రైతుబంధు నిధులు ఖాతాలలో జమ అయ్యాక మంత్రులు టిఆర్ఎస్ నాయకులు కెసిఆర్ బొమ్మకు పాలాభిషేకాలు చేసి సొంత నిధులను రైతులకు అందించినట్లు సంబరపడి పోతుున్నారు.
(వడ్డేపల్లి మల్లేశము)
ప్రభుత్వాలు మాత్రం గోరంత చేస్తే కొండంత గా ప్రచారం చేసుకుంటూ ఆర్బాటాలు, ప్రలోభాలు, వాగ్దానాలు, హామీలు, నటనతో కాలయాపన చేయడమే కాకుండా చేసిన ప్రతి పనికి గుర్తింపు కావాలని కోరుకుంటాయి. ప్రతిఫలం లేకుండా ఏ పని చేయవు. రాజుల పైసా రాళ్ళ పాలు అన్నట్లుగా ప్రజా సంపద ప్రభుత్వం చేతిలో దుర్వినియోగం అవుతూ ఉంటుంది.
ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ఇటీవల యాసంగి పంట కోసం ప్రభుత్వం విడుదల చేసిన రు. 7645 కోట్ల రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భంగా ప్రభుత్వమే సంబరాలు జరపడం దేనికి సంకేతం? ఇది అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది కదూ!
బాధ్యతగా చేసే పనికి ప్రచారం అవసరమా?
2021 డిసెంబర్ మాసం చివరి దశలో రాష్ట్రంలోని రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అయిన సందర్భంగా వివిధ జిల్లాలలో వేరు వేరు ప్రాంతాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి చేసిన పాలాభిషేకాలకు అంతే లేదు. ఈ పని ఎవరి ప్రోత్సాహముతో జరిగిందో ?ఎందుకోసం చేయవలసి వచ్చిందో? ముఖ్యంగా రైతులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఆలోచించాలి.
పైన చెప్పినట్లుగా కుటుంబ పెద్దలు సామాజిక బాధ్యత కుటుంబ ప్రయోజనం కోసం పాకులాడిన ట్లుగా పాలకులు ప్రభుత్వ పెద్దలు ప్రజల నుండి వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రజల కోసం పని చేయవలసి ఉంటుంది. అంతేకాని ప్రభుత్వ పెద్దల జేబులోనుండి ఖర్చు చేసేది ఏమీ లేదు. అలాంటప్పుడు ప్రతి పనికి ప్రచారాన్ని పాలకులు కోరుకోవడంలో అర్థం ఉందా?
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ అనే ఆకాంక్షలతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధులు ఉన్నత వర్గాలు పెట్టుబడిదారులకు, నియామకాల ఊసేలేదు. ఆత్మ గౌరవం అడుగంటి పోగా నిర్బంధం, అణచివేత, ఆధిపత్యం వంటి నిరంకుశ విధానాలు కారణంగా ఏ వర్గం కూడా రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతకడం లేదు. ఇక ప్రాజెక్టులకు సంబంధించి నీళ్లను సమకూర్చిన ప్పటికీ అంతకుమించిన ఖర్చుచేసి అక్రమాలకు పాల్పడినట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు అనేక నివేదికలు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. ఇక చేయవలసిందల్లా విచారణ నిజనిర్ధారణ మాత్రమే.
రైతుబంధు నిధులు ఖాతాలలో జమ అయిన నాలుగు రోజులు వరుసగా వివిధ ప్రాంతాలలో మంత్రులు కార్యకర్తలు టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకాలు చేసి తమ సొంత నిధులను రైతులకు అందించినట్లు గా సంబరపడి పోయినారు.
ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో పల ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమం గా నిర్వహించాలని ఆదేశించడంతో పదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు వీధివీధినా వాడ వాడ నా కొనసాగుతున్నాయి. మరొక అడుగు ముందుకు వేసి సంక్రాంతి పండుగ వరకు కూడా ఈ సంబరాలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో ప్రత్యేకత ఏముంది ?ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం లేనప్పుడు పాలకులు మాత్రమే పండుగ చేసుకోవడం స్వార్థ ప్రయోజనాలకు ప్రచార ఆర్భాటాలకు మాత్రమే పరిమితమైనట్లు లెక్క. పిల్లలను భాగస్వాములను చేయకుండా తల్లిదండ్రులు తమ కృషిని ప్రచారం చేసుకోవడం ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు బాధ్యతను విస్మరించి నట్టే భావించవలసి ఉంటుంది .అంటే ప్రతి పనికి లబ్ది గురించే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇక అక్కడ అక్కడ రైతులు కూడా స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఉండవచ్చు .లేదా కొందరి ప్రోత్సాహంతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పాలన లో భాగంగా ప్రజా సంపదను ప్రజలకు పంపిణీ చేయవలసిన టువంటి రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నప్పుడు సంబరాలు చేసుకునే అర్హత ప్రభుత్వాలకు లేదు. ప్రజలు రైతులు కూడా ఇలాంటి పాలాభిషేకాల దుష్ట సంస్కృతిని తృణీకరించి, తమ శక్తిని గుర్తించి, ప్రభుత్వ బాధ్యతలు గుర్తింప చేసి, రాజ్యాంగబద్ధంగా హక్కులను పొందిన నాడే అట్టడుగు స్థాయి వరకు రాజ్యాంగ ఫలాలు అందుతాయి. అదే నిజమైన టువంటి ప్రజాస్వామ్యం.. ప్రచారాలకు ప్రలోభాలకు వాగ్దానాలకు అధికార దుర్వినియోగానికి ఆధిపత్య భావజాలానికి కాలంచెల్లిన రోజున దేశవ్యాప్తంగా సుపరిపాలన అవతరిస్తుంది. అందులో భాగo గా తెలంగాణ రాష్ట్రంలో పాలాభిషేకాల సంస్కృతిని కట్టడి చేస్తే తప్ప పాలకులు తమ బాధ్యతను గుర్తించలేరు. కర్తవ్యాన్ని నిర్వహించలేరు.
రాష్ట్ర గవర్నర్లు, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం ,కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అవినీతి నిరోధక శాఖ వంటి స్వయంప్రతిపత్తి గల సంస్థలు ప్రభుత్వాలు చేసే కుటిల ఎత్తుగడలు నిర్మూలించాలి. గుర్తింపు కోసం చేసే ఆరాటాలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే సందర్భాలను ఎండగట్టిన ప్పుడే, తగిన చర్యలు తీసుకున్నప్పుడే, ప్రచారానికి అడ్డుకట్ట వేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాలు నివారించబడతాయి. అందులో భాగమే పాలాభిషేకాల నిషేధం ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార నిర్మూలన.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట (తోటపల్లి) తెలంగాణ రాష్ట్రం)