*సాంస్కృతిక కన్వీనర్ గా గుత్తికొండ ధనుంజయరావు ఎన్నిక
(అవ్వారు శ్రీనివాసరావు)
సాహిత్య సాంస్కృతిక వేదికలు చాలా వరకు నిర్వీర్యమమవుతున్నాయి. సాహిత్య సమావేశాలకు రకరకాల కారణాల వల్ల ప్రజలు రావడం తగ్గిపోతున్నది. ఇపుడయితే, జూమ్ ఆన్ లైన్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రజలు ఎవరిళ్లలో వాళ్లరు కూర్చుని సమావేశాల్లో పాల్గొనవచ్చు. తిలకించవచ్చు.
ఇలాంటి నేపథ్యంలో మంగళగిరి పట్టణంలో కొత్తగా అభ్యుదయ భావాలతో ఒక సాంస్కృతిక వేదిక అవసరమనే భావన సాహితీ మిత్రులలో రావడం, ఇతర వేదికలకు ఛత్రం లాగా పని చేసే కొత్త వేదిక ఏర్పాటు చేసేందుకు కృషి మొదలు కావడం హర్షణీయం. ఈ ప్రయత్నాలమీద ఒక రిపోర్టు ఇది.
సాంస్కృతికరంగంలో మంగళగిరికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సాహితీ, కళారంగాలకు పలువురు ప్రముఖులు శ్రీకారం చుట్టారు.
మంగళగిరిలో సాంస్కృతిక ఐక్యవేదిక ఏర్పాటుదిశగా పాతమంగళగిరిలోని పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో ఆదివారం రాత్రి విస్తృత సమావేశం జరిగింది. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గస్థాయిలో ఒక ఐక్య సాంస్కృతిక వేదిక ఏర్పాటు చేయాలని, ఆ వేదికపై అహగాహన, చేపట్టాల్సిన కార్యక్రమాలు, నియమావళి, సంస్థకు నామకరణ, కన్వీనర్ ఎన్నిక తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ సాగింది.
సమావేశానికి అధ్యక్షత వహించిన లాల్, నీల్ మైత్రి ఉద్యమ కార్యకర్త రేకా కృష్ణార్జునరావు ప్రగతిశీల శక్తులు ఐక్యం కావాల్సిన ఆవశ్యకత.. దేశ పరిస్థితులపై మాట్లాడారు. గతంలో ప్రజాసాంస్కృతిక కార్యక్రమాలకు మంగళగిరి అగ్రస్థానంగా ఉండేదని, మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యతను వివరించారు. ప్రస్తుత సాహితీ, కళాసంస్థల ప్రతినిధులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే.. ఈ ఐక్య వేదికలో పాలుపంచుకోవచ్చని కృష్ణార్జునరావు వివరించారు.
అభ్యుదయ రచయితల సంఘం జిల్లా నాయకుడు గోలి సీతారామయ్య అన్ని ప్రగతిశీల శక్తులు వివిధ రూపాల్లో సంఘటితం కావాల్సిన పరిస్థితుల నేపథ్యంలో, నూతనంగా ఏర్పడే ఐక్య సాంస్కృతిక వేదిక అవగాహన, పని పద్ధతుల గురించి విపులంగా మాట్లాడారు.
విశ్వశాంతి కళాపరిషత్ కన్వీనర్ పొట్లాబతుని లక్ష్మణరావు మాట్లాడుతూ ఒకనాడు ప్రజానాట్యమండలి వంటి కొన్ని కళాసంస్థలు కమ్యూనిస్టు భావజాలంతో అవిశ్రాంతంగా పనిచేస్తూ ప్రజలను ఎంతగానో చైతన్యం చేశాయని గుర్తుచేశారు. కాలక్రమంలో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనమవుతుండడంతో ఎంతో ఘన చరిత్ర గల ప్రజానాట్యమండలి వంటి కళాసంస్థలు పూర్వంలా పనిచేయలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
సమావేశంలో పాల్గొన్న మిత్రులందరూ సాంస్కృతికంగా ఐక్యవేదిక అవసరం చాలా ఉందని, దేశంలో పాలకులు తమ ప్రయోజనాల కోసం సాంస్కృతిక కాలుష్యాన్ని ప్రజలపై కుమ్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
*ఐక్యవేదిక కన్వీనర్ గా గుత్తికొండ
సాంస్కృతిక ఐక్యవేదిక కన్వీనర్ గా మంగళగిరి చైతన్య వీవర్స్ కల్చరల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గుత్తికొండ ధనుంజయరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 8 మందిని కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా సమావేశం ఎన్నుకుంది. కమిటీ సభ్యులుగా రేకా కృష్ణార్జునరావు, తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు, పొట్లాబత్తుని లక్ష్మణరావు, గోలి సీతారామయ్య, ఆకురాతి రత్నారావు, చిలకా వెంకటేశ్వరరావు, గోలి మధు, సందుపట్ల భూపతి ఎన్నికయ్యారు. పై వారితో పాటు ఇంకా ఐక్య వేదికపై ఆసక్తి కనబరిచే సంస్థలు, వ్యక్తులను ఈ ఐక్యవేదికలో భాగస్వాములుగా చేర్చుకుంటామని ఐక్యవేదిక కన్వీనర్ గుత్తికొండ చెప్పారు. నూతన కమిటీ త్వరలో సంఘం పేరు, అవగాహన పత్రం, కార్యాచరణ, నియమావళి రూపొందించి విస్తృత సమావేశంలో చర్చ జరిపి వాటికి తుదిరూపం ఇస్తుందని కమిటీ తరపున ఆకురాతి రత్నారావు వెల్లడించారు.
సీపీఎం జిల్లా నాయకుడు ఎస్ఎస్ చెంగయ్య, జమా అతే ఇస్లాం పట్టణ నాయకుడు ఎస్.కె. ఎమ్ డి అజీమ్, ఎస్సీ, ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ ప్రచార రాష్ట్ర కార్యదర్శి కారుమంచి రామారావు, జిల్లా ప్రగతిశీల న్యాయవాదుల వేదిక కన్వీనర్ శిఖా సురేష్ లు సాంస్కృతిక ఐక్య వేదికకు స్వాగతం పలికి తమ సౌహార్ద సందేశాలను ఇచ్చారు. సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు శిరందాసు నాగార్జున, కొలికపూడి రూఫస్, అవ్వారు శ్రీనివాసరావు, ఆళ్ల సాంబిరెడ్డి, వాసి జ్యోత్స్న, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, కారంపూడి అంకమ్మరావు, బూసి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.