పాలాభిషేకాలను, వ్యక్తి పూజను ప్రభుత్వం పెద్దలు ఆమోదించడం ఆనందించడం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యన్ని అవమానించడమే. వ్యక్తి పూజను నిరాకరించి ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి. తెలంగాణ ఉద్యమానికి ఆత్మ గౌరవం పునాది అనే విషయం విస్మరించారదు. ఆత్మగౌరవం విడనాడ రాదు
వడ్డేపల్లి మల్లేశము
పరిపాలనలో వ్యక్తి పూజను, పాలకుల ఆరాధనను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యతిరేకిస్తూ రాజ్యాంగ పరిషత్ లో చేసిన ప్రసంగాన్ని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రస్తావి౦చారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేనట్లే రాజ్యాంగ పరిభాషలో వ్యక్తిపూజకు తావులేదని చేసిన హెచ్చరిక పాలకులకు ఇప్పటికీ చెవికి ఎక్కక పోవడం బాధాకరం.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి సంబంధించిన చిత్రపటాన్ని పాలాభిషేకాలతో ముంచెత్తడం, వ్యక్తిపూజతో ఆకాశానికి ఎత్తడం భారతదేశంలో బహుశా ఏ రాష్ట్రంలో లేని సంఘటన గా అభివర్ణించవచ్చు.
ప్రజాస్వామ్య పరిభాషలో చెప్పాలనుకుంటే ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా కృషి చేయడమే పాలకుల వంతు. కానీ అందుకు తగిన గుర్తింపు, గౌరవము, పూజలు అందుకోవడం భారత రాజ్యాంగం అనుమతించక పోయినా తెరాస శ్రేణులు పూజకు, పాలాభిషేకాలకు పాల్పడటంతో పాటు ప్రజలను కూడా బానిసలుగా గుడ్డిగా నమ్మే విధంగా ప్రోత్సహించడం ఈ రాష్ట్రంలో శాస్త్రీయమైన సమగ్రమైన హేతుబద్ధమైన పరిపాలన లేదనడానికి నిదర్శనంగా భావించవచ్చు.
గుర్తింపు కోసమేనా? ప్రజల కోసమా?
భారత ప్రజాస్వామిక వ్యవస్థలో స్వాతంత్ర్యము సాధించిన నుండి గత 75 సంవత్సరాలుగా రాజకీయ జీవితం, రాజకీయ యంత్రాంగం, పాలనా పద్ధతులు క్రమంగా పలుచబడుతున్నాయనడానికి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న టువంటి ప్రచార ఆర్భాటాలు, పాలాభిషేకాలు, వ్యక్తిపూజలు నిదర్శనం.ఇవి ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు భావించవలసి ఉంటుంది.
స్వాతంత్ర అనంతరకాలంలో సామ్యవాద తరహా పరిపాలన సాధించే క్రమంలో, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడమే కాకుండా ,అంతరాలు అసమానతలను తగ్గించే విధంగా బడ్జెట్ రూపకల్పన ప్రభుత్వ ప్రణాళికలు అమలమైన మాట వాస్తవం. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించే బదులు భారతదేశ పక్షాన ఐక్యరాజ్యసమితి లో పాల్గొని ప్రసంగించడానికి ప్రతిపక్ష నాయకుని హోదాలో పని చేసినటువంటి అటల్ బిహారీ వాజపేయి గారిని గుర్తించి సాధరo గా పంపించిన గురుతర సాంప్రదాయాన్ని గతంలో చూడవచ్చు.
కేంద్రంలో గాని వివిధ రాష్ట్రాలలో కానీ గతంలో పాలించిన, పాలిస్తున్న ఏ పాలకులు కూడా ఇలాంటి పాలాభిషేకాలు, వ్యక్తిపూజకు అనుమతించిన దాఖలాలు పెద్దగా లేవు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడగానే ప్రపంచము నివ్వెరపోయే స్థాయిలో పరిపాలన చేస్తానని మాట ఇచ్చి చేసిన అనేక వాగ్దానాలను తుంగలో తొక్కడ మే కాకుండా పాలాభిషేకాల ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు తెలంగాణ ప్రభుత్వం పాల్పడుతున్నది.
ఉల్లంఘనకు పాల్పడి రాజ్యాంగాన్ని మార్చాలి అంటే ఎలా?
ప్రపంచంలోని 24 దేశాలకు పైగా పర్యటించి సమగ్రమైన టువంటి విధానం ద్వారా భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకుని ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అని చెప్పుకునే మనం వ్యక్తి పూజ ను, ఆరాధనను నిషేధించాలని స్పష్టంగా రాజ్యాంగ పరిషత్ లో ప్రకటించుచున్నాము. అలాంటిది పోయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా స్థానిక తెరాస శ్రేణులు ప్రభుత్వ అనుకూల వర్గం చేతిలో చిన్న ప్రకటనకు పాలాభిషేకాల తో గౌరవించబడుతూ వ్యక్తి పూజలందుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చెక్ పెట్టాలి. వ్యక్తులు ముఖ్యం కాదు పరిపాలనలో ప్రభుత్వ విధానమే ముఖ్యమనే కొత్త సంప్రదాయానికి తెర తీయవలసిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.
అత్యంత బాధాకరం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కూడా తెలుగు భాషా సంస్కృతుల ఉన్నతి కోసం అనేక సందర్భాలలో పనిచేసి ప్రసంగాలు చేసినారు. కానీఏ స్థాయిలో వ్యక్తి పూజలందుకున్న దాఖలాలు లేవు. అప్పటి వరకు లేనటువంటి మండల వ్యవస్థను తీసుకొనివచ్చి సామాజికంగా రాజకీయంగా ప్రజల ఎదుగుదలకు కృషి చేసి మాండలిక వ్యవస్థ ద్వారా రాజకీయ రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన ఎన్టీ రామారావు ఏనాడు కూడా ఇలాంటి గుర్తింపు ల కోసం పాకులాడ లేదని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ సుమారుగా రెండు దశాబ్దాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం అవతరించి ప్రజల ఆకాంక్షలను ఆకాశానికి ఎత్తి ఉన్నతమైన పరిపాలన చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రతి నిర్ణయము, ప్రకటనకు ప్రచారాన్ని కోరుకుంటూ ఆ స్థాయిలో గుర్తింపు కోసం పాలాభిషేకాలను అనుమతించడం భావ్యం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని అనుమతించలేదు. కానీ అంతకు మించిన స్థాయిలో పరిపాలన చేసుకోవలసిన మనం వ్యక్తి పూజ, వ్యక్తి గుర్తింపు ఇవ్వడం ద్వారా తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ప్రాభవాన్ని దశాబ్దాలు వెనుకకు తీసుకు పోయినట్లుగా భావించవలసి ఉన్నది.
కొన్ని సంఘటనలు
ఇటీవల ప్రభుత్వం రైతుబంధు నిధులను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంలో సుమారుగా పది రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వమే పిలుపు ఇవ్వడం దానికి తెరాస కార్యకర్తలు ప్రజలను కలుపుకొని ప్రజల ఆకాంక్షలు ఉద్యమ శక్తిని నీరుగార్చే విధంగా పాలాభిషేకాలకు పూనుకోవడం ద్వారా శాస్త్రీయమైన అవగాహన లేకుండా చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈసారి మహిళల పట్ల ప్రభుత్వం అతిగా ప్రేమను చూపి మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచించి అమలు చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి మహిళా బంధు అనే పేరుతో మహిళలందరూ తెరాస కార్యకర్తలు ముఖ్యమంత్రి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించక తప్పదు. మంత్రివర్గంలో గాని పార్టీ క్రియాశీల రాజకీయాల్లో కానీ మహిళల కు అంతగా ప్రాధాన్యత ఇవ్వని తెరాస పార్టీ ప్రచారం కోసమే మహిళా దినోత్సవాన్ని పార్టీ పక్షాన నిర్వహిస్తూ మూడు రోజుల ప్రచారం కోసం వాడుకోవడం పాలాభిషేకాలు అనుమతించడం ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది.?
ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసమే
కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు గానీ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వము నుండి అవసరమైనటువంటి సౌకర్యాలను పొందడం ప్రజల హక్కు. కానీ ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద బ్రతకడానికి వీలు లేదు.” హక్కులకై కలబడు బాధ్యతలకు నిలబడు” అనే భారత రాజ్యాంగం హక్కులను విధులను ప్రజలకు ప్రసాదించినది. రాజ్యాంగంలో నిర్దేశించబడిన ప్రకారమే ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయవలసి ఉన్నప్పుడు ప్రజల చెమట ద్వారా, ప్రజల యొక్క పన్నుల ద్వారా సమీకరించబడిన డబ్బుతో చేపట్టిన కార్యక్రమాలను ప్రభుత్వo ప్రచారం చేసుకోవడానికి అర్హత ఎక్కడిది?
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ,గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వం నిరుద్యోగ భృతి కల్పిస్తామని ,కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీలన్నీ పక్కదారి పట్టిన వి. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమే. కానీ ప్రచార కార్యక్రమం కాదు. అలాంటిది అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు తెరాస శ్రేణులు వ్యక్తిపూజకు పాల్పడుతూ రాజకీయాలను, పాలనను అవమానించడాన్ని ఇకనైనా వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఆపవలసిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో లేనటువంటి సాంప్రదాయాలను ఈ రాష్ట్రంలో కొనసాగిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుమతిస్తున్నట్లు? ఈ ప్రచారము లేదా వ్యక్తి పూజ ప్రభుత్వ ఆలోచనా? లేక పార్టీ నిర్ణయమా? ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, బుద్ధిజీవులు, చరిత్రకారులు ,విశ్లేషకులు, వెంటనే ప్రభుత్వ వ్యక్తి పూజ, పాలాభిషేకాల పైన ప్రతిఘటన కార్యక్రమాలను తీసుకొని న్యాయ స్థానము దృష్టికి తీసుకు వెళ్లడం ద్వారా ఈ రాజ్యాంగ ఉల్లంఘన విధానాన్ని వెంటనే రాష్ట్రంలో కట్టడికి చొరవ చూపాలి. కృషి చేయాలి. దీనిని ప్రజల యొక్క ఆత్మగౌరవానికి అగౌరవంగా భావించాలి.
తాగునీరు ఇచ్చిన మని గర్వంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆ తాగునీటిని ఏనాడైనా సమావేశాల్లోనూ, ఇళ్ళలోనూ వాడుతున్నరా? ఒకసారి ఆలోచించుకు౦టే ఈ ప్రభుత్వం యొక్క ఆచరణ విధానం ఏమిటో తెలుస్తోంది.
“పాలాభిషేకాలను నిరసిద్దాం ” “వ్యక్తిపూజను ఖండిద్దాం” – “వ్యక్తివాదాన్ని ప్రతిఘటిద్దాం”-“ప్రభత్వవిధానంగా మాత్రమే గుర్తిద్దాం” పాలనలో వ్యక్తి గుర్తింపుకు స్థానం లేదు”ప్రజల ఆకాంక్షల అమలే కీలకం”పాలన ప్రజల పేరుమీద జరగాలి పాలకులు బాద్యులు మాత్రమే.”గుర్తింపు కోరే పాలకులు మనకు వద్దు. ” ప్రజలను ప్రభువులుగా చూడడమే ముద్దు.” .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)