ల్లో 11 గంటల ట్రెక్

తిరుప‌తి జ్ఞాప‌కాలు-56

(రాఘ‌వ శ‌ర్మ‌)

ఇలా తాళ్ళు ప‌ట్టుకుని లోయ‌లోకి జాగ్రత్తగా దిగ‌డం..!
తాళ్ళు ప‌ట్టుకుని నిటారుగా ఉన్న కొండ‌ను ఎక్క‌డం..!
పెద్ద పెద్ద బండ‌రాళ్ళ‌ను ఎక్కుతూ, దిగుతూ లోయ‌లో ప్ర‌వాహానికి ఎదురుగా ఏక‌బిగిన ప‌ద‌కొండు గంట‌లు న‌డ‌వ‌డం..!
నీటి గుండాల్లో ఈద‌డ‌డం..!
జ‌ల‌పాతాల కింద త‌డిసి ముద్ద‌వ‌డం..!
పాపనాశ‌నం దిగువున ఉన్న‌ లోయ‌లో ఏడు తీర్థాల‌ను ఒకే రోజు సంద‌ర్శించ‌డం..!
ఇది సాహ‌సమా..! దుస్సాహ‌సమా..!
నిజంగా ఇది డేర్ డెవిల్ ట్రెక్కింగ్‌…!
పాతికేళ్ళుగా శేషాచ‌ల కొండ‌ల్లో ట్రెక్కింగ్ చేస్తున్నాం.
కానీ, ఇంత‌ క‌ష్ట‌త‌ర‌మైన ట్రెక్కింగ్ గ‌తంలో ఎప్పుడూ ఎర‌గ‌ను.

పాపనాశనం దాటాక అడవిలో నడక

స‌న‌క‌స‌నంద‌న తీర్థం, అక్క‌గార్ల గుండాలు, మ‌ల‌య‌ప్ప కోన‌, మ‌ల‌య‌ప్ప తీర్థం, జ్వ‌ర‌హార తీర్థం, కాయ‌ర‌సాయ‌న తీర్థం, వెంక‌టేశ్వ‌ర తీర్థం; ఒక్క రోజులో మేం సంద‌ర్శించిన తీర్థాలు.
“ఇది చాలా హార్డ్ ట్రెక్కింగ్‌. అందుకే అంద‌రికీ చెప్ప‌ప‌లేదు. రాగ‌లుగుతారా!?” అన్నారు మ‌ధు.
ఇష్టం క‌నుక‌, క‌ష్ట‌మైనా వ‌స్తానన్నాను.
ఆదివారం ఉద‌యం ఆరు గంట‌ల‌క‌ల్లా తిరుమ‌ల‌లోని పాప‌నాశ‌నం డ్యాంకు చేరుకున్నాం.
తిరుప‌తి నుంచి ప‌ద‌కొండు మంది, చెన్నై నుంచి అయిదుగురు, మొత్తం ప‌ద‌హారు మందిమి.
పాప‌నాశ‌నం డ్యాం దాటుకుని అడ‌విలో మా న‌డ‌క మొద‌లైంది.
పావుగంట‌లో స‌న‌క‌స‌నంద‌న తీర్థం చేరుకున్నాం.
చిన్న గుంట‌లో ఉన్న నీళ్ళు ఎంత స్వ‌చ్ఛంగా ఉన్నాయో!
మండు వేస‌విలో కూడా ఎప్పుడూ ఆ గుంట ఎండిపోదు.
ఏ తీర్థానికి వెళ్ళినా ఇక్క‌డి నుంచే నీళ్ళు తీసుకెళ్ళాలి.

