యాపిల్ ధరలతో నిమ్మకాయ పోటీ, ఎందుకో తెలుసా?

మార్కెట్లో ఇపుడు యాపిల్ పళ్ల ధరలు, నిమ్మకాయ ధరలు సమానమయ్యాయి. ఎక్కడి యాపిల్, ఎక్కడి సన్నిమ్మకాయ? అవును ఇపుడు ఇండియా మొత్తం నిమ్మకాయలు యాపిల్ పళ్లలాగా  చాలా ధర పెట్టిప్రజలు కొనాల్సి వస్తున్నది.చాలా మంది ఈ సీజన్ నిమ్మకాయ కొనలేని పరిస్థితి ఏర్పడింది.

కిలో నిమ్మకాయ ధరల నుంచి రు. 190 నుంచి 350 దాకా ఉన్నాయి.  ఒక్కొక్క నిమ్మకాయ  రు.10 నుంచి  రు. 13  దాకా, పండగ సమయంలో 15 దాకా పలుకుతూ ఉంది. ఇంత ధర  ఎపుడూ లేదు. నిమ్మకాయ ఇపుడుకొనబోతే కొరివి అయింది.

ఇపుడు వేసవి కావడంతో నిమ్మకాయలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దేశంలో నిమ్మకాయలు బాగా పండించే రాష్ట్రాలలో అంధ్రప్రదేశ్ రెండోది. మొదటి రాష్ట్రం గుజరాత్. ఆంధ్రప్రదేశ్ లో 41.858 హెక్టేర్ల విస్తీర్ణంలో నిమ్మ తోటలు ఉన్నాయి. ఆంధ్ర నిమ్మకాయల కోసం దేశమంతా ఎదురుచూస్తు ఉంది.  ఆంధ్రనిమ్మకాయలలో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువయినందున వాటి గుజరాత్ నిమ్మకాయలకంటే ఎక్కువ డిమాండ్ అని చెబుతారు.  అయితే, ఈ సీజన్ లో ఆంధ్రలో  పంట లేదు. దిగుబడి పడిపోయింది.దీనితో  ఆంధ్ర నిమ్మకాయలు మార్కెట్లో తగ్గిపోయాయి. ధర బాగా పెరిగిందేకు  ప్రధాన కారణం అదే.  భారతదేశంలో 37.17  లక్షల టన్నుల నిమ్మ పంట పండుతుంది. ఇది దేశీయావసరాలకే వాడతారు. దేశం నుంచి నిమ్మ ఎగుమతులు గాని, దిగుమతులు గాని లేవు.

ఆంధ్రప్రదేశ్ లోని  పాత నెల్లూరు జిల్లా నిమ్మకాయలకు పంటకు ప్రసిద్ధి. ఇక్కడ సుమారు 18,797హెక్టేర్ల విస్తీర్ణంలో నిమ్మకాయలు పండిస్తారు.    ఇలాంటి చోట మార్చి  30న ఉన్న     రు.10 వేల క్వింటాల్ ధర, ఏప్రిల్ 5 నాటికి రు.18,000 వేలకు చేరిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది.  మొదట శ్రీరామనవమి, ఇపుడు రంజాన్ పండగలు ధరలు విపరీతంగా పెరిగేందుకు ఒక కారణమయ్యాయి. దీనికితోడు డీజిల్ ధర విపరీతంగా పెరిగింది.  డిజీల్ ధరలు పెరగడంతో రవాణ ఖర్చు పెరిగి కలకత్తా, ఢిల్లీ వంటి నగరాలలో నిమ్మకాయ ధరలు ఆకాశాన్నంటాయి.  ఢిల్లీ సమీపంలోని ఘాజియాబాద్ లో కనివిని ఎరుగని రీతిలో  కిలో నిమ్మకాయల ధర రు. 350 దాటింది. అన్నింటికి మించి నిమ్మ పంట వైఫల్యం ధరలు పెరిగేందుకు కారణమయింది.

ఎందుకిలా జరిగింది?

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఈ ఏడాది నిమ్మపంట బాగా పడిపోయింది.మొదట 2018-19లో కరువు వచ్చింది. అపుడు పంట ఎండిపోయింది. కొత్త గా మొక్కలు నాటేందుకు కోవిడ్ పాండెమిక్ అడ్డొచ్చింది. అంటే రెండేళ్ల పాటు కొత్త మొక్కలు నాటేందుకు వీలుకాలేదు.  తర్వాత 2021లో విపరీతమయిన వర్షాలు వచ్చాయి. గత డిసెంబర్ నుంచి జనవరి దాకా విపరీతంగా వర్షాలు కురియడమే. దీనితో నిమ్మ పూతకాలం ఆగిపోయింది. సాధారణంగా  నిమ్మరైతులు  సెప్టెంబర్ నెలలో బహార్ ట్రీట్ మెంట్ పద్ధతిలో నిమ్మచెట్లు పూతకొచ్చేలా చేస్తుంటారు. నిమ్మపూత  కాయగా మారాలంటే మూడు నాలుగు నెలలు పడుతుంది అయితే గత ఏడాది వర్షాకాలం జనవరి దాకా కొనసాగింది. దీనితో బహార్ ట్రీట్ మెంట్ కు వీల్లేకుండా పోయింది. మితిమీరిన వర్షాల వల్ల చెట్లు పూతకు రాలేకపోవడమే కాదు, చచ్చిపోయాయి కూడా. దీనితో పంటదిగుబడి అంతకుముందటి పంటలో కేవలం 20 శాతమే ఉందని నెల్లూరు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు చెప్పినట్లు డౌన్ టు ఎర్త్ రాసింది.

నిమ్మతోటకు సంవత్సరానికి మూడు బహార్ ట్రీట్ మెంట్స్ ఇస్తారు. ఈ ట్రీట్ మెంటు తర్వాత చెట్లు పూతకు వస్తాయి.  మొదటి బహార్ ట్రీట్ మెంట్ ఇస్తే జనవరి –ఫిబ్రవరి నెలల్లో  చెట్లు పూతకొస్తాయి.  ఏప్రిల్ లో కాయలు కాస్తాయి. రెండో బహార్ వల్ల జూన్ ,జూలైలో పూతకాలం వస్తుంది.  అక్టోబర్ లోకాయలు కాస్తాయి. మూడో బహార్ వల్ల సెప్టెంబర్ ,అక్టోబర్ లో చెట్లు పూతకొస్తాయి. మార్చిలో పంటచేతికొస్తుంది. ఇపుడు నిమ్మపంట దిగుబడి పడిపోయేందుకు కారణం, రెండు బహార్ ట్రీట్ మెంట్స్ ఫెయిల్ అవడమే. దీనికి కారణం, సెప్టెంబర్, నుంచి జనవరి దాకా విపరీతంగా వర్షాలు కురియడమే. విపరీతంగా చిత్తడి ఉండటంతో బహార్ ట్రీట్ మెంటుకు వీలు లేకుండా పోయింది. దీనితో చెట్లు పూతకురానేలేదు. ఇంక పంట ఎలా వస్తుంది. నిమ్మకాయల డిమాండ్ వుండే వేసవిలో పంట అందుబాటులో లేకుండా పోయింది. కాయల కొరత ఏర్పడింది. దీనికి పండగలు, డీజిల్ పెరగడం తోడయి,నిమ్మకాయలు మార్కెట్ యాపిల్ ధర పలికే పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *