తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి వరంగల్ నగరంలో కులసంఘం షాక్ ఇచ్చింది. రెడ్డి కులాని కి చెందిన యువకులే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అని చూడకుండా నాయని మీదికి వాటర్ బాటిళ్లు వేదిక మీదికి విసిరారు.ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో జరిగింది. అక్కడ తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాకతీయ రెడ్ల శంఖారావం ఏర్పాటుచేశారు. వివిధ జిల్లాల నుంచి రెడ్డి యువకులు ఐక్య నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. నాయిని ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
రెడ్లకు రిజర్వేషన్లు కల్పించే డిమాండ్ మీద ఆయన మాట్లాడటం మొదలు పెట్టగానే వివాదం చెలరేగింది.
రెడ్డి ఐక్య వేదిక డిమాండ్లమీద ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో ఉన్న యువకులకు అసంతృప్తి కలిగించాయి. రెడ్ల డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించడం నా చేతిలోనే కాదు ఎవరి చేతిలో లేదని హోంమంత్రి అన్నారు. ఇందులో రిజర్వేషన్ల కల్పిండం ప్రధానమయిన డిమాండ్. రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగ వ్యవహారమని, వాటిని మార్చడం ఎవరి తరం కాదని నాయిని పేర్కొన్నారు. దీంతో సభలో ఉన్న యూత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయినికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే మీరు గోల చేసినంత మాత్రాన జరిగేదేమీ లేదని నాయిని మాట్లాడారు. కొందరు యువకులు సభ వేదిక మీదకు వాటర్ బాటిళ్లు విసిరి ఆందోళన చేశారు. అయితే సభ నిర్వాహకులు సంయమనం పాటించాలని పదే పదే విన్నవించడంతో యూత్ శాంతించలేదు. చివరకు పోలీసులు వేదిక మీదకు మంత్రి మీద బాటిళ్లు పడకుండా అడ్డంగా నిలబడ్డారు. ముఖ్య అతిథిగా పిలిచి సభలో హోంమంత్రి నాయిని ని అవమానించడం సరికాదని సీనియర్లు సర్ది చెప్పారు. సభలో పలుసార్లు గొడవలు జరగాయి. కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రెడ్ల సమస్యలను పార్టీ సమస్యలను మ్యానిఫెస్టోలో చేరుస్తామని అనగానే, మంత్రి వ్యంగ్యంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదెప్పుడు, మ్యానిఫెస్టోలో పెట్టేదెప్పుడు, సమస్యలు పరిష్కరించేదెపుడు అనగానే అక్కడున్న ప్రజాప్రతినిధులు గోల చేస్తూ అభ్యంతరం చెప్పారు.
తర్వాత, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని కోరుతూ రాష్ట్రం తీర్మానం చేసిన పంపినా కేంద్రం పట్టించుకోలేదని నాయిని అనడంతో బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నాయకుడు ఎడ్ల అశోక్ రెడ్డి, పద్మారెడ్డి మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గొడవ చేయడం మొదలుపెట్టారు. ఇతర పెద్దలను వాళ్లను అతి కష్టం మీద శాంతింప చేశారు.