విజయవాడ : అమరావతి రాజధాని తరలింపు, వికేంద్రీ కరణ చెల్లవని ఇచ్చిన హైకోర్టు తీర్పు పై
అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకి వెళ్ల వచ్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ తులసిరెడ్డి సలహా ఇచ్చారు. హై కోర్ట్ తీర్పు మీద జగన్ చేస్తున్నవన్ని వక్ర భాష్యాలని అంటూ ధైర్యం ఉంటే హై కోర్ట్ తీర్పుని సవాల్ చేయాలని ఆయన ముఖ్యమంత్రి కి సలహా ఇచ్చారు.
నిన్నఅసెంబ్లీలో అమరావతి హైకోర్టు తీర్పు మీద సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చ కు సమాధానము ఇస్తూ హైకోర్టు తీర్పు చట్ట సభల పరిధిలో జోక్యం చేసుకోవడమేనని, కోర్టు తన పరిధి దాటడమేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యా నించారు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాల్ని ప్రభుత్వాలకు ఇవ్వరాదన్న సుప్రీం తీర్పు ను ఇది ఉల్లంఘించడమే అని కూడా ఉన్నారు. చివర, దేమైనా మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని జగన్ తేల్చిచెప్పారు. దీనిమీద కాంగ్రెస్ నేత తులసిరెడ్డి స్పందించారు.
“సుప్రీంకోర్టు కు వెళ్లేందుకు ఉన్న అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోరు? ఇదే ప్రభుత్వం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై హైకోర్టులో చుక్కెదురైతే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భాలున్నాయి కదా, అంత ధైర్యం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లేచ్చుగా?” అని తులసి రెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ చేయాలనుకుంటున్నది పరిపాలన వికేంద్రీకరణ కాదని, పరిపాలనతో విధ్వంసం చేయడమేనని తులసిరెడ్డి ఆరోపించారు. అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలంటే పాలన వికేంద్రీకరణే చేయాలా? అని ఆయన ప్రశ్నించారు.
దేశంలోని మిగతా రాష్ట్రాల్లో అలాగే చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే తగిన ప్రణాళికలు అమలుచేసి అన్ని ప్రాంతాలనూ ప్రగతిబాటలో నడిపించే వారని అన్నారు. అధికార వికేంద్రీకరణ అంటే స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించాలని, ఇలాంటి ముఖ్యమైన అంశాలను పక్కన పెట్టి పరిపాలన, శాసన, న్యాయ రాజధానులను వేర్వేరుచోట్ల పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు.