జర్నలిస్టుల క్లబ్ ఎన్నికలు కూడా ఇంతేనా?

హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భారీగా అవకతవకల ఆరోపణలు

ఎన్నికల ఫలితాలను నిలిపివేసిన రిటర్నింగ్ అధికారి

స్వస్తిక్ బదులు రౌండ్ సింబల్ లో గుద్దినట్లు  తేలింది.

దేశంలో జరిగే ఎన్నికలలో ఎంతగా అవకతవకలతో జరుగుతుంటాయో  జర్నలిస్టుల రాస్తుంటారు, టివీల్లో  కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటారు. పొద్దునే డిబేట్లలో పండితులు  విశ్లేషిస్తుంటారు. ఇంకా ఏమేమీ చేయాలో చేస్తుంటార. ఎన్నికల వ్యవస్థ ఎలా కుళ్లిపోయిందో  తెలియచేస్తుంటారు.  అయితే, ఈ జర్నలిస్టులే ఎన్నికలు జరుపుకుంటే ఎలా ఉంటుంది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు చూపించాయి. ఎన్నికలనేవి ఎవరు జరిపినా ఎక్కడ జరిపినా ఒకేలాగే ఉంటాయా?

ఆదివారం నాడు  అంటే 13-03-2022 న  హైద్రాబాద్ ప్రెస్ క్లబ్  కొత్త కార్యవర్గం ఎన్నుకునేందుకు ఎన్నికలు జరిగాయి. హోరాహోరీ గా పోటీ జరిగింది. ప్రచారమూ హోరో హోరీగా జరిగింది. కొంతమంది చేస్తున్న ఆరోపణ ల ప్రకారం విందులు వినోదాలు కూడా జరిగాయి. వాళ్లు కూడా విపరీతంగా ఎన్నికల వాగ్దానాలు చేసుకున్నారు. అరచేతిలో ప్రెస్ క్లబ్ స్వర్గం చూపించారు. ఎన్నికల్లో పట్టమని 1300 ఓట్లు లేవు.  అయినాసరే, ఈ ఎన్నిక సజావుగా జరిగేలా చూల్లేకపోయారు.

ఎన్నికల్లో  అవకతవకలు చోటు చేసుకున్నాయి. బ్యాలెట్ పేపర్ పైన ఓటు వేయడానికి స్వస్తిక్ గుర్తును మాత్రమే ఉపయోగించాలి. కానీ కొన్ని బ్యాలెట్ పేపర్ల పై రౌండ్ ముద్ర ప్రత్యక్షమయింది.  మరికొన్ని బ్యాలెట్ పేపర్ ల పైన ఇంటూ గుర్తులు ఉన్నాయి.  అంటే దొంగవోట్లు పడ్డాయన్నమాట.

ఈ విషయం  ప్రెసిడెంట్ పదవికోసం పోటీ చేస్తున్న అభ్యర్థి సూరజ్ భరద్వాజ్ కంట పడింది.  ఆయన  ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన అభ్యంతరాన్ని తెలియజేశారు. ఇది కుదరదు అన్నార.

అదే విధంగా పోలైన మొత్తం ఓట్లు, అభ్యర్థులకు పడ్డ ఓట్లు, చెల్లని  ఓట్లు పొంతన కుదర్లేదు.   అంటే మొత్తం ఓట్లలో కొన్ని ఓట్లు గల్లంతయ్యాయి.

ఈ అంశాలపై ప్రధానంగా అభ్యంతరం తెలపడంతో, స్వస్తిక్ గుర్తుకు బదులు రౌండ్ సీల్ ఎలా వచ్చింది, కొన్ని బ్యాలెట్ పేపర్ల పై ఇంటూ గుర్తు ఎలా వేశారు అనేది తేలాలి.

అందువల్ల  హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి నిలిపి వేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఇది తేలేవరకుసంయమనం పాటించాలని నోటీసు పెట్టారు (పై ఫోటో).

 

కొంతమంది కోర్టుకు కూడా పోతామంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *