(టి.లక్ష్మీనారాయణ)
మాజీ డీజీపీ శ్రీ గౌతం సవాంగ్ గారిని ఏపిపిఎస్సీ ఛేర్మన్ గా నియమిస్తూ గవర్నర్ గారి ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేశారు. నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వహించాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఇవాళ వరకు డిజిపిగా “పోలీస్ బాస్, పొలిటికల్ బాస్” కనుసన్నల్లోనే పని చేశారన్న అపవాదును మూటగట్టుకున్న గౌతమ్ సావాంగ్ గారిపై నిరుద్యోగ యువతకు విశ్వాసం కల్పించడం అసాధ్యం.
గౌతమ్ సావాంగ్ గారు నేటికీ ఐపిఎస్ ఆఫీసర్. సర్వీస్ లో ఉన్నారు. ఆయన రాజీనామా చేసినా, వి.ఆర్.ఎస్.కు దరఖాస్తు చేసుకొన్నా, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. అంత వరకు ఏపిపిఎస్సీ ఛేర్మన్ లాంటి రాజ్యంగబద్ధమైన పదవులు చేపట్టడానికి అనర్హులు కదా! ” డీమ్డ్ టు బి రిటైర్డ్” అన్న క్లాజును అడ్డం పెట్టుకొని బాధ్యతలు చేపట్టినా, తర్వాత కేంద్ర ప్రభుత్వం రాజీనామాను లేదా విఆర్ఎస్ దరఖాస్తును ఆమోదించకపోతే! ఏపిపిఎస్సీ ఛేర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది కదా!
నేడు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఐఏఎస్, ఐపిఎస్ ల సర్వీసు అంశాల సవరణలపై వివాదం కొనసాగుతున్నది. ఆ సవరణలను బిజెపి యేతర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వ్యతిరేకిస్తున్నాయి. దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఏమిటో ఇంకా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో డిజిపి వ్యవహారం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి చేరుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏ వైఖరి ప్రదర్శిస్తుందో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పైరవీ చేసి ఆమోదింప చేయించుకునే అవకాశం లేదా! అంటే, ఉండవచ్చు! కానీ, అంత ప్రయాసపడి ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ గారు ఏపిపిఎస్సీ ఛేర్మన్ కావడం ఆహ్వానించతగ్గ పరిణామం కాదు. అధికార, సంకుచిత రాజకీయాలతో ఏపిపిఎస్సీ వ్యవస్థ ఇప్పటికే గాడితప్పింది. దాని విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. యువత భవిష్యత్తుతో రాజకీయ క్రీడ మంచిది కాదు.
(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)