ప్రజాస్వామ్యం పై అమెరికా ఆధిపత్య మనస్తత్వం, ఇతర పశ్చిమ దేశాల గుత్తాధిపత్య నిర్వచనాలకు విరుద్ధంగా చైనా శ్వేతపత్రం
—డాక్టర్ యస్. జతిన్ కుమార్
డిసెంబరు 9,10, తేదీలలో అమెరికా అధ్యక్షుడు బి డెన్ ప్రజాస్వామ్యం గురించి ఒక శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని 100 దేశాల, ప్రాంతాల నుండి ప్రభుత్వ, పౌర సమాజాల నాయకులు, ప్రైవేటు రంగ ప్రముఖులు పాల్గొనేలా ఈ సమావేశాలు ఏర్పాటు అయ్యాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న స్థితిలో ప్రజాస్వామ్యాన్నిపునరుద్ధరించటం అమెరికాకు, ఇతర ప్రజాస్వామ్య దేశాలకు అత్యవసరం అని ఆయన అంటున్నారు.
చైనా ను నియంతృత్వదేశం అని నిర్వచించి ,దాన్ని పక్కకు నెట్టి , ప్రాభవం తగ్గిపోతున్న తన ఆధిపత్యాన్ని పునరుద్ధరించుకోవటానికి ప్రజాస్వామ్యం పేరిట అమెరికా ఈ సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంలో చైనా స్టేట్ కౌన్సిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ డిసెంబర్ 4 వ తేదీన “చైనా: డెమోక్రసీ దట్ వర్క్స్” (China: Democracy That Works)పేరుతో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.
ఈ పత్రం పాశ్చాత్య వ్యవస్థకు వెలుపల వున్న ఒక ప్రధాన దేశం ప్రజాస్వామ్యంపై వెలువరించిన అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రపంచంలో ప్రజల ప్రజాస్వామ్యాన్ని పెద్ద ఎత్తున ఆచరిస్తున్న సమాజం చైనా. ఈ పత్రం ప్రచురణ ప్రజాస్వామ్యం పై అమెరికా ఇతర పాశ్చాత్య దేశాల గుత్తాధిపత్య నిర్వచనాన్ని సవాలు చేసింది.
ఇది మానవుల ప్రజాస్వామ్యం వివిధ పద్ధతులను మరింత వివరణను సూచిస్తుంది. చైనా ఆర్థిక సామాజిక నిర్మాణం ప్రపంచ ప్రఖ్యాత విజయాలను సాధిస్తూనే ఉంది, ప్రజల సమగ్ర హక్కులు కూడా నిరంతరం మెరుగు పడుతున్నాయి.
ఆకస్మిక కోవిడ్-19 వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాటంలో పాశ్చాత్యులు ఇబ్బంది కి గురికాగా చైనా మెరుగైన ఫలితాలను సాధించింది. ఇది ప్రజల ప్రాణాలను అత్యంత ప్రభావవంతమైన రీతిలో రక్షించింది. చైనా ప్రతిపాదించిన సంపూర్ణ ప్రజల ప్రజాస్వామ్య ప్రక్రియకు బలమైన వాస్తవిక పునాది, ఆధారం ఉంది.
ఇది తాత్కాలిక లేక స్వల్పకాలిక నినాదం కాదు, చైనా దేశం గొప్ప పునరుజ్జీవనంతో ముడిపడిన ప్రక్రియ. పాశ్చాత్య ప్రజాస్వామ్యానికి వెలుపల ప్రజాస్వామ్య నిర్మాణానికి అది భూమికను ఏర్పరుస్తుంది.
పాశ్చాత్య ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా, అమెరికన్ ప్రజాస్వామ్యం, 200 సంవత్సరాలకు పైగా ఉనికి లో ఉన్నప్పటికీ ,ఉపయోగంలో తీవ్రమైన అసమర్థతను చూపించింది. యుఎస్ లోని అత్యంత ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి అది ఇక ఏమాత్రం ప్రేరణను అందించటం లేదు. ఇది దాదాపు ఒక బోలు నిర్మాణం గా మారింది, అలవాటుగా ఎన్నికలు నిర్వహిస్తుంది.
ఎన్నికలు దాని ప్రజాస్వామ్యం యొక్క ఏకైక లక్షణంగా మారాయి. ఎన్నికలలో గెలవడం రాజకీయ పార్టీల, రాజకీయ నాయకుల యొక్క అఖండ లక్ష్యంగా మారింది. యుఎస్ సమాజం లో సమస్యలను పరిష్కరించడంలో రాజకీయ, ఆర్థిక లక్ష్యాలు సాధించుకోవటం పెరుగుతోంది.
సమస్యను పరిష్కరించినట్లు నటించడానికి, సమస్యలను పరిష్కరించ లేకపోయినందుకు రాజకీయ ప్రత్యర్థులను నిందించడానికి, ఓటర్లను మోసం చేయడానికి ఇది ఒక “తెలివైన” మార్గంగా మారింది.
అమెరికన్ ప్రజలు “ఓటర్లు”గా ఉన్నప్పుడు మాత్రమే వారిని ఒప్పించ టానికి రాజకీయ నాయకులు వారిని విలువైనవారిగ పరిగణిస్తున్నారు. కానీ ఎన్నికల తరువాత, గెలుపొందిన పక్షాన్ని ఆ ప్రజలు (వోటర్లు ) పర్యవేక్షించలేరు.
సాధారణంగా, యుఎస్ లోనూ పశ్చిమం లోనూ వున్నవి సాపేక్షంగా “చిన్న ప్రభుత్వాలు,” ఆ ప్రభుత్వాలు ప్రజల జీవనోపాధికి పూర్తి నైతిక బాధ్యతను వహించావు. కోవిడ్-19 మహమ్మారి అమెరికాలో 7,00,000 కంటే ఎక్కువ మరణాలకు దారితీసినప్పటికీ, ఫెడరల్ ప్రభుత్వం డానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా, అధ్యక్షుడు టీకాలు తీసుకోని లేదా మాస్కులు ధరించడానికి నిరాకరించే సాధారణ ప్రజలపై బాధ్యతను నెట్టి వేయవచ్చు. యుఎస్ లో, ప్రభుత్వానికీ ప్రజలకీ మధ్య ఒక చాలా బలమైన మధ్యవర్తిత్వ శక్తి ఉంది: అదే పెట్టుబడి.
పెట్టుబడి- ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడాన్ని బలంగా ప్రభావితం చేయడమే కాకుండా, సామాజిక సంబంధాలను నిర్దేసించడం లో కూడా ఆధిపత్య శక్తిగా ఉంది. ఇది యుఎస్ లో ప్రజాస్వామ్య అధికార పంపిణీలో నికరమైన శక్తి. దీనికి భిన్నంగా చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం రూపొందించిన జాతీయ నిర్మాణంలో ప్రభుత్వం నేరుగా ప్రజలకు బాధ్యత వహిస్తుంది.
జాతీయ పురోగతిని ప్రోత్సహించడానికి, ప్రజలను పరిపాలనకు కేంద్రంగా చూడటం, పురోగతి యొక్క ఫలాలను ప్రజలకు అందించడం అనేవి సంపూర్ణ జనతా ప్రజాస్వామ్య ప్రక్రియ కున్న ప్రాథమిక అర్థం, తర్కం.
యుఎస్ తరహా ప్రజాస్వామ్యం ప్రారంభమయ్యింది బానిస యజమానులకు ప్రజాస్వామ్యం అనే రీతిలో. అది మైనారిటీ గా వుండే ఉన్నత సామాజిక వర్గాల ప్రజాస్వామ్యం. అది క్రమంగా “ఒక వ్యక్తికి, ఒక ఓటు” అనే స్టాయికి విస్తరించింది. అయితే, సామాజిక ప్రయోజనాల స్థాయి విభజించబడింది. వివిధ వర్గాలలో పోలరైజ్ చేయబడింది కాబట్టి, సాధారణ ప్రజలు తమ ఓట్లను వారి వాస్తవ ప్రయోజనాలను రక్షించే సాధనంగా మార్చలేకపోతున్నారు.
ప్రభుత్వం వారి నిజ జీవితంలో ఒక నైరూప్య భావన. కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు తగాదాలలో నిమగ్నమయ్యారు. ఫెడరల్ ప్రభుత్వం విమర్శలను పూర్తిగా విస్మరించవచ్చు,అది విమర్శకులను, మీడియాను తిట్టవచ్చు. ఫలితంగా, మీడియా ఏమి చెప్పినా, అది ప్రభుత్వం పై ప్రభావం చూపదు. దీనికి విరుద్ధంగా మొత్తం ప్రజల ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రజలకు గరిష్ట సంక్షేమాన్నిఅందించడానికి పూనుకుంటుంది.
ప్రభుత్వాన్ని అందుకు తగ్గ కృషి చేయాలనే భావనలో ఉంచుతుంది. పేదరికం, వాయు కాలుష్యం, మహమ్మారి వ్యాధుల వ్యాప్తిని అరికట్టడం, విద్యుత్ కొరతను నిర్మూలించడం వంటి వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రజాస్వామ్యం రూపొందించబడింది. ప్రజలు ఆందోళన చెందుతున్న సమస్యలపట్ల ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. జాతీయ పాలన కీలక సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. చైనా ఈ అంశాల లలో స్పష్టమైన ఫలితాలను సాధించింది కూడా
చైనా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వేదిక లేదని కొందరు వాదిస్తున్నారు. కానీ పాశ్చాత్య ప్రజాభిప్రాయం యొక్క క్రమరహిత వ్యక్తీకరణకు భిన్నంగా చైనాలో ఒక క్రమబద్ధమైన విధానం వుంది . వాస్తవానికి, చైనా సమాజంలో పై నుండి క్రిందికి అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి అనేక సంస్థాగత మార్గాలు ఉన్నాయి, ఉదాహరణకు, అవినీతిని తొలగించడానికి సంస్థాగత ఛానెల్ వుంది. చైనీస్ ప్రజలు తమ దైనందిన జీవితాలకు సంబంధించిన సమస్యలను వినిపించడమే కాకుండా, అధికారుల దృష్టిని వాటి పట్ల కేంద్రీకరింప చేయగలరు. తగిన పరిష్కారాలు కూడా పొందగలరు. ఇలా వారి సమస్యలను పరిష్కరించే అవకాశం ఎక్కువగా ఉంది. సంక్లిష్టమైన, విస్తృత శ్రేణి గల సమస్యలు వున్నసందర్భంలో, దేశం ఈ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తుంది.
అయితే పాశ్చాత్య తరహా ప్రజాస్వామ్య వ్యవస్థ యోగ్యత లేకుండా పూర్తి నిరుపయోగంగా ఉందని కూడా చైనీయులు అనుకోరు. ఉదాహరణకు, “అనేక పాశ్చాత్య దేశాలలో చట్టబద్ధ పాలన ఉన్నత అధికారాన్ని కలిగి ఉంది. న్యాయ మార్గాల ద్వారా నిర్దిష్ట వివాదాలను పరిష్కరించడానికి ఆ సమాజాలు దృఢంగా అలవాటు పడ్డాయి.” అని వారు భావిస్తారు. అధ్యయనం చేయడానికి ఇటువంటి విలువైన అంశాలు ఉన్నాయి. చైనా యొక్క మొత్తం ప్రజల ప్రజాస్వామ్య ప్రక్రియ- పాశ్చాత్య తరహా ప్రజాస్వామ్యంతో వైరుధ్య సంబంధాన్ని కలిగి లేదు. అవి వివిధ దేశాలలో వివిధ చారిత్రక సాంస్కృతిక నేపథ్యాలలో ఉద్భవించిన భిన్న ప్రక్రియలు. ఎవరికి వారు తమ దైన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతులు అనుసరించాలి . ఒకరి నుండి ఒకరు నేర్చుకోవాలి అని చైనా భావిస్తుంది.
అయితే, అమెరికా, మరి పశ్చిమ దేశాలలోని కొన్ని శక్తులు వారి సంకుచిత ఆలోచనా దృక్పథం, వారి విలువల ఆధారంగా చైనాలోని ప్రాథమిక రాజకీయ వ్యవస్థపై దాడి చేస్తూనే ఉన్నాయి. ఎవరు ప్రజాస్వామ్యవాదులు , ఎవరు కాదు అని నిర్వచించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఇది చైనా ప్రభుత్వమూ ప్రజలూ ఎన్నడూ అంగీకరించని విషయం. నేటి చైనా సమాజం ఒక రాజకీయ విశ్వాసంతో నిండి ఉంది. సంక్షోభాలను ఎదుర్కోవడంలో వారి విజయం, పురోగతి, సమర్థతను అందరం చూశాము. “మేము ప్రజాస్వామ్యాన్ని సమర్థిస్తున్నాము, మరియు ప్రజాస్వామ్యాన్ని ఆచరించడానికి కట్టుబడి ఉన్నాము. మమ్మల్ని దూషిస్తున్న శక్తులకు, మేము ఒకటి చెప్పాలనుకుంటున్నాము: మీ విజయాలను మాతో పోల్చండి, మీరు స్తబ్దతలో చిక్కుకున్నట్లు కనుగొంటారు, అప్పుడు మీ ప్రజాస్వామ్యం గురించి ప్రగల్భాలు పలకడం విలువైనది కాదని మీకు తెలుస్తుంది.” అని చైనీయులు సగర్వంగా ప్రకటిస్తున్నారు.
( డిసెంబర్ 04, 2021 గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం ఆధారంగా )