ఇలా లోయలోకి దిగుతూ…

ఇరువైపులా చెట్ల మ‌ధ్య‌లో బోద‌ ఎత్తుగా పెరిగింది.
చ‌లువ రాతి బండ‌లవ‌ద్ద‌కు చేరుకున్నాం.
దారంతా స‌హ‌జ‌ సిద్దంగా ఏర్ప‌డిన బండ‌లు వ‌ర్ష‌పునీటి ప్ర‌వాహానికి నునుపు దేలాయి.
ఏట వాలుగా ఉన్న ఆ బండ‌ల‌పై నుంచి న‌డుస్తున్నాం.
మా సాహ‌సాల‌ను చూడ‌డానికి అప్పుడే సూర్యుడు కొండ‌మాటు నుంచి తొంగి చూస్తున్నాడు.
చెట్ల సందుల నుంచి మా పై కిర‌ణాలు ప్ర‌స‌రింప చేస్తున్నాడు.
చెన్నై నుంచి వ‌చ్చిన వారు తెలుగు, ఇంగ్లీషు క‌ల‌బోసి మాట్లాడుతున్నారు.
వారితో తెలుగు వాళ్ళు కొంద‌రు ఇంగ్లీషులో మాట‌మంతి క‌లిపారు.
తెలుగు, త‌మిళ, ఇంగ్లీషు మాట‌ల మూట‌ల‌ను చూసి చెట్లు విస్తుబోతున్నాయి.
వీటికి తోడు న‌వ్వుల రేడు జై బాలాజీ స‌ర‌దా క‌బుర్లు.
ఎదురుగా రామ‌కృష్ణ తీర్థం ఎక్కే కొండ‌.
ఆ కొండ‌కు కుడి వైపు మ‌లుపు నుంచి ఏట‌వాలుగా దిగుతున్నాం.
ప‌క్క‌న పాప‌నాశ‌నం ఏరు రొద చేస్తూ ప్ర‌వ‌హిస్తోంది.
చుట్టూ చెట్లు క‌మ్మేశాయి. సూర్యుడు క‌నిపించ‌డం లేదు.
మ‌రి కాస్త దూరంలో తుంబురు తీర్థం.
తుంబురుకు అర కిలో మీట‌రు ఈవ‌ల పాప‌నాశ‌నం లోయ‌లోకి ఒక‌రొక‌రుగా దిగాం.
క‌ష్ట త‌ర‌మైందే కానీ, తాడు లేకుండానే దిగ‌గ‌లిగాం.
మా బృందానికి ఒక‌రు ముందుంటే, మ‌రొక‌రు చివ‌ర‌న.
ఒక‌రు మ‌ధు, మ‌రొక‌రు తిరుమ‌ల రెడ్డి.
లోయ‌లోకి దిగి, కాస్త ముందుకు న‌డుస్తున్నాం.
ద‌క్షిణం నుంచి ఉత్త‌ర దిశ‌గా రాళ్ళ మ‌ధ్య నుంచి ఏరు ప్ర‌వ‌హిస్తోంది.
అనేక నీటి గుండాల‌లో దూకుతూ, రొద చేస్తూ త‌న సొద‌ను వినిపిస్తోంది.
ఉద‌యం ఎనిమిద‌య్యింది.

ఏడుగురు వనదేవతలు ‘అక్క గార్ల’విగ్రహాలు

ఒక పెద్ద నీటి గుండం ముందు ఆగాం.
వాటిని అక్క‌గార్ల గుండా లం టారు.
అక్క‌డే అల్పాహారం ముగించి, ఆ గుండంలోకి కొంద‌రు మున‌క‌లేశారు.
అ ప‌క్క‌నే కొండ‌కు ఆనుకుని ఏడు అక్క‌గార్ల విగ్ర‌హాల‌వంటి రాతిచిహ్నాలు.
ఆ ఏడుగురు అక్క‌గార్లను ఏడుగురు వ‌న‌దేవ‌త‌లుగా భావిస్తారు.
పాప‌నాశ‌నం ఏటి పై భాగం నుంచి ద‌క్షిణ దిశ‌గా వ‌చ్చిన‌ మేం, లోయ‌లో ప్ర‌వాహానికి ఎదురుగా ఉత్త‌ర దిశ‌గా న‌డుస్తున్నాం.
ఉద‌యం తొమ్మిదైంది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంది.
ఇరువైపులా రెండు ఎత్తైన కొండ‌లు.
ఏటి మ‌ధ్య‌లో ఎక్క‌డా ఎండ పొడ క‌నిపించ‌డం లేదు.
మ‌ధ్య‌లోప్ర‌వ‌హిస్తున్న ఏరు ప‌క్క నుంచి ఎడ‌మ వైపు మా న‌డ‌క మొద‌లైంది.
ర‌క‌ర‌కాల చెట్లు. మ‌ధ్య‌లో ఏటి ప్ర‌వాహానికి కొట్టుకొచ్చిన రాళ్ళు.
వాటి పైన న‌డుస్తూ సాగుతున్నాం.

అక్కగారి గుండం

ఏటిలో ఎదురుగా ఒక ఎత్తైన కొండ క‌నిపించింది.
కొండ పైనుంచి ప‌డుతున్న జ‌ల‌పాతం.
ఒక ద‌శ నుంచి మెట్లు మెట్లుగా జారుతూ ముందుకు సాగిపోతోంది.
నీటి గుండాలు క‌నిపించినా, జ‌ల‌పాతాలు క‌నిపించినా ట్రెక్క‌ర్ల‌కు పూన‌కం వ‌చ్చేస్తుంది.
అంతే, మెట్లు మెట్లుగా ఉన్న ఆ ద‌శ‌కు ఎక్కారు.
పాకుడుకు జారుతోంది.
కాళ్లు, చేతుల‌తో పాకి జ‌ల‌పాతం కింద‌కు చేరారు.
జ‌ల‌పాతం కింద త‌డుస్తూ, చిన్న పిల్ల‌ల్లా కేరింత‌ల‌తో ఆనందంలో త‌న్మ‌యులైపోయారు.
చుట్టూ కొండ‌లు, కొండ అంచుల్లో పెద్ద పెద్ద చెట్లు.
కొండ‌కు కుడి వైపున సొట్ట‌పోయిన‌ట్టు, కాస్త లోప‌ల‌కు చొచ్చుకు పోయింది.
ఆక్క‌డ కూడా పెద్ద నీటి గుండ‌మే!
కొండ పై నుంచి ఆ గుండంలోకి జ‌ల ధార ప‌డుతోంది.
అదే మ‌ల‌య‌ప్ప కోన‌.
త‌మిళంలో మ‌లై అంటే కొండ‌.
మ‌ల‌య‌ప్ప కోన అంటే, కొండ దేవుడి కోన‌.

ఎండ‌మ వైపున కొండ అంచులు ప‌ట్టుకుని ఎక్కాం.
అక్క‌డ‌ మ‌నిషెత్తు పెరిగిన ప‌చ్చ‌ని చెట్లు మ‌ధ్య‌లో సాగుతున్నాం.
కొండ అంచున ఫెర్న్ పెరిగింది.
ప‌క్క‌న లోతైన‌ లోయ‌లో మ‌ల‌య‌ప్ప కోన‌.
పై నుంచి ప‌డుతున్న జ‌ల‌ధార‌.
ఆ పెర్న్ పై నుంచి జాగ్ర‌త్త‌గా న‌డుచుకుంటూ సాగుతున్నాం.
ఉన్న‌ట్టుండి నా కుడి కాలు మోకాలి వ‌ర‌కు ఫెర్న్ కింద ఉన్న కొండ చీలిక‌లో దిగ‌బ‌డిపోయింది.
అతిక‌ష్టం పైన లేవ‌గ‌లిగాను.
నా ముందు న‌డిచిన వారెవ‌రూ ఫెర్న్ కింద చీలిక ఉన్న‌ట్టు గుర్తించ‌లే దు.
ఆ త‌రువాత వ‌చ్చిన వారంతా ఆ చీలిక పై నుంచి దాటుకున్నారు.
కొండ‌పైనుంచి కారుతున్న నీటితో కిందంతా చెమ్మ‌గా ఉంది.
మా బృందంలోని వారంతా, ప్ర‌తి ఒక్క‌రూ ఎక్క‌డో ఒక చోట‌ ప‌డుతూ లేస్తూనే సాగుతున్నారు.
‘ప‌డ‌ని వాళ్ళు పాపాత్ములు’ అన్న‌ట్టు త‌యారైంది మా ట్రెక్కింగ్‌.
ఆ కొండ అంచులు దిగ‌గానే నేలంతా బండ‌లు.
మ‌ళ్ళీ ఆ రాళ్ళ‌ను ఎక్కుతూ సాగుతుంటే ఎదురుగా పెద్ద నీటిగుండం.
పై నుంచి ఎదురుగా పారుకుంటూ ఏరు ప్ర‌వ‌హిస్తోంది.
ఎన్ని మెలిక‌లు తిరుగుతోందో తెలియ‌దు.
మెలిక‌లు తిరిగిన‌ప్పుడ‌ల్లా హొయ‌లు పోతోంది.
ప‌ది అడుగుల ఎత్తు నుంచి రెండు కొండ‌ల న‌డుమనున్న‌ ఆ నీటి గుండంలో ప‌డి ముందుకు సా గిపోతోంది.
గుండానికి ప‌క్క‌నే ఆనుకుని ఎత్తైన‌ కొండ.
మ‌ళ్ళీ ఆ నీటి గుండంలో మున‌క‌లేశాం.

కొండ అంచున ఫెర్న్ మొక్కల మధ్య నుంచి నడక
రెండు కొండల నడుమ పెద్దనీటి గుండం

ఎంత సేపు!?
ముందు ఇంకా ఎన్ని గుండాలున్నాయో, ఎన్ని జ‌ల‌పాతాలున్నాయో!
ముందుకు సాగ‌క త‌ప్ప‌ లేదు.
మ‌ళ్ళీ ఎడ‌మ ప‌క్క‌న కొండ ఎక్కాలి.
కొండ అంచునే సాగుతున్నాం.
ఏటి ప్ర‌వాహానికి పెద్ద పెద్ద బండ రాళ్ళు కొట్టుకొచ్చాయి.
ఇంత పెద్ద బండ రాళ్ళు కొట్టుకు రావాలంటే, ఆ ఏరు ఎంత ఉదృతంగా ప్ర‌వ‌హించిందో!
ఒక పెద్ద బండ రాయి కింద నుంచి బైటికి మొలుచుకొచ్చిన చెట్టు ఆ బండ‌రాయిని పెన‌వేసుకుని ఎలా పైకి ఎగ‌బాకిందో!
ఏటి ప్ర‌వాహానికి అడ్డంగా ప‌డిపోయిన మ‌హావృక్షం.

ఏడడుగుల పాము కూసం

ఒక పెద్ద పాము కూసం ఏడ‌డుగులు ఉంది.
అది నాగుపాముదై ఉండ‌వ‌చ్చు.
ఒక బండ రాయి నైరూప్య చిత్రంలా ఉంది.
వందల ఏళ్ళ నాటి మ‌హావృక్షం వేళ్ళు ఏటి ఉదృతికి బైట‌ప‌డ్డాయి.
మ‌ధ్యాహ్న‌మ‌వుతోంది.
ఏటిలో ఎండ పొడ క‌నిపిస్తోంది.
సూర్యుడు న‌డినెత్తికొచ్చాడు మ‌మ్మ‌ల్ని చూడ‌డానిక‌న్న‌ట్టు.
సూర్యుడు మ‌మ్మ‌ల్ని చూడ‌నీయ‌కుండా చెట్లు అడ్డంప‌డుతున్నాయి.
చెట్ల కొమ్మ‌ల సందుల్లోంచి సూర్య కిర‌ణాలు దోబూచులాడుతున్నాయి.
కొండ అంచుల్లో ఎన్ని రూపాలు!

పాము పడగ వంటి కొండ చరియ కింద

ఒక ప‌క్క కొండ అంచు విప్పిన‌ పెద్ద పాము ప‌డ‌గ‌లా ఉంది.
ఆ కొండ ప‌డ‌గ కింద అంతా కాసేపు సేద‌దీరాం.
ముందుకు సాగితే జ‌ల‌పాత‌పు హోరు.
ఎత్తైన కొండ నుంచి జ‌ల‌పాతం జాలువారుతూ ముందుకు సాగుతోంది.
అదే మ‌ల‌య‌ప్ప తీర్థం.

ఆ జ‌ల‌పాతం కింద మ‌ళ్ళీ జ‌ల‌కాలు.
మ‌ధ్యాహ్నం ఒక‌టిన్న‌ర‌వుతోంది.
అంతా భోజ‌నాలు ముగించి ఆ బండ‌ల‌పైనే విశ్ర‌మించాం.
కాస్త ఏట‌వాలుగా ఉన్న బండ‌పైన ప‌డుకుని బ్యాగును త‌ల కింద పెట్టుకున్నాను.
అంద‌రూ బాగా అలిసిపోయారు.
ప‌డుకోగానే కాస్త కునుకు ప‌ట్టింది.
నా వెనుక నుంచి వ‌చ్చిన ఒక కోతి నా బ్యాగును లాగింది.
పులిహోర తిని ప‌క్క‌నే ప‌డేసిన కాగితాల వాస‌న‌ను బ‌ట్టి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది.
అదిలించే స‌రికి పారిపోయింది.
కునుకు ప‌ట్ట‌డం, కోతి వ‌చ్చి నా బ్యాగును లాగ‌డం దానికి ఆటైపోయింది.
అడ‌విలో కోతుల కోస‌మైనా ఒక పులిహోర పేకెట్ తేవాల‌నిపించింది.
మ‌ళ్ళీ మూడుగంట‌ల‌కు బ‌య‌లుదేరాం.
సూర్యుడు ప‌డ‌మ‌టి దిక్క‌కు ప‌య‌న‌మ‌య్యాడు.
ఆ లోయ‌లో ఎక్క‌డా ఎండ‌ పొడ క‌నిపించ‌డం లేదు.
ముందుకు సాగుతున్నాం.
మ‌ళ్ళీ ఎడ‌మ వైపున కొండ ఎక్కాలి.
రాతి కొండ నిట్ట‌నిలువునా ఉంది.
ప‌ట్టు దొర‌క‌డం లేదు.
బెత్తెడున్న‌ అంచులు ప‌ట్టుకుని ఒక‌ సాహ‌సిక‌డు ఎక్కి, తాడు క‌ట్టి కింద‌కు వ‌దిలాడు.
ఆ తాడు ప‌ట్టుకునే అంద‌రూ ఎక్కుతున్నారు.
మ‌ధు కింద నిల‌బ‌డి ఒక‌రొక‌రిని తాడు పైకి ఎక్కిస్తుంటే, పైనున్న తిరుమ‌ల రెడ్డి వారిని జాగ్ర‌త్త‌గా అందుకుంటూ దారి చూపిస్తున్నాడు.
య‌శ్వంత్ అంద‌రికంటే ముందు న‌డుస్తున్నాడు.
వ‌య‌సు రీత్యా ఎక్కుడు, దిగుడు, న‌డ‌క‌లో కాస్త వెనుక‌బ‌డ్డా, జై బాలాజీ నా వెనుకే ఉన్నాడు.
ఎక్క‌డా న‌న్ను ఒంట‌రిగా వ‌ద‌ల‌లేదు.

కాయ రసాయన తీర్థం

స‌న్న‌గా పారే ఏటికి ఎటు వైపు నుంచి వెళ్ళాలో ఎప్ప‌టిక‌ప్పుడు అన్వేష‌ణే.
రాళ్ళ‌ను ఎక్కుతూ దిగుతూ సాగుతున్నాం.
మ‌ళ్ళీ స‌న్న‌గా నీటి శ‌బ్దం.
అర్ధ‌చంద్రాకారంలో ఉన్న కొండ చీలికలో ఇరుక్కుపోయిన బండ రాళ్ళు.
ఆ బండ రాళ్ళ సందుల్లోంచి ముందున్న‌ గుండంలోకి రొద చేస్తూ నీటి ధార ప‌డుతోంది.
అదే కాయర‌సాయ‌న తీర్థం.
ఆ గుండంలో అడుగునున్న రాళ్ళు కూడా క‌నిపిస్తున్నాయి.
మ‌ళ్ళీ ఆ కాయ‌ర‌సాయ‌న తీర్థం మ‌మ్మ‌ల్ని ఆక‌ర్షిస్తోంది.
సాయంత్రం నాలుగ‌వుతోంది.
అప్ప‌టికే లోయ‌లో చీక‌టి క‌మ్ముకుంటోంది.
చ‌లేస్తోంది.
ఆ చ‌లిని లెక్క చేయ‌కుండా నీళ్ళ‌లోకి దూకాం.
ఈదుకుంటూ, ఈదుకుంటూ ప‌డుతున్న జ‌ల‌ధార కింద‌కు ఒక‌రొక‌రుగా చేరుకున్నాం.
ఇరువైపులా ఉన్న కొండ అంచుల ప‌ట్టు దొరికింది.
కాళ్ళ కింద రాళ్ళు త‌గులుతున్నాయి.
నెత్తిన ఆ జ‌ల‌ధార ప‌డుతుండ‌గా ఆలాగే ఉండిపోయాం.
ఎంత సేపైనా అలా ఉండిపోవాల‌నిపించింది.
కానీ, కాలం త‌రుముకొస్తోంది.
చీక‌టి ప‌డ‌క‌ముందే పాప‌నాశ‌నం చేరుకోవాలి.

మ‌ళ్ళీ లేచి న‌డ‌క పాగించాం.
మ‌ళ్ళీ తాళ్ళు ప‌ట్టుకుని కొండ ఎక్కాం.
రాళ్ళ పై నుంచి అలా సాగుతున్నాం..సాగుతున్నాం..
కొంత దూరం వెళ్ళ‌గానే కొండ పైనుంచి ప‌డుతున్న‌ జ‌ల‌పాతం
కొండ‌కున్న‌ఎన్ని అంచుల‌పై నుంచి దూకుతోందో!
కింద నున్న పెద్ద నీటి గుండంలో ప‌డుతోంది.
జ్వ‌ర‌హార‌ తీర్థంలో కూడా దూకాల‌నిపించింది.
కానీ, స‌మ‌యం గ‌డిచిపోతోంది.
వెళ్ళ‌క త‌ప్ప‌దు.
జ్వ‌ర‌హార‌ తీర్థం చూశాక‌, మ‌ళ్ళీ కొంత దూరం వ‌చ్చిన దారినే వెన‌క్కి న‌డిచాం. కొండ ఎక్కుతున్నాం.

ఆ ప‌క్క‌నే వెంక‌టేశ్వ‌ర తీర్థం.
ఇది పేరుకు తీర్థ మే కానీ, నీళ్ళు లేవు.
దాని ముంగిట ఉన్న‌చిన్న గుండంలో నీళ్ళు రంగుతిరిగి ఉన్నాయి.
మాన‌వ అలికిడి లేని ఈ లోయ‌లో నీళ్ళు ఎందుక‌లా ఉన్నాయి!
నీటి ప్ర‌వాహం పెద్ద‌గా లేక‌పోవ‌డం వ‌ల్ల‌, ఇరువైపులా కొండ‌ల‌పై నున్న ఎర్ర‌మ‌ట్టి క‌రిగి ఈ గుండంలో ప‌డి ఉండ‌వ‌చ్చు.
అంత‌కు మించి వేరే అవ‌కాశ‌మే లేదు.
దీంతో ఏడు తీర్థ ద‌ర్శ‌నాలు అయిపోయినాయి.
కొండ ఎక్కుతూ ముందుకు సాగుతున్నాం.
అటు ఒక కొండ‌, ఇటు ఒక కొండ‌, మ‌ధ్య‌లో లోతైన లోయ‌.

