అవును. నిజమే మీరు చదివింది. సెంచరీ కొట్టాలన్న కసితో ఉన్నారు రేవంత్ రెడ్డి. గతంలో సెంచరీకి చేరువగా వచ్చినా.. కొద్దిలో మిస్ అయ్యారు. కానీ ఈసారి లెక్క తప్పకుండా సత్తా చాటేందుకు రేవంత్ రెడీ అవుతున్నారు. రేవంత్ సెంచరీ స్టోరీ ఏంటో తెలియాలంటే చదవండి ఫుల్ స్టోరీ.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన ఏకాగ్రత మొత్తం కొడంగల్ మీదే కేంద్రీకరింమచారు. కొడంగల్ లో తరచుగా పర్యటిస్తున్నారు. ఇక తెలంగాణలో సర్పంచ్ ల ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో అన్ని పార్టీలు సర్పంచ్ సీట్లు గెలిచేందుకు కసరత్తు ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా తన నియోజకవర్గం కొడంగల్ లో వంద సర్పంచ్ స్థానాలకు తక్కువ కాకుండా గెలిచేందుకు స్కెచ్ రెడీ చేశారు.
అందుకోసమే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణల పేరుతో పర్యటిస్తున్నారు. ప్రతి పర్యటనలో ఆయన టిడిపి, టిఆర్ఎస్ తోపాటు ఇతర పార్టీల నేతలను సైతం కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటున్నారు. జెండా ఆవిష్కరణలు.. కండువాలు
కప్పుడే పనిగా పెట్టుకున్నారు రేవంత్. ఎలాగైనా తన నియోజకవర్గంలో వంద సర్పంచ్ లు గెలిచి ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి, అటు అధికార టిఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 118 సర్సంచ్ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గంలో కొడంగల్, బొంరాస్ పేట్, కోస్గి, మద్దూరు, దౌలతాబాద్ మండలాలు ఉన్నాయి. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 83 సర్పంచ్ స్థానాలు రేవంత్ రెడ్డి కైవసం చేసుకున్నారు. అప్పుడు ఆయన టిడిపిలో ఉన్నారు. అప్పుడు ప్రతిపక్షంలోనే.. ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నప్పటికీ ఈసారి కచ్చితంగా 100 స్థానాలు గెలుచుకోవాలని కసరత్తు చేస్తున్నారు.
మరి అప్పుడంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. కేంద్రీకరణ అంతగా లేదు. పైగా రాష్ట్ర విభజన సమయం కూడా. దీంతో ఎవరిని ఎవరూ పెద్దగా టార్గెట్ చేయలేదు. కానీ ఆ ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నికలు కచ్చితంగా తేడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్న రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు.. పైగా రేవంత్ ను చాన్స్ దొరికితే నలిచిపారేయాలన్న కసితో పాలకవర్గం ఉన్నది. ఈ పరిస్థితుల్లో గతంలో వచ్చిన 83 స్థానాలు నిలబెట్టుకోవడమే రేవంత్ కు కష్టమైపోతున్న తరుణంలో వంద స్థానాలు ఎలా గెలుస్తారన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది.