(తిరుపతి జ్ఞాపకాలు-52)
(రాఘవ శర్మ)
చుట్టూ ఎర్రటి రాతి కొండ..
ఎదురుగా ఎత్తైన మహావృక్షాలు..
వాటి మధ్యలో ఒక పెద్ద నీటి గుండం..
నిట్టనిలువునా ఉన్న ఆ కొండపై నుంచి, నీటిగుండంలోకి దుముకుతున్న జలపాతం..
పెద్ద పెద్ద నీటి ముత్యాలను పై నుంచి విసిరేస్తోంది..
అవి టపటపామంటూ రాలిపడుతున్నాయి.
డెబ్భై అడుగుల ఎత్తు నుంచి జాలువారి, నీటి గుండంలోపడి ముందుకు సాగిపోతోందీ హలాయుధ తీర్థం.
నెత్తిన జటాజూటాలలో శివుడు గంగను మోసినట్టు, ఈ హలాయుధం కూడా తన నెత్తిన ఆరు జలపాతాలను, నీటి గుండాలను మోస్తోంది.
దాని పాదాలకింద మరో మూడు నీటి గుండాలను మురిపెంగా దాచుకుంది.
పది నీటి గుండాలలో మునిగి తేలి, కపిల తీర్థమై తిరుపతి వాసులను కనువిందు చేస్తోంది.
ఈ ఆదివారం(సెప్టెంబర్4) ఉదయం ముప్ఫై అయిదు మందిమి కలిసి కపిలతీర్థానికి బయలుదేరాం
మధు అధ్వర్యంలో ని మా బృందంలో యువకులతో పాటు,మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.
కపిల తీర్థం వద్ద ఉన్న అటవీ శాఖ కార్యాలయం నుంచి తిరుమల కొండ వైపు నడిచాం.
నేలపైన ఏమాత్రం ఎండపొడ సోకనివ్వని ఎత్తైన వృక్షాలు.
జిగిబిగిగా అల్లుకుపోయిన వెదురు పొదలు.
అంతా దట్టమైన అడవి.
కొండ అంచులకు చేరుకున్నాం.
కొండ ఎక్కుతుంటే చెట్లు తప్ప ఏమీ కనిపించడం లేదు.
ఎదురుగా ఏటవాలుగా కనిపిస్తున్న రాతి కొండ.
కాళ్లూ,చేతులతో కొండకు ఎగబాకుతున్నాం.
వెనక్కి తిరిగి చూస్తే అంతా పచ్చదనం.
కొండ సానువుల్లో ఎంత అడవి!
మహావృక్షాల వరుసకు ఆవల, కనుచూపు మేర వరకు అన్నీ భవనాలే.
దూరంగా భవనాలకు ఆవల కొండల ఆనవాళ్ళు.
పైకి ఎక్కిన కొద్దీ కనిపిస్తున్న తిరుపతి నగరం ఎంత విశాలమైంది!
కొండ కొసకు చేరి, పై నుంచి చూస్తే కింద కపిల తీర్థం.
భూమ్యాకర్షణకు కాళ్ళు జివ్వున లాగుతున్నాయి.
కొండవైపు తిరిగి ముందుకు సాగితే దూరంగా ఎత్తైన జలపాతం.
అది చెట్ల మాటున కనపడీ కనపడనట్టు దోబూచులాడుతోంది.
ఆ జలపాతపు హోరు చెవులకు సోకుతోంది.
దాని దరిచేరిన కొద్దీ, మమ్మల్ని చూసి అది మరీ హోరెత్తుతున్నట్టుంది.
రాళ్ళు ఎక్కుతూ, చెట్లను దాటుకుంటూ, హలాయుధం ముందుకు చేరాం.
నిట్టనిలువునా అది 70 అడుగుల కొండ.
అంత ఎత్తు నుంచి జలపాతం జలజలా జారుతోంది.
నీటి ముత్యాలను గుండంలోకి టపటపామంటూ విసురుతోంది.
ఆ జలపాతాన్ని చూడగానే పిల్లల కేరింతలు, తల్లుల తన్మయత్వం.
ఒకరొకరు నీటిలోకి దిగుతున్నారు.
ఏమాత్రం నదురు లేదు, బెదురు లేదు.
కాళ్ళ కింద నీళ్ళలో గులకరాళ్ళు.
నాలుగైదేళ్ళ పిల్లలు కూడా ఆ నీళ్ళలో నడయాడుతున్నారు.
గుండంలోకి ముందుకు పోయిన కొద్దీ లోతు.
మహిళలు కూడా ట్యూబులు కట్టుకుని గుండంలోకి దూకుతున్నారు.
ఈదుకుంటూ జలపాతం కిందకు చేరుకున్నాం.
కొండ అంచులను పట్టుకుని జలపాతంకింద నిలబడడానికి ప్రయత్నిస్తున్నాం.
ఎక్కడా పట్టు దొరకడం లేదు.
మళ్ళీ గుండంలోకి జారిపోతున్నాం.
జలపాతం పక్కనే కొండ అంచులు పట్టుకుని కొందరు సాహసికులు పదిఅడుగులు ఎక్కారు.
అక్కడ కొండ అంచులో గుహ.
లోపలికి తొంగి చూస్తే ఏమీ లేదు.
అక్కడ ఒక చెట్టుకు తాడుకట్టి కిందకు వదిలారు.
అంతా ఆ తాడుపట్టకునే ఎక్కారు.
నీటి గుండానికి, జలపాతానికి మధ్యలో పదిమందివరకు కూర్చునే కొండ అంచులు.
అక్కడ కూర్చున్నా నెత్తిన నీటి ముత్యాలు రాలుతున్నాయి.
అక్కడి నుంచి పిల్లలు గుండంలోకి దూకుతున్నారు.
పెద్దలూ దూకుతున్నారు.
అందరిలోనూ ఆనందం.
వయసుతో సంబంధం లేదు.
జెండర్తో సంబంధం లేదు.
ఎవరి హోదాలేమిటో ఎవ్వరికీ పట్టదు.
ఎవరి సామాజిక స్థితిగతులేమిటి అక్కడ ఎవరికీ అవసరం లేదు.
అంతా వింతే!
అందరి నోట ఆహా..ఓహో..
అందరి ముఖాల్లో ఆనందం.
అంతా పిల్లలైపోయారు.
అంతా నీటిలో చేపలైపోయారు.
కేరింతలు, తుళ్ళింతలు.
బిడ్డల తల్లులు కూడా పసిబిడ్డలైపోయారు.
ఫొటోలు,వీడియోలు.
హలాయుధ తీర్థం నుంచి లేవబుద్ది కావడం లేదు.
కాలం తెలియడం లేదు.
ఇందరిని ఏకం చేసిన ఈ జలపాతం ఎంత గొప్పది!
ఇంత సమానత్వాన్నిప్రసాదించిన తీర్థ రాజం ఎంత దొడ్డది!
గంటలు గడిచిపోతున్నాయి.
ఆకలి మర్చిపోయాం.
దాహం మర్చిపోయాం.
నిట్టమధ్యాహ్నం అవుతోంది.
గుండంలోంచి లేవబుద్ధి కావడంలేదు.
అయినా లేవక తప్పడం లేదు.
ఒకరొకరు అయిష్టంగా లేస్తున్నారు.
టవల్ తీసుకుని అక్కడి సెలేటిలో పిల్లలు చేపలు పడుతున్నారు.
తిళ్ళు, తీర్థాలు ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాం.
ఆ తీర్థం పక్కనే, కొండ అంచునే శిథిలమైనపురాతన దేవాలయ గోడలు.
ఇటుకలతో నిర్మించారు.
ఇప్పుడున్న ఇటుకల మందంలో సగం కూడా లేవు!
ఆ గోడల పైనుంచి కాస్త కొండ పైకి ఎక్కాం.
ఆశ్చర్యం..అక్కడొక పురాతన శివలింగం!
మళ్ళీ తిరుగు ప్రయాణం.
వచ్చిన దారినే ఏటవాలుగా ఉన్న కొండపైన కూర్చుని జారుడు బండలా జారుతూ దిగుతున్నాం.
హలాయుధ తీర్థ ఆనందాన్ని మనసులో మూటగట్టుకుని దిగుతున్నాం.
ఏ ఒక్కరికీ అలుపూ లేదు, సొలుపూ లేదు.
మళ్ళీ దట్టమైన అడవిలోకి అడుగులు పడుతున్నాయి.
కష్టమైనా ఇష్టమైన ట్రెక్కింగ్.
ఒక సంతుష్టినిచ్చిన సందర్శన.
హలాయుధ తీర్థం.. నీకు మా నమస్కారం.
నీకు ఇదే మా హృదయాంజలి.
(రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, కవి,రచయిత)
.