ఈ ఫోటో ఏమిటి? నాసా పర్సివరెన్స్ తీసిన అంగారక గ్రహ ఉపరితలం ఫోటో… కావచ్చా. కానేకాదు. ఇది తిరపతిసమీపంలో ఉన్న పెద్ద బండ. ఇది బాలరాజు బండలు ప్రాంతం. ఎవరో ప్రాచీన కళాకారుడెపుడో ఇక్కడికొచ్చి అందంగా , వింతగా అమర్చిన పెద్ద బండ రాళ్ల కళాఖండాలలో ఇదొకటి. భూమన్ మొన్నామధ్య ఈ ప్రాంతానికి ట్రెక్ వెళ్లారు. ఆ విశేషాలు ఈ వారం.
(భూమన్)
మొజాయిక్ ఎడ్వంచర్ కమ్యూన్ (Mosaic Adventure Commune) తిరుపతిలో నమ్మదగ్గ ట్రెక్కింగ్ గ్రూపు. దీని వ్యవస్థాపకులు ఏనుగుల రమణ, ట్రిక్కింగ్ బాలు. గత మూడు దశాబ్దాలుగా వీరు తిరగని తవ్వితీయని చోటు ఎందెందు వెతికినా శేషచలపు అడవుల్లో లేదు. ప్రాచీన అవశేషాలను వెలికి తీస్తారు.. గత కాలపు మానవుని ఆనవాలు పసిగడతారు.. ఆటు అటవీ శాఖ వారికి, పురావస్తు శాఖ వారికి, చారిత్రిక పరిశోధకులకు చోదక శక్తులు వీరే.
తిరుపతి చుట్టుపక్కల 20 కిలోమీటర్ల పరిధిలో ఎంపిక చేసిన 20 ప్రదేశాల్లో గత ఐదు సంవత్సరాలుగా సూర్యోదయ ట్రెక్కింగ్ పేరిట క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడి వారు సోషల్ మీడియా పుణ్యమా అని వెతుక్కుని మరి ఈ మార్నింగ్ సన్ రైస్ ట్రెక్కర్స్ తో జతకావడం అత్యంత విశేషము. సీనియర్ ట్రెకర్లను ఆనందపరిచే విషయమూను. ఈ రోజు 156 వ సూర్యోదయ ట్రెక్కింగ్ పూర్తయింది.
ట్రెక్కింగ్ ప్రదేశం కొత్తది. వీరు ముందుగానే రెక్కీ నిర్వహించి వచ్చి తగిన జాగరూకతతో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు గొప్ప క్రమశిక్షణ సంస్కారహితమైన నడతతో ట్రెక్కింగ్‌లు నడవడం చాలా చాలా గొప్ప. Mosaic Adventure Commune తిరుపతిలోని వారికి ఒక మంచి ఆరోగ్యప్రదమైన కార్యక్రమాన్ని రూపొందించి నందుకు గిన్ని స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాంటివి ఎన్నో గుర్తించి ప్రశంసలు కురిపించటం.. భాగస్వాములమైన నాలాంటి వారందరికీ చాలా సంతోషాన్ని ఇస్తున్నది.
బాలరాజు బండలు చంద్రగిరికి వెనుక భాగంలో అత్యంత సుందరమైన ప్రదేశంలో ఉన్నాయి. చుట్టూ కొండలు.. కొండల్లో పెద్ద పెద్ద బండ రాళ్లు… పాకుడు రాళ్లు.
బండరాళ్ల లో చూసిందంతా కళ్ళకు అబ్బురమే. దారులు లేని చోట దారులు చేసుకుంటూ… దాదాపు 50 మందిమి… చాలా ఉత్సాహంగా గడిపొచ్చిన రోజది. ఆ బాలరాజు బండల చివరికి పోతే… పెద్ద జారుడుబండ…. ఆ బండ మీద చూస్తే…. కనుచూపుమేరా పచ్చదనమే. ఆనుకుని సన్నటి నీటిపాయలతో మెరుస్తున్న స్వర్ణముఖి. నిజంగానే స్వర్గాన్ని వెదజల్లినట్టుంది. చిట్టడివి.. రాళ్లు రప్పలు.. కంపలు.. చీక్కంపలు.. మరుగుజ్జు కొండ లాంటి ఎత్తైన రాళ్ళను దాటుకుంటూ పయనించటమే ఒక చక్కటి అనుభూతి.
పైగా స్వర్ణముఖిలో అడుగుపెట్టి … ఆ ఇసుక నీటి తెమ్మర్ల మధ్య నడుచుకుంటూ రావటమే మధురానుభూతి. కూత వేటంత దూరంలో మా ఊరికి …. మా తిరుపతికి ఇంత ప్రఖ్యాతి గాంచిన, అద్భుతమైన ప్రదేశాలు ఉండటం.. వాటిని కనుగొని నలుగురికి తెలియజేస్తున్న Mosaic Adventure Commune న్ని మనసారా అభినందిస్తున్నా.
నేను ఎన్ని మార్లు పదుగురితో పలుమార్లు ట్రెక్కింగ్లకి.్ సాహసోపేతమైన నడకలకి పోయినా ఈ గ్రూపు నాకు ప్రత్యేకమైనది. ఒకరికొకరికి అందరూ తెలిసినట్టుగా… మంచి కలుపుగోలు తనంతో.. నలుగురమనే స్పృహతో నడవటమన్నది. అదే మనం కోరుకోవాల్సింది.
నాలాంటి ఇద్దరూ.. ముగ్గురు తప్ప మిగిలిన వారందరూ యువతీ యువకులే. అందరూ వయసు తేడా లేకుండా కలసిపోవటమున్నదే అదే ట్రెక్కింగ్ లక్షణం.
మా ఈ ట్రెక్కింగ్ సంస్కృతి నలుగురికి పాకాలనీ… మాతోపాటు మరింతమంది పాలు పంచుకోవాలని… మా ఆకాంక్ష నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే 7000 మందికి పైగా ఇందులో సభ్యులుగా ఉండడం… ప్రతి వారం 50 మందికి తక్కువ కాకుండా.. కొన్ని మార్లు వందల్లో పాల్గొనడం.. ఈ గ్రూపు విజయానికి నిదర్శనం.
ఈ పూట బాలరాజు బండల సౌందర్యంలో రాళ్లు.. రప్పలు, చెట్లు.. చేమల రహస్యాలు ఎన్నో విన్నాము… అనుభూతించినాము. నా ఈ రాతల ద్వారా మరింత మంది మాలోకి వస్తారని నమ్ముతూ…
(భూమన్,ప్రకృతి ప్రేమికుడు, రచయిత,తిరుపతి)