‘డాక్టర్ వైఎస్సార్ తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్’ సేవలలో భాగంగా అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్ కండిషన్డ్ వాహనాలను ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించారు.
సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే….
“500 కొత్త ఎయిర్ కండిషన్డ్ వాహనాలను రాష్ట్రం నలుమూలలకూ ఈ రోజు పంపుతున్నాం. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని మొట్టమొదట నుంచి ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, ఆ చెల్లెమ్మలు గర్భం దాల్చిన వెంటనే వారికి అండగా ఉంటూ.. రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే గర్భవతి అయన చెల్లెమ్మ 108 కి ఫోన్ చేసిన వెంటనే వాహనం అక్కడికి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లడమే కాకుండా నాణ్యమైన సేవలు ఆస్పత్రిలో అందించి, డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు కూడా వారి చేతిలో పెడుతున్నాం. ఇంటికి వెళ్లేటప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి, వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, సిజేరియన్ అయితే రూ.3వేలు, సహజ ప్రసవం అయితే రూ.5వేలు ఆరోగ్యఆసరా కింద విశ్రాంతి సమయంలో కూడా తోడుగా ఉండేందుకు ఈ మొత్తాన్ని చెల్లెమ్మ చేతిలో పెట్టి.. ఆమెను ఈ తల్లీబిడ్డ ఎయిర్ కండిషన్డు వాహనంలోనే ఇంటివరకు పంపించి, వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.”