తిరుపతి జ్ఞాపకాలు-54
(రాఘవ శర్మ)
ఒక ఎత్తైన నల్లని రాతి కొండ..
మబ్బులు కమ్మిన ఆకాశాన్ని తాకుతున్నట్టుంది.
నిట్టనిలువుగా ఉన్న కొండకు అడ్డంగా అంచలంచెలు.
అక్కడి నుంచి కిందకు దుముకుతోంది తెల్లని పాలనురుగులా!
వేలాడేసిన వెండి జలతారులా జలపాతం!
కుజ్.. జ్.. జ్… మంటూ రొదచేస్తోంది తన సొదలేవో వినిపిస్తున్నట్టు.
శేషాచలం కొండల్లో విశేషమైందీ బ్రహ్మతీర్థం.
ఆదివారం తెల్లవారుజామున ఓ ఇరవై మందిమి నారాయణతీర్థానికి బయలుదేరాం.
తిరుపతి-రైల్వే కోడూరు మధ్యన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుక్కల దొడ్డిని సమీపిస్తున్నాం.
ఆ చీకట్లో రోడ్డు పక్కనే పెద్ద జింకల గుంపు వెదురు పొదల్లో మేత మేస్తున్నాయి.
కుక్కల దొడ్డి నుంచి శేషాచలం అడవిలోకి సాగాం.
రైల్వేవంతెన కింద బురద నీళ్ళు దాటుకుంటూ మావాహనాలు ముందుకు కదిలాయి.
తెలతెలవారుతుండగా అటవీశాఖ గేటు దాటుకుని లోనికి ప్రవేశించాం.
పచ్చని అడవిలో పక్షుల పలకరింపులు; మాకు స్వాగతం పలికినట్టే ఉన్నాయ్ .
అడుగడుగునా రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తున్న కాలువలు.
అటవీశాఖకు చెందిన సిద్దలేరు బ్యాస్ క్యాంపును దాటుకుని సాగుతున్నాం.
వర్షాలకు మట్టిదారి బాగా కొట్టుకుపోయి, ఎక్కడికక్కడ గండ్లు పడ్డాయి
ఆ కాలువలను దాటుకుంటూ సాగుతుంటే, ఎదురుగా పచ్చని అడవి.
దట్టంగా పెరిగిన వెదురు పొదలు.
అక్కడక్కడా ఏనుగుల విసర్జితాలు పచ్చిగా ఉన్నాయి.
దారికి అడ్డంగా పడిన వెదుర్లు తొలగించాలని మా కోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయ్!
ఇటీవలే సంచరించిన ఏనుగుల ఆనవాళ్ళు స్పష్టంగా గోచరిస్తున్నాయ్.
కంగుమడుగు ఉదృతంగా ప్రవహిస్తోంది.
ముందుకు సాగుతున్నాం.
దారికి ఎడమవైపున మూడేర్ల కురవ రొద చేస్తూ ప్రవహిస్తోంది.
మమ్మల్ని మోసుకొచ్చిన వాహనాలు కదలనంటూ మొండికేశాయి.
ఒక్కొక్క వాహనాన్ని ఇద్దరు ముగ్గురు తోయాల్సి వచ్చింది.
కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు కొట్టుకొచ్చి దారికి అడ్డంగా పడ్డాయి.
వాహనాలు సాగడానికి ఇబ్బంది ఏర్పడింది.
రాళ్ళను తొలగించుకుంటూ ముందుకు సాగాం.
మూడేర్ల కురవ వరకే మాకు వాహన యోగం.
కుక్కల దొడ్డి నుంచి మూడే ర్ల కురవ వరకు ఇరవై కిలోమీటర్ల ప్రయాణం.
నారాయణ తీర్థం నుంచి వచ్చే ఏటిలోనే మా నడక.
మళ్ళీ అడ్డంగా ఎన్ని ఏర్లను దాటామో తెలియదు.
కొంతదూరం సాగే సరికి జలపాతపు హోరు.
అదిగో ఎదురుగా ఎత్తైన కొండ నుంచి జాలువారుతున్న జలపాతం.
గత ఏడాది ఏప్రిల్‌లో నారాయణ తీర్థం వెళ్ళాం!
అప్పుడు కనిపించని బ్రహ్మతీర్థ జలపాతం ఇప్పుడెక్కడ నుంచి వచ్చింది!
నిజమే అది ఎండాకాలం.
ఎండిపోయిన జలపాతం ప్రవహించిన ఆనవాళ్ళు తప్ప, ఆప్పుడా ఎత్తైన కొండ గురించి పెద్దగా పట్టించుకోలేదు.
బ్రహ్మ తీర్థం అన్నారు.
తీర్థం లేని తీర్థం అనిపించింది.
వర్షాలుపడితేనే ఇది దుముకుతుంది.
వేసవిలోనీళ్ళు లేక మూతిముడుచుకుకూర్చుంది.
ఇప్పుడు చూస్తున్నాం బ్రహ్మతీర్థం అసలు రూపాన్ని.
ఎత్తైన ఒకే రాతి కొండ ఎడమ నుంచి కుడి వరకు విస్తరించింది.
ఒకే కొండ పై నుంచి పక్కపక్కనే రెండు జలపాతాలు హోరు మంటున్నాయి !
రెండూ కలిసి కింద ఉన్న పెద్ద నీటి గుండంలో పడుతున్నాయి.
గుండంలోకి జాలువారుతున్న జలపాతం పక్కనే కుడి వైపు నుంచి కొండ ఎక్కుతున్నాం.
అడుగులు జాగ్రత్తగా వేయాలి.
చేతులతో పైకిపాకాలి.
జలపాతం ఎంత ఉదృతంగా ఉంది!
ఎత్తైన కొండ నుంచి ఒక అంచులో ఆగాం.
ఆ జలపాతం మమ్మల్ని చూసి మరింత రొదచేస్తోంది.
దాని ముందే కూర్చుని అల్పాహారం ముగించాం.
ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియదు.
తింటున్నంత సేపూ బ్రహ్మ తీర్థం అందాలనువీక్షించాం.
ఈ తీర్థానికి ఎడమ వైపునుంచి వచ్చే నారాయణ తీర్థం నీటితోకలిసి మూడేళ్ళ కురవలో సంగమిస్తోంది.
బ్రహ్మతీర్థం నుంచి ఎడమ వైపునకు ఏర్లు దాటుతూ బయలు దేరాం.
అది ఐదు కిలోమీటర్ల నడక, ఈత.
గత ఏడాది వచ్చినప్పుడు ఈ ఏర్లు ఇంతగా లేవు.
ఎండిపోయిన ఏటి మధ్యనుంచే సాగాం.
ఇప్పడలా కాదు ఏర్లన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి.
నారాయణ తీర్థం నుంచి వచ్చే ఏరు రెండు ఎర్రటి కొండల నడుమనుంచి బ్రహ్మ తీర్థం మీదుగా మూడేర్ల కురవ వైపు సాగుతోంది.
ఏటికి ఇరువైపులా ఎత్తైన కొండ అంచులు.
మధ్యలో నీటి ప్రవాహం.
వేలాడుతున్న కొండ చిలువలాంటి గిల్లి తీగ.
కొండ మెడలో గజమాల వేద్దామా,ప్రవహిస్తున్న ఏటికి వేద్దామా అన్నట్టు, అటు ఇటు రెండు పెద్దపెద్ద వృక్షాలు తమ భుజాన గిల్లి తీగను మోస్తున్నాయి .
వేసవికి, వర్షాకాలానికి ఎంత తేడా!
గత ఏడాది వేసవిలో ఈ ఏటి మధ్యలోనే గులకరాళ్ళ పైన నడుచుకుంటూ వెళ్ళాం.
రెండు కొండలనడుమ ఒక పక్కగా నక్కి నక్కినట్టు ఏరు ప్రవహించేది.
ఇప్పడు ధైర్యంగా తలెత్తుకుని, ఏటి నంతా అక్రమించుకుని గంభీరంగా సాగుతోంది.
ఈత కొడుతూ ముందుకు సాగాల్సిన నీటి గుండాలు పెరిగాయి.
వాటిలో నీటి ప్రవాహమూ పెరిగింది.
కొండ అంచులో ఒక పక్క సామాన్లు పెట్టేసి ఏటిలో దిగక తప్పలేదు.
ఈదుకుంటూ ఈదుకుంటూ సాగుతున్నాం.
ఆ ఏటిని ఎంత ఈదినా ఇంకా ఎంత ఉంది!
అదిగో దూరంగా జలపాతపు హోరు.
నారాయణతీర్థమే!
గుండం దరి చేరాం.
ఎంత ఉదృతంగా దూకుతోంది!
కొండపై నుంచి రెండు పాయలుగా పడుతున్నాయి.
మధ్యలో రెండూ కలసి ఒకే పాయగా జలపాతం జారుతోంది.
గత ఏడాది వేసవి కంటే ఉదృతంగా దుముకుతోంది.
మధు, తిరుమల రెడ్డి తదితర డేర్ డెవిల్ ట్రక్కర్లు జలపాతం పక్కనుంచి 30 అడుగుల కొండను అతి కష్టం పైన ఎక్కారు
పైన తాడుకట్టి ఒదిలారు.
గత ఏడాది వేసవిలో లాగా చకచకా ఎక్కలేకపోయాం.
వేలాడుతున్న తాడును జలపాతం పక్కకు తోసేస్తోంది.
అంతా పాకుడు.
పట్టు దొరకడం లేదు.
కొందరు మధ్య నుంచి నీటిగుండంలోకి జారిపడ్డారు.
కొద్ది మంది మాత్రమే ఎక్కగలిగారు.
జలపాతం ఎక్కనివ్వడం లేదు.
పైన మహాద్భుతం.
పైన మరోపెద్ద నీటి మడుగు.
ఆ మడుగును మూడువైపులాకొండ తన బాహువుల్లో బంధించింది.
ఆ కొండకున్న సొరంగం నుంచి నీటి ప్రవాహం వచ్చిపడుతోంది.
ఎంత విచిత్రం!
మళ్ళీ వెనుతిరగక తప్పదు.
ఈదుకుంటూ ఈదుకుంటూ వచ్చేశాం.
మధ్యాహ్నం ఒకటిన్నరదాటింది.
పొద్దుటినుంచి ఆకాశాన్ని కమ్మేసిన మేఘాలు వీడిపోయాయి.
ఎండ మొదలైంది.
నారాయణతీర్థం ఏటికి ఇరువైపులా ఎత్తైన రెండు కొండలు.
ఆకొండలు, వాటిపైన మొలిచిన వృక్షాలు మాకుగొడుగును పట్టినట్టున్నాయి.
ఎండ పొడ సోకనివ్వడం లేదు.
భోజనాలు ముగించుకుని వెనుతిరిగాం.
మూడేళ్ళ కురవ వద్దకు వచ్చాం.
మళ్ళీరాళ్ళ పైనుంచి, దారికి అడ్డంగా ప్రవహిస్తున్న కాలవల నుంచి సాగాం.
చీకటి పడక ముందే రైల్వే వంతెన వద్దకు చేరాం.
రోడ్డెక్కగానే మళ్ళీ మళ్ళీ రణగొణ ధ్వనులు, మళ్ళీ కాలుష్యం.
మా మదిలోమాత్రం అడవి సౌందర్యం.
మా ఊపిరి తిత్తులను శుభ్రం చేసుకుని వచ్చాం.
మామనసులను ప్రశాంత పరుచుకుని వచ్చాం.
ఒక నిశ్శబ్ద తరంగం
మా ట్రెక్కింగ్ ఉప్పెనలో అతనొకనిశ్శబ్ద తరంగం.
అడవంటే ఇష్టం..అడవంటే ప్రాణం..
అలివ్‌గ్రీన్ దుస్తుల్లో తెల్లగా, పొట్టిగా ఉంటాడు.
ట్రెక్కింగ్ అంటే అందరికంటే ముందుటాడు.
కెమెరా, స్టాండ్, టెంటు, బుజాన బ్యాగ్.
యుద్ధానికి వెళ్ళే సైనికుడిలానో, ఒక కమేండో లానో అనిపిస్తాడు.
బ్రూస్‌లీ లా సన్నగా ఉంటాడు.
బలంగానూ ఉంటాడు.
మాటల మాంత్రికుడు కాదు.
పలకరిస్తే తప్ప నోరువిప్పడు.
కర్ణుడి సహజ కవచకుండలాల్లా, అతని ముఖంలో ఎప్పుడూ నవ్వుంటుంది.
గుండ్రటి ముఖం, పెద్ద పెద్దపెద్ద కళ్ళు అడవినంతా పరికిస్తూనే ఉంటాయి.
నేను అంతగా గమనించలేదుకాని, చాలాకాలంగా మాతోనే సాగుతున్నాడు.
అతనొక నిశ్శబ్ద తరంగమైనా, హోరెత్తే అలలమధ్ధే ఉంటాడు.
ఆయనే డాక్టర్ ప్రసాద్ పీలేరులో వెటర్నరీ డాక్టర్.
ప్రకృతి ప్రేమికుడు.
ట్రెక్కింగ్ శ్రామికుడు.
జలపాతాల స్వాప్నికుడు.
(తిరుపతి నుంచి నారాయణ తీర్థం వెళ్ళా లాంటే రోడ్డు మార్గ ములో 30 కిలోమీటర్లు అటవీ మార్గంలో 25 కిలోమీట ర్లు మొత్తం 55 కిలోమీట ర్లు ప్రయాణం చేయాలి. నారాయణ తీర్థం వెళ్లే దారిలో వర్షాల వల్ల బ్రహ్మతీర్థం దర్శనమిచ్చింది. యాత్ర రాను పోను మొత్తం 110 కిలోమీట ర్లు.)
(రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)