సలీంద్ర కోన, గూండాల కోన హొయలు గురించి ఎంత చెప్పినా కొంతే. ఎంత చూసినా ఆ తనివి తీరని ప్రకృతి సొగసు అది…
(భూమన్)
మా పిల్లప్పుడు బాగా ఆసక్తిగా చదువుకున్న పుస్తకాలు అంతటి నరసింహం గారివి. చదవటం ఒక పిచ్చిగా అలవాటు చేసిన ఆ పుస్తకాల్లోని కథలు, గాథలు ఇప్పటికీ నాలో ఇంకి ఉండటమే ఆశ్చర్యం. ఆ రచనల్లో చిట్వేలి అడవులు, కోడూరు సొగసులు గూండాల కాల్వ హొయలు, గుంజన జలపాతపు హోరు, దయ్యాలు… వంటి ఎన్నెన్నో భలేగా ఆకర్షించేటివి. ఇన్నాళ్లకు…. ఇన్నాళ్లకు వాటిని చూసి తరించి, అనుభవించి, పలమరించే భాగ్యం కలిగింది.
జలపాతం వీడియో ఇక్కడ చూడండి
కాలిఫోర్నియాలో ఉండగానే మద్రాసు శ్రీరామ్ అక్కడికి పోవాలి సార్… అని ప్రతిపాదన చేసినారు. శేషాచలం అడవుల ఆనుపానాలు బాగా తెలిసినవారు ఆయన. శ్రీరామ్ తల్లి వెంకటాచల మహాత్మ్యం పుస్తకంలోని తీర్థాల గురించి చెప్పి శ్రీరామ్ను పురిగొల్పితే… సాధ్యం కానీ తీర్థాలు ఎన్నింటినో గత పాతికేళ్లుగా తిరిగి వస్తున్నారు. శ్రీరామ్ ఇంటి నుండి తీర్థాలకు బయలుదేరితే ఆ తల్లి అతను తిరిగి వచ్చేంత వరకు భాగవతం చదువుతూ ఉండడం… శ్రీరామ్ ఒక స్పిరిచువల్ ట్రక్కర్. తమిళం, ఇంగ్లీష్ మాత్రమే తెలిసినవాడు. గూగుల్ ద్వారా వీటి స్థావరాలను కనుక్కొని స్థానిక యానాదుల సహకారంతో ఇప్పటికే అన్ని తీర్ధాలు దర్శించుకున్నారు.
అతని నిబద్ధత క్రమశిక్షణకు మెచ్చి కాలిఫోర్నియా నుండి రాగానే ఎంతో ఇష్టమైన ఈ ప్రాంతాల సందర్శన కానిచ్చినాను.
తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాలకు రైల్వే కోడూరు, ఎర్రగుంట కోటల మీదుగా పోవాలి. మామిడి, పరింది, పసుపు, అరటి తోటల మధ్య అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మా యాత్ర కొనసాగింది.
పైగా మా పిల్లప్పుడు ఎంతో భీతిగా విన్న ఊరు ఎర్రగుంట కోట. 60వ దశకంలో ఈ ఊర్లో ఫ్యాక్షన్ భూతానికి ఏడు మంది బలై పోయారు. ఆ సంగతి ఆ ఊరిలో వారికి చెబితే నోళ్ళు వెల్లబెట్టుకుని విన్నారు.
చెన్నై నుండి 40 మంది టేక్కేలు, మేం మరో 40 మంది కలుసుకున్నాం. మూడు ట్రాక్టర్లు, ఒక జీపు, పది మోటారుసైకిళ్ళతో ఉత్సాహభరితంగా సాగింది మా పయనం. అన్ని సదుపాయాలు శ్రీరామ్ ఏర్పాటు చేసినాడు. మమ్మల్ని వేలు పెట్టవద్దని అభ్యర్థించి మరి చేసినాడు. దూరంగా కొండల మీద దోబూచులాడుతున్న మేఘపు దొంతర్లను ఆసక్తిగా ఆస్వాదిస్తూ.. దట్టమైన అడవిలోకి అడుగుపెట్టి వెంగమ్మ బావి దగ్గర ఉండే బ్రిటిష్ వారి కాలం నాటి ఒక సుందరమైన భవంతిని సందర్శించినాము.
ఆ కాలంలో దీని ఖర్చు అక్షరాల 5000 రూపాయలు మాత్రమే. అటవీ దారులు, విశ్రాంతి గదులు, అడవుల సంరక్షణ ఆనాటి వారి వేసిన పునాదులే. పై కోట నుండి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో గూండాల ఏరును మరిన్ని యేర్లు దాటుకుంటూ సలీంద్ర కోన దారి పట్టినాము.
