(డాక్టర్ .యస్. జతిన్ కుమార్ )
కొద్ది రోజుల క్రితం భారతీయ పత్రికలలో అంతగా ప్రచురింపబడని ముఖ్యమైన విశేషం ఒకటి జరిగింది. నేటి ప్రపంచంలో పెద్దన్నగా వ్యవహరిస్తూ, అన్నిదేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ తన మాట నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతున్న అగ్ర రాజ్యం అమెరికా. అమెరికా పెత్తందారి విధానాలను నిరోధిస్తూ, ప్రపంచ బడుగు దేశాల వాణిగా, ప్రపంచ శాంతి అభ్యుదయాలకోసం తనదైన సిద్ధాంతాల వెలుగులో ప్రయాణిస్తూ, అనేక దేశాల ఆదరణను చూరగొంటున్న దేశం చైనా.
ఈ ప్రభుత్వాల మధ్య కొన్ని చర్చలు జరిగాయి. గత కొంతకాలంగా ఆ రెండు పెద్ద దేశాల సంబంధాలు క్షీణించాయి. చైనా పై అమెరికా కాలుదువ్వుతూ, రాజకీయం గా ప్రచ్చన్నయుద్ధం, ఆర్ధిక రంగంలో చైనా వ్యతిరేక వాణిజ్య యుద్ధం ప్రకటించి కొనసాగిస్తున్నది. చైనా ఈ దాడిని బలంగా ఎదుర్కొంటూ సోషలిస్టు నిర్మాణపు శక్తి సామర్ధ్యాలను రుజువు చేస్తున్నది. అయితే ప్రపంచ అభివృద్ధిని దెబ్బ తీసే ఈ అశాంతి పూరిత వాతావరణాన్ని చైనా బలంగా వ్యతిరేకిస్తున్నది. శాంతిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నది. చైనా ఈ కృషిని ఒక బలహీనమైన స్థానం నుండి కాక, సర్వ సన్నద్ధత తోనూ, ప్రపంచ ప్రజల ఆశాజ్యోతిగా సంపాదించుకున్న గొప్ప నైతిక బలం తోను, తన న్యాయబద్దమైన సైద్ధాంతిక దృఢత్వంతోనూ కొనసాగిస్తున్నది.
9 జూలై 2022 న, చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి వాంగ్ యి; యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ తో, జి 20 విదేశాంగ మంత్రుల సమావేశం ముగిసిన తరువాత బాలిలో చర్చలు జరిపారు. ఈ చర్చలలో చైనావారి నిర్మొహమాటమైన, దృఢమైన వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నది.
చైనా-అమెరికా సంబంధాలు, పరస్పర ఆసక్తి గల అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇరుపక్షాలు “సమగ్రమైన, లోతైన, నిర్మొహమాటమైన సంభాషణలు” సలిపారు. ఈ సమావేశం గణనీయమైనదీ,నిర్మాణాత్మకమైనదీ అని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇరు పక్షాలు పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి, అపార్థాలు, తప్పుడు అంచనాలను తగ్గించడానికి, భవిష్యత్తులో ఉన్నత స్థాయి పరస్పర చర్యలకు పరిస్థితులను సానుకూలం చేయడా నికి ఈ సమావేశం సహాయ పడుతుందని భావిస్తున్నారు. .
చైనా-అమెరికా సంబంధాలు గత అమెరికా పరిపాలన వల్ల కలిగిన ఇబ్బందుల నుండి ఇంకా బయటపడలేదని, ఇంకా సవాళ్ళు పెరుగుతున్నాయని వాంగ్ యీ పేర్కొన్నారు. ఇరు దేశాల సంబందాలు క్షీణించడంలో వక్రీకరించ బడిన కథనాల పాత్ర వుంది .”రాజకీయ కచ్చితత్వం” పేర తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం వుంది . సరైన దిశ నుండి మరింత తప్పుదారి పట్టించే ప్రమాదం వుంది. ఇది చైనా గురించి యునైటెడ్ స్టేట్స్ యొక్క తప్పుడు అవగాహన వల్ల సంభవించింది, ఇది సరైన మార్గం నుండి వైదొలగిన అమెరికా అనుసరిస్తున్న చైనావైరి విధానానికి దారితీసింది. చైనా పట్ల అమెరికా విధానంలోని స్వీయ వైరుధ్యాలు, ప్రపంచంపై, చైనాపై, చైనా-అమెరికా సంబంధా లపై, ఆసక్తి, పోటీపై దాని అభిప్రాయాలను తీవ్రంగా తప్పుఅంచనా వేయడాన్ని ప్రతిబింబిస్తాయి. యునైటెడ్ స్టేట్స్ చైనాపట్ల భయం, బెరుకు ఒకరకం ద్వేషం ప్రదర్శిస్తుందని చాలా మంది వాదిస్తారు. అటువంటి ముప్పును అరికట్ట కుండా కొనసాగిస్తే, యునైటెడ్ స్టేట్స్ యొక్క చైనా విధానం ఒక మూసుకుపోయే దశకు మాత్రమే దారితీస్తుంది, అది ఏ మార్గాన్ని అందించదు.
చైనా-అమెరికా సంబంధాలను ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు, ఇరు దేశాల అధ్యక్షులు సాధించిన ఉమ్మడి అవగాహనలను చిత్తశుద్ధితో అమలు చేయడమే ప్రాథమిక విధానం అని వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. చైనా-అమెరికా సంబంధాలను అభివృద్ధి చేయడంలో అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రతిపాదించిన మూడు సూత్రాలపై చైనా అన్నివిధాలా కృషి చేసింది, అవి పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, ఇద్దరికీ ప్రయోజనకరమైన సహకారం. [ఇది చైనా ఇతర దేశాలతో వ్యవహరించే సాధారణ పంధా] ఇక అమెరికా కూడా అధ్యక్షుడు బైడెన్ చేసిన ఐదు వాగ్దానాలను నిజంగా నెరవేర్చాలి అని చైనా కోరుకుంటోంది.
“చైనా వ్యవస్థను మార్చడానికి తాము ప్రయత్నించబోమని అమెరికా వాగ్దానం చేసినందున, చైనా ప్రజలు -చైనా లక్షణాలతో కూడిన సోషలిజాన్ని ఎన్నుకోవడాన్ని అమెరికా గౌరవించాలని, చైనా రాజకీయ వ్యవస్థ పై అమెరికా దాని దేశీయ విదేశీ విధానాలను రుద్దడం, దాడి చేయడం మానుకోవాలని వాంగ్ యీ నొక్కి చెప్పారు. చైనాతో కొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరబోమని అమెరికా వాగ్దానం చేసినందున, అది ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్నిముందు విడిచి పెట్టాలి. చైనాకు వ్యతిరేకంగా ప్రత్యేక ముఠాలు కట్టటం మానేయాలి. “తైవాన్ స్వాతంత్ర్యానికి” మద్దతు ఇవ్వబోమని యునైటెడ్ స్టేట్స్ వాగ్దానం చేసినందున, అది ఏక-చైనా విధానాన్ని తారుమారు చేయడం లేదా వక్రీకరించడం మానుకోవాలి, తైవాన్ సమస్యపై “కొద్ది కొద్దిగా ముక్కలు చేసే” ప్రయత్నాలు ఆపివేయాలి. చైనా శాంతియుత పునరేకీకరణను అడ్డుకోవడానికి “తైవాన్ కార్డు” ఆడటం మానుకోవాలి. చైనాతో సంఘర్షణకు తావు లేదని అమెరికా వాగ్దానం చేసినందున, అది చైనా సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి, చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్నిఆపాలి. మానవ హక్కులు లేదా ప్రజాస్వామ్యం సాకుతో చైనా యొక్క చట్టబద్ధమైన ప్రయోజనాలను బలహీనపరచడం మానుకోవాలి. అమెరికా చైనాపై విధించిన అదనపు సుంకాలను వీలైనంత త్వరగా తొలగించాలి, చైనా వ్యాపారాలపై ఏకపక్షంగా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. “
“చైనా-యుఎస్ సంబంధాల మార్గంలో ప్రమాదాలను నివారించడానికి భద్రతాచర్యలు తీసుకోవటానికి యుఎస్ ఇచ్చిన పిలుపును వాంగ్ యీ గమనించాడు. రెండు పక్షాలు మూడు ఉమ్మడి ప్రకటనల్లో చేసిన వాగ్దానాలను చిత్తశుద్ధితో నెరవేర్చి, సరైన దిశకు కట్టుబడి, వెంటనే అడ్డంకులను తొలగించి, ముందుకు సాగే మార్గాన్ని సజావుగా, నిరాటంకం గా మార్చితే, ద్వైపాక్షిక సంబంధాలు, దారి తప్పకుండా, నియంత్రణలో సాఫీగా నడుస్తాయి . లేకపోతే, ఎన్ని రక్షణ కంచెలు నిలబెట్టినా వృధా. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, ఘర్షణను నివారించ డం, ఇరుపక్షాలకి గెలుపు నిచ్చే సహకారం వంటి స్ఫూర్తితో మార్గదర్శకాలను రూపొందించడం గురించి ఇరు పక్షాలు చర్చించాలి. ఇద్దరు అధ్యక్షుల ఉమ్మడి అవగాహనలను అమలు చేయడానికి, వివిధ రంగాలలో వివిధ అధికారుల మధ్య మెరుగైన సమన్వయం సాధించడానికి తగిన మార్గాలను తెరిచి వుంచడం చాలా ముఖ్యం. ఉద్రిక్తతలను, విభేదాలను సరిగ్గా నిర్వహించడం, సమస్యలను పరిష్కరించడానికి అవగాహనతో పనిచేయడం అవసరం. అందుకు తోడ్పడేలా చైనా అమెరికా ముందు నాలుగు జాబితాలను ఉంచింది, 1. అమెరికా ఆపాల్సిన తప్పుల జాబితా,2 అమెరికా పరిష్కరించాల్సిన కీలక వ్యక్తిగత కేసుల జాబితా3. చైనాకు అధిక ఆందోళన కలిగిస్తున్న అమెరికా 117 కాంగ్రెస్ లోచేసిన చట్టాల జాబితా 4.ఎనిమిది రంగాలలో సహకార ప్రతిపాదనల జాబితా. వీటిని అమెరికా గట్టిగా పరిగణిస్తుందని చైనా భావిస్తోంది.
తైవాన్ సమస్యపై చైనా యొక్క దృఢమైన వైఖరి గురించి వాంగ్ యీ ఒక సమగ్ర అవలోకనాన్ని ఇచ్చారు. అమెరికా తన మాటలతో, చేతలతో జాగ్రత్తగా ఉండాలని, “తైవాన్ స్వాతంత్ర్య” శక్తులకు తప్పుడు సంకేతాలు పంపరాదని, తమ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే చైనా ప్రజల దృఢ సంకల్పాన్ని తక్కువ అంచనా వేయరాదని, తైవాన్ జలసంధిలో శాంతికి విఘాతం కలిగించే ప్రాథమిక తప్పిదాలు చేయరాదని ఆయన నొక్కి చెప్పారు. జిన్జియాంగ్, హాంకాంగ్, సముద్ర సంబంధిత అంశాలపై అమెరికా తప్పుడు అభిప్రాయాలను వాంగ్ ఈ ఖండించారు.
కార్యదర్శి బ్లింకెన్ చైనా పట్ల యునైటెడ్ స్టేట్స్ విధానాన్ని వివరించారు. “యునైటెడ్ స్టేట్స్ చైనాతో ఒక కొత్త ప్రచ్ఛన్న యుద్ధంలో పాల్గొనడానికి, చైనా వ్యవస్థను మార్చడానికి, చైనా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ యొక్క స్థితిని సవాలు చేయడానికి లేదా చైనాను నిరోధించడానికి ప్రయత్నించదు, తైవాన్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇవ్వదు, తైవాన్ జల సంధి ప్రాంతంలో యధాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించదు. ద్వైపాక్షిక సంబంధాలలో ప్రమాదాలను నివారించ డానికి యునైటెడ్ స్టేట్స్ కట్టుబడి ఉంది. చైనాతో సహకారానికి సిద్ధంగా ఉంది.” అని ఆయన అన్నారు.
చైనా-యుఎస్ సంయుక్త కార్యవర్గ సంప్రదింపుల ఫలితాల కోసం పనిచేయడానికి ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. వారి దౌత్య మరి కౌన్సీలర్ సిబ్బంది తమ విధులను నిర్వర్తించడానికి, ప్రజల మధ్య సంబంధాల పై సాంస్కృతిక విషయాలపై మార్పిడి మరి సంప్రదింపులను తిరిగి ప్రారంభించడానికి తగిన మెరుగైన పరిస్థితులను పునరుద్ధరించడానికి అంగీకరించాయి. వాతావరణ మార్పులు, ప్రజారోగ్య రంగాలలో సహకారాన్ని పెంపొందించు కోవడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో, చైనా-యునైటెడ్ స్టేట్స్ మధ్య సానుకూల పరస్పర చర్యల కోసం కూడా ఈ సమావేశం కొన్ని ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఉక్రెయిన్, కొరియా ద్వీపకల్పం, ఇతర సమస్యలపై ఇరు పక్షాలు అభిప్రాయాల మార్పిడి చేసుకున్నారు.
భారతదేశం కూడా చైనాతో అనేక వివాదాలలో మునిగి వుంది. అనేక దఫాలుగా చైనా మనదేశంతో చర్చలు చేసింది. మొన్న జూలై 17 న కూడా మిలిటరీ అధికారుల స్థాయి చర్చలు ఎల్ ఎ సి దగ్గిర జరిగాయి. ఇందులో ప్రగతి కనిపించినట్లు లేదు. చైనా ప్రతిపాదన లు ఏమిటో, వారి విదేశ నీతికి ప్రాతిపదిక ఏమిటో మన పత్రికలు స్పష్టంగా రాయవు సరికదా వారు మొండివారని, మన శత్రువులని, సమస్యలు పరిష్కరించటంలో ఆసక్తిలేనివారని, యుద్ధ ప్రేమికులని ప్రచారం చేస్తుంటారు. అమెరికాతో జరిగిన సంభాషణలో చైనా నాయకత్వం ఆలోచన లో న్యాయ బద్దత, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే వైఖరి, అదే సమయంలో తమ సార్వభౌమాధికారం, దేశ సమగ్రత, భద్రతల పట్ల గల రాజీలేని నిబద్దత, నిక్కచ్చితనం వ్యక్తమవుతాయి. భారత పాలకులు కూడా ఇలా సూత్ర బద్ధమైన వైఖరి తో చర్చించి చైనాతో వివాదాలు పరిష్కరించుకోవాలని ఆశిద్దాం.
(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయలన్నీ రచయిత సొంతం)
[డాక్టర్.యస్. జతిన్ కుమార్, భారత చైనా మిత్రమండలి తెలంగాణ రాష్ట్ర శాఖ సహాయ కార్యదర్శి ]