అమిత్ షా రాజకీయ ‘తమాషాలు’!

-టి. లక్ష్మీనారాయణ

అమిత్ షా గారు కేంద్ర హోం మంత్రి. ప్రధాన మంత్రి మోడీ గారి తర్వాత ఆయన చుట్టే అధికారం కేంద్రీకృతమై ఉన్నది. పనిగట్టుకొని రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి రామోజీరావు గారిని కలిశారు. హైదరాబాదు విమానాశ్రయం వద్ద ఒక హోటల్ కు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించి, కలుసుకొన్నారు. వారిని కలిసినట్లు ఫోటోలతో ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. కలిస్తే తప్పేంటని ఎవరైనా అడగవచ్చు. వ్యక్తుల మధ్య కలయికలకు ప్రజలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు.

కానీ, అమిత్ షా గారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడిగినా ఇంటర్యూ ఇవ్వరని వినికిడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ఇంటర్యూ దొరక్క వెనక్కి వచ్చిన ఉదంతాలు, రాత్రి పొద్దు పోయాక సమయమిస్తే కలుసుకున్న ఘటనలు ప్రసారమాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. అంత “బిజీ”గా ఉండే అమిత్ షా గారు తెలుగు నాట పర్యటనకు వచ్చి ఒక ప్రముఖ పత్రికాధిపతిని, ఒక సినీనటుడ్ని కలవడంలో తప్పనిసరిగా రాజకీయ అజెండా ఉంటుందని ప్రజలు భావించడం సహజమే కదా!

ఈ కలయికల వెనుక రాజకీయ అజెండా ఉన్నదని కాషాయ దళం ఒప్పుకోక పోయినా, కలయికల ఆంతర్యం బహిరంగ రహస్యమే. వివిధ రంగాలలో ప్రముఖులను కలుసుకొని, మచ్చిక చేసుకోవాలన్న ఒక ఎత్తుగడను గత కొంత కాలం నుంచి అమలు చేస్తున్నారు. ఆ ఎత్తుగడలు, వ్యూహాల్లో అంతర్భాగంగా ఈ తరహా కృత్రిమ ఆప్యాయత ఒలకబోస్తూ ప్రముఖులను కలవడం ద్వారా ప్రజలను మాయచేయాలని, భ్రమల్లో, ఊహాగానాల్లోకి నెట్టాలన్న ఆలోచన దాగి ఉన్నది. వాటిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే రాచక్రీడలో కాషాయ దళం ముందుంది. కేంద్ర మంత్రి కాకముందు అమిత్ షా గారు వేమూరి రాధాకృష్ణ గారి ఇంటికెళ్ళి కలిసినట్లు గుర్తు.

విజ్ఞులైన ప్రజలు విసక్షణతో ఒక్క విషయాన్ని ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బిజెపి భాగస్వామే కదా! తల్లిదండ్రులను చంపి, పిల్లాడ్ని అనాధగా వీధిన పడేశారని ఒకనాడు(ప్రధాన మంత్రి కాకముందు) వాపోయిన వ్యక్తి మోడీ గారే కదా! అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించారని పదేపదే పార్లమెంటులోనే వ్యాఖ్యానించింది కూడా ఆ పెద్దమనిషే కదా! కేంద్రంలో ఎనిమిదేళ్ళుగా అధికారాన్ని వెలగబెడుతున్నది బిజెపినే కదా! అలాగే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 అమలును పర్యవేక్షించే బాధ్యత నిర్వహిస్తున్నది అమిత్ షా గారే కదా!

విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా, ప్రత్యేక తరగతి హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేస్తున్నది ఎవ్వరు? చేయాల్సిన పనులు చేయకుండా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రశ్నార్థకంచేస్తూ, ప్రముఖ వ్యక్తులను ప్రత్యేకంగా కలిసి, ఆలింగనాలు చేసుకోవడం వల్ల తెలుగు జాతికి ఒరిగేదేంటి! కేవలం ప్రజల దృష్టిని మళ్ళించి, రాజకీయ లబ్ధి పొందాలనే కుటిల రాజనీతిని ప్రదర్శిస్తున్న ఈ తరహా రాజకీయ నాటకాలను తిలకించండేగానీ, ప్రభావితులు కావద్దని చిన్న విన్నపం. ఆలోచించండి🤔

(టి. లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *