ఒంటిమిట్టలోని శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణానికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది.
శుక్రవారం రాత్రి 8 నుండి 10 గంటల వరకు హస్తా నక్షత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరుగనుంది.
కల్యాణవేదిక వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్యాలరీలు ఏర్పాటుచేశారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు.
భక్తులందరూ కోదండరాముని కల్యాణం వీక్షించేలా 40 హెచ్‌డి డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సంప్రదాయబద్ధంగా కల్యాణవేదికను సిద్ధం చేసి వాహనాల పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేశారు. ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు, 80 దేవతామూర్తుల కటౌట్లు, శోభాయమానంగా పుష్పాలంకరణలు చేశారు.
భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం వేదికకు ఇరువైపులా కలిపి సుమారు 350 కౌంటర్లు ఏర్పాటుచేశారు. 2.20 లక్షల ప్యాకెట్ల అక్షింతలు తయారుచేశారు. 3 లక్షల ప్యాకెట్ల మజ్జిగ, 3 లక్షల ప్యాకెట్ల తాగునీరు పంపిణీ చేశారు. 1700 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. భక్తుల సౌకర్యార్థం వైద్యశిబిరాలు, 400 మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. 600 మంది పారిశుద్ధ్య సిబ్బందితో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. రేడియో, బ్రాడ్‌కాస్టింగ్ విభాగం ద్వారా భక్తులకు సమాచారం, సూచనలు అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
వైఎస్సార్ జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని పోలీసులు, టిటిడి విజిలెన్స్ సిబ్బంది కలిపి 2 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.