*రూపాయే కాక యెన్, యూరో సైతం డాలర్ చే బలహీనపడే ప్రక్రియ!
*ఇరవై ఏళ్ళకి డాలర్ వద్దకి చేరిన యూరో!
*డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే రూబుల్, యువాన్ కూటమికి కూడా ఎదురు దెబ్బే!
– ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
డాలర్ తో రూపాయి మారకపు విలువ నేడు క్రమంగా పడిపోతోంది. మూడు వారాల క్రితం ₹78 కి పడింది. రెండు వారాల క్రితం ₹79 కి తగ్గింది. నిన్న ₹79.60 కి తగ్గింది. ఇది రాసే టైమ్ (14-7-2022 సాయంత్రం నాలుగు గంటలు) కి ₹79.84 కి క్షీణించింది. రేపో మాపో అది ₹80కి తగ్గినా ఆశ్చర్యం లేదు.
అంతర్జాతీయ మార్కెట్లో సరుకుల కొనుగోళ్లకై ఒక్క డాలర్ కి మొన్న ₹78; నిన్న ₹79; రేపు ₹80 చెల్లించాల్సిన దుస్థితి ఇండియాకు ఏర్పడింది. అది భారత్ కే పరిమితం కాదు. సామ్రాజ్యవాద దేశాలకు కూడా తప్పడం లేదు. యూరోపియన్ యూనియన్ (EU) కి చెందిన *యూరో* కు కూడా సెగ తగిలింది. మూడో ఆర్ధిక వ్యవస్థగా పేరొందిన జపాన్ యెన్ కి కూడా షాక్ తగిలింది. యూరో గూర్చి వద్దాం.
ఇరవై ఏళ్ళ తర్వాత డాలర్ విలువతో యూరో విలువతగ్గి డాలర్ కి సమ స్థాయికి చేరింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పట్ల పరిశీలక వర్గాల్ని దిగ్భ్రాంతికి గురి చేసే ఓ కీలక పరిణామం ఈనెల 12న చోటుచేసుకుంది. అదే డాలర్ తో యూరో సమానం కావడం! ఐతే అప్పటికింకా ఆవగింజంత డాలర్ కంటే యూరో పైనే ఉంది. నిన్న 13న డాలరే పై చెయ్యికి చేరింది.
జర్మనీ, ఫ్రాన్స్ ల చొరవ, కృషి ఫలితంగా 1999లో ఏర్పడిందే యూరో కరెన్సీ! బయటకు ఏం చెప్పినా, అంతర్గతంగా అమెరికాకి ఓ సవాల్ గా ఏర్పడిందే. అది డాలర్ విలువతో ఇంచుమించు దగ్గరగా ప్రారంభమైనది. 2002డిసెంబర్ లో డాలర్ కంటే బాగా వెనకబడింది. అదే తర్వాత క్రమంగా పుంజుకుంది. ఉక్రెయిన్ రష్యా తాజా యుద్ధం తర్వాత చమురు, సహజ వాయువుల కొరతతో యూరోప్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితి ఏర్పడింది. దాని ఫలితమే యూరో క్షీణత.
ఏడాది క్రితపు డాలర్ తో పోల్చితే యూరో విలువ 15 శాతం తగ్గింది. ఈ జనవరితో పోల్చితే 11 శాతం తగ్గింది.
మరో మాట చెప్పాలి. ఈ కాలంలోనే అమెరికన్ డాలర్ విలువ అమెరికా మార్కెట్లో గణనీయంగా తగ్గింది. అమెరికాలో ద్రవ్యోల్బణం 28 ఏళ్ళ తర్వాత రికార్డ్ స్థాయికి అధిక స్థాయికి చేరింది. అమెరికన్ మార్కెట్లో సరుకులతో పోల్చితే, అమెరికన్ కరెన్సీ (డాలర్) విలువ తగ్గింది. స్వంత మార్కెట్లో స్వంత దేశ ప్రజల ఎదుట డాలర్ దిగజారుతోంది. దానిని తట్టుకోలేక అది వడ్డీరేట్లు తగ్గిస్తోంది. చెలామణి నుండి డాలర్ ని కట్టడి చేసి సరుకుల కొనుగోళ్ల పై ఆంక్షల్ని విధిస్తోంది. అదే డాలర్ ప్రపంచ మార్కెట్లో ఆధిపత్య కరెన్సీగా నేటికీ చెలామణి అవుతోంది. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకి మింగుడుపడని వైరుద్యాల్లో ఇదొకటి.
తన దేశ సరిహద్దుల్లో డాలర్ బలహీనపడుతూ, సరిహద్దులకి అవతల ప్రపంచ మార్కెట్ వ్యవస్థ లో బలపడుతోండడం ప్రపంచ ఆర్థిక రాజకీయ రంగాల్లో కొత్త కుదుపులకి దారితీయక తప్పదు.
డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ, దానిని బలహీనపరిచే లక్ష్యంతో నేడు రూబుల్-యువాన్ కూటమి ప్రయత్నిస్తోన్నది. ఐనా తన ఆధిపత్యాన్ని డాలర్ కాపాడుకుంటోంది. తనకు పోటీగా ఏర్పడ్డ యూరోని సైతం డాలర్ వెనక్కినెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది దీర్ఘకాలిక పరిణామం కాకపోవచ్చు. ఐనా నేటి ప్రపంచ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తుంది.
పై లెక్కల్ని బట్టి రేపటి గమనాన్ని ఆలోచిద్దాం.
ఒక అమెరికన్ పౌరుడు లేదా పౌరురాలు విద్య, పర్యాటక పనులపై ఏడాది క్రితం యూరోప్ వెళ్లి, వెయ్యు డాలర్లతో ఫారెక్స్ బాంక్ లో 1150 యూరోలను పొందవచ్చు. అదేవ్యక్తి ఆరునెలల క్రితం వెయ్యు డాలర్లతో 1110 యూరోలు పొందవచ్చు.
ఇక రివర్స్ లో చూద్దాం. ఏడాది క్రితం అమెరికా వెళ్లే యూరోప్ దేశాల పర్యాటకులు తమ వద్ద గల వెయ్యు యూరోల్ని ఫారెక్స్ బాంక్ లో 1150 డాలర్లుగా మార్చగలరు. ఈ జనవరిలో వెళ్తే 1110 డాలర్లు పొందగలరు. ఈరోజు వెళ్లే యూరోప్ పర్యాటకులు వెయ్యు యూరోలకు వెయ్యు డాలర్లే (లేదా అంతకంటే తక్కువే) పొందుతారు.
పై పరిస్థితి అమెరికన్లకి లాభిస్తుంది. యూరోప్ దేశాల ప్రయాణీకులకు నష్టం చేకూరుస్తుంది. ఇది అమెరికన్లని యూరోప్ కి ప్రోత్సాహిస్తుంది. అదే సమయంలో అమెరికాకి యూరోప్ పర్యాటకుల్ని నిరుత్సాహ పరుస్తుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో ఏర్పడే ఆర్ధిక సంక్షోభాలు పరస్పర వైరుధ్యాలతో కూడినవి. పైపైన చూస్తే అమెరికాకి లాభిస్తుంది. కానీ అది పాక్షిక సత్యమే. అమెరికా నుండి డబ్బు యూరోప్ దేశాలకు ప్రవహిస్తుంది. యూరోప్ దేశాల నుండి అమెరికాకి ధనప్రవాహం తగ్గుతుంది. నేడు విలువ పెరిగే డాలర్ రాజ్యానికి రేపటి రాబడి తగ్గుతుంది. నేడు విలువ తగ్గే యూరోప్ రాజ్యాలకు రేపు రాబడి పెరగవచ్చు. మున్ముందు పరిస్థితిని తలక్రిందులు చేయిచ్చు. పెట్టుబడిదారీ ఆర్ధిక సంక్షోభ వలయంలో ఈ తరహా వైరుధ్యాలెన్నో!
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం యూరోప్ కి కొత్త కష్టాల్ని తెస్తోంది. రష్యా నుండి సహజ వాయువు, చమురు సరఫరాలు నిలిచిపోవడం లేదా తగ్గిపోవడం ఒక కారణం. (వారం క్రితం రిపేర్ పేరిట రష్యా నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని ఆపిన తర్వాత యూరోప్ స్థితి మరింత దిగజారింది) ఓవైపు రష్యా-చైనా కూటమికి వ్యతిరేకంగా యూరోప్ దేశాల్ని తన కూటమిలోకి అమెరికా నయాన్నో భయాన్నో ఏకం చేసింది. యూరోకి స్నేహ హస్తం చాచి డాలర్ చేరదీసిన మాట నిజమే. అదే డాలర్ చేతిలో నేడు యూరో భంగపడుతోంది.
మరోవైపున రష్యా పరిస్థితి కూడా అలాగే ఉంది. యుద్ధంతో దాని కరెన్సీ రూబుల్ విలువ దిగజారుతోంది. డాలర్ తో రూబుల్ విలువ జులై 6న బాగా క్షీణించింది. నేడు రష్యాలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. యుద్ధ సన్నాహాలు ప్రారంభం కాకముందు 2021 అక్టోబర్ లో 7శాతం ఉండేది. అది జనవరిలో ఇంచుమించు 9% కి పెరిగింది. ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైన తర్వాత ఏప్రిల్, మే ల్లో 17% దాటింది. యుద్ధం అందరికీ నష్టమే. ఐనా యుద్ధం చేస్తారు. అది సామ్రాజ్యవాద రాజకీయ ధర్మం. అది మరో మాట!
క్రమంగా నేడు శ్రీలంక, పాకిస్థాన్, మియన్మార్, నేపాల్, మాల్దీవుల వంటి ఇరుగు పొరుగు దేశాలకి ఆర్ధిక లేదా రాజకీయ సంక్షోభం వ్యాపిస్తోంది. భారతదేశం ముంగిట్లోనూ పొంచి చూస్తోంది. తుదకు సంపన్న సామ్రాజ్యవాద కరెన్సీలైన యూరో, యెన్ వంటివి సైతం డాలర్ ఎదుట దిగజరిపోయే దుస్థితిలో రేపటి భారత్ దుస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.ఇవి మనకి సంబంధం లేనివి కాదు.
మన రూపాయి విలువ దిగజారితే నష్టపోయేది ప్రధానంగా నిరుపేద, పేద మధ్యతరగతి ప్రజలే. అందులో కూడా శ్రామిక ప్రజలే సర్వం కోల్పోతారు. అందుకే ఈ పరిణామం పై ముందస్తు అవగాహనతో అప్రమత్తతని ప్రదర్శిద్దాం.
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
*ఫ్లాష్ …
*ఈ రైటప్ ఎడిటింగ్ పూర్తిచేసి, ఎందుకైనా మంచిదని ఫారెక్స్ మార్కెట్ ని చెక్ చేశా. ఈరోజు 5pmకి డాలర్ తో రూపాయి విలువ ₹79.98 కి క్షీణించింది. ఇంకెప్పుడో అనుకునే ₹80 పతనం అప్పుడే జరిగింది. అదో ఆర్ధిక సంక్షోభ సూచిక. రెపో ఎల్లుండో వెసులుబాటు చూసుకొని దానిపై కూడా ప్రతిస్పందిస్తా.*