తెలుగు ప్రజలు జరుపుకునే వ్యవసాయసంబంధ పండుగ సంక్రాంతి. రాయలసీమ ప్రాంత ప్రజలైన కదిరి ప్రజానీకం కూడా ఈ పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని భావించే రోజును మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. పంటలు చేతికొచ్చిన సందర్భంలో ఇది రైతులు చేసుకునే ఆనందోత్సాహాల పండుగ.
ఈ పండుగకు అల్లుళ్ళను పిలిచి మర్యాదలు చేయడం ఒక ఆనవాయితీ గా ఉంది.
సంక్రాంతికి ముందు రోజును భోగి పండుగ అంటారు. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఎలాగంటే పాడి పంటలు సమృ ద్ధిగా ఇళ్లకు వచ్చే కాలమిది. రెండో రోజును సంక్రాంతిగా, పెద్దలు పండుగగా, మూడో రోజును కనుమ పండుగ లేదా పశువుల పండుగగా జరుపుకుంటారు.
భోగి పండుగ సాధారణంగా జనవరి 14 న జరుపుతారు. భోగి రోజున తెల్లవారక ముందే కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభ మవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొని ఉన్న జీవితాన్ని ప్రారంభించాలని మనసులో నిర్ణయించుకుంటారు.
సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానాలు చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొంటారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పనికిరాని బట్టలను, ఇంట్లో ఉండే పాత పొరకలు, తట్టలు , విరిగిపోయిన మంచాలు మొదలైన పాడైన పాత వస్తువులను మంటల్లో వేసి కాల్చివేస్తారు. వ్యవసాయంలో వాడి పాతబడి దెబ్బ తిన్నవాటిని భోగి మంటల్లో వేస్తారు. కొంత మంది సంప్రదాయం పేరుతో భోగి మంటలు వేయాలన్న తాపత్రయంతో రబ్బరు, టైర్లు, పెట్రోలు పోసి తగల పెడుతున్నారు. దాని వల్ల కాలుష్యం పెరిగి ఆరోగ్యం పాడవుతుంది. నిజానికి భోగి మంటల్లో వేయాల్సింది పాత వస్తువులు కాదు, మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు.
భోగి రోజు పట్టణాలలో బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుకుంటారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. పల్లెల్లో దోసెలు చేసుకునేవారు. అందువల్ల దీన్ని దోశెల పండుగ అనేవారు.
ఇప్పుడు దోసెలు ఎక్కడ కావాలంటే అక్కడ దొరకడం వల్ల భోగి పండుగ అంటే కేవలం చలిమంట కాచుకునే భోగిమంటగా మారిపోయింది.
రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగిస్తారు. దాదాపుగా అందరిళ్ళలో అత్తిరాసలు, ఓళిగలు, చక్కిలాలు, పాయసం, చిత్రన్నాం, వడలు మొదలయిన వంటకాలు చేసుకుంటారు. కొత్తబట్టలు ధరిస్తారు. కొంతమంది ఈ రోజున పెద్దల పండుగ జరుపుతారు. ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ముగ్గులు మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు.ఎద్దు లేదా ఎనుము పేడతో ముద్దగా చేసి దానిపై గుమ్మడి పూవును పెడతారు. గతంలో గొబ్బియ్యాలో గొబ్బియ్యాలో
అంటూ అమ్మాయిలు పాటలు పాడేవారు. ఇప్పుడది కనుమరుగైంది. పట్టణాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటారు. వివిధ సంఘాల వారు. కొంతమంది పిల్లలు గాలిపటాలను ఎగుర వేస్తారు.గాలి పటాలు పోటీని 2019 లో కదిరిలో నిర్వహించడం ఒక అనుభూతిని మిగిల్చింది.
సంక్రాంతి రోజు గంగిరెద్దులను ఆడించే వృత్తి గల గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత నృత్యాలు(డ్యాన్స్) చేయిస్తారు. ఇవి చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్లు మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టూ అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యం ఇంటికి వచ్చి ఉంటుంది. అందుకనే వారికి ధాన్యం బిక్షగా ఇస్తారు. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెంతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ తలపాగా ధరించి దానిపై రాగి పాత్ర కదలకుండా ఉంచుకుని హరిదాసు ప్రత్యక్షమవుతాడు. ఇదంతా పాత సంప్రదాయం. మారిన పరిస్థితుల్లో గంగిరెద్దుల వారు అలా తిరగాల్సిన అవసరం నేడు లేదు. వారు చదువుకుని వృద్ధిలోకి వస్తున్నారు.
మూడోరోజు కనుమ. దీనినే పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశువులను రైతులు పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్ని తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, ఎనుములను (గేదెలను) పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్న నేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.
రాయలసీమ పల్లెల్లో ఇంటి ముందరే పశువుల కొట్టం ఉండేది.ఇప్పుడు పల్లెల స్వరూపం మారిపోయింది. ఆ కొట్టం దగ్గరే పొంగలి వండుతారు. పొంగలిని కొత్త కుండలో, కొత్త బియ్యం, కొత్త బెల్లం, పెసలు, పాలు వేసి వండుతారు. దాన్ని పశువులకు నైవేద్యంగా తళిగ(పళ్లెం)లో సమర్పిస్తారు. కొంతమంది కాటమయ్య దేవునికి కోడిని కోసి నైవేద్యంగా పెడతారు.
మద్దిమాను, నేరేడి మానుచెక్క, మోదుగపూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పుచెక్క అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది. దీన్ని పశువులకు తినిపించాలి. ఇదొక పెద్ద ప్రహాసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసెళ్ళు ఉప్పు చెక్కను తినిపిస్తారు.
గొర్రెలు, మేకలు ఐతే కొన్ని వాటంతటవే తింటాయి. లేకపోతే వాటికి కూడా తినిపిస్తారు. ఏడాది కొక్కసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారిణి అని వీరి నమ్మకం.
ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుకపోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునైన కత్తితో బాగా చెక్కి వాటికి రకరకాల రంగులు పూస్తారు. కొంతమంది వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో గజ్జల పట్టాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఎద్దుల బండిని కూడా అలంకరిస్తారు. కొన్ని చోట్ల ఎడ్లబండి పందేలు కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు.
కదిరి లోనే గాక తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో గ్రామ దేవతలకు పూజలు, బలులు, దేవరలు ఇప్పటికీ ప్రజలు జరుపుతూనే వున్నారు. ప్రధానంగా పోలేరమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, సుంకమ్మ, గంగమ్మ, అక్కమ్మగార్లు, మారెమ్మ, నల్లలమ్మ మొదలైన వారంతా గ్రామదేవతలు. ఈ గ్రామ దేవతలు ఆ గ్రామం కోసం సాధారణంగా ప్రాణత్యాగం చేసిన ఉంటారు.
ఉదాహరణకు పుంగనూరు చెరువు తెగిపోకుండా పుంగమ్మ దానికి అడ్డం పడుకుంది. అలా పుంగమ్మ దేవత అయింది. బుక్కరాయ సముద్రం చెరువు తెగిపోకుండా ముసలమ్మ దానికి రాత్రంతా అడ్డం పడుకుంది. ప్రాణత్యాగం చేసింది. ముసలమ్మ దేవత అయింది. ఇలాంటి గ్రామ దేవతల కు వేపచెట్టు, అశ్వత్థ వృక్షం (రావి), జమ్మి చెట్టు మొదలైన చెట్లవద్ద అతి చిన్నగా గుడులు కట్టి రకరకాల జంతు బలులతో రక్తతర్పణం చేయడం మధ్యయుగాలలో మూఢవిశ్వాసంగా ప్రారంభమై ఇప్పటికీ జరుగుతూనే ఉంది.
‘దేవర’ అనే తంతు ఒక ప్రధాన గ్రామాన్ని ఆశ్రయించిన చిన్నచిన్న గ్రామాల వారు చేసే ఒక బలిపూజా విధానం. గ్రామ పొలిమేర (సరిహద్దులు)ల్లో బలిపశువు (ఎనుపోతు) (దున్న)ను ఊరేగింపుగా తీసుకువెళ్లి దాన్ని గ్రామదేవత ముందు బలియిచ్చేవారు.
ఈ తంతు జరగడానికి చాలా కాలంముందే ఒక పోతును ఇందుకు సిద్ధం చేసి ఉంచేవారు. ఈ జంతువు యథేచ్ఛగా సంచరిస్తూ పంటపొలాల్లో యేమితిన్నా ఎంత తిన్న అడ్డూ, ఆపూ ఉండదు. దేవరకై వదలిన పోతు దేవరదున్నపోతుగా బలికి సిద్ధం చేస్తారు.
సామాన్యంగా చాలా గ్రామాల్లో 12 సం॥ ఒకసారి జరిగే ఈ భీభత్స పూరిత కార్యక్రమం పల్లె ప్రజల్లో ఉత్సాహం, ఆనందం మాత్రమేకాక విపరీతమైన వ్యయప్రయాసల్ని కూడా కల్గిస్తుంది. యిట్లాంటి జాతరలు జంతుబలుల నిషేధ చట్టం వల్ల యిప్పుడు బాగా తగ్గి పోయాయి. అయితే కొన్ని చోట్ల కోళ్ళు, పొట్టేళ్ళు, గొర్రెలు బలిపశువులై అకాల మరణం పొందుతూనే ఉన్నాయి.