(భూమన్*)
శాన్ ఫ్రాన్సిస్కోలో బాగా చెప్పుకోదగ్గ విశేషమైనది Mount Diablo ట్రెక్. ఇది ఉత్తర కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాలో ఉంది దాదాపు 3899 అడుగుల ఎత్తున ఉన్న ఈ శిఖరం చేరుకోవాలని మా అబ్బాయి రాహుల్ ను కోరితే సరేనని బయలు దేరాము. దాదాపు 21 కిలోమీటర్ల ఘాట్ మన తిరుమల ఘాట్ మలుపులను గుర్తుకు తెచ్చాయి.
కారులో వెళ్తుంటే దారి పొడవునా కొన్ని పదుల సంఖ్యలో సైకిల్ మీద వచ్చే వారిని చూసి నోరెళ్ళ పెట్టవలసి వచ్చింది. ఛాలెంజ్‌గా తీసుకుని అలా వస్తుంటారు. అంతేగాక అక్టోబర్‌లో సైకిల్ పోటీలప్పుడు కొన్ని వందల మంది పాల్గొంటారని. 44 నిమిషాల్లో సైకిల్ తొక్కి పైకి చేరుకున్న వారు ఉన్నారంటే ఆశ్చర్యపోయాను. పైకి వెళ్లే కొద్దీ అద్భుతమైన కొండల వరుస దృశ్యాలు… ఎటు చూసినా కొండల వరుసలే కనిపిస్తాయి. పైకెక్కి చూస్తే చుట్టుపక్కల అంతా అద్భుతమైన ప్రకృతి ఆరబోతలే కనువిందు చేశాయి. కొండ ఎటు చూసినా పిరమిడ్ ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ శిఖరం చేరుకోవటానికి కారులో సైకిల్ పైన నడిచి కూడా రావచ్చు. నేను తొలిసారి ఇక్కడికి కారులో వెళ్లాను. నడకన దాదాపు 13.5 కిలోమీటర్లు వచ్చాను.
మంచి వాతావరణంలో శిఖరం పైభాగం నుంచి చూస్తే 100 మైళ్ళ దూరం వరకు కనిపిస్తుందని చెబుతారు. ఈ వ్యూ షెడ్ ప్రపంచంలోనే పెద్దదని Mount Kilimanjaro తరువాతదని అంటారు.
Mount diablo లో ఒకప్పుడు నివసిస్తున్న స్థానిక అమెరికన్లకు ఇది అత్యంత పవిత్రమైంది. ఇది జీవుని పుట్టుకకు ఆధారమని Miwok , Ohlone తెగలవారు నమ్మేవారట. కొండలను పవిత్రంగా పూజించటం.. అవి దేవుళ్ళని నమ్మే ఆచారం మనలో కూడా ఉంది. నేను తిరిగిన తిరుమల కొండలు, యోగుల పర్వతం, నగరి వనిక్కు, మల్లయ్య కొండ, సింగిరి కోన, మూలకోన ఇలాంటిదే. శిఖరాన ఉన్న టవర్‌ను స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ వారు 1928లో నిర్మించారు 10 మిలియన్ క్యాండిల్స్ పవర్‌తో beacon ఏర్పాటు చేసి దాన్ని Eye of Diablo అని పిలుస్తున్నారు. పక్కనే ఉన్న టీవీ ట్రాన్స్మిటర్ను KOVR వారు 1954లో ఏర్పాటు చేశారట.
1964 నుండి ప్రతి సంవత్సరం పెరల్ హార్బర్ యుద్ధ వారసుల కుటుంబాలు చరిత్రత్మాకమైన Beacon వెలిగించి సంబరాలు జరుపుకుంటారు. ఇంకా వెన్నెల వెలుగుల సంబరాలు.. ఎటు శిఖరం నడకలు, సైకిళ్ల పోటీలు ఉంటాయి. ఈ ట్రాక్ మామూలుగా కాకుండా ఎంతో చరిత్రత్మాకమైనదిగా భావిస్తున్నారు. 20,000 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం దాదాపు 800 Trail తో కళకళలాడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో పిక్నిక్ కేంద్రాలు ఉన్నాయి. వారి వారి శరీర దారుఢ్యాన్ని అనుసరించి ఏదో ఒక కొస నుంచి Treks చేస్తుంటారు.
నేను దిగేటప్పుడు ఒంటరినే అయినా ఏ చింత.. భయము లేదు. ఆ కొండల ఎగుడు.. దిగుడులు, దూరంగా కొంచెం పచ్చదనం మరికొంత బోధమయం. అక్కడక్కడ pine చెట్లు, Oak చెట్లు చూస్తూ పక్షుల కిళకిళరావాల మధ్యన దిగటానికి దాదాపు మూడున్నర గంటలు సమయం పట్టింది.
అడవిలో Lions, Bears ఉంటాయన్నారు గానీ నాకు Cayoto, Turky, Owl, Squirrel మాత్రం కనిపించాయి.
నడుస్తూ వచ్చి సౌత్ గేట్ నుంచి బయటకు వచ్చాను. ఈ ట్రెక్ అన్నింటికన్నా కొంచెం కష్టం గాను… అసలు సిసలైన ట్రెక్ అనిపించింది. ఏదేమైనా మన నడకదారుల్లో చేసే తాత్వికచింతన, పరిసరాల పరిశీలన… ప్రకృతి తీరుతునులు మనకు మరింత శక్తిని… కొత్త రక్తాన్ని ఇస్తాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
నేను గమనిస్తున్నంతవరకు మా ఊర్లో గాని ఇక్కడ కానీ ట్రెక్కింగ్ స్పృహ బాగా పెరిగింది. మరీ కరోనాకాలంలో ఇది మరింత అవసరమని జనం నమ్ముతున్నట్లుగా అనిపిస్తుంది.
ఈ రాతలు మరింత మందిని ప్రకృతిలో భాగం చేయగలవని…. వారి ఆరోగ్య స్థితిని మెరుగుపరచి సామాజిక యోధులుగా చేయగలరని నమ్మిక.
(*భూమన్, రచయిత, ప్రకృతి ప్రేమికుడు. ఇపుడు అమెరికా పర్యటనలో ఉన్నారు)