(EAS శర్మ)
తెలుగు రాష్ట్రాలలో నేషనల్ హైవేస్ అథారిటీ లిమిటెడ్ (NHAI) వారు, జాతీయ రహదారుల కోసం రైతులవద్దనుంచి బలవంతంగా వేలాది ఎకరాల భూములను సేకరిస్తున్నారు. కాని వారు NHAI చట్టం లో 3వ సెక్షన్ మాత్రమే వర్తిస్తుంది అనే నెపంతో, రైతులకు సరిఅయిన నష్టపరిహారం ఇవ్వకుండా, వారి భూములను తీసుకోవడం వలన,రైతులు వారి భూములను, ఉపాధులను పోగొట్టుకుంటున్నారు.
2013 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టం ప్రకారం, NHAI నష్టపరిహారాన్ని ఇస్తే, రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ చట్టం పట్టాదారులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ చట్టంలో 10వ సెక్షన్ క్రింద వ్యవసాయ భూములకు ప్రాముఖ్యత ఇవ్వడం వలన ఆహార భద్రత దృష్ట్యా విలువ ఉంటుంది. అదే కాకుండా, రైతులకు భూసేకరణ చేసే సంస్థ ఉదారంగా నష్టపరిహారం ఇవ్వాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ, 2017 లో విపులంగా NHAI సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా, ఆ నిర్దేశాలలో 5.6 పారా క్రింద, NHAI వారు పట్టాదారులకు 2013 భూసేకరణ చట్టం క్రింద ఉదారంగా నష్టపరిహారం ఇవ్వాలని స్పష్టంగా తెలియ పరచడమైనది.
అయినా ఆ నిర్దేశాలకు విరుద్ధంగా NHAI వారు, NHAI చట్టం క్రిందనే రైతులకు తక్కువ నష్టపరిహారం ఇవ్వడం, రాష్ట్రప్రభుత్వ అధికారులు వ్యతిరేకత చూపకుండా, రైతులకు నష్టం కలుగుతున్నా, ఉదాసీనతతో వ్యవహరించడం జరుగుతున్నది.
నేను ఈ విషయాన్ని 5-3-2022, 4-5-2022 తేదీలలో, రెండు తెలుగు రాష్ట్రాల దృష్టికి తీసుకువచ్చినా, అధికారుల దృక్పధం మారలేదు.
ఒక NHAI భూసేకరణ కేసులో సుప్రీం కోర్టు వారు 2013 చట్టం క్రిందనే పట్టాదారులకు నష్టపరి హారాన్ని ఉదారంగా ఇవ్వవలసినదని NHAI సంస్థను ఆదేశించారు
ఈ విషయాన్ని కూడా నేను రెండు రాష్ట్రాల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు .
ఇంకొక కేసులో, రాజస్థాన్ ప్రభుత్వం రైతుల పక్షం లో వాదించి, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ సహకారంతో, NHAI ద్వారా రైతులకు ఉదారంగా నష్టపరిహారాన్ని ఇప్పించారు. అటువంటి చొరవ తెలుగు రాష్ట్ర అధికారులు తీసుకుపోవడం బాధాకరంగా ఉంది .
రైతులకు నష్టపరిహారం ఇచ్చే సంస్థ NHAI వారు. ఇందువలన రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. లాభం కలిగేది రాష్ట్రంలో రైతులకు. అయినా, తెలుగు రాష్ట్రాల అధికారులు NHAI వారి పక్షంలోనే వాదిస్తూ, రైతులకు నష్టం కలిగించడం
అర్ధంలేని ప్రవర్తన.
ఈ విషయంలో పట్టాదారులలో పూర్తి అవగాహన ఇంకా రాలేదు . కొంతమంది మాత్రమే 2013 చట్టం క్రింద నష్టపరిహారాన్ని ఇవ్వాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. వారికి ఇంతవరకు న్యాయం జరగలేదు. పట్టాదారులలో, ఈ విషయం మీద అవగాహన తెచ్చి, అందరి దగ్గర నుంచి 2013 చట్టం క్రింద నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందని దరఖాస్తులను సే కరించి, వారికి ఉదారంగా నష్టపరిహారాన్ని ఇప్పించే బాధ్యత రెండు రాష్ట్రాల అధికారుల మీద ఉంది.
ఈ విషయాలను అధికారులు మీ దృష్టికి తీసుకు రాలేదని అనుకుంటున్నాను. మీరు తత్క్షణం జోక్యం చేసుకుని, NHAI సంస్థ ద్వారా పట్టాదారులకు న్యాయం కలిగిస్తారని ఆశిస్తున్నాను. ఇందువలన న్యాయం జరిగేది రెండు రాష్ట్రాల్లో రైతులకు, అని గుర్తించాలి.
(పూర్వ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ,EAS శర్మ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖ)