(అరణ్య శేఖర్)
వివేక్ అన్న ముందుండి నడిపించగా భూమన్ సార్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ తో లంకమల ప్రయాణం మొదలైంది. నేను, విజయ భాస్కర్ రెడ్డి సార్, శ్రీనాథ్, సుబ్బారెడ్డి అన్న మరొక మిత్రుడు రాత్రికి కావాల్సిన వంట సామాగ్రి తీసుకుని బయలుదేరాము.
కొత్తచెరువు దాటి లంకమల అభయారణ్యంలో మా ప్రయాణం మొదలయ్యీకాగానే మా కారు ముందుగా రోడ్డుకు కుడివైపు నుండి ఎడమవైపుకు చెంగుచెంగునా ఎగురుకుంటూ రెండు జింక పిల్లలు వెళ్లాయి.
ఆ దృశ్యాన్ని చిత్రీకరించలేకపోయినందుకు విజయ భాస్కర్ రెడ్డి సారు బాధగా కనిపించసాగారు. దానిని మరిపించే ఉద్దేశ్యంతో గతంలో భక్తులు చేసిన కాలుష్యాన్ని తొలగించేందుకు ‘No Plastic Lankamala’ పేరుతో వివేక్ అన్న సారథ్యంలో చేసిన కార్యక్రమం గురించి ఆనాటి వర్షాల వల్ల నదులు ఉప్పొంగి ప్రవహించగా వాటిని దాటుకుంటూ సాగిన మా ప్రయాణాన్ని కూలంకుషంగా వివరిస్తూ వచ్చాము. పాచి బండలు వద్దకు రాగానే వాటిని చూడటం కోసం ముందుగా వచ్చిన సభ్యులతో కలిసి మిగిలిన ప్రయాణాన్ని కొనసాగించాము. వేసవి కాలం అయినందువలన అడవంతా ఎండిపోయి ఆకులన్నీ రాలగా రోడ్డుపైన దుమ్ము రేపుతూ ఒకదాని వెనుక మరొకటి మా వాహనాలు వెళుతూ ఉంటే ఆకుల శబ్దాలు చెవిని తాకగా లేచిన దుమ్ము మా బండ్ల వెంట రాసాగింది.
లంకమల విశేషాలు పరిసర ప్రాంతాల గురించి వివేక్ అన్నా వివరిస్తూ రాగా మూడు వైపులా ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయా అనిపించేంత ఎత్తయిన కొండలు మరోవైపు వరద సృష్టించిన వంక. అక్కడికి కుడివైపున సీతాదేవి రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి నిల్చుని శివలింగానికి నమస్కరిస్తూ ఉన్న విగ్రహాల సత్రము, ఎడమవైపున బాహుబలి లాంటి జలపాతము దాని పక్కనే కొండ ప్లేటు మీద మల్లేశ్వరుడిగా పూజలందుకునే శివయ్య గుడి, మధ్యలో సేదతీరడానికి దాతలు కట్టిన పెద్ద పెద్ద అరుగులు.
200 అడుగుల పై నుండి లంకమల జలపాతం తన అందాలను ఆరబోస్తూ వయ్యారంగా కింద ఉన్న గుండంలోకి దూకుతూ రా రమ్మంటూ స్వాగతించగా కొందరు అక్కడికి వెళ్లి ఆ అందాలను తనివితీరా ఆస్వాదించగా మిగిలిన వారిమి మా వెంట తెచ్చుకున్న సామాగ్రి అంతా రాములవారి సత్రంలో పెట్టి అక్కడినుండి కుడివైపు దగ్గరలో ఉన్న పసల గుండం జలపాతం వద్దకు వెళ్ళాము. ఈ జలపాతం ఎత్తు తక్కువ అయినప్పటికీ కొండపై నుండి మెలికలు తిరుగుతూ గుండంలోకి దూకుతూ చూపరుల మదిని కొల్లగొడుతోంది. అక్కడ నీటిలో దిగగా చల్లటి స్పర్శ ఒంటిని తాకింది. అదేమీ చిత్రమో మొదట్లో చల్లగా అనిపించినా నీటిలో ఉన్నంతసేపు వెచ్చగా బయటికి రాగానే చల్లగా గిలిగింతలు పెడుతోంది. కాసేపటికి కిందనుండి మిగిలిన సభ్యులు కూడా పసల గుండం వద్దకు రాగా అందరం ఇక్కడి అందాలను ఆస్వాదించి చీకటి పడుతున్నందువల్ల చకచకా నడుస్తూ సత్రం వద్దకు వెళ్ళాము.
బిలం గుహ యాత్ర 1. ఇక్కడ చదవండి
ఈ ప్రయాణంలో గత 30 ఏళ్లుగా భూమన్ సార్ అడవి బాటలో ఎదురైనా సవాళ్లను వాటిని ఎదుర్కొన్న విధానాలను వివరించగా గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని ముందు ముందు జాగ్రత్తగా ఉండాలని చాలా విషయాలు నేర్చుకున్నాము. ఆలస్యంగా కడప నుండి బయలుదేరిన రవి శంకర్ అన్న తో కూడిన సభ్యులు మా కంటే ముందే అక్కడికి చేరుకుని కింద ఉన్న జలపాతం వద్ద జలకాలాడి దగ్గరలో కనిపించిన ఎలుగుబంటి ఫోటోలు వీడియోలు చిత్రీకరించారు. అది చూసిన మేము లేటుగా వచ్చిన మీకే బంటీ గాడి దర్శనం అయ్యింది అనుకుంటూ వారు తీసిన ఫోటోలు వీడియోలో చూసి ఆత్మసంతృప్తి పొందాము.
గతంలో ఇక్కడ అ రాత్రి బస చేసిన అనుభవం మాకు ఉన్నందున రాత్రి ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం మేము చేస్తుంటే, శివరాత్రికి భక్తులు వదిలివెళ్లిన దుర్ఘంధపు వాసనలు, భక్తులకు వండిన ఆహారం అందరూ తినగా మిగిలిన దాన్ని అక్కడక్కడా పడవేయగా అడవిలో సంచరించే కోతులు, ఎలుగుబంట్లు, పక్షులు తినగా మిగిలిన ఆహారం కుళ్ళి కాలుష్యాన్ని వెదజల్లుతూ అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చెడగొడుతోంది. అక్కడ ఉండడం కంటే కొద్దిగా వెనక్కి వెళ్లి రెడ్డి బావి దగ్గర ఫారెస్ట్ వాళ్ళ బేస్ క్యాంప్ బాగుంటుందని పయనమయ్యాము.
దారి వెంబడి జీరో బడ్జెట్ పాలిటిక్స్ మాధవ రెడ్డి గారు చెబుతున్న ఆన్లైన్ మోసాల నుండి ఆత్మహత్యల వరకు సమస్యలు, వాటిని ఎదుర్కొనే మార్గాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించుకుంటూ రెడ్డిబాయి వద్దకు చేరుకున్నాము. కొన్ని అసౌకర్య కారణాల వల్ల కొందరు బద్వేలుకు వెళ్లేందుకు సిద్ధపడగా మరికొందరు అక్కడే ఉండేందుకు సిద్ధపడ్డారు. అయితే ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం నేను అందర్నీ తీసుకుని లంకమలకి వెళితే వివేక్ అన్న మరుసటి రోజు జరగబోయే బిలం యాత్రకు అన్నింటిని సంసిద్ధం చేసి రాత్రి 8 గంటలకు నందిపల్లి నుంచి బయలుదేరి వస్తాడని వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యంగా వచ్చే లింగారెడ్డి అన్నకు చెప్పాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరం లోపలికి వెళ్ళవలసి వచ్చింది. మనుషులం అయితే అక్కడ ఉన్నాము కానీ మనసంతా బయట తిరుగుతోంది.
బద్వేలుకి బయల్దేరిన వారి వస్తువులు బేస్ క్యాంపు వద్ద ఉండిన వారి వస్తువులు అక్కడవి ఇక్కడ, ఇక్కడివి అక్కడ మార్పిడి చెందడం వల్ల ఫోన్లు పనిచేయని ఆ ప్రదేశం నుండి వాహనాలను ఛేదించి ఎవరివి వారికి అందేలా చేసి అడవి నుండి బయట పడేసరికి చాలా సమయం పట్టింది. సిగ్నల్ అంది అందగానే రాజన్నకు ఫోన్ చేయగా ఇక రారేమో అనుకుని కడపకు బయల్దేరి సిద్ధవటం దగ్గర పోతున్న తనని బద్వేలు కి రమ్మని చెప్పి వెంటబెట్టుకుని బైకులో చలికి వణుకుతూ రెడ్డిబాయి బేస్ క్యాంపు వద్దకు చేరుకున్నాము.
అప్పటికే సుబ్బారెడ్డి అన్న వంటలు చేసి పెట్టగా అక్కడ ఉన్న మిత్రులు భోజనాలు చేసి ఫైర్ క్యాంప్ వద్ద కూర్చుని గుసగుసలాడుతూ కనిపించారు. భోజనాలు అయ్యాయి, చల్లటి గాలి అలసిన శరీరాలను తాకుతుండటం వల్ల దుప్పట్లలో దూరిపోగా మేము కారులోకి దూరిపోగా, అడవిలో ఆ రాత్రి అలా నిశ్శబ్దంగా గడిచిపోయింది.. (సశేషం)