ఎంతైనా అవసరం
ఓ నలుగురిని సంపాదించుకోవడం ఎంతైనా అవసరం! అది మనిషైనా నిట్రాడుపాకైనా ఒక్కటే! దేని అవసరం ఎప్పుడొస్తుందో ఎవరికితెలుసు? పచ్చని చెట్లమధ్య మొలిచిన పాకను కొబ్బరి కుదుళ్ళు బెసకనియ్యనట్లే ఇరుగు పొరుగుతో వియ్యమున్నవారు కష్టాలొస్తే బెదరనియ్యరు!
మనసు మడతల్లో ఉన్న అనేక సత్యాలు
మరుగుపడకుండా ఉంచుకున్నప్పుడే
పచ్చని నవ్వులు విచ్చుకుంటాయి!
ఇంకిపోయిన బావులు ఆకస్మికంగా
జలసిరిని సంతరించుకున్నప్పుడు
ఆనందానికి అవధులుండవు కదా!
పురోగమనమే జీవితం అయినచోట
విజయకేతనం రెపరెపలాడుతుంది!
ఆచరణపటిమ పదునెక్కినప్పుడు
అభివ్యక్తి తీవ్రత పరిఢవిల్లుతుంది!
ఓ నాలుగు మాటలు
గుర్తుపెట్టుకోవడం ఎంతైనా అవసరం!
అప్పుడే జీవితం రసరమ్యమౌతుంది!
కొత్త ఊహాలు కుబుసం విడుస్తుంది!!
డా.గూటం స్వామి
(9441092870)