లాహోర్ లో భగత్ సింగ్ కి నివాళి

 

*భగతసింగ్, రాజగురు, సుఖదేవ్ ల్ని ఉరితీసిన స్థలం (లాహోర్) లో ఉరి తీసిన సమయంలో కొవ్వొత్తుల ప్రదర్శన!

 

*సామ్రాజ్యవాద వ్యతిరేక సమర పథం సరిహద్దుల్ని చేరిపివేయ గలదు. అమరత్వానికి ప్రభుత్వాలు హద్దుల్ని గీయలేవు. లాహోర్ లో భగతసింగ్, రాజగురు, సుఖదేవ్ ల స్మారక ప్రదర్శన ఓ నిదర్శనం!

*లాహోర్ కేంద్రంగా భగతసింగ్ స్మారక కేంద్రం ఒకటుంది. అదే BHAGAT SING MEMORIAL FOUNDATION! దాని క్లుప్త నామం BMF! భగతసింగ్, రాజగురు, సుఖదేవ్ ల్ని ఉరితీసిన చౌరస్తాలో ఉరితీసిన సమయంలో 91 ఏళ్ల తర్వాత నిన్న BMF కొవ్వొత్తులతో ప్రదర్శన చేసింది. పాకిస్థాన్ స్వాతంత్ర్య యోధులు, విద్యార్థి ఉద్యమ నేతలు పాల్గొన్నారు

*1961 నాటి నగర విస్తరణలో జైలుకూల్చి ఆ స్థలం గుండా రోడ్డు వేశారు. ఉరికంభ స్థలం SHADMAN CHOWK అయ్యుంది. దానికే భగతసింగ్ చౌక్ పేరు పెట్టాలని పాకిస్థాన్ పౌర బృందాలు డిమాండ్ చేస్తూనే వున్నాయి. నిన్నటి ప్రదర్శనలోనూ ఆ డిమాండ్ చేశారు.

*2012 లోనే పంజాబ్ అసెంబ్లీలో భగత్ సింగ్ చౌక్ గా మార్పుకై చర్చ జరిగింది. (ఇండియన్ పంజాబ్ అసెంబ్లీ కాదు, పాకిస్థాన్ పంజాబ్) అది పాక్ పౌర బృందాల డిమాండ్ కి మరింత బలం చేకూర్చింది.

*శాండర్స్ హత్య కేసు FIR లో భగతసింగ్ పేరు లేదు. నిర్దోషిగా తేల్చే ఆధారాలు వున్నాయి. బ్రిటీష్ సామ్రాజ్యవాద కుట్రని బట్టబయలు చేసే అవకాశం ఉంది. కేసు పునర్విచారణని కోరే ప్రాతిపదిక ఉంది. ఇదే స్పూర్తితో పాకిస్థాన్ సుప్రీం కోర్టు ప్రముఖ లాయర్ అబ్దుల్ రషీద్ ఖురేషి 2018 ఫిబ్రవరి లో లాహోర్ హైకోర్టులో కేసు దాఖలు చేసాడు. ఆ సెప్టెంబర్ లోనే నగర మేయర్ కి హైకోర్టు ఓ సూచనలో ఆ చౌక్ ని భగతసింగ్ చౌక్ గా మార్పుపై అభిప్రాయం కోరింది. అది నేటికీ కార్యరూపం ధరించ లేదు. అదే డిమాండ్ పై ప్రదర్శన చేసింది

*వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ కలెక్టీవ్ (PROGRESSIVE STUDENTS COLLECTIVE-PSC) గా ఏర్పడ్డాయి. పాక్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘ ఎన్నికల పై నిషేదం ఎత్తివేతకై PSC ఉద్యమిస్తోంది. గత ఏడాది నవంబర్ 26నాటి భారీ ప్రదర్శన PSC ప్రతిష్టని పెంచింది. నిన్న PSC నాయకత్వం పాల్గొనడం ప్రదర్శనకు నిండుదనం వచ్చింది.

*లాహోర్ ప్రదర్శకులు హుస్సేనీవాలా అమర క్షేత్ర సందర్శన కోసం డిమాండ్ చేసారు. భారత సర్కార్ తో పాక్ సర్కార్ చర్చించాలని వారు కోరుతున్నారు. భగతసింగ్, రాజగురు, సుఖదేవ్ లు భారత ఉపఖండపు హీరోలనీ, వారి స్మారక స్థూపాల సందర్శన ఉపఖండ ప్రజల హక్కు అనేది వారి భావన! దానికో నేపథ్యం ఉంది.

*ఉరితీసాక బ్రిటీష్ పోలీసులు ఆ ముగ్గురు వీరుల మృత దేహాల్ని హుస్సేనీవాలా వద్ద సట్లెజ్ నదిలో వేసారు. దేశవిభజనలో ఆ ఊరు పాకిస్థాన్ లో చేరింది. (అక్కడ సట్లెజ్ నది రెండు దేశాల మధ్య సరిహద్దు) పద్నాలుగు ఏళ్ళు పాక్ లో వున్నా, ఆ యోధులకి స్మారక కేంద్రాన్ని నిర్మించలేదు. హుస్సేనీవాలా గ్రామం 1961లో ఇండియాలో చేరాకే స్మారక కేంద్ర నిర్మాణం జరిగింది. అదో నేపధ్య చరిత్ర!

*హుస్సేనీవాలాని ఇండియాలో చేర్చాలనీ, సందుకై పాక్ సర్కార్ తో నెహ్రూ సర్కార్ చర్చలు జరపాలనీ, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సీపీఐ పంజాబ్ (ఇండియన్ పంజాబ్) రాష్ట్ర కమిటీ కోరింది. సీపీఐ అనుబంధ AISF విద్యార్థి సంఘం పెద్ద ఆందోళన చేపట్టింది. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర విద్యార్థి లోకాన్ని అశేష సంఖ్యలో రోడ్ల పైకి తెచ్చింది. ఆ రాష్ట్ర సర్కార్ నెహ్రూ సర్కార్ పై వత్తిడి తెచ్చింది. అది పాక్ కి ప్రతినిధివర్గాన్ని పంపింది. సుదీర్ఘ చర్చల తర్వాత అవగాహన కుదిరింది. సట్లెజ్ ఆవలి హుస్సేనీవాలా గ్రామం భారత్ లో విలీనానికీ, 12 గ్రామాల్ని పాకిస్థాన్ కి ఇచ్చుటకూ ఒప్పందం కుదిరింది. ఎట్టకేలకు హుస్సేనీవాలా గ్రామం 1961 లో భారత్ లో చేరింది. హుస్సేనీవాలా స్థూపాల్ని సందర్శించే అవకాశం తమకి కూడా ఉండాలనే పాకిస్థాన్ స్వాతంత్ర్య యోధుల కోర్కెని నెహ్రూ సర్కార్ అనుమతించింది. ఐతే యుద్ధ కాలాల్లో అట్టి అవకాశం చేజారింది.

*(సుమారు పాతికేళ్ల క్రితం ఇఫ్టూ జాతీయ కమిటీ సమావేశం జలంధర్ లో జరిగిన సందర్భంగా AP నుండి హాజరైన DV కృష్ణారెడ్డి, బిక్షమయ్య గార్లు, నేను పంజాబ్ ఇఫ్టూ గైడ్ ద్వారా హుస్సేనీవాలా సందర్శించాం. పాక్ సరిహద్దుకి ఒకే కిలో మీటర్ దూరాన ఉంది. స్మారక ప్రాధాన్యత వల్లనే కాక, భౌగోళిక ప్రాధాన్యత వల్ల కూడా దానికి ప్రాధాన్యత ఉందని చెప్పగలను.)

*బటుకేశ్వర దత్తు ప్రస్తావన సముచితం. భగతసింగ్ తో సెంట్రల్ అసెంబ్లీ లో బాంబు విసిరి అరెస్టై యావజ్జీవ శిక్ష పడి అండమాన్ లో కఠినశిక్ష అనుభవించి, విడుదలయ్యాక కూడా అరెస్టై శిక్షలు గడిపిన చరితార్థుడాయన!కుహనా స్వాతంత్ర్య ప్రభుత్వ అవార్డుల్ని, పారితోషకాల్ని కాదని ఆగర్భ దారిద్య్రంతో బ్రతికాడు. హాస్పిటల్ లో చివరి ఘడియల్లో పరామర్శకి వచ్చిన భగతసింగ్ తల్లితో ఓ కోర్కెని వ్యక్తం చేసాడు. హుస్సేనీవాలా భారత్ లో విలీనంపై హర్షిస్తూ, ముగ్గురు ప్రాణమిత్రుల సమాధుల పక్క తనని ఖననం చేయాలనే ఆఖరి కోరిక కోరాడు. నిజానికి దత్తు బెంగాలీ. చివరి కోరికబట్టి 1965 లో హుస్సేనీవాలా లోనే ఖననం చేశారు. భగత్ సింగ్ తల్లి విద్యావతి కూడా కొడుకు స్థూపం వద్దే ఖననం చేయాలని కోరింది. ఆమెని 1975 లో అక్కడే చేశారు.

*మతపరమైన దేశంగా పాకిస్థాన్ ఏర్పడింది. లౌకిక దేశంగా భారత్ ఏర్పడింది. నేటికి 75 ఏళ్ళు! మతతత్వ పాకిస్థాన్ తో మోడీ భారత్ పోటీపడి నేడు మరో ముందడుగు సైతం వేసింది. నేడు రెండు పొరుగు దేశాల మతతత్వ సర్కార్లకు భగతసింగ్ ఆశయాలు గిట్టవు. ఉభయ దేశాల లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర శక్తులకి అవి అవసరమైనవి. వాటి మధ్య ఐక్యతావశ్యకత మరింత పెరుగుతుంది.

*లాహోర్ లో నిన్నటి ప్రజాతంత్ర, లౌకిక శక్తుల ప్రదర్శన పాక్ సర్కార్ పై భగతసింగ్ స్మారక స్థల సందర్శన కై డిమాండ్ చేశాయి. హుస్సేనీవాలా అమర సందర్శన ఉపఖండపు సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తియుత శక్తులకు స్ఫూర్తినిస్తుంది. పాక్ పౌర బృందాలకు గల సందర్శన హక్కు యుద్ధ కాలాల్లో చేజారింది. ఆ హక్కు పునరుద్ధరణకై పాకిస్తాన్ పౌర సమాజ బృందాల డిమాండ్ న్యాయమైనది. వారి కోర్కె ఫలించాలని కోరుకుందాం.

*గురునానక్ స్మారక స్థలి సరిహద్దు ఆవల పాకిస్థాన్ లో ఉంది. ఆ స్థల సందర్శన హక్కు కై ఇండియన్ పంజాబ్ ప్రజల కోర్కెకి మోడీ సర్కార్ తలొగ్గింది. మోడీ సర్కార్ విజ్ఞప్తికి పాక్ సానుకూలంగా స్పందించింది. దానితో అసాధ్యమనే కర్తార్ పూర్ కారిడార్ రెండు దేశాల సరిహద్దు చేరిపి, నేడు సౌహార్దతకి ప్రతీక అయ్యుంది. గురునానక్ స్మారక స్థలి ఏ అసాధ్య కార్యాన్ని సుసాధ్యం చేసిందో, భగతసింగ్ స్మారక స్థలి పై కోరిక రేపు ఫలిస్తుందని కూడా మనం ఆశిద్దాం.

*పాకిస్తాన్, ఇండియా ల్ని పరిపాలించే నేటి మతతత్వ సర్కార్లకి పాకిస్థాన్ లౌకిక శక్తుల కోర్కె మింగుడు పడదు. లాహోర్ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాకిస్థాన్ లౌకిక శక్తులు కోరే సౌహార్ద, సుహృద్భావ డిమాండ్ కి మన దేశ ప్రజాతంత్ర, ప్రగతిశీల, లౌకిక శక్తులు నిండు మనస్సుతో మద్దతు ఇవ్వాల్సి ఉంది. వారికి నైతికబలాన్ని అందించే బాధ్యత మనపై ఉంది. ఆ దిశలో స్పందిద్దాం.

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *