ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, గ్రామ సచివాలయ, కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలెన్నో ప్రభుత్వం దగ్గిర పెండింగ్ లో ఉన్నాయి. వాటిమీద లెక్కలేనన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హామికిచ్చింది. ఒక్కటి కూడా నెరవేర్చలేదు.
11వ PRC అమలు, ఉద్యోగ/ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు చెల్లింపు, DA బకాయిల విడుదల, cps రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, తదితర సమస్యల పరిష్కారం కొరకు ఇప్పటికే ఉద్యమం మొదలుపెట్టారు. కార్యాలయాల ముందు ప్రదర్శనలు చేశారు. పలుమార్లు చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేనున్నా అన్నారు.ఏమి కాలేదు.
జనవరి 3 వ తేదీన నిర్వహించబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముందే రాష్ట్రంలో పనిచేస్తున్న 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, పెన్షనర్స్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, NMR, పార్ట్ & ఫుల్ టైమ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్ సమస్యలు పరిష్కార శుభవార్త తెలుపుతారని ఆశించారు. కొత్త సంవత్సరం వచ్చి రెండురోజులయింది. సీఎంవో నుంచి ఎలాంటి అలికిడి లేదు.
గతంలో ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు 17.12.2021న తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేసి ప్రకటన కోసం ఆశగా ఎదురు చూశారు.
అయితే నేటికి ప్రభుత్వం నుండి ఎలాంటి పరిష్కారం లభించనందున, ఇరు JAC ల ఐక్య వేదిక తదుపరి చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకు సమావేశం అవుతున్నాయి.
ఇరు JAC ల సంయుక్త రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశము సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగుతుంది.
అనంతరం అదే రోజు సాయంత్రం 6 గంటలకు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయం ప్రకటిస్తామని AP JAC నేతలు బండి శ్రీనివాసరావు & హృదయ రాజు AP JAC (అమరావతి) నేతలు బొప్పరాజు & వైవీ రావు, తెలిపారు.