అమరావతి రాజధాని రైతులు 45 రోజులు సాగించిన “న్యాయస్థానం నుండి దేవస్థానం”, మహా పాదయాత్రకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు, సీపీఐ తాడేపల్లి మండల కార్యదర్శి కంచర్ల కాశయ్య పాల్గొన్నారు.
పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలను కాశయ్య పంచుకునేందుకు కమ్యూనిస్టు ఐక్య వేదిక, మంగళగిరి కన్వీనర్ రేకా కృష్ణార్జునరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
పాతమంగళగిరి పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు గారి కళావేదిక (లక్ష్మి శారీస్ బిల్డింగ్ పైన – బైపాస్ రోడ్డు పక్కన)పై శుక్రవారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గంజి చిరంజీవి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, వివిధ రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు గుత్తికొండ ధనుంజయరావు, పొట్లాబత్తుని లక్ష్మణరావు, సందుపట్ల భూపతి, శిఖా సురేష్, కారుమంచి రామారావు, గంజి వెంకయ్య, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, సుబ్రహ్మణ్యం మాస్టారు, తెంపల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన మహాపాదయాత్ర తన లక్ష్యాన్ని చేరుకుందని ప్రజాకళాకారుడు కంచర్ల కాశయ్య పేర్కొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న కాశయ్య తన అనుభవాలను పంచుకున్నారిలా…
‘‘ మహాపాదయాత్రలో 400 కి.మీ. నడవాలని నాకనిపించింది. ఎందుకు నడవాలంటే.. ఇది చరిత్రలో ఒక అవకాశంగా నేను భావించాను. ఎందుకంటే గౌతు లచ్చన్నగారు అక్కడ శ్రీకాకుళం నుంచి మద్రాసు వరకు రైతు పాదయాత్రలో మొత్తం ఆ రోజు కూడా రైతాంగపోరాటమే.. నడిచాడని ఆయనకు పెద్ద చరిత్ర ఉంది. ఇది మనకు దొరికిన అవకాశం. దీనిని ఉపయోగించుకోవాలనే అభిప్రాయం నాకు కూడా లోపల ఉంది.
“మూడు రాజధానులు అని చెప్పిన తర్వాత రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా.. వారికి సమాధానం లేదు. మీరు భూములిచ్చారు. ఆ నిర్ణయాన్ని మేము ఉపసంహరించుకున్నాం. ఇదిగో మీకు ఈ రకమైన న్యాయం చేయబోతున్నాం.. ఈ రకమైన ప్రయోజనం చేయబోతున్నామని ప్రభుత్వం నుంచి ఒక్క మాటంటే మాట కూడా లేదు. టోటల్ గా రాజధాని ఉద్యమంలో న్యాయం, ధర్మం, నీతి ఉందనిపించింది నాకు.
“పాదయాత్ర వెళ్లేకొద్దీ ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ప్రభుత్వమేమో రాళ్లు వేస్తుందని చెప్పింది. రాళ్లు కాదు పూల వర్షం కురిసింది. మీరు చెబితే నమ్మరు కానీ… ఎకరాలకు ఎకరాలు బంతి పూలుకొని రెమ్మలుగా చేసుకుని 20, 30 ట్రాక్టర్లలో తెచ్చి బారులుగా నిలబడి మూడు కి.మీ. మేర ప్రదర్శన ఉంటే పూల వర్షం కురింపించారు.
“నడక అంటే సహజంగా మీరు అనుకోవచ్చు.. రోజుకు 15, 18, 20 కిలోమీటర్లే కదా 22 కిలోమీటర్లు ఆఖరుగా నడిచాం. మనం సాగినంతవరకు నడుచుకుంటూ వెళితే పెద్ద ఇబ్బందేమీ ఉండదు. స్టాండింగ్ ఉంటుంది. అడుగులో అడుగువేసుకుని వెళ్లాలి. ఎందుకు అడుగులో అడుగు వేసుకుని వెళ్లాలంటే.. అక్కడ స్వాగతం పలికేవాళ్లు, కొబ్బరికాయలు కొట్టేవాళ్లు, నడవరు.. డ్యాన్సులు వేసేవాళ్లు, ఇది చేసేవాళ్లు.. అది చేసేవాళ్లు.. చిన్నగా నడుచుకుంటూ వెళ్లేవారు.. రోజు మొత్తం మీద 15 కిలోమీటర్లు నడిచినా.. 18 కిలోమీటర్లు నడిచినా స్టాండింగ్ మాత్రం 10 గంటలు ఉండాలి… నుంచోవటమే కదా.. నుంచోవడం మూడు అడుగులు వేయడం.. నాలుగడుగులు వేయడం.. అలా వెళ్లడం బాగా ఇబ్బంది అనిపించింది.
“ఇక పాదయాత్రకు స్వాగతాలతోపాటు డబ్బులు కూడా విశేషంగా ఇచ్చారు. మీరు ఎప్పుడైనా చూశారా.. చందాలు లైనులో నిలబడి ఇవ్వడం.. అక్కడ కొన్నిచోట్ల అలా ఇచ్చారు. రైతుల పాదయాత్రకు గొప్ప స్వాగతం లభించింది. సెలబ్రిటీల పాదయాత్రలు గొప్పగా ఉంటాయి.. అయితే రైతులు చేపట్టిన ఈ పాదయాత్రకు లభించిన అపూర్వస్వాగతం నేను కనీవినీ ఎరుగను.
“పాదయాత్రలో ‘ నాది ప్రకాశం జిల్లా.. నా రాజధాని అమరావతి’, ‘నాది నెల్లూరు జిల్లా.. నా రాజధాని అమరావతి’, ‘నాది చిత్తూరు జిల్లా.. నా రాజధాని అమరావతి’ అనేటువంటి నినాదాలు మరీ ముఖ్యంగా మహిళల్లో బలంగా వచ్చాయి. అమరావతి రాజధాని కావాలనేటువంటి గుండె చప్పుడు వారి మనస్సుల్లో, హృదయాల్లో, వాళ్ల స్వాగతాల్లో స్పష్టంగా కనిపించింది.
“టోటల్ గా ప్రజా గుండె చప్పుడు.. అమరావతి రాజధాని కావాలనేది స్పష్టమైంది. ఆ ప్రాంతంలో అమరావతిపై ఉన్న ప్రేమ మన ప్రాంతంలో లేదు,’’ అంటూ ప్రజాకళాకారుడు కంచర్ల కాశయ్య ‘ న్యాయస్థానం నుంచి దేవస్థానం’ వరకు నిర్వహించిన మహాపాదయాత్రలో తన అనుభవాలను సవివరంగా ఆత్మీయ సమావేశంలో పంచుకున్నారు.