విజయవాడ: ఉద్యోగులకు సంబంధించి జారీ చేసిన జీవోలన్నింటినీ తిరస్కరిస్తున్నామని ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
కొత్త పీఆర్సీపై అశాస్త్రీయంగా ఇచ్చిన జీవోలను వ్యతిరేకిస్తున్నామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఈ రోజు నేతలు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు.పాత పద్ధతిలోనే పీఆర్సీ ఇచ్చేదాకా పోరాడతామని అన్నారు.
వారేమన్నారంటే…
‘‘ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఇది చీకటిరోజు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఎప్పుడైనా ఉందా?గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు.
గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీని కూడా ఎత్తివేయడం మించిన అన్యాయం మరొకటి ఉంటుందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే పీఆర్సీ ఇవ్వండి.
పాత పద్ధతిలోనే పీఆర్సీ ఇచ్చేదాకా పోరాడతాం. అవసరమైతే సమ్మె చేసేందుకూ వెనుకాడం. తీవ్రతర ఉద్యమం, సమ్మెలకు ప్రజలు మాకు సహకరించాలి’’