-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
విప్లవ యోధులు భగతసింగ్, రాజగురు, సుఖదేవ్ ల్ని ఉరితీసి ఈరోజుకు 91 ఏళ్లు! ఈ సందర్భంగా భగతసింగ్ ని ఆదర్శంగా తీసుకొనే అనేకానేక అంశాల్లో ఒక అంశాన్ని ప్రస్తావించుకొని కర్తవ్యానికి పునరంకితం అవుదాం.
కార్మికవర్గ హక్కుల్ని కాలరాసేందుకు ఒక నల్ల చట్టాన్ని; స్వాతంత్ర్య ఉద్యమ అణచివేత కోసం మరో నల్ల చట్టాన్ని చేసే దుష్ట లక్ష్యంతో బ్రిటిష్ ప్రభుత్వం ముసాయిదా బిల్లుల్ని సెంట్రల్ అసెంబ్లీ లో ప్రవేశపెట్టింది. మొదటి బిల్లు పేరు *కార్మిక వివాదాల బిల్లు! (THE TRADE DISPUTES BILL)
రెండవ బిల్లు పేరు ప్రజా భద్రతా బిల్లు!*l (THE PUBLIC SAFETY BILL)
పై బిల్లులకు నిరసనగా భగతసింగ్, బటుకేశ్వర్ దత్తు 8-4-1929న ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ హాల్ లో బాంబు విసిరి అరెస్టు అయ్యారు. లాహోర్ కుట్ర కేసులో విచారించి బ్రిటీష్ ప్రభుత్వం 23-3-1931న ముగ్గురు యోధుల్ని ఉరి తీసింది. భగతసింగ్ 23 నెలలు జైల్లో గడిపాడు. జైలుని ఒక రాజకీయ పాఠశాలగా మార్చాడు. అందులో అధ్యయనం ఒక కర్తవ్యం. భగతసింగ్ లేత ప్రాయంలోనే ప్రపంచ చరిత్ర అధ్యయనం పై దృష్టిపెట్టాడు. ముఖ్యంగా రష్యా సోషలిస్టు విప్లవం సహా మార్క్సిస్టు గ్రంధాల్ని అధ్యయనం చేసాడు. ఆ పుస్తకాల కోసం లాహోర్ జైలు నుండి భగతసింగ్ 24-7-1930 న తన స్నేహితుడు జయదేవ్ కి రాసిన ఒక లేఖ చరిత్రకు మిగిలింది. దొరకనివీ, మిగలనివీ ఎన్నో! అలా దొరికిన ఆ అరుదైన లేఖ వర్తమాన శ్రామికవర్గ విప్లవ సంస్థల ఉద్యమ శక్తులకు సదా కరదీపంగా వుంటుంది.
ఆయన 91వ వర్దంతి సందర్భంగా ఆ ఉత్తరాన్ని చదువుదాం. దాన్ని యథాతథంగా ఈ క్రింద ఉదహరిస్తున్నా.
లాహోర్
24-7-1930
నా ప్రియమైన జయదేవ్
దయచేసి ద్వారకా దాస్ లైబ్రరీకి వెళ్లి, క్రింది పుస్తకాలు సేకరించి, శనివారం కుల్బీర్ ద్వారా పంపించ గలవు.
*MILITARISM
BY KARL LIEBNECHT
*HARDMEN’s FIGHT
BY BERTAND RUSSEL
*SOVIETS AT WORK,LEFT WING COMMUNISM, MUTUAL AID*
BY PRINCE KROPATKIN, FIELDS, FACTORIES AND WORKSHOPS,CIVIL WAR IN FRANCE
BY MARX, LAND REVOLUTION IN RUSSIA*
*దయచేసి పంజాబ్ పబ్లిక్ లైబ్రరీలో క్రింది పుస్తకం తీసుకొని పంపగలవు.
*HISTORICAL METERIALISM
BY Bukharin.
బోస్ట్రల్ జైలుకు ఏమైనా పంపారో లేదో లైబ్రరేరియన్ని అడగండి. అతని వద్ద పుస్తకాల జాబితా ఉంది. సుఖదేవ్ తమ్ముడు జయదేవ్ ద్వారా జాబితా పంపారు. ఇంతవరకు ఒక్క పుస్తకం కూడా అందలేదు. ఒకవేళ అతని వద్ద జాబితా లేకపోతే దయచేసి లాలా ఫిరోజ్ చంద్ గారిని అడిగి వారికి నచ్చిన పుస్తకాలు తీసి పంపండి. వచ్చే ఆదివారం అక్కడకు వెళ్లే లోగా వారికి పుస్తకాలు అందాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ యీ పని జరిగేటట్లు చూడండి.
*వీటితో పాటు.. అటువంటివే మరో రెండు మూడు పుస్తకాలు డాక్టర్ ఆలం కోసం కూడా కావాలి.
*మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి. భవిష్యత్తు లో మరోసారి మీకు యీ శ్రమను కలిగించనని వాగ్దానం చేస్తున్నాను.
అభివందనాలతో
భగతసింగ్.
పైన పేర్కొన్న లేఖ మనకు నేర్పే పాఠం సుస్పష్టమే. విజ్ఞానం చాలా ముఖ్యమైనది. అధ్యయనం నిత్యవృత్తిని చేయాల్సి ఉంది. ప్రపంచ దేశాల చరిత్రపట్ల ఆయన ప్రదర్శించిన జిజ్ఞాసను స్ఫూర్తిగా తీసుకుందాం. దానికోసం ఆయన ఎలా పరితపించాడో ఆదర్శంగా తీసుకుందాం. కారాగార జీవితాన్ని సైతం విప్లవ దీక్షతో గ్రంథ అధ్యయనం కై సద్వినియోగం చేసిన తీరును మార్గదర్శకంగా తీసుకుందాం. ఫాసిస్టు ప్రమాదం పెరిగే కాలంలో విప్లవాచరణకి దిక్సూచి వంటి అధ్యయనానికి పునరంకితం అవుదాం.