చెక్ రిపబ్లిక్  లో ద్రవ్యోల్బణం పై లక్షమందితో ప్రదర్శన

 

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

భౌతికంగా ప్రాంతీయ యుద్ధమే. ఫలితాలు అంతర్జాతీయ స్వభావం గలవి. అదే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం.

యుద్ధంలో పాల్గొనని సుదూర దేశాల్లో సైతం ద్రవ్యోల్బణం అధికంగా పెరుగుతోంది. “యుద్ధం వద్దు” డిమాండ్ వాటిలో కూడా బలపడుతోంది. అదో భాగం.

యుద్దానికి మద్దతు తెలిపే దేశాల్లో కూడా యుద్ధ వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇది మరో భాగం.

ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగే తాజా యుద్ధంలో యూరోపియన్ కూటమి ఉక్రెయిన్ కి మద్దతు ఇస్తోంది. రష్యాపై ఆంక్షలు కూడా విధించింది. నాటో కూటమి సైనిక సాయం కూడా చేస్తోంది. పై రెండు కూటాల్లో చెక్ రిపబ్లిక్ సభ్య రాజ్యమే.

యుద్ధ కారణంగా రష్యా నుండి సహజ వాయువు, చమురు, గోధుమల సప్లై యూరోప్ దేశాలకు నిలిచి పోయింది. ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసర సరుకుల ధరలు ఎన్నడూ లేనంతస్థాయికి చేరాయి. ఫలితంగా ఆ యూరోప్ దేశాలోకి యుద్ధ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు నేడు విస్తరిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వాలు యుద్దాన్ని బలపరుస్తుంటే, ప్రజలు దాన్ని వ్యతిరేకించడం ఓ రాజకీయ సాంప్రదాయం గా మారడం విశేషం.

రొటేషన్ ప్రక్రియలో భాగంగా యూరోపియన్ యూనియన్ కూటమికి అధ్యక్షస్థానం ప్రస్తుతానికి చెక్ దేశానిది. ఆ దేశ రాజధాని ప్రాగ్ సిటీలో నిన్న శనివారం లక్షమంది యుద్ధ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేశారు. (ఆ ప్రదర్శనలో 70,000 మందే పాల్గొన్నారనేది ప్రభుత్వ, పోలీసు వర్గాల అంచనా! అది డెబ్భై వేలే ఐనా, అసాధారణమనేది రాజకీయ పరిశీలకులు భావన) తాజా యుద్ధం యూరోప్ ప్రజల్ని రోడ్ల పైకి తెస్తుండడం విశేషం!

కుడి, ఎడమ రాజకీయ వైఖర్లు గల మూడు సంస్థల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ప్రాగ్  సిటీలో నిన్నటి ప్రదర్శన జరిగింది. ఒకవైపు ద్రవ్యోల్బణం, ధరలు, చమురు, గ్యాస్ సరఫరా వంటి ఆర్ధిక డిమాండ్లు నినదించారు. మరోవైపు “యుద్ధం వద్దు” “రష్యాపై ఆంక్షలు వద్దు” “యుద్దాన్ని బలపరిచిన చెక్ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి” తదితర రాజకీయ డిమాండ్లు నినదించడం రాజకీయ విశేషం!

“దేశాల్లో ఆంతరంగికంగా కార్మికవర్గానికీ బూర్జువా వర్గానికీ మధ్య తొలుత వర్గపోరాటాలు తలిత్తితే, దేశాల మధ్య యుద్దాలు వాయిదా పడతాయి. ఒకవేళ దేశాల మధ్య మార్కెట్ల పంపిణీ కోసం యుద్దాలు ముందుగా తలెత్తితే, ఆ దేశాల్లో వర్గ పోరాటాల వ్యాప్తికి దారి తీస్తుంది.” అనే సూత్రం ఒకటుంది. దీన్ని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో “విప్లవాలు యుద్దాలని వాయిదా వేస్తే, యుద్దాలు విప్లవాల్ని త్వరితం చేస్తాయి.” అనే సూత్రంగా ప్రాచుర్యం పొందింది. ఔనుమరి, చాలా ఏళ్ళ తర్వాత నేడు యూరోప్ దేశాల్లో ద్రవ్యోల్బణం ఓ రాజకీయ చలనాన్ని తెప్పిస్తోంది. ఇదో నిజం.

తూర్పు, దక్షిణ దేశాల్లో ద్రవ్యోల్బణం రెండంకెలకి చేరుతుంటే, అమెరికా, పశ్చిమ యూరోప్ దేశాల్లో రెండుశాతం వద్ద వుంటూ వచ్చేది. నాలుగైదు దశాబ్దాల తర్వాత నేడు యూరోప్ దేశాల్లో కూడా మొదటిసారి రెండంకెల వద్దకు చేరుతోంది. బ్రిటన్ లో 10% దాటింది. అధిక ధరల బాధేమిటో నేటి తరం యూరోప్ ప్రజలకు తొలిసారి స్వానుభవంలో తెలుస్తోంది. ఫలితమే ఇటీవల యూరోప్ దేశాల కార్మికవర్గం వరసగా సమ్మెలకు పూనుకోవడం. నిన్నటి ప్రాగ్ భారీ నిరసన ప్రదర్శన ఓ నిదర్శనం.

ప్రతిరోజూ కన్నీళ్లు కార్చడానికి అలవాటు పడిన బాధితులలో తమ నిత్య సమస్యలపై తక్షణ స్పందన తగ్గుతుందనే నానుడి ఉంది. అరుదుగా కార్చేవాళ్లకు తీవ్ర సమస్య ఎదురైతే వెంటనే తీవ్రంగా స్పందిస్తారనే భావం సైతం ఒకటుంది. నిత్యావసర సరుకుల ధరలు (పెట్రోలు డీజిల్, వంట గ్యాస్ సహా) నిత్యం పెరిగి, నిరంతరం కన్నీళ్లు కార్చడానికి అలవాటు పడ్డ భారత్ వంటి దేశాల ప్రజలకు స్పందించేగుణం తగ్గిందా? లేదంటే బాధిత ప్రజల్ని సమీకరించే రాజకీయ, నిర్మాణ సామర్ధ్యం ఇక్కడి ఉద్యమ సంస్థలకు తగ్గిందా? అనేది మరో మాట అనుకోండి. కానీ యూరోప్, అమెరికాల్లో తాజాగా జరిగే కార్మికవర్గ సమ్మెలు, యుద్ధ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు మన దేశాల బాధిత ప్రజలకు కూడా కొత్త ఉద్యమ స్ఫూర్తిని ఇవ్వడం నిజం.

నేడు యూరోప్ దేశాల కార్మికవర్గం చేపట్టే సమ్మె పోరాటాలు, ఆ బాధిత ప్రజలు చేపట్టే నిరసన ఆందోళనలు ముమ్మాటికీ భారత్ వంటి దేశాల ప్రజల పోరాటాలకి కొత్త స్ఫూర్తిని ఇస్తాయనుటలో సందేహం లేదు. ఉద్యమ సంస్థల కర్తవ్య భారాన్ని పెంచితీరుతుందని మనం ఆశించవచ్చునేమో!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *