(టి.లక్ష్మీనారాయణ)
ఏ.పి.ఎన్.జీ.ఓ. మరియు రాష్ట్ర సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ & డీఏలకు సంబంధించిన జీఓలను తిరస్కరిస్తున్నామని, అవసరమైతే సమ్మె చేస్తామని నేడు వ్యాఖ్యలు చేస్తున్నారు. వీళ్ళే కదా! 23% పిట్మెంట్ కు ముఖ్యమంత్రి వద్ద అంగీకరించి వచ్చింది. ఆ ఒప్పందం అమలుకు జీఓలు ఇలాగే ఉంటాయని ఉద్యోగ సంఘాల నాయకులకు తెలియదనుకోవాలా! నిజంగానే తెలియకపోతే వారు ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉండడానికి అనర్హులు.
ముఖ్యమంత్రి వద్ద ఉద్యోగ సంఘాల నాయకులు అంగీకరించిన వేతన సవరణ ఒప్పందంపై 8వ తేదీ ఉదయం టీవీ5 చర్చలో ఈనాడు జీఓల్లో పొందుపరచిన రీతిలో పర్యవసానాలు ఉంటాయని నేను వివరించాను. 27% ఇంటీరియం రిలీఫ్(ఐఆర్) తీసుకొంటూ, 23% పిట్మెంట్ కు అంగీకరిస్తే అదనంగా ఉద్యోగులు తీసుకొన్న వేతన మొత్తాలను ప్రభుత్వం తిరిగి వసూలు చేసుకొంటుంది కదా! ఆ మాత్రం కూడా తెలియని వాళ్ళు నాయకులుగా ఎలా ఉంటారు! ఆ మొత్తాన్ని డీ.ఏ.ల పద్దు క్రింద చెల్లించాల్సిన అరియర్స్ మొత్తం నుండి సర్దుబాటు చేసుకుంటామని జీ.ఓ.లో పేర్కొన్నారు. అందులో వింత లేదా మోసం ఏముంది!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణలో భాగంగా మోడీ ప్రభుత్వం హెచ్.ఆర్.ఏ. స్లాబులను తగ్గించింది. ఇహపై కేంద్ర వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతన సవరణ ఉంటుందని ముఖ్యమంత్రి తన మనసులోని మాటను ఆనాడే చెప్పారు. తదనుగుణంగానే జీ.ఓ.లు జారీ చేయబడ్డాయి.
పెండింగ్ లో ఉన్న అన్ని డీఏలను ఇస్తామని, రిటైర్మెంట్ వయసును 60 నుండి 62కు పెంచుతున్నామని చెప్పగానే అన్నీ మరచి ఉద్యోగ సంఘాల నాయకులు చప్పట్లుకొట్టారు. ఒకరిద్దరు ఆ రాత్రి డాన్సులు చేస్తూ చిందులు కూడా వేసి, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఉద్యోగుల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి, జీ.ఓ.లను చూడగానే పెల్లుబికింది. దాంతో ఉద్యోగ సంఘాల నాయకులు మొసలి కన్నీరు కారుస్తూ, ప్రభుత్వం మోసం చేసిందంటూ తెచ్చిపెట్టుకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళా కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు! నాయకులు నాసిరకమైన వాళ్ళైతే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి కదా!
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు యు.జి.సి. వేతనాలు చెల్లించేవారు. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా యు.జి.సి. నూతన వేతనాలు దేశ వ్యాపితంగా అమలులోకి వచ్చాయి. మన రాష్ట్రంలో కూడా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. వైద్య కళాశాలల అధ్యాపకులకు మాత్రం యు.జి.సి. వేతనాలను చెల్లించకుండా “ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ రివైజ్డ్ పే స్కేల్స్ -2020” అంటూ మార్పుచేసి, ఐదేళ్ల అరీయర్స్ చెల్లించలేదు. వాళ్ళ సంఘాల నాయకులకు అడిగే నోళ్ళు లేవు.
టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు