“When you’re happy, you enjoy the music. But, when you’re sad you understand the Lyrics” Frank Ocean
(మల్లేశ్వరరావు ఆకుల)
ఆడదిగా శిశువుకు జన్మనిస్తుంది. ఆ శిశువు మగాడై ఆమెను బజారు మనిషిని చేస్తాడు.
మనసు లేని మనుషులు ఆమెను పతిత అని ముద్రవేసి నలిపేసి తొక్కేస్తారు.చీదరించుకొంటారుఆమె కూడా ఒక మాతృమూర్తి అని మర్చిపోతారు.
పెరట్లో తులసి అంత పవిత్రమైన ఆమే, అంగట్లో సరుకులాగ అమ్ముడయ్యేదీ ఆమెనే.
కాముకుల దర్బారులో నగ్నంగా ఆడిస్తారు. గొప్ప గొప్ప గౌరవం, పరువు ప్రతిష్టలు ఉన్నవారే ఆమె శీలాన్ని హరిస్తారు. వారి మధ్య పరువం తప్ప పరువులేని ఆమె శరీరం పంచుకో బడుతుంది.
పురుషులుగా ఎంత జులుం చేసినా సహించాలే తప్ప, ఆమె వెక్కిళ్ళు కూడా కనీసం బయటకు వినపడకూడదు. కన్నీటి చారికలు కనిపించకూడదు.
భోగవస్తువై, అనుభవించేందుకు వారికోసం తాను తన తనువుని సుఖ శయ్యగా మార్చే ఆ నిర్భాగ్యురాలికి మాత్రం దక్కేది చితిమంటలే.
(Movie – Sadhna (1958). Lyric: Sahir Ludhianvi, Music: N Datta)
మగవాడి కామ ప్రకోపానికి ఆమె బలిపశువు. ఆమెకు మాత్రం జీవించి ఉండడమనే పెద్ద శిక్ష. ఎవరి పెదవులు శిశువుగా ముద్దాడాయో, ప్రేమను పంచాయో, ఆ మగ శిశువులే ఆమెతో వ్యాపారం చేయించారు.
ఏ గర్భం లో పుట్టి పెరిగారో ఆజన్మ స్థానాన్నే అమ్ముకుంటున్నారు, అద్దెకు ఇస్తున్నారు.
ఏ శరీరం నుండి పుట్టి ఎదిగారో, ఎవరి రెక్కల కష్టాన్ని తమకు రెక్కలుగా మార్చుకున్నారో, వాటినే నరికారు, నాశనం చేశారు.
పెద్దమనుషులుగా తాము తయారు చేసిన చట్టాలు, కట్టుబాట్లు అనే తాళ్లతో స్త్రీ ని బంధించి తమ ఆధిపత్యపు హక్కును చాటుకున్నారు.
సజీవ దహనం చేసి బలిదానం, ఆత్మార్పణం అనే పేర్లు పెట్టారు.
ఒక రొట్టె ముక్కని ఆమె మొఖాన కొట్టి, తమ జాలి, దయ అని గొప్పగా చాటుకున్నారు.
ఈ ప్రపంచంలో ప్రతి సిగ్గులేని పనీ, పురుషాహంకారం లో పెరిగి, ఆడదాన్ని నడి రోడ్డులో నిలబెడుతుంది. ఆమెను పాప కూపం వైపు నడిపి, పడద్రోసే ద్రోహులు, తమ పాపపు రాశులను ఆమెకు వస్త్రంగా కప్పుతారు.
ఆడతనం ప్రపంచపు భాగ్యరాశి. అయినా ఆమె విధివంచిత. అవతార పురుషులు, మహాత్ములకు ఆమె జన్మనిచ్చినా, ఆమె మాత్రం శనిదేవత పుత్రిక.
ఆడదాన్ని ఎంతటి నిర్భాగ్యురాలను చేశారంటే పాపం, ఆమె బిడ్డ లాంటి వాళ్ల పక్కలోనే భోగ వస్తువుగా పడుకోబెట్టారు.
హిందీ కవి మైథిలీ శరణ్ గుప్త తన కవితలో అంటారు- ఓ స్త్రీ నీ జీవితం ఇంతేనా? యెదలో పాలు,కళ్లల్లో కన్నీళ్లు.
(ఈరోజు సాహిర్ లుధియాన్వీ జయంతి/అం.మహిళా దినోత్సవ సందర్భంగా)
(సోర్స్ : సోషల్ మీడియా)