*ఎల్.హెచ్.ఎం.ఎస్. సౌకర్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి: విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక
జిల్లాలోని విజయనగరం 1వ పట్టణ, 2వ పట్టణ, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల పోలీసు స్టేషను పరిధిలో నివసిస్తూ సంక్రాంతి పండగకు బయట ప్రాంతాలకు వెళ్ళే ప్రజలందరూ తమ ఇండ్లలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఎల్.హెచ్.ఎం.ఎస్. (LHMS Locked House Management System) సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక జనవరి 11, మంగళవారం నాడు ప్రజలను కోరారు.
దొంగతనాల నివారణకు పోలీసుశాఖ లాక్డ్ హౌస్ మేనేజ్ మెంట్ సిస్టంను ప్రత్యేకంగా రూపొందించిందన్నారు. ఈ విధానం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడం వలన ఇల్లు విడిచి పెట్టి బయట ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు ఇండ్లలో దొంగతనాలు జరుగుతున్నాయన్నారు.
తాము ఇల్లు విడిచి బయటకు వెళ్తున్నట్లుగా సంబంధిత పోలీసు స్టేషనుకు ముందస్తు సమాచారాన్ని అందించినట్లయితే పోలీసులు ఎల్. హెచ్. ఎం.ఎస్. సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తారన్నారు.
ఏదైనా అవసరం లేదా ప్రత్యేక పని మీద తమ ఇంటిని విడిచి పెట్టి వెళ్ళే ప్రజలు ముందుగా సంబంధిత పోలీసు స్టేషనుకు సమాచారం ఇచ్చినట్లయితే, పోలీసు అధికారులు సదరు ఇంటిని సందర్శించి, సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, ఆయా ఇండ్లపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తారన్నారు.
ఇందుకుగాను, ఇంటి యజమాని తమ స్మార్ట్ ఫోనులో ఎల్. హెచ్.ఎం.ఎస్. యాప్ ను డౌనులోడు చేసుకోవాలన్నారు. నిఘా కొరకు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలతో ఈ యాప్ ను అనుసంధానం చేయడం వలన దొంగతనంలను నివారించ వచ్చునన్నారు.
ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇంటి పరిసరాలలోకి ప్రవేసించిన వెంటనే పోలీసులకు సమాచారం చేరవేస్తుందని, దీనితో అప్రమత్తమై, పోలీసులు దొంగతనాలు జరగకుండా సులువుగా నియంత్రించ వచ్చునని జిల్లా ఎస్పీ ప్రజలకు తెలిపారు.
విజయనగరం 1వ, 2వ, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల పోలీసు స్టేషను పరిధిలో నివసించే ప్రజలకు ఎల్. హెచ్. ఎం. ఎస్. సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.
ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సంక్రాంతి పండగకు తమ స్వంత ఊళ్లకు వెళ్ళేటప్పుడు పోలీసుశాఖతో సహకరించి, ముందుగా స్థానిక పోలీసులకు సమాచారమందించి ఎల్. హెచ్.ఎం. ఎస్. సౌకర్యాన్ని వినియోగించుకొని ఇల్లు విడిచి పెట్టి వెళ్ళే సమయంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకొని దొంగతనాలను నివారించడానికి సహకరించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక కోరారు.