ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ జనవరి 21 నుండి 27వ తేదీ వరకు ఏడు రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీయాగం నిర్వహించనున్నారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో ఏకాంతంగా ఈ యాగం జరుగనుంది. అర్చకులు శ్రీ పి.శ్రీనివాసన్ ఈ యాగానికి ప్రధానాచార్యులుగా వ్యవహరిస్తారు. ఈ యాగ కార్యక్రమాలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించవచ్చు.
జనవరి 20న గురువారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
జనవరి 21న మొదటిరోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యాగశాల హోమాలు, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహామంగళహారతి చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. జనవరి 22 నుండి 26వ తేదీ వరకు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీయాగం కార్యక్రమాలు నిర్వహిస్తారు.