నంద్యాల RARS భూములను మెడికల్ కాలేజ్ కి కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఉన్నా ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ ఏర్పాటు చేయడం పట్ల రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మెడికల్ కాలేజ్ కి కేటాయించడం మీద తాము హైకోర్టులో పిటిషన్ వేశామనీ ఈ విషయంపై గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఈ RARS భూములపై స్టే మంజూరు చేసారని తెలిపారు.
శుక్రవారం నాడు నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడారు.
మెడికల్ కాలేజీ ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామనీ అయితే రాయలసీమ రైతాంగ అభివృద్ధే కాకుండా, దేశాభివృద్ధికి దోహద పడుతున్న నంద్యాల RARS ను నిర్వీర్యం చేయవద్దని తాము ప్రభుత్వానికి విన్నపించినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో తాము కోర్టుకు వెళ్ళామని ఆయన తెలిపారు.
RARS భూములలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు విషయంలో హైకోర్టు లో విచారణ జరుగుతోందనీ, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రాంతీయ వ్వవసాయ పరిశోధన స్థానం ను యదాతధంగా కొనసాగించేలాగా కోర్టు ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు.
RARS ను ఏ ఇతర అవసరాలకు వినియోగించకుండా స్డే ఇచ్చియున్నారని ఆయన తెలిపారు.
అయితే నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా నంద్యాల జిల్లా ఏర్పాటు అయిన నేపథ్యంలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి చెందిన కార్యాలయాలలో నంద్యాల జిల్లా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కోర్టు ధిక్కారం క్రిందకు వస్తుందనీ, కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ RARS కు చెందిన కార్యాలయాలలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని దశరథరామిరెడ్డి కోరారు.
ఈ సందర్భంగా గౌరవ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను పొందుపరస్తూ, RARS ఇతర అవసరాలకు వినియోగించడం కోర్టు ధిక్కారం క్రిందికి వస్తుందని వివరిస్తు పిటీషన్ తరుపున హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది అర్జున్ రెడ్డి పంపిన నోటీసును నంద్యాల సబ్ కలెక్టర్ ద్వారా కర్నూలు జిల్లా కలెక్టర్ కు పంపడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిటిషనర్లు ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి, కొమ్మా శ్రీహరి, ఏర్వ రామచంద్రా రెడ్డి, చిన్న రామకృష్ణా రెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి,సుదాకర్, సౌదాగర్ కాసిం మియా తదితరలు పాల్గొన్నారు.