జర పైలం
— నిమ్మ రాంరెడ్డి
ఊకే
కొన్ని దారాలే జతకలుస్తూ
వాటికవే ఉరితాడును పేనుకుంటున్నయ్
కొన్ని కీచురాళ్ల సెల్ఫ్ డబ్బా మోతలకు వనంలోని పక్షులన్నీ కూయడం మానేసినయ్
అమాసకో పున్నానికో జిగిలేని నాలుగు బొడుసురాళ్ల తట్ట నెత్తినెత్తుకొని
ముత్యాలని నమ్మిస్తంటే
తామర తల్పాలు ముడుసుకొని
మొగిలోకే జారుకున్నయ్ సూడలేక
గట్టిగా రాకితే ఇచ్చుకపోయే ఇసుక తెన్నులమీద
సాహితమ్మ ఎంతకాలం నిలబడుతుందో
కాలమే శెప్తుంది
కప్పిన గుడ్డపిలకలనే నోట్ల గుక్కి
మూగదాన్ని జేత్తరనే భయం
శెవిలో ఇల్లుగట్టుకున్నది
ఒక్కటంటే ఒక్క
హస్తభూషణానికి జన్మనివ్వని సోకేసులకు
బొట్టువెట్టి బోనమెత్తుతండ్రంటే
సుక్కవెట్టుకునే సూపుడేలును
కటుక్కున నరుకుడుకే
లేకపోతే
వందల వేల సత్కారాల జాతరల మతలబు ధిక్కార పోట్టేళ్లను బలివ్వడము కాక మరేమిటి
చేతికిచ్చిన యాది పలకనడ్డుపెట్టి
కాళ్లకింది మట్టిని కాజేత్తరనే కలత కాల్చేస్తంది
అత్యంత నిరాశ నిస్పృహ నిర్లిప్తతలతో లబోదిబోమనే పానాలు కూడా
మేడిపండు నజరానాలకు సాగిలవడుతుంటే
కాల్చిన వాతల మరకలు
శిగ్గుతో తలదించుకున్నయ్
ఇపుడు
ఎవడెట్ల వొయినా సరే
వానికో వేదిక గావాలె
ఆహ వోహో అని ఆకాశానికెత్తాలె
పళ్ల మధ్య రాయైనా
పటుక్కున కొరకాలె
ఇరగదీత్తండని
అవును
ఆనాడు గుర్రం జాషువాను తొక్కిపట్టింది నిజమే
ఈనాడు గుర్రాలతో పరుగెత్తలేక
దొడ్డిదారిలో ఉరుకుతున్నది నిజమే
భయమో భారమో
బలీయంగా వెంటాడుతున్నట్లుంది
పాలల్లో నీళ్లు కలుపుతనే ఉన్నరు
నిప్పులల్ల నీళ్లువోత్తనే ఉన్నరు
మరీ పలుసగైతే
పారవోసుడే సుమా!
మొత్తం సల్లార్పితే
శిమ్మ శీకటే నానా
జర పైలం