ఏటంబడి పెద్ద పెద్ద రాళ్లు.. చిన్నచిన్న గుంటలు ఎక్కుతూ.. దిగుతూ… మహా అద్భుతాలన్నీ కనులారా గాంచినాము. గుంజన కన్నా ఎత్తైన జలపాతం కనులారా దర్శించుకుని రాను పోను మూడు గంటలు నడిచి… తిరిగి వస్తూ వస్తూ దారిలో ఆ జలపాతం నీరు భూమిలోకి ఇంకి భూగర్భంలో ప్రవహిస్తుండటం చూసి థ్రిల్ అయిపోయినాము.
చుట్టూ కొండల సొగసు చెప్పనలివి కానిది. కంచి పట్టు చీర కట్టుకున్నట్టుగా.. వగలు పోతున్నట్లుగా బహు పసందుగా ఉన్న దృశ్యాలు.. అడుగు ముందుకు వేయనివ్వటం లేదు. కాలు కింద చూద్దామా…. ముత్యాల రాశులు పోసినట్టుగా సన్నటి గులకరాళ్లు. పక్కన నీటి గలగలలు… ఒడ్డున చెట్ల గుసగుసలు… పక్షుల కిలకిల రావాలు…. ఓహో అదొక మధురానుభూతి.
అక్కడనుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండాల కోన చేరుకున్నాము. ఇక్కడ శివుని గుడి ప్రసిద్ధి. లోకులు బాగా ఎరిగిన ప్రదేశం ఇది. ప్రతి ఏడూ శివరాత్రిన వేలాదిమంది వస్తూ ఉంటారు. బస్సు సౌకర్యం అప్పుడు మాత్రమే. ఈ గూండాల కొనకు అన్నమాచార్యుల పెద్ద కుమారుడు పెద్ద తిరుమల ఆచార్యులు వచ్చి ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించారని ఒక శిలాశాసనం అతను వేయించినదేనని అక్కడి పూజారి ఆవులయ్య వివరం చెప్పినాడు.
ఆ ప్రాంతంలో చాలా శాసనాలు ఉండేటవని దిక్కు దివాణం లేక అన్నీ కనుమరుగైపోయాయని వాపోయినాడు. అతని ఆవేదనకు అర్థం ఉంది. పట్టించుకునే వారేరి. చరిత్ర పట్ల మక్కువేది? పోయిన మన ఆనవాళ్లను రక్షించుకునే దిక్కేది? మన చరిత్రను మనమే మన కాళ్లతో తొక్కి పారేయటం మన సంస్కృతిలో భాగమైపోవటం ఎంతటి విచారకరం!??
అక్కడ ఉండే గుహను పట్టించుకున్న నాధుడే లేడు. గుహ ఎంత దూరం పోతుందో.. ఎంతవరకు పోవచ్చో తెలిసినవారు లేరయ్యా అని ఆవులయ్య ఆవులించడం కడుపులో దేవినట్టుగా ఉంది. ఆ గుహ మీదుగా కొండ వారంట 66 కిలోమీటర్లు పోతే అద్భుతమైన జలపాతం ఉంది.
దోసిలి మాదిరిగా.. పగడపు చిప్పలా ఉండే ఆకారం ఒక అద్భుతం. పైభాగం కొంచెం నోరు తెరుచుకుని అక్కడి నుండి ఉరికే ఆ నీటి మధ్యన జలకాలాడటం ఎంతటి భాగ్యమో మాటల్లో చెప్పలేను. ఆ గుండంలో ఉన్నంతసేపు పైకి చూస్తూ ఆ నీళ్లు ఎక్కడినుండి వస్తున్నాయో… సమయం అనుకూలిస్తే ఆ పై భాగానికి పోయి చూడాలని తలంపుతో బయటకు వచ్చినాను
ఒకేరోజు రెండు తీర్థాలను చూడ్డం… అమ్మో.. సామాన్యమైన కాద్సార్ అని మాతో పాటు వచ్చిన పల్లె మిత్రులు అంటుంటే మురిసిపోతూ….
చాన్నాళ్లకు మా కడప భాష సొగసులని తనివి తీరా ఆస్వాదిస్తూ… అందరం రాత్రి భోజనానికి కూర్చున్నాము. చెన్నై నుండి ప్రత్యేకంగా వచ్చిన వంటగాళ్లు చాలా పసందైన వంటకాలతో అందరి అలసటను దూరం చేసినారు. ఆ వెన్నెల రాత్రిలో పలవల రామచంద్రారెడ్డి రాసిన అమరనాదయాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం, శ్రీరామ్ సన్మాన కార్యక్రమంతో మా అద్భుతమైన ట్రెక్కింగ్ పూర్తయింది.
(భూమన్ ప్రముఖ రచయిత,విమర్శకుడు, అంతకు మించి ప్రకృతి ప్రేమికుడు)