మేం న‌డుస్తున్న కొండ అంచునే కుడి వైపునున్న లోయ వైపు న‌డిచాం.
లోతైన లోయలోంచి ఒకే పెద్ద రాయి ఒంటి స్తంబం మేడ‌లాగా మా ఎత్తుకు స‌మాంత‌రంగా పైకి లేచిన‌ట్టుంది.
మేం న‌డిచే కొండ‌కు, ఆ రాయికి మ‌ధ్య రెండు నుంచి మూడు అడుగుల దూరం మాత్రమే ఉంది.
రాయికి, కొండ‌కీ మ‌ధ్య ఉన్న లోతైన లోయ‌.
కింద‌కు చూస్తే క‌ళ్ళు తిరుగు తున్నాయి.
ఈ కొండ నుంచి ఆ రాయి పైకి ఒక్కొక్క‌రూ చాలా జాగ్ర‌త్త‌గా దాటాం.
ఎవ్వ‌రినీ ఎగ‌ర‌వద్ద‌ని చెప్పాం.
ఎగ‌ర‌డంలో పొర‌పాటున లోయ‌లో ప‌డితే ప్ర‌మాదమే.
భ‌య‌మేసింది.
ఆ రాయి న‌లుచ‌ద‌రంగా ఉంది.
లోయ‌లోంచి పైకి ఒంట‌రిగా లేచింది.
ప‌ద‌హారు మందిమి ప‌ట్టాం.
నేను, మ‌ధు, మ‌రొక ఇద్ద‌రు కాళ్ళు లోయ‌లోకి వేలాడ‌దీసి కూర్చున్నాం.
భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తికి కాళ్ళు జివ్వున లాగుతున్నాయి.
అంతా మా వెనుక నిలుచుకున్నారు.
కొండ అవ‌త‌లి నుంచి కెమెరా క్లిక్ మంది.
ఏమిటీ సాహ‌సం!?
అందుకునే దీన్ని డేర్ డెవిల్ ట్రెక్కింగ్ అన్నాం.
మ‌ళ్ళీ ఒక‌రొక‌రుగా వెన‌క్కి.
త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చిన ఒక ట్రెక్క‌ర్ వారిస్తున్నా విన‌లేదు.
రాయిపై నుంచి కొండ పైకి ఒక్క ఉదుట‌న గెంతాడు.
అత‌నికి అల‌వాటేన‌ట‌!
మా గుండెలు గుభేల్ మ‌న్నాయి.
కొండ ఎక్కుతూ ముందుకు సాగుతుంటే ఎదురుగా పాప‌నాశ‌నం డ్యాం.
దాని పప్క నుంచి పైకి వ‌చ్చేస‌రికి సాయంత్రం అయిదైంది.
పాప‌నాశ‌నం డ్యాం వ‌ద్ద ఉద‌యం ఆరుగంట‌ల‌కు మొద‌లైన మా ట్రెక్కింగ్ సాయంత్రం అయిదు గంట‌ల‌కు అదే పాప‌నాశ‌నం డ్యాం వ‌ద్ద ముగిసింది.
అడుగులు భారంగా ప‌డ్డాయి.
ఇక ఏ మాత్రం న‌డిచే ఒపిక లేదు.
తిరుప‌తికి తిరుగు ప్ర‌యాణ మయ్యాం.
తిరుప‌తి లోని అలిపిరి నుంచి తిరుమ‌ల‌కు 18 కిలో మీట‌ర్లు.
అక్క‌డి నుంచి పాప‌నాశ‌నం డ్యాం వ‌ర‌కు దాదాపు ఆరేడు కిలోమీట‌ర్లు ఉంటుంది.
మొత్తం 24 కిలోమీటర్లు పోను, రాను 24 కిలోమీటర్లు.
అడివిలో నడకను లెక్క కట్టలేము.
అట‌వీ శాఖ అనుమ‌తి లేనిదే డ్యాం దాట‌డానికి వీలు లేదు.
ఈ లోయ‌లో ఎంత దూరం న‌డిచామో అంతేలేదు

ఒక నిశ్శబ్దం సాహ‌సం

య‌త్వంత్‌కు పాతిక ముప్ఫై ఏళ్ళుంటాయి.
పెద్ద‌గా మాట్లాడ‌డు.
ఏదైనా అడిగితే త‌ప్ప నోరు విప్ప‌డు.
గుండం క‌నిపిస్తే చాలు బ్యాగ్ కింద పెట్టి నివ‌దానంగా నీళ్ళ‌లోకి న‌డుచుకుంటూ వెళ్ళిపోతాడు.
కొత్త వాళ్ళు చూస్తే ఇతనికి ఏ మైనది అనుకొంటారు.
నీళ్ళ‌లో ఒక అనిర్వ‌చ‌నీయ‌మైన అనుభూతిని పొందుతాడు.
ట్రెక్కింగ్‌లో పైల‌ట్ లా అంద‌రికంటే ముందు వెళ్ళిపోతుంటాడు.
దారి ఎలా ఉందో చెపుతాడు.
ఎటు వైపున వెళితే తేలికో వివ‌రిస్తాడు.
నిటారుగా కొండ‌ ఎక్కాల్సిన చోట‌, స్పైడ‌ర్‌మాన్ లా తాడు లేకుండానే ఎక్కేస్తాడు.
ఒక చెట్టుకు గ‌ట్టిగా తాడు క‌ట్టి కింద‌కు వ‌దులుతాడు.
ఆ తాడు ప‌ట్టుకునే మేమంతా ఎక్క‌గ‌లుగుతాం.
అంతా మాట‌ల మూట‌ల‌తో ఆనందిస్తే, య‌శ్వంత్ మౌనంతో ఆనందిస్తాడు.
ఎక్క‌డా హ‌డావుడి లేదు.
మా ట్రెక్కింగ్ ప్ర‌వాహంలో య‌శ్వంత్ ఒక నిశ్వ‌బ్ద త‌రంగం.

స్వ‌చ్చ‌మైన నీళ్ళు

అన్ని తీర్థాల‌లో ఉన్న నీటిని మ‌ధు టోట‌ల్ డిజాల్వింగ్ సాల్వెంట్ (టీడీఎస్‌)యంత్రంతో ప‌రీక్షించారు.
మా ఇంట్లోంచి తెచ్చుకున్న క్యాన్‌నీటిలో 37 టీడీఎస్ పాయింట్లు ఉన్నాయి.
కొంద‌రు ఇంటి నుంచి తెచ్చుకున్న కొళాయి నీటిలో 72 నుంచి 77 డీటీఎస్ పాయింట్లు ఉన్నాయి.
అక్క‌గార్ల గుండాలు, మ‌ల‌య‌ప్ప తీర్థం, కాయ‌ర‌సాయ‌న తీర్థం, జ్వ‌ర‌హార తీర్థంల‌లో 23 నుంచి 27 టీడీఎస్ పాయింట్లు ఉన్నాయి.
అదే స‌న‌క‌స‌నంద‌న తీర్థంలో కేవ‌లం 10 టీడీఎస్ పాయింట్లు మాత్ర‌మే ఉన్నాయి.
అంటే ఈ తీర్థ‌జ‌లాలు ఎంత స్వ‌చ్ఛ‌మైన‌వో గ‌మ‌నిస్తే ఆశ్చ‌ర్యం వేస్తుంది.
అన్ని తీర్థ జ‌లాల కంటే స‌న‌క‌స‌నంద‌న తీర్థ జ‌లం చాలా చాలా స్వ‌చ్ఛ‌మైన‌వ‌ని గ‌మ‌నించాం.

(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, రచయిత